*నా ఉన్నతికి హుందా నా భాష…!*
నన్నయ్య నారు పోయగా,
తిక్కన్న తీపు తొడగగా,
ఎర్రన్న వర్ణమై విరసిల్లగా,
నా తెలుగు సస్యశ్యామలమాయె...
పాల్కురికి అచ్చతెలుగు తోడవగా,
శివతత్వం చిందులేయగా,
తెలుగు పదం పాదాలు కలిపి,
కావ్యమై పరవళ్లు తొక్కింది..
శ్రీనాథుని సీసంలో రోషంగా,
పలనాటి పౌరుషంగా,
చాటువై పద్యాల్లో మేటిగా,
గంభీరంగా జలజల ప్రవహించింది…
పోతన సేద్యంలో నాగలిగా,
తెలుగు నేలపై భక్తిని పండించి,
భాగవతపు వెన్నను అందించి,
తెలుగు రీతుల మాధుర్యమే పంచింది..
అష్టదిగ్గజాలు పల్లకి కాగా,
ప్రబంధమే గండపెండెరంగా,
కృష్ణరాయల చేతుల్లో,
వినువీధుల్లో అంబారీపై అందాలనెక్కింది..
బద్దెన సుద్దులు చెప్పగా,
వేమన్న బుద్ధులు విప్పగా,
శతకమై అమరత్వాన్ని పొంది,
పిల్లల నోట తియ్యటి మాటగా నిలిచింది…
నేడు సరళత్వము పొందగా,
ఆధునికమై అందాలనెక్కగా,
విశ్వవీధిలో వింజామరలు,
వీస్తూ ప్రపంచమంతా పరవళ్లు తొక్కుతోంది…
కందుకూరి సంస్కరణ చేయగా
గురజాడ ముత్యాల హారాలు కూర్చగా
గిడుగు గోడై నిలవగా
నవ్యమై నవ శకాన్ని ప్రారంభించింది..
జ్ఞానపీఠాలు కిరీటంలా ధరించగా
అన్ని ప్రక్రియలలో ఆరితేరగా
పద్యమై గేయమై పాటలై పారగా
నేలంతా తెలుగు పలుకులతో వికసించింది..
ఇదే నా భాష ఇదే నా శ్వాస,
నా జాతికి చిహ్నంగా,
నా ఉన్నతికి హుందాగా,
నన్ను నడిపిస్తుంది నిత్యం ఇది సత్యం..
కొప్పుల ప్రసాద్
నంద్యాల
9885066235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి