5, జనవరి 2026, సోమవారం

సంపూర్ణ మహాభారతము

  🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*శనివారం 3rd జనవరి 2026*

``

            *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                             9️⃣4️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


      *సంపూర్ణ మహాభారతము*


                    *94 వ రోజు*                   

*వన పర్వము తృతీయాశ్వాసము*


             *మాంధాత*```


ఆ తరువాత ధర్మరాజు సైంధవారణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడ ప్రవహించుచున్న యమునా నదిని చూసి రోమశుడు ఇలా చెప్పసాగాడు.. “ధర్మరాజా ఇది యమునా నది. గంగా నదితో సమానమైనది. దీని తీరాన మాంధాత అనే మహారాజు ఎన్నో యాగాలు పరిపాలించాడు. ఆయన చరిత్ర చెపుతాను విను..

పూర్వం ఇక్ష్వాకు వంశంలో ధార్మికుడు, కీర్తివంతుడు, ధర్మశీలుడు, బలవంతుడూ అయిన యవనాశ్వుడు అనే రాజు ఉండే వాడు. అతనికి సంతానం లేదు. అతడు భృగుమహర్షి ఆశ్రమానికి వెళ్ళి సంతానం కోసం అర్ధించాడు. అతని కోరిక మన్నించి భృగుమహర్షి పుత్రకామేష్టి యాగం చేసాడు. మంత్రజలం నిండిన పాత్రను జాగ్రత్తగా కాపాడమని ఋత్విక్కులను నియోగించాడు. ఒక అర్ధరాత్రి యవనాశ్వుడు దాహంవేసి తెలియక ఆ మంత్రజలం త్రాగాడు. ఇది భృగుమహర్షికి తెలిసి యవనాశ్వునితో “రాజా! విధి అనుల్లంఘనీయం. నీ భార్యకు ఇవ్వవలసిన జలాన్ని నీవు త్రాగావు. కనుక నీవు గర్భం ధరిస్తావు. నీకు ఒక కుమారుడు పుడతాడు” అని చెప్పాడు. 


యవనాశ్వుడు గర్భం ధరించాడు. అతని ఎడమభాగాన్ని చీల్చుకుని కుమారుడు కలిగాడు. అతనే మాంధాత. ఆ శిశువును చూడటానికి ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు ఆ బాలుని నోట్లో చూపుడు వ్రేలిని పెట్టి 

“ఇది అమృతమయము దీనిని త్రాగుము” అని అన్నాడు. 


అందువలన అతనికి మాంధాతృడు అని నామకరణం చేసాడు. మాంధాత ఎన్నో ఏళ్ళు రాజ్యపాలన చేసాడు. తన పరాక్రమంతో ఎన్నో రాజ్యాలు జయించాడు. యజ్ఞయాగాలు చేసాడు. ఇంద్రునితో యుద్ధం చేసి రాజ్యంలో సకాలంలో వానలు కురిసేలా చేసాడు. మాంధాత యజ్ఞం చేసిన చోటు ఇదే. ధర్మజా! సోమకుడనే మహర్షి యాగం చేసిన ప్రదేశం. ఇది నహుషుడు యజ్ఞం చేసిన ప్రదేశం. ఇది అంబరీషుడు యాగం చేసిన పుణ్యభూమి. ఇది సరస్వతీ నది నిషధ దేశంలో మాయమై ఇక్కడ చమసోద్భేదం అనే చోట బయటపడింది. ధర్మజా ఇది విష్ణుప్రద తీర్థం, ఇది కాశ్మీర మండలం, ఈ క్షేత్రానికి మానసద్వారం అని పేరు. దీనిని పూర్వం పరశురాముడు నిర్మించాడు.```


           *శిబిచక్రవర్తి*```


ఒకరోజు ఇంద్రుడు శిబి చక్రవర్తిని పరీక్షించాలని అగ్నిదేవునితో కలసి తాను డేగరూపంలోనూ అగ్నిదేవుడు పావురం రూపంలోనూ మారారు. 

డేగ రూపం లోని ఇంద్రుడు పావురంరూపంలో అగ్నిదేవుని తరుముతూ ఉన్నాడు. ఆ పావురం శిబి చక్రవర్తి దగ్గరకు వచ్చి శరణు వేడింది. శిబి పావురానికి అభయం ఇచ్చాడు. డేగ శిబి చక్రవర్తిని చూసి 

“రాజా! ఇది నాకు ఆహారం. దీనిని నాకు ఇవ్వండి. ఈ ఆహారం లేకుంటే నేను బ్రతకలేను” అని అడిగింది. 


శిబి చక్రవర్తి “ఈ పావురం నన్ను శరణుజొచ్చింది. అభయం ఇచ్చిన వారిని విడిచిపెట్టడం ధర్మంకాదు. నీవు వేరే ఆహారం చూసుకో!” అన్నాడు. 


డేగ శిబితో “రాజా! ఇది నాకు దేవుడిచ్చిన ఆహారం. దీనికి సమానమైన ఆహారం నాకిచ్చి దీనిని నువ్వు తీసుకో!” అని చెప్పింది.


అందుకు అంగీకరించిన శిబి ఒక కత్తి తీసుకుని తన దేహాన్ని కోసి మాంసం తీసి త్రాసులో వేసాడు. ఎంత మాంసం వేసినా పావురం ఎత్తు తూగకపోవడం చూసి ఆశ్చర్య పడిన శిబి తనకు తానే త్రాసులో కూర్చుని ఆత్మార్పణం చేసుకున్నాడు. 


అతని త్యాగనిరతికి మెచ్చి ఇంద్రుడు, అగ్నిదేవుడు తమ నిజరూపాలు ధరించి “రాజా! నీ త్యాగనిరతికి సంతోషించాము. నీకీర్తి అజరామరమై చిరకాలం వర్ధిల్లుతుంది” అన్నారు.``` 

  

              *సశేషం*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

            🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: