5, జనవరి 2026, సోమవారం

- బీబీ నాంచారిని


ప్రశ్న :- బీబీ నాంచారిని వెంకటేశ్వర స్వామి వారు నిజంగా వివాహం చేసుకున్నారా.


సమాధానం :-


నేను దాదాపు ఆరు నెలల పాటు రీసెర్చ్ చేసి సంపాదించిన అంశాలు ఈ పోస్ట్ కు ఆధారం.


బీబీ నాంచారి అనే భక్తురాలినీ వేంకటేశ్వరస్వామి వారు వివాహం చేసుకున్నారా అంటే .

 తిరుమల ఆలయం యొక్క స్థలపురాణం లో కానీ స్వామి వారి భక్తుల యొక్క చరిత్ర లో కానీ తిరుమల కు సంబంధించి ఎక్కడ కూడా బీబీనాంచారి అనే భక్తురాలి పేరు మనకు కనిపించదు.

ఆ పేరు కల భక్తురాలు ఎప్పుడైనా తిరుమలకు వచ్చింది అని చెప్పడానికి కూడా ఒక చిన్న ఆధారం కూడా మనకు దొరకదు.


మరి బీబీనాంచారి అనే భక్తురాలు ఏ ఆలయం యొక్క చరిత్రలో కనిపిస్తుంది అంటే దానికి సంబంధించిన వివరాలు మనకు మైసూరు సమీపంలోని మెల్కోటే ఆలయం యొక్క చరిత్ర లో కనిపిస్తుంది.అక్కడి చరిత్ర ఏమిటి అని ఒకసారి పరిశీలిద్దాం.


ఢిల్లీ సుల్తానులు మెల్కోటే ఆలయం పై దాడి చేసి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఎత్తుకొని వెళ్లిపోయారు అని అప్పుడు రామానుజుల వారు డిల్లీకి వెళ్ళి సుల్తాన్ తో మాట్లాడి ఆ విగ్రహాన్ని తిరిగి తీసుకుని వచ్చారు అని చెబుతారు.

కాకపోతే ఆ స్వామి వారి విగ్రహాన్ని ఎంతో ఇష్టంగా ప్రాణం గా ప్రేమించే ఆ సుల్తాన్ కూతురు స్వామి వారి విగ్రహాన్ని వదిలి ఉండలేక మెల్కోటే ఆలయానికి వచ్చి అక్కడ ఆలయం ముందు తనువు చాలించి స్వామి లో ఐక్యం అయింది అని కొందరు భావిస్తారు.


(నిజానికి అక్కడ ఉన్న స్వామి వారి విగ్రహం చాలా అద్భుతమైన సౌందర్యం తో ఉంటుంది.ఎంత సేపు చూసినా తనివితీరని రూపం అక్కడున్న చలువ నారాయణ స్వామి రూపం .అక్కడ స్వామిని కూడా పగలు కాకుండా సాయంత్రం పూట అదికూడా వెన్నెల్లో ఊరేగింపు చేస్తారు.అందుకే ఆ స్వామిని చలువ నారాయణస్వామి అని అంటారు.)


అక్కడి వరకు బాగానే ఉంది కానీ.

చరిత్ర ను కొంచెం పరిశీలిస్తే 

రామానుజుల వారి జీవితకాలం1017 నుంచి 1137 

వరకు .ఒక మానవుని సంపూర్ణఆయువు 120 యేళ్ళు రామానుజుల వారు అలా పరిపూర్ణజీవితాన్ని గడిపారు.కానీ రామానుజుల వారి కాలం లో డిల్లీ నీ సుల్తానులు పాలిస్తున్నారా లేదా అని పరిశీలిస్తే అప్పటికి డిల్లీ ఇంకా ముస్లిం సుల్తానుల చేతుల్లోకి పోలేదు .అప్పుడు డిల్లీనీ పాలిస్తుంది 

రాజపుత్రులు ఐన తోమర్లు అంటే కచ్చితంగా చెప్పాలి అంటే అనంగపాల తోమర్ అనే హిందూరాజు డిల్లీ నీ పాలిస్తున్నాడు.


రామానుజుల వారు పరమపదం పొందిన 60 ఏళ్లకు డిల్లీ సుల్తానుల పరం అయింది.అంటే కుతుబ్ బుద్ధిన్ ఐబక్ అనే ఘోరీ సైన్యాధిపతి డిల్లీసుల్తాన్ అయ్యాడు.ఇతడి వంశాన్ని మామ్లుక్ రాజవంశం లేదా బానిస వంశం అంటారు.


పోనీ దక్షిణ భారత దేశం పైకి మొదట దాడి చేసిన వారు ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ తరుపున మాలిక్ కాఫర్ దాడి చేశాడు అదికూడా రామానుజల వారి కాలం తరువాత దాదాపు 150 సంవత్సరాలకు

దీన్ని బట్టి పరిశీలిస్తే రామానుజుల కాలం లో మెల్కోటే ఆలయం పై ముస్లిము ల దాడి జరగలేదు అని తెలుస్తుంది .అలా దాడి జరగనప్పుడు రామానుజుల వారు డిల్లీ వెళ్ళడం ఆపద్ధము.

ఆ డిల్లీ సుల్తాన్ కూతురు మెల్కోటే రావడం కూడా అబద్దం.ఇంకా విచిత్రం ఏమిటంటే డిల్లీ సుల్తాన్ అంటారు కానీ ఆ సుల్తాన్ పేరు ను ఇంతవరకు ఎవ్వరు చెప్పడం నేను వినలేదు.


తరువాత కాలం లో అంటే 14 లేదా 15 వ శతాబ్ద కాలం లో బీబీ నాంచారి కథను సృష్టించి ఉండవచ్చు.


దీన్ని బట్టి పరిశీలిస్తే బీబీ నాంచారి అనే భక్తురాలు కల్పితం అని కచ్చితంగా మనం నిరూపించవచ్చు.


జై శ్రీ కృష్ణ 🙏 🙏 🙏 🙏 🙏 🌺🌺🌺🌺🌺🌺

కామెంట్‌లు లేవు: