17, జనవరి 2026, శనివారం

అర్చకత్వం

  *అర్చకత్వం:* విరామం లేని సేవ…

కనిపించని త్యాగం, మౌన ఆరోగ్య పోరాటం


ఈ ప్రపంచంలో నిజంగా సెలవులే లేని వృత్తులు చాలా తక్కువ.

అటువంటి అరుదైన, నిరంతర త్యాగంతో నడిచే వృత్తుల్లో అర్చకత్వం ఒకటి.

ఇది ఉద్యోగం కాదు… ఇది ఒక జీవన విధానం, ఒక తపస్సు.


అర్చకుడి రోజు గడియారంతో కాదు – దేవుడి కాలంతో మొదలవుతుంది.

తెల్లవారుజామున లేచి, ఇంట్లో కాలకృత్యాలు తీర్చుకొని,

గుడికి చేరుకొని ముందుగా గర్భగుడిని ఊడ్చి, శుభ్రపరిచి,

దీపాలు వెలిగించి, స్వామివారిని మేల్కొలిపి

 అర్చన ప్రారంభం.


అక్కడినుంచి ఆగకుండా—

అభిషేకాలు, అలంకారాలు, మహానైవేద్యం, దర్శనాలు.

సాధారణ రోజుల్లోనే ఇవన్నీ పూర్తయ్యేసరికి మధ్యాహ్నం 1 దాటిపోతుంది.

ఇక విశేష ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, కళ్యాణోత్సవాలు వస్తే

నిద్ర ఎప్పుడు? భోజనం ఎప్పుడు?

అన్న ప్రశ్నలకే సమాధానం ఉండదు.


ధనుర్మాసం, కార్తీక మాసం అయితే

ఆ సేవ మరింత కఠినంగా మారుతుంది.

భక్తులు ఎడతెరిపి లేకుండా వస్తూనే ఉంటారు.

అర్చకుడికి మాత్రం

విశ్రాంతి అనే మాటే ఉండదు.


ఒక అత్యవసర పరిస్థితిలో పక్క ఊరు వెళ్లాల్సి వస్తే—

ఫోన్ ఓపెన్ చేసి కనీసం 15 మందికి కాల్ చేయాల్సిందే.

14 మంది “కుదరదు” అన్నాక

ఒక్కడు మాత్రమే

“అన్నా నువ్వు వెళ్లిరా… రేపు అర్చన నేను చూసుకుంటా”

అని చెప్పినప్పుడు వచ్చే ఆనందం

డబ్బుతో కొలవలేనిది.


పెద్ద దేవాలయాల్లో ప్రత్యామ్నాయ అర్చకులు ఉండవచ్చు.

కానీ చిన్న దేవాలయాల్లో,

మధ్యస్థ దేవాలయాల్లో,

ఒకే ఒక్క అర్చకుడు ఉన్న ఆలయాల్లో

ఆ ఒంటరితనం, ఆ బాధ

నిజంగా వర్ణనాతీతం.


దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాల్లో

సెలవులు కూడా అధికారుల అనుమతుల మీదే.

సేవ చేయాలన్న మనసు ఉన్నా

స్వేచ్ఛ ఉండదు.


ఎవరైనా ఫంక్షన్‌కు పిలిస్తే ఆనందం కాదు… భయం!

ముహూర్తం వేళ గుడిలో అర్చనకి ఎవరు ఉంటారు?

వెళ్లకపోతే ఏమనుకుంటారో?

ఇక మన ఇంటి శుభకార్యాలకు పిలవడం మానేస్తారేమో?


ప్రత్యామ్నాయ అర్చకుడు దొరకక

వెళ్లలేక వదిలేసిన పెళ్లిళ్లు, శుభకార్యాలు

పదుల్లో కాదు… వందల్లో ఉంటాయి. వాడు అంతేలే పిలిచిన రాడు అనే నిష్టూరాలే ఎక్కువ. మౌనముగా భరిస్తూ బాధ పడుతూ వుంటారు. 


ఇంకా హృదయాన్ని పిండేసే విషయం—

ఇంటిపేరు వాళ్లు, చిన్నప్పటినుంచి తెలిసినవాళ్లు చనిపోతే కూడా

“వాడు ఒక్కడే గుడి చేసుకుంటున్నాడు”

“కార్తీక మాసం”

“ధనుర్మాసం”

అని చెప్పి

మొత్తం కార్యక్రమాలన్నీ అయిపోయాక

పదో రోజు ఫోన్ చేసి

“బాబు, రేపు తలస్నానం చేయి”

అనే స్థితి.


నిన్ను ఎత్తుకుని పెంచినవాడు చనిపోతే

కనీసం ఆఖరి చూపు కూడా చూడలేకపోవడం

అర్చకుడి జీవితంలో

మాటల్లో చెప్పలేని బాధ.


ఇంత సేవ చేస్తూనే

ఎక్కువసేపు గర్భగుడిలో ఉండడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు

చాలా తీవ్రమైనవి – కానీ అవి ఎవ్వరూ మాట్లాడరు.


▪️ గాలి ప్రసరణ లేని గర్భగుడిలో

ధూపం, దీపాలు, కర్పూరం పొగను

రోజూ గంటల తరబడి పీల్చడం వల్ల

తలనొప్పులు, మైకం, శ్వాసకోశ సమస్యలు, దీర్ఘకాలంలో ఆస్థమా


▪️ దీపాల వేడి, మూసివేసిన గది వల్ల

అధిక వేడి, డీహైడ్రేషన్, నీరసం, బీపీ సమస్యలు


▪️ గంటల తరబడి నిలబడి ఉండటం,

వంగి అభిషేకాలు చేయడం వల్ల

మోకాళ్ల నొప్పులు, వెన్నునొప్పి, స్పాండిలైటిస్


▪️ తక్కువ వెలుతురు, పొగ వల్ల

కళ్ల మంట, నీరు రావడం, చూపు మందగించడం


▪️ టైమ్‌కు భోజనం లేక

గ్యాస్ట్రిక్, అసిడిటీ, అల్సర్లు, జీర్ణకోశ వ్యాధులు


▪️ నిద్రలేమి, కుటుంబానికి సమయం లేక

మానసిక ఒత్తిడి, ఒంటరితనం


ఇవన్నిటికంటే అత్యంత దారుణమైన సమస్య ఒకటి ఉంది.

ఒకసారి గుడిలో అడుగు పెట్టాక

మధ్యలో ప్రకృతి పిలిచినా

గర్భగుడిని వదిలి వెళ్లే వెసులుబాటు ఉండదు.


అందుకే చాలాసార్లు

అవి ఆపేసుకుంటూ ఉండిపోతారు.

దీని వల్ల తీవ్రమైన శరీర సంబంధ సమస్యలు వస్తాయి.

ఒకవేళ పక్కకు వెళ్లి వచ్చినా

మళ్లీ మళ్లీ స్నానాలు, తలస్నానాలు—

అవి తెచ్చే మరో రకమైన ఇబ్బందులు.


ఈ అన్నిటికీ కారణం అవుతుందేమో అని

చాలాసార్లు తినకుండా, తాగకుండా

అలాగే ఉండిపోతారు.


పొద్దున్నే డ్యూటీ ఎక్కితే

ఎప్పుడూ డ్యూటీ దిగే సమయం వస్తుందో

అర్చకుడికే తెలియదు.


ఇన్ని కష్టాలు తెలిసినా

అర్చకుడు గుడిని వదలడు.

స్వామిని వదలడు.

సేవను ఆపడు.


కనీసం సమాజం

గౌరవం,

మాటల మర్యాద,

మానవీయ దృష్టి

చూపితే

అదే అతనికి పెద్ద ఆరోగ్యం.


🙏 అర్చకత్వం వృత్తి కాదు…

తరతరాల త్యాగం,

నిరంతర సేవ,

నిశ్శబ్ద జీవితం,. 🙏🙏👍

కామెంట్‌లు లేవు: