5, జనవరి 2026, సోమవారం

శ్రీ లింగ మహాపురాణం

  అష్టాదశ పురాణాలు - శ్రీ లింగ మహాపురాణం - పశుపక్ష్యాదుల సృష్టి - ఎనభై ఒకటవ భాగం

_________________________________________________

బ్రహదేవుడు అసుర దేవ పితృ మానవాది ఎనిమిది సృష్టుల తరువాత పశుపక్షు జంతు మృగాదుల సృష్టి చేయ సంకల్పించాడు. యువావస్థ పొంది స్వేచ్ఛగా జీవించగలిగే పక్షులను సృష్టించాడు. ఈ పక్షులు రెక్కలు కలిగి ఆకాశంలో ఎగురుతూ ఎక్కడికైనా వెళ్ళగలవు. పక్షులను సృష్టించిన తరువాత రెక్కలు కలిగిన పశువుల సమూహములను సృష్టించాడు.


తరువాత జంతు సృష్టి జరిగింది. బ్రహ్మ తన ముఖము నుండి అజములను అనగా మేకలను, వక్షస్థలము నుండి గొర్రెలను, ఉదరము నుండి గోవులను (ఆవులను) , పార్శ్వముల నుండి వృషభమలను (ఎద్దులను), పాదముల నుండి గుర్రములను, గార్ధభములను, ఏనుగులను, ఒంటెలు మొదలైన వన్య మృగములను సృష్టించాడు.


బ్రహ్మ దేవుని శరీర రోమముల నుండి సస్య, పూల మొక్కలు, ఫలముల నిచ్చే వృక్షాలను సృష్టింప చేశాడు. స్వాత్తిక సృష్టిగా పిలువబడే సృష్టి తరువాత బ్రహ్మదేవుడు యజ్ఞము చేశాడు. అప్పుడు ఆటవిక మృగ సృష్టి జరిగింది.


అప్పుడు మాంస భక్షక మృగములు, వేటకుక్కలు, వానరములు, పక్షి పంచకములు (మాంస భక్షణ చేసే ఐదు రకాల పక్షులు) , ఏడు రకాలైన సరీసృపములు అనగా నేల పై ప్రాకే జీవులు, తోడేళ్ళు, పులులు, సింహాలు మొదలైన క్రూర మృగాలు సృష్టించబడ్డాయి.


కల్ప ప్రారంభంలో మొదట బ్రహ్మ విద్యుత్, వజ్ర, మేఘ, రోహిత, ఇంధ్రధనుస్సు, తేజ, జ్యోతిర్గణాలను సృష్టించాడు. దేవతలు, అసురులు, పితరులు, మానవులను సృష్టి చేసిన తరువాత స్థావర జంగమ యక్ష పిశాచ గంధర్వ అప్సరస కిన్నెర రాక్షస గణాలను ఉత్పన్నం చేశాడు. పిదప వృక్ష పశు పక్ష్యాదులు సర్పాలు జంతువులు మృగాలను సృష్టి చేశాడు.


పూర్వ కల్పాలలో వీటికి హింస అహింస నమ్రత క్రూరత ధర్మము అధర్మము సత్యము అసత్యము మొదలైన ఏయే స్వభావాలు ఉన్నాయో ఈ కల్పంలో కూడా అవే స్వభావాలు లక్షణాలు సమకూర్చుకున్నాయి.


తరువాత బ్రహదేవుని ప్రధమ ముఖము నుండి గాయత్రి, త్రిక్, త్విష్ఠ, సామ, స్థంతర, అగ్నిష్టోమ మంత్రాలు, పద్యాలు సృష్టించబడి శబ్ద రూపంలో వెలువడ్డాయి. దక్షిణ ముఖము నుండి యజు, త్రిష్టుభు, ఛందము పంచదశ స్తోమము, బృహద్ స్తోమము, ఉక్త్య పద్యాలు సృంజించబడ్డాయి.


తరువాత జగతీఛంద, సప్తదశ స్థోమ, వైరూపసామ, అతిరాత్ర మంత్ర పద్యములు ఉత్న్నమయ్యాయి. ఉత్తర ముఖము నుండి ఇరవై ఒకటి అధర్వ ప్రార్ధనా మంత్రాలు, ఆప్తోయ, అర్యమ, అనుష్ఠభ ఛందము, వైరాజ ఛందముల సృష్టి జరిగింది.


తరువాత మహాభూతములైన ఇంద్రియముల క్రియల, విషయములు, వాని రూపముల సృష్టి జరిగింది. బ్రహ్మ స్వయంగా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రయాలు జీవులకు ఏర్పాటు చేశాడు. వేదముల ననుసరించి ప్రళయము యొక్క అంతిమ రాత్రి చివర భాగంలో ఉత్పన్నులయ్యే మునుల పేర్లను, చేయు కర్మలను బ్రహ్మదేవుడు మునుపటి కల్పాలలో ఏవిధంగా ఉందో అదేవిధంగా ఉండేటట్టు చేశాడు.


బ్రహ్మదేవుడు చరాచర ప్రాణుల సృష్టి తన మానసిక స్థితిని అనుసరించి చేశాడు. సత్త్వ రజో గుణాలతో సృష్టి తరువాత బ్రహ్మ మనస్సులో తనూ మాత్రమే సృష్టి ఇలా ఎంత కాలం చేస్తూ వుండగలడు అనే ఆలోచన వచ్చింది. మనస్సు తమోగుణ పూరితమై దుఖము కలిగి దుఖితుడయ్యాడు. ధ్యాన దీక్షలోకి వెళ్లిన తర్వాత సత్త్వ రజో గుణములు వచ్చి తమముతో ఏకమైనాయి. మిధునం లేదా జంటగా ఏర్పడటంతో సృష్టి కొనసాగించటానికి తగిన విధంగా తన దేహాన్ని రెండుగా మార్చాలని అన్న ఆలోచన కలిగి బ్రహ్మకు ప్రసన్నత కలిగింది.


తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం.


మీ అమూల్యమైన స్పందన కోరుతూ.


మీ

శ్రీకాంత్ గంజికుంట కరణం

కామెంట్‌లు లేవు: