5, జనవరి 2026, సోమవారం

శ్రీ శ్రీ బోధే౦ద్ర సరస్వతి స్వామీజీ

  శ్రీ శ్రీ బోధే౦ద్ర సరస్వతి స్వామీజీ ( కంచి మఠానికి 59 వ పీఠాధిపతులు. )


* * *

కేశవపాండురంగ యోగి , సుగుణ దంపతులకు 1610 వ సంవత్సరంలో క౦చిమఠానికి కేంద్రంగావున్న, కాంచీపురంలో బోధే౦ద్ర సరస్వతి స్వామి, జన్మించారు. చాలారోజుల వరకు తల్లిదండ్రులకు సంతానం లేకపోగా, లేకలేక కలిగిన ఈ పిల్లవాడు, 59 వ కంచి జగద్గురు విశ్వకేంద్ర సరస్వతివారి వరప్రసాదంగా తల్లిదండ్రులు తలపోశారు. విశ్వకేంద్ర సరస్వతి స్వామి వారే బాల్యంలో ఆ పిల్లవానికి ‘ పురుషోత్తమన్ ‘ అని నామకరణం చేసారు. 


బాల్యంలోనే పురుషోత్తమన్ చూపిస్తున్న భక్తిభావం, పరిపక్వత, నిగూఢ మేధాశక్తి చూసి ఆశ్చర్యపోయి, విశ్వకేంద్ర సరస్వతి వారు, ఆపిల్లవాడు తమదగ్గరవుంటే, మానవజాతి కి యెంతోసేవ చేయగలడని తలచి, ఆ పిల్లవాడిని, కంచి పీఠానికి దత్తత యివ్వమని పురుషోత్తమన్ తల్లిదండ్రులను కోరారు. తమ పీఠానికి కాబోయే అధిపతినిగా పురుషోత్తమం ని చేయాలనీ వారి ప్రగాఢ సంకల్పం. 


* * *

తల్లిదండ్రులు కూడా లేకలేక కలిగిన సంతానమైనా, అతడిని తమ ఇష్టపూర్వకంగానే కంచిపీఠానికి దత్తత ఇచ్చారు. పురుషోత్తమన్ దినదిన ప్రవర్ధమానుడవుతూ, శృతి, స్మృతి, పురాణాలలో మంచి ప్రావీణ్యం పొంది, వేదాంత విషయాలలో పట్టుసాధించి, యువకులకు మార్గ దర్శకులయ్యారు. క్రమంగా పురుషోత్తమన్ రామనామ సంకీర్తన వైపు దృష్టి మరల్చి, కలియుగంలో రామనామ సంకీర్తనమే భవత్సాగరం దాటిస్తుందని ప్రగాఢంగా నమ్మారు. ఆక్రమంలోనే, రోజుకు లక్షసార్లు పురుషోత్తమన్ రామనామ జపం చేస్తూ వుండేవారు.  


* * *

సన్యాసం స్వీకరణ 


పూరి జగన్నాధ క్షేత్రంలో, ‘ లక్ష్మీధరులు ‘ వ్రాసిన ‘ భగవద్ నమ కౌముది ‘ ని వారినుండి గ్రహించి, దాని స్పూర్తితో ఒక లక్ష భగవద్ నామ శ్లోకాలను స్వరయుక్తంగా తయారుచేసి, ఆ తరువాత గురువుగారి అనుమతితో, బోధే౦ద్ర సరస్వతి పేరుతొ సన్యాసం స్వీకరించి, కాంచీపురం వెళ్లారు. 1638 నుంచి వారు జీవన్ముక్తి పొందేవరకు స్వామి కాంచీపీఠ 59 వ, మఠాధిపతులుగా వున్నారు. 


భగవద్ నామ శ్లోకాలను స్వరపరచే సువర్ణ అవకాశం బోధే౦ద్రులు అందిపుచ్చుకుని, రామునిపై తనకున్న భక్తినంతా ఆ శ్లోకాలలో కుమ్మరించి ధన్యులయ్యారు. బోధే౦ద్ర స్వామి, శ్రీరాముని వైభవాన్ని కీర్తిస్తూ, ఆరు గొప్ప కావ్యాలు ప్రజలముందు వుంచారు.  


అవి భగవన్నామ రసోదయం, భగవన్నామ రసార్ణవం, భగవన్నామ రసాయనం, హరిహర భేద ధిక్కారం ‘

మొదలైనవి. రామనామ ప్రాశస్త్యాన్ని వివరించడానికి స్వామి అనేక గ్రామాలు తిరుగుతూ, శ్రీరాముని గొప్పదనాన్ని పల్లెప్రజలకు వివరించి వారిని ధన్యులను చేసారు. 


* * *

బోధేన్ద్ర స్వామి తమతోపాటు, శ్రీ శ్రీధర వేంకటేశ్వర అయ్యవారిని తిరువిశనల్లూర్ నుండి పిలిపించుకుని, అనేక గ్రామాలు వారిని తీసుకువెళ్లి, వారిచేతకూడా రామనామ ప్రాశస్త్యం గురించి చెప్పించారు. ఆ అనుభవాలతోనే, శ్రీధర వేంకటేశ్వర అయ్యవారు, ‘భగవన్నామ భూషణం ‘ అనే గ్రంధాన్ని రచించి, అందులో, పరమాత్మ ప్రభావాన్ని వేదాలు, ఇతిహాసాలు, పురాణాలూ మూలంగా తీసుకుని రచించారు. 


గోవిందపురం 


బోధేన్ద్ర సరస్వతి, ఆవిధంగా పర్యటిస్తున్నప్పుడే కావేరీ తీరం వెళ్లడం జరిగింది. అక్కడి ప్రకృతి రమణీయతకు యెంతో ముగ్ధులై, తమ శేషజీవితాన్ని అక్కడే గడిపి, సమాధి పొందాలని నిర్ణయించుకున్నారు. 


తంజావూరు లోని గోవిందపురంలో, ఆ విధంగా స్వామి నిర్ణయించుకున్నట్లే, 1692 లో పురత్థాసి ( సెప్టెంబర్- అక్టోబర్ ) మాసంలో, ఒక ప్రాత: సమయాన తాము కోరుకున్న విధంగానే, బోధేన్ద్ర సరస్వతి, కూర్చున్నవారు కూర్చున్నట్లే మహాయోగి వలే, జీవసమాధి పొందారు. ఆ తరువాత, ఒక పౌర్ణమి తిధినాడు, విదేహముక్తి పొందారు. 


* * *

బోధేన్ద్ర సరస్వతి వారి సమాధి ఇప్పటికీ సకల మర్యాదలతో, కాంచీమఠం నిర్వహిస్తూ వున్నది. 


స్వస్తి. 

ప్రేమతో, 

గండవరపు ప్రభాకర్. 


( ఒక ముఖపుస్తక మిత్రుని కోరిక మేరకు, బోధేన్ద్ర సరస్వతి స్వామివారి గురించి వ్రాసే అవకాశం నాకు దక్కింది. ఆ మిత్రునికి కృతజ్ఞతలతో...)

కామెంట్‌లు లేవు: