23, డిసెంబర్ 2024, సోమవారం

తిరుప్పావై ప్రవచనం‎- 8 వ రోజు*

 🌹🌷🪷🏹🛕🏹🪷🌷🌹

*🕉️సోమవారం 23 డిసెంబర్,  2024🕉️*

  *వేకువఝామున పాడుకొనుటకు*



  *తిరుప్పావై ప్రవచనం‎- 8 వ రోజు*              

    *🏹8 వ పాశురము🏹*


*కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱు వీడు*

*మేయ్ వాన్ పరన్దనకాణ్!* *మిక్కుళ్ళపిళ్ళైగళుమ్*

*పోవాన్ పొగిన్ఱారై* *ప్పోగామల్ కాత్తున్నై*

*కూవువాన్ వన్దు* *నిన్ఱోమ్; కోదుకల ముడైయ*

*పావాయ్!* *ఎళున్దిరాయ్, పాడిప్పఱై కొణ్డు*

*మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ*

*దేవాది దేవనైచ్చెన్ఱు నామ్ శేవిత్తాల్*

*ఆవా వెన్ఱారాయ్ న్దు అరుళేలో రెమ్బావాయ్.*



            *🕉️భావము🕉️*


తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లివారింది. గేదెలు మంచుమేత మేయటానికై విడువబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగనే అతని వద్దకు చేరవలెనని, అట్లు చేసిన అతడు చాల సంతోషించునని తలుస్తున్నారు. అందరును కలిసి గోష్ఠిగ పోవుటే మంచిదని యెంచి వారినందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలముగనే వున్నదికదా! మరింక ఆలస్యమెందుకు? లెమ్ము! ఆశ్వాసురరూపుడైన కేశిని, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి, మన నోమునకు కావలసిన 'పఱై' అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమటకు పోయిన అతడు 'అయ్యో! మీరు నాకంటే ముందుగనే వచ్చితిరే!' యని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును.



       *🌹అవతారిక:l🌹*


క్రిందటి పాశురంలో భారద్వాజ పక్షులు చేసే కలకల ధ్వనిని విని అందులోని ధ్వనిని గ్రహించమంటున్నది. ఈమె సాయించిన మొత్తం తిరుప్పావై అంతా ధ్వని కావ్యమే. పైకి సాధారణ భాషగా కనబడినా అందులోని అంతరార్ధం బహు విస్తృతమైనది. వేదోపనిషత్సారమైన యీ గ్రంథ ఆంతర్యాన్ని ప్రతివారు యెరిగి తీరవలసినదే అన్నదే ఆండాళ్ తల్లి చెప్పినది. ఈ ఎనిమిదవ పాశురంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణురాలైన గోపిక తెల్లవారిపోయిననూ ఇంకా లేవలేదని గమనించి ఆమెను 

లేచిన వారందరితో కలిసి గోదాదేవి మేల్కొలుపుతున్నది. ఇది ఎనిమిదవ పాశురము. 



🌷8.వ మాలిక:

(మలయమారుత రాగము - ఆదితాళము)


ప. తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!

తీరుగ మహిషములు మేతకై! తరలె!

తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!


అ..ప. పరమార్ధమని యెంచి శ్రీకృష్ణునే చేరు

తరుణుల నిలిపి యిటు నీకై వచ్చితి మమ్మ 

తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!


చ.. కేశినోటిని జీల్చి మల్లుర మదమణచిన

కేశవుడౌ సర్వేశుని జేరి

ఆశల 'పఱ'గొని కృష్ణు స్తుతియింప-లో

కేశుడౌ తాను కాపాడడే మనల

తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!

తీరుగ మహిషములు మేతకై తరలె!



  *ఎనిమిదవరోజు ప్రవచనం‎*


*08 వ రోజు - నేను నీవాడనని తెలిపితే చాలు పరమాత్మే మనకోసం తపిస్తాడు!

*ఆండాళ్ తిరువడిగలే శరణం* 



 పాశురము:


*కీళ్ వానం వెళ్ళెన్ఱెరుమై శిఱు వీడు*

*మెయ్యాన్ పరందన కాణ్ మిక్కుళ్ళ పిళ్ళైగళుం*

*పోవాన్ పోగిన్ఱారై ప్పోగామల్ కాత్తు ఉన్నై -*

*క్కూవువాన్ వందు నిన్ఱోం కోదుగలం ఉడైయ*

*పాపాయ్! ఎళుందిరాయ్ పాడి ప్పఱై కొండు*

*మావాయ్ పిళందానై మల్లరై మాట్టియ*

*దేవాది దేవనై చ్చెన్ఱు నాం శేవిత్తాల్ ఆవా* *ఎన్ఱారాయుందరుళ్-ఏలోర్ ఎంబావాయ్*


ధనుర్మాస వ్రతం ఒక విలక్షణమైన వ్రతం. శరీరాన్ని శ్రమింపజేసి, హింసించి చేసే వ్రతం కాదు, శరీర ప్రవృత్తికి అనుకూలంగా సాగేది మన వ్రతం. నీటివాలుకు మనం తెరచాప ఎత్తుకుంటే, దానికి గాలికూడా వాలు అయితే యాత్ర వేగం వేగం గా సాగినట్లుగానే, మన శరీరం ఏ ఏ ప్రవృత్తికి ఇష్టపడుతుందో దానికి కావల్సిన పదార్థాలని అందిస్తూ, బాగుపడటానికి ఆలోచనారీతిలో మార్పు వచ్చేలా, మనిషికి లక్ష్యాన్ని తెలిపేదే ఆండాళ్ తిరుప్పావై. ఒక ఉత్తమ స్థితికోసం పాటుపడటం, అదీ కూడా తన తోటి వారందరితో కలిసి ఆనందం పొందాలని చెప్పేదే ఆండాళ్ తిరుప్పావై. మన వేదాలు ఆ రహస్యాలనే తెలుపుతాయి. 


*"అస్మాన్ అగ్నే నయ సుపతా రాయే"* ‘మా అందరిని కలిపి మంచిమార్గాన నడుపు’ అనే విషయాన్నే తెలుపుతాయి. మన వేద సంప్రదాయం ఇదే, ఆండాళ్ 

ఆ మార్గాన్నే నడిచి తను ఫలాన్ని పొంది మనకు అందించింది తిరుప్పావైని. మనిషికి ఇదీ లక్ష్యం, ఆ లక్ష్యాన్ని ఇలా చేరాలి అని వేదాలు తెలిపాయి. అందరం కలిసి ఆనందం పొందడాన్నే బ్రహ్మానందం అని అంటారు. ఇప్పుడు ఉండే స్థితి నుండి విడుదల పొంది, అంటే ముక్తి పొంది ఆ స్థితికి చేరాలి. అలా ముక్తి కోరుతున్నాం అంటే మనల్ని ‘ముముక్షు’ అని అంటారు. 

మరి ఏం చేయాలి ఏది పొందాలనేది మన వేదాలు చెబుతాయి. యాజ్ఞవల్కుడు అనే గొప్ప మహానుభావుడు ఉండేవాడు. జనక చక్రవర్తికి గురువుగారు. ఆయనకు ఇద్దరు భార్యలు ఉండే వారు పెద్దావిడ మైత్రేయి, చిన్నావిడ కాత్యాయని, కొంతకాలం అయ్యాక వానప్రస్తం గడుపాలని తన ఆస్తిని విభజించి వాళ్ళకు పంపకం చేసాడు. అయితే కాత్యాయని సంపదలను తీసుకొని ఊరుకుంది. మైత్రేయి గొప్ప యోగ్యత కలది, ఆయనను ఒక ప్రశ్న వేసింది. “ఇన్ని సంపదలను విడిచి వెళ్తున్నావంటే నీవు కోరుకుంటున్నది బహుశా ఇంతకంటే విలువైనదై ఉంటుంది కదా. మరి నాకూ ఆ సంపదే కావాలంటూ ఆయన వెంట బయలుదేరింది. మరి నీవు పొందాలనుకున్న ఆ ఆత్మజ్ఞానం ఏదో నేనూ పొందాలని అనుకుంటున్నాను, మరి దానికి నేనెలా సాధన చెయ్యాలో చెప్పు!” అని అడిగింది. 


*"ఆత్మావారే ద్రష్టవ్యః శ్రోతవ్యః మంతవ్యః నిదిద్యాసితవ్యః మైత్రేయీ"* అంటూ ఉపదేశం చేసాడు. హే మైత్రేయీ *"ఆత్మావారే ద్రష్టవ్యః "* లోపల ఉండే ఆత్మ అనేదాన్ని మనం స్పష్టంగా చూడవలె. కానీ ఎట్లా కనిపిస్తుంది? “ద్రష్టవ్యః” - చూడాలి అనుకున్న దాన్ని మొదట *"శ్రోతవ్యః"* వినాలి, మంతవ్యః - దాన్నే పదే పదే తలచాలి, నిదిద్యాసితవ్యః - ఇకపై దాన్ని ఊహించాలి. మనకు కనిపించే మార్గాల్లో ఏది మంచిదో అనుభవజ్ఞులైన పెద్దల సలహా తీసుకుంటూ ముందుకు సాగాలి. ఆండాళ్ ఇదే విషయాన్ని చెబుతుంది. ఆండాళ్ తల్లి చెప్పేది ఏదో మెట్ట వేదాంతం కాదు, లౌకికమైనది అంతకంటే కాదు. ఆండాళ్ తిరుప్పావై మన ఆధ్యాత్మిక జీవన మార్గాన్ని అందులో మనం సాధించాల్సిన ప్రగతిని సూచిస్తూ అందించిన అతి సుందరమైన ఒక లలితమైన గోపికా కృష్ణుల కథ. పైకి ఒక అందమైన కథ, లోపల మన ఆధ్యాత్మిక జీవనానికి అవసరమైన లక్ష్యాన్ని సూచించే ఒక దివ్యమైన చరిత.

మొదట పక్షులు అరుస్తున్నాయి అని చెప్పింది, ఇక పక్షుల అరుపులు వినలేదా అని చెప్పింది - ఇది మనం శ్రవణం చేయటం లాంటిది. అలా చేయగా క్రమేపి రుచి ఏర్పడ్డాక, ఆలయ పిలుపు శంఖం ధ్వని, గోపికల పెరుగు చిలికే ధ్వనిని ఊహించింది. ఇలా కనిపించని వాటిని ఊహిస్తున్నారు. ఎన్నింటినో వింటాం, ఊహిస్తాం ఆ తర్వాత మనకు జ్ఞానుల సహవాసం కావాలి. అందుకే మునులు స్మరించువాడు అని తెపిపింది, వాడే నారాయణుడు అని తెలిపింది. ఇలా మునుల వద్ద ఉపదేశం పొంది ఇక మనం జీవనం సాగించాలి. అలా సాగితే మనం *"ద్రష్టవ్యః"* అప్పుడు స్పష్టంగా చూడగలం. 


*"కీళ్"* తూర్పు దిక్కున *"వానమ్"* ఆకాశం *"వెళ్ళెన్ఱ్"* తెల్లవారిందని అనుకుని *"ఎరు మై"* గేదెలన్ని కూడా *"శిఱు వీడు మెయ్యాన్"* చిన్న మేత మేయడానికి *"పరందన కాణ్"* పచ్చిక బయళ్ళలో వ్యాపించాయి. సాధారణంగా గేదెలను తామసిక గుణంతో పోలుస్తారు, తెలవారటాన్ని సత్వంతో పోలుస్తారు. ఇక్కడ ఆండాళ్ తల్లి మనలోని తామసిక గుణాన్ని బయటకు పంపి సత్వం పైకి వస్తున్నప్పుడే మనం భాగుపడే ప్రయత్నం చెయ్యాలి. మరి ఈ తామసిక గుణం మనలో ఎంతవరకు ఉంటుంది, శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్లు- *"రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే"* మనలోపలుండే సర్వ రసుడు, సర్వ గంధుడు అయిన భగవత్ దర్శనం అయినప్పుడు మాత్రమే మనలోని ఈ తామసిక గుణం బయటకి పోతుంది. అంతవరకు మనం దాన్ని అణిచే ప్రయత్నం చేయాలి. మీముఖ కాంతికి చీకటి చెదిరి అలా తెల్లవారినట్లు మీకనిపిస్తుంది, ఇంకా తెల్లవారలేదు అని ఆ లోపల గోప బాలిక లేవలేదు. 


*"మిక్కుళ్ళ పిళ్ళైగళుం"* మిగతా పిల్లలందరూ *"పోవాన్ పోగిన్ఱారై"* త్వరత్వరగా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్ళిపోతుంటే *"ప్పోగామల్ కాత్తు"* వాళ్ళను ఆపి, *"ఉన్నైక్కూవువాన్ వందు నిన్ఱోం"* నిన్ను కూడా తీసుకు వెళ్దామని నీ ఇంటి ముందుకు వచ్చాం. ఎందుకంటే, *"కోదుగలం ఉడైయ పాపాయ్!"* శ్రీకృష్ణుడికే నిన్ను కలవాలని కుతూహలం కల్గించే గోపికవి కదా నివ్వు. భగవద్గీతలో స్వామి చెప్పినట్లుగా *"ప్రియోహి జ్ఞానినో త్యర్థమాం సచ మమ ప్రియః"* జ్ఞానికి నేనంటే ఎంత ఇష్టమో నాకూ జ్ఞాని అంటే ఇంకా ఎక్కువ ఇష్టం అని పరమాత్మ అన్నాడు. అందుకే మనం ఆలయాల్లో ఆళ్వారులని పెట్టుకొని వారి ద్వారా స్వామిని సేవిస్తాం. నిన్ను వదిలి మేం వెళ్ళలేం. నీవు మావెంట ఉంటే శ్రీకృష్ణుడు తప్పనిసరి ప్రసన్నం అవుతాడు. *"ఎళుందిరాయ్"* లేవమ్మా అందరం కలిసి వెళ్దాం. అక్కడకు వెళ్ళి *"పాడి ప్పఱై కొండు"* మనకు నోరు ఉన్నందుకు ఆయన నామాన్ని పాడుదాం. 


*"మావాయ్ పిళందానై"* గుఱ్ఱం రూపంలో వచ్చిన అశ్వాసురుని నోట్లో చేయి పెట్టి నోరు విరిచివేసాడు. మనలోని ఇంద్రియాలు అశ్వాలకు ప్రతీక. కఠోపనిషత్ లో ఈ విషయం ఉంది. యముడు నచికేతుడికి చెబుతాడు *"ఇంద్రియాణి హయానాహుః"* శరీరం అనే రథానికి ఉన్న గుఱ్ఱాలు ఇంద్రియాలు. ఈ ఐదు ఇంద్రియాలు మనను ఐదువైపులకు లాగుతుంటాయి. మనస్సు అనే కళ్ళెంను బుద్ది అనే సారథిచేతులో పెట్టావా ప్రయాణం సుఖం. లేకుంటే ఈ రథం ముక్కలు ముక్కలై పోతుంది జాగ్రత్త అని హెచ్చరిస్తాయి ఉపనిషత్తులు. భగవంతుడు ఇంద్రియాలను హరించడు, వాటి ప్రవృత్తిని మారుస్తాడు. అందుకే అశ్వాసురుని నోరు విరిచేసాడు.


*"మల్లరై మాట్టియ"* మథురా నగరిలో మల్ల యోధులైన చాణూరుడు ముష్టికుడులను కంసుడు శ్రీకృష్ణ బలరాములను సంహరించడానికి ఏర్పాటుచేసాడు. వారు మాదక ద్రవ్యం సేవించి ఉన్నారు, కృష్ణ బలరాములు వారి మద్యకి వెళ్ళి, ఇరువురు వారిని వారే సంహరించుకొనేట్లు చేసారు. మనకి ఆయనను దూరంగా పోకుండా ఆయనే చేసుకున్నాడు. మనలోని కామ క్రోధాలు ఈ మల్ల యోధులవంటివే అని గమనించాలి. మనలోని కోరికలను ఎంతవరకు ఆపగలం, ఎంత కోరిక తీర్చుకోవాలని చూస్తే అంత పెరుగుతాయి మన కోరికలు. ‘పూరణైరేవ కన్యతే’- దేనితోనైతే నీవు పూడ్చాలని ప్రయత్నం చేస్తావో అవే ఈ కన్నాన్ని పెద్దగా చేస్తాయి. అగ్నికి కావల్సింది ఇంధనం, ఇంధనం పోస్తే అగ్ని మరింత పెరుగుతుంది అలానే మనలోని కోరికలు మరింత పెరుగుతాయి. రావణ వధ అనంతరం, హే రావణా! ఈ రాముడు కోతులు నిమిత్తమాత్రులు, నిన్నా వీరు అణిచివేసింది, నీలోని కామ క్రోధాలను పైకి లేపుకున్నావు వాటితో నిన్ను నేవే చంపుకున్నావు! అని మండోదరి శోకిస్తూ అన్న మాటలు. కృష్ణుడివైపు మనం మళ్ళిస్తే వాటిని కృష్ణుడే సంహరించివేస్తాడు. 


*"దేవాది దేవనై"* ఆయన దేవాది దేవుడు, మనల్ని ఆయన ఎప్పుడు వదలడు. ఇన్నాళ్ళూ మనం ‘నేను- నీవాడను’ అని అనకనే కదా ఇక్కడ ఉన్నాం, ఇప్పుడు కోరిక కలిగినందుకు నోటితోĥ ఒక్క సారి అను. ఏమని *"చ్చెన్ఱు నాం శేవిత్తాల్"* ఒక్క సారి మనం చేరి తండ్రీ ‘మేము నీవారమని’ తెలిపితే చాలు. *"ఆవా ఎన్ఱ్ ఆరాయ్ అంద్ అరుళ్"* మన కోసం ఆయనే తపిస్తాడు. ఇక్కడ మనం రామాయణం లోని ఒక సన్నివేశం గుర్తు చేసుకుందాం. రాముడు వనవాసం చేస్తూ పంచవటిలో కుటీరం కట్టుకొని ఉన్నాడు, అంతలోనే అక్కడికి కొంతమంది ఋషులు వచ్చి రామా మాకు ఇన్ని కష్టాలున్నాయని మొర పెట్టుకున్నారు. రాముడు నేను అయోద్య నుండి వచ్చింది మీ కష్టాలు తెలుసుకొని తీర్చేందుకేనని, తను కొంత ఆలస్యం చేసినందుకు సిగ్గు పడ్డాడు. ఇదీ పరమాత్మ స్వభావం. మనం ఒక్కసారి సేవిస్తే చాలు ఆయన మనకోసం తపిస్తాడు. ‘తిరుమరిసై ఆళ్వార్’ ఆయననే భక్తి సారులు అని కూడా అంటారు, ఆయన కాంచీ పురంలో ఒక ఆలయంలో ఉండేవారు. వారితో పాటు ఆయన శిష్యుడు ఉండేవాడు. అయితే ఆ శిష్యుడు మంచిగా పాటలు పాడేవాడు. ఆయన్ని రాజుగారు పిలిచి తనపై పాటలు పాడమని కోరారు. దానికి ఆయన’దేవుణ్ణి పాడే నాలుక మనుష్యులను పాడటానికి కాదు!’ అని అన్నాడు, దానికి రాజు కోపించి ఆయన్ని రాజ్యం నుండి బహిష్కరించాడు. అతనితో పాటు గురువుగారూ బయలుదేరారు. దానితో ఆ గురువుగారి వెంట ఆలయంలో పెరుమాళ్లు కూడా అతని వెంటనే వెళ్తాననడంతో, రాజుగారు ఇద్దరిని బతిమిలాడి తీసుకువచ్చాడట. ఆ భక్తుడంటే ఆ పెరుమాళ్ళకి అంత ఇష్టం ఉండేది. ‘యదోక్తకారి’- ఎలా చెపితే అలా వినే పెరుమాళ్ అని అర్థం. ఇది కాంచి పురంలో ఒక ఆలయం.  మనపై పడేట్టు చేస్తుంది.

      

    *బాగ స్వామ్యం  చేయడమైనది*

*న్యాయపతి నరసింహారావు*

కామెంట్‌లు లేవు: