5, జనవరి 2026, సోమవారం

సాధన చతుష్టయ సంపత్తి. 23 .

  సాధన చతుష్టయ సంపత్తి. 23 . 

( అజ్ఞాన మూల : , అజ్ఞాన స్వరూప విచారణ )


దీనికి సంబంధించిన వివరణ ఆదిశంకరులు, ' వివేక చూడామణి ' లో విశదంగా చెప్పడం జరిగింది, సంస్కృతశ్లోకాలద్వారా. వీటిని మన సౌలభ్యం కోసం, సులభమైనశైలిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


ఓం శ్రీగురుభ్యోమ్ నమ : 


* * *

శ్లో. 

అనాదిత్వ మవిద్యాయా : కార్యస్యాపి తథేష్యతే /

    ఉత్పన్నా యాస్తువిద్యయా మా విద్య కమనాద్యపి // 200 .  


అవిద్యకు మొదలంటూ ఎలాలేదో, అలాగే జగత్తు, జీవము. బుద్ధి మొదలైనవి కూడా అనాదిగా వున్నవి. అయినా, జ్ఞానము పొడచూపగానే, అజ్ఞానమనే పొర, వీటికి తొలగిపోతుంది. మట్టినుండి కుండతయారుకాక మునుపు కుండలేదు. అనగా అది నిత్యముకాదు.  


* * *

కారణముకన్నా కార్యము వేరుకాదు. అగ్నియొక్క లక్షణము దహించుట. దహించుట అనేది అగ్నికి వేరుగాలేదు. నీటి స్వభావము చల్లగావుండుట. చల్లదనము వేరు, నీరు వేరుకాదు. అవయవముల కన్నా శరీరము భిన్నముకాదు. నూలుపోగులకన్నా వస్త్రము వేరుకాదు. విత్తనముకన్నా చెట్టు వేరుకాదు. ఈ విధంగా కార్య కారణ సంబంధములను గుర్తుపట్ట కలగాలి.  


అందువలన అవిద్య అనాదిగా వస్తున్నా, అవిద్య వలన చేస్తున్న కర్మలుకూడా అవిద్యయే. అవిద్య వలననే పుణ్యపాపకర్మలు చేయకలుగుతున్నాము. అవిద్య నశించే జ్ఞానము కలిగినంతనే అమృతత్వ భావన అనుభవించ కలుగుతున్నాము.  


సూర్యోదయము కాగానే అంధకారము అంతర్ధానం అవడం నిత్యం అందరకూ అనుభవమే. ఎంత భానుడు ప్రకాశించినా, గుహలో సూర్యకిరణాలు సోకకపోతే, గుహలో చీకటిని ఎవరు పారద్రోలగలరు.


* * *

కాబట్టి ఈ అజ్ఞానము అనాదిగావున్నా, నిత్యము కాదు, తొలగింప శక్యమైనది. గురుదేవులు దృష్టాంత పూర్వకంగా చెప్పుచున్నారు. స్వప్నం అనుభవిస్తున్న వానికి కలలో చూసిన పదార్ధములు, సంఘటనలు, ఆ సమయానికి సత్యములుగా కనిపిస్తాయి. స్వప్నం లోనే ఆనందిస్తూ ఉంటాడు, భయపడుతూ వుంటాడు. ధిగ్గున మేల్కొనగానే, అవన్నీ మాయమయి మంచి స్వప్నమైతే, ఇది నిజమైతే యెంత బాగుంటుంది అనుకుంటాడు. చివరగా, స్వప్నం లో చూసింది మిధ్య అని తెలుసుకుంటాడు. అదేవిధంగా, జాగ్రద్ అవస్థలో జరుగుతున్న సంఘటనలు, జ్ఞానికి జ్ఞాన అవస్థలో కల్పితంగానే కనిపిస్తాయి.   


ఉపాధి అనేది బుద్ధితో సమన్వయము అయేదితప్ప వేరుకాదు. స్వేచ్ఛగా తిరిగే పక్షిని పంజరంలో బంధించి పంచభక్ష్య పరమాన్నాలు పెట్టినా, దానికి శాంతి కలుగదు. బయట స్వేచ్ఛగా తిరుగుతున్న వేరొక పక్షి బియ్యపుగింజలు కష్టపడి సంపాదించుకుని తిరుగుతుంటే, దానినిచూసి, అశాంతికి గురి అవుతుంది.  


* * *

అలాగే, జీవుడు నిత్యానంద స్వరూపుడే అయినా, అవిద్యకు తగులుకుని, బుద్ధి అనే ఉపాధిలోవుండి, అశాంతికి గురి అవుతున్నాడు. జ్ఞానముచే ఆ బంధాన్ని తొలగించు కున్నవాడై, పరమాత్మ రూపమై శాంతి పొందుతున్నాడు.   


స రాగులకు, వీత రాగులకు ఇదే వ్యత్యాసము. 


* * *

శ్లో.  

జీవత్వం న తతో>న్యత్తు స్వరూపేణ విలక్షణ /

  సంబంధస్వ్యాత్మనో బుద్ధ్యా మిధ్యా జ్ఞాన పురస్సర : // 203 .


జీవత్వం అనేది యదార్ధముకాదు. అది బుద్ధివలన కలిగిన దోషమే. ఉపాధికి బుద్ధితోవున్న సంబంధమే జీవత్వం. బియ్యపుగింజపై పొట్టు వున్నప్పుడే, దానిని వడ్లగింజ అని అంటాము. ఒకసారి, పొట్టు తీసివేసిన తరువాత, అది కేవలం బియ్యపు గింజ మాత్రమే.  


అలాగే, జీవత్వం అనేది బుద్దిని ఆలంబనగా చేసుకుని వున్నదే. అది అజ్ఞానముచే కల్పితము . ఆ బుద్ధి అణిగినచో జీవుడే పరమాత్మ. 


* * *

జీవత్వబుద్ధి తొలగే ఉపాయము చెబుతున్నారు గురుదేవులు. 


స్వస్తి.

ఆదిశంకరుల అనుగ్రహంతో మరికొంత రేపు. 

ప్రేమతో,

గండవరపు ప్రభాకర్.

కామెంట్‌లు లేవు: