4, ఫిబ్రవరి 2025, మంగళవారం

వరమౌ లోకహితార్థ

 మ.వరమౌ లోకహితార్థ దీక్షలవి సంభావింప నేకాగ్రతన్

తరియింపం జను పాప పంకిలపు నంతస్తాప దౌర్గత్య దు

ర్భర దారిద్ర్యపు వేదనల్ హితమతిన్ వర్ధిష్ణులం గొల్వ నె

త్తరి మేలుం దగఁ గూర్చ నెంచుట మహద్భాగ్యంబునౌ భారతీ!౹౹25 


శా.నేరారోపిత శిక్షయే వినుతమౌ నిత్యార్థ సంసిధ్ధిగన్

భారమ్మయ్యెడు చండ పాశమె ఘన స్వాతంత్ర్య రోచిస్సుగన్

కారాగార నివాసమే విదిత సత్కార్యాళి ప్రాప్తింగనన్ 

పోరాటమ్మును జేసినట్టి మణులన్ పూజించెదన్ భారతీ!౹౹ 26

తలచిన తక్షణమ్మె

 చ.తలచిన తక్షణమ్మె తమ ధారణఁ గల్మిని  చాతురి ప్రభా 

కలిత మనస్కులై వినుత గమ్యముఁ జేరు తెలుంగు తేజముల్

లలిత హితార్థ  సన్మతి విలక్షణమౌ బహుళార్థ సాధన

మ్ములఁ గనిపెట్టి గాంచెదర పూర్వ మహోన్నత కీర్తి భారతీ!౹౹ 23


మ.మహనీయుల్ తమ జీవితమ్ములను సన్మార్గైక లక్ష్యమ్ముతో

బహుళార్థమ్ము లొసంగ నెంచి భువి నిస్వార్థైక యత్నమ్ములన్

విహితమ్మైన విశిష్ట యోచనల దీప్తిన్  సత్య ధర్మమ్ములన్

సహనమ్మున్ మది నమ్మి కూర్చిరి ఘన స్వాతంత్ర్యమున్ భారతీ!౹౹ 24

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం  - సప్తమి - అశ్వనీ -‌‌ భౌమ వాసరే* (04.02.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

కోతి ఉపవాసం

 కోతి ఉపవాసం ........... [నాకొక పాఠం ]



ఒక కోతి ఒకరోజు స్వామీజీ ఉపన్యాసం విన్నది. దానికి ఉపన్యాసం చాలా నచ్చింది. ఒక పరవదినాన రోజంతా ఉపవాసం చేయాలనుకుంది. జపం చేయటానికి నిశ్చయించుకుంది.పని అంతా పూర్తి చేసుకుంది. కూర్చొని జపం మొదలుపెట్టింది.


ఉన్నాట్టుండి దానికొక సందేహం వచ్చింది .ఈరోజంతాఉపవాసం ఉండి జపం చేస్తుంటే,రేపు నాకు చాలా నీర్సంగా వుంటుందేమో! అప్పుడు మరి చెట్టు నుంచి చెట్టుకు దూకి పళ్ళు కోసుకోగలనా? నీరసం మరీ ఎక్కువైపోతే ! ఎలా? ఏమీ చెయ్యలేనేమో ?

ఈ ఆలోచన వచ్చాక ,కోతి జపం చేయటం ఆపింది. అప్పటికప్పుడు లేచి చెట్టూపుట్టా గాలించి మరుసనాటికి సరిపడే ఆహారాన్ని సేకరించింది. దానిని ఒక మూల భద్రపరచింది.మళ్ళీజపం కొనసాగించింది.

మరికొంత సేపటికి కోతికి ఇంకో ఆలోచనవచ్చింది. "రేపు నీరసం వల్ల నేను నడవలేక పోతేనో? ఆహారం ముందేవుంచుకుని కూడా ఆకలితో అలమతించి పోతాను కాబోలు! ఈ ఆలోచనతో పాపం కోతి ఎంతో బాధపడి పోయింది.

వెంటనే లేచింది. ఆహారాన్ని తన చేతికి అందుబాటులో వుంచుకుంది. మళ్ళీ జపం ఆరంభించింది.

ఆకోతికి కొంతసేపటికి మరో ఆలోచన వచ్చింది. "ఒకవేళ నేను మరీ నీరసించి పోయి ఆహారాన్ని అందుకొని నోటిలో కూడా పెటుకోలేక పోతేనో" అంటూ జరగబోయేది ఊహించుకుంది. ఆహారాన్ని నోటిలోనే వుంచుకుని ఉపవాసం చేయాలనుకుంది. ఆవిధంగా అది ఆహారాన్ని నోటిలో పెట్టుకుని జపం చేయబోయింది. కానీ నోటిలో నిండుగా ఆహారం పెట్టుకుని జపం ఎలాచేస్తుంది?

చివరకు కోతి బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది."భోజనం నోట్లో వుంచుకోవడం ఎందుకు?ఇప్పుడైతే ఏమిటి ?రేపైతే ఏమిటి? ఎలాగూ అది నేను తినవలసినదేకదా! అందువల్ల ఈఆహారాన్ని ఇప్పుడే తినేసి కూర్చుని,సుఖం గా జపం చేసుకుంటాను." అనుకుంది. తనకు వచ్చిన ఈ గొప్పాఅలోచనకు ఎంతగానో మురిసి పోయింది. ఆహారం తీసుకుంది.నిద్ర ముంచుకొచ్చింది. స్వామీజీ ఉపన్యాసం మరచిపోయింది. పక్కపరుచుకుంది. హాయిగా నిదురపోయింది.



[ఈరోజు పిల్లలకు ఈకథచెబుతుంటే ,ఎందుకో ఎవరో చర్నాకోలతో కొట్టినట్లు చురుక్కుమన్నది. నాసాధనకూడా ఇంతేనేమో నని.]

3, ఫిబ్రవరి 2025, సోమవారం

ఆరోగ్యం భాస్కరాత్ ఇచ్చేత్"

 "ఆరోగ్యం భాస్కరాత్ ఇచ్చేత్" అని శాస్త్ర వచనము.

ఉత్తమమైన ఆరోగ్యం కావాలి అనుకునే వారు సూర్య భగవానుడిని ఆరాధిస్తే సంపూర్ణ ఆరోగ్యo కలుగుతుందని శాస్త్రం చెబుతోంది. తత్రాపి 

 రథ సప్తమీ పర్వదినం వంటి రోజు ఆ భాస్కరుడిని పూజిస్తే ఎంతో శుభం.

అదే విధంగా అర్క పత్రములు శరీరము పైన ఉంచుకుని స్నానం చేయడం కూడా రథ సప్తమీ పర్వదినమున అందరూ తప్పకుండా చెయ్యాలి.


ఈ క్రింద శ్లోకాలు పఠిస్తూ స్నానము చేయవలెను.

*రథసప్తమీ సప్తార్కస్నాన ప్రార్థనా*

యద్యజ్జన్మకృతం పాపం

మయా జన్మసు సప్తసు।

తన్మే రోగం చ శోకం చ

మాకరీ హన్తు సప్తమీ।। 1


ఏతజ్జన్మకృతం పాపం

యచ్చ జన్మాన్తరార్జితమ్।

మనోవాక్కాయజం యచ్చ

జ్ఞాతాజ్ఞాతే చ యే పునః।। 2


ఇతి సప్తవిధం పాపం

స్నానాన్మే సప్తసప్తికే।

సప్తవ్యాధి సమాయుక్తం

హర మాకరి సప్తమి।। 3 


*రథసప్తమీ అర్ఘ్యం*


సప్తసప్తివహ ప్రీత

సప్తలోక ప్రదీపన।

సప్తమీ సహితో దేవ

గృహాణార్ఘ్యం దివాకర।।

*దివాకరాయ నమః ఇదమర్ఘ్యం 1


*కూష్మాణ్డ దాన ప్రార్థనా*

కూష్మాణ్డం బహుబీజాఢ్యం

బ్రహ్మణా నిర్మితం పురా।

తస్మాత్ అస్య ప్రదానేన

సన్తతిః వర్ధతాం మమ।। 2

–‘‘ఈ శరీరమే చిత్రమైనది.

 ఆయనకు తన గొప్పదనాన్ని గురించిగానీ, భాగ్యాన్ని గురించి గానీ ఏమాత్రం గర్వంలేదు. ఆయనకు జ్ఞానపీఠం బహుమానం వచ్చింది. రేడియోస్టేషనుకి కార్లోపోతున్నాము. అప్పుడు మాస్టారు –‘‘ఈ శరీరమే చిత్రమైనది. ఎన్ని బాధలు పడిందో అన్ని సుఖాలూ పడింది. ఈ శరీరంలో ఉన్న సత్యనారాయణ నాటికీ నేటికీ ఒక్కడే. కాని వీడిచుట్టూవున్న సంసారం మారిపోయింది. అప్పుడు నాతో బ్రతికిన భార్య యిప్పుడు లేదు. ఇప్పుడు నా యింట్లో ఎన్ని కూరలున్నా చుట్టం వస్తే మళ్ళా ఏ బంగాళాదుంపలో ఏవో తెప్పిస్తేగాని తృప్తిగావుండదు. అప్పట్లో నా కొంపకు చుట్టంవస్తే వానికి ఏమిమర్యాద చేయగలమా అని నాకు కొంచెం కష్టంగా వుండేది. భోజనం వేళ ఆగదుగదా ! ఆ వేళకు మాఆవిడ వచ్చిన చుట్టానికి, నాకు తిండి సృష్టించేది. ఇంట్లో ఆ పదార్థాలు ఎలా ఎక్కడనుండి ఊడిపడినాయో నాకు తెలియదు. షడ్రసోపేతంగా అమ్రుతాయమానమైన తిండి సృష్టించేది. సృష్టించడమే సుమా! కూర, పప్పు, పులుసు, పచ్చడి ఏమి కావాలో అన్నీ, ఎలా వచ్చినాయి యివన్నీ! నా బీదకాపురానికి అటువంటి సృష్టిచేయడానికి, ఆ మర్యాద దక్కించడానికి ఆ మహాయిల్లాలు పడిన శ్రమ తలచుకుంటే నాకు ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అదంతా ఎందుకండి! నేను 1956తో మేడ కట్టాను. అప్పటివరకూ పాకలో వున్నాను. అప్పుడూ ఇప్పుడూ ఒక్కటే. కాని అప్పటి మా ఆవిడ పడినకష్టం వానకురిస్తే ఇంట్లో మోకాటిలోతు నీళ్ళు ఆ నీళ్ళు తోడేసి రాళ్ళు పేర్చి వాటిమీద యింత ఉడకేసి పెట్టాల్సివచ్చేది. అప్పటి విశ్వనాథ సత్యనారాయణకి యిప్పటి విశ్వనాథ సత్యనారాయణకి తేడా ఏమిటి? అదే శరీరం కారులో పోతుంది. రైలులో పోతుంది. కొన్ని యేండ్లుగా యిలా సుఖపడుతున్నది. లోపల ఉన్న జీవుడు ముందు స్థితి మరచిపోలేదు. మా తండ్రిగారుండగా నేను యువరాజును. పుట్టుభోగిని. తర్వాత కష్టదశ. ఈ కనపడే భోగం, మేడ అంతా ఆ జీవుడినంటుకోవడం లేదు. అందువల్ల వాడికి దుఃఖమేమిటో కష్టమేమిటో తెలిసినంత సుఖం గూర్చి తెలీదు. వానికి గర్వం ఎలావుంటుంది? (అంత కష్టదశలో ఆయన చేసిన గుప్తదానాలు అనేకములు. ఆయన సంపాదన అప్పుడు ఎక్కువకాదు. దాతృత్వం ఆపుకోలేని చేయి తన యిబ్బంది తాను పడుతూనేవుంది. ఆ దానాలతో సుఖపడినవారు చాలామంది వున్నారు) బ్రతికి వున్నాను కనుక యివన్నీ అనుభవిస్తున్నాను. ఆ భార్యలేదు. ఆమెకీ అనుభవంలేదు. ఇప్పుడింత మహాకవిని, అప్పుడూ మహాకవినే నన్ను మహాకవిని చేసినది ఆమె’’ ఈ మాటలాయన కళ్ళల్లో చెమ్మతో అన్న మాటలు. వరలక్ష్మీ త్రిశతిలో అన్నారు కదా! 


‘‘వట్టి నీరసబుద్ధి నట్టినన్ను రసోత్థపథముల సత్కవీశ్వరుని జేసి

…….ఇతరు లెవ్వరు నెరుగని యీ రహస్య ఫణితి నను

నేలుకొనిన నా పట్టమహిషి’’


‘‘నా యఖిల ప్రశస్త కవనమ్మున కాయమ పట్టభద్రురా

లాయమ లేక యాధునికమైన మదున్నత చిత్తవృత్తి లేదు’’


అని చెప్పారు. శ్రీరామచంద్రమూర్తికి ముప్పై ఆరుఏండ్ల వయసులో సీతా వియోగం సంప్రాప్తించింది. తనకుకూడా సరిగా అదే వయస్సులో ఆ భార్యావియోగమహాదు:ఖం సంప్రాప్తించింది. ఆ వియోగ వ్యథ ఏమిటో తెలియనిదే తాను రామకథను రసవంతం చేయలేడని భగవంతుడు తనకు ఆ యోగ్యత కూడా కల్పించాడని వాపోయినాడాయన.


(విశ్వనాథవారి వ్యక్తిత్వం వారిని పై పై చూపులతో చూసినవారికి అర్థం కాలేదు. వారికి అత్యంత సన్నిహితుడైన శిష్యుడు, వారి రచనలు చాలావాటికి లేఖకుడు, స్వయంగా గొప్ప కవిపండితుడు ఐన శ్రీ పేరాల భరతశర్మ గారు విశ్వనాథవారి గురించి మనసుని తాకే వ్యాసాలు కొన్ని రాశారు. అందులో ఒకదాని నుండి చిన్న భాగం ఇది.

పుస్తకం.నెట్ నుండి సంగ్రహించి ఇక్కడ పెడుతున్నాను, వారికి కృతజ్ఞలతో)

వసంత పంచమి

 


శ్రీభారత్ వీక్షకులకు వసంత పంచమి శుభాకాంక్షలు 🌹సరస్వతి, లక్ష్మీ దేవి, పార్వతీ దేవి..ముగ్గురమ్మలు సమానంగా పూజలందుకొనే వేడుక. ఆ ముగ్గురూ ఒక్కటే. అయినా వారిని విడివిడిగా అర్చించడంలోనే అందరికీ అపరిమితమైన ఆనందం. వివిధ రాష్ట్రాల్లో ముగ్గురమ్మలకు ఎలాంటి వేడుకలు ఎంత ఘనంగా జరుపుతారో వివరించారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త డా. తిరుమల నీరజ గారు. మన్మధుని శివుడు తన మూడోకంటితో ఎందుకు భస్మం చేశాడో, పార్వతిని ఎలా పరిణయమాడాడో వినండి. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

Panchaag


 

సరస్వతీ నమస్తుభ్యం*

 🌹 *సరస్వతీ నమస్తుభ్యం* 🌹

*(3.2.25 నాడు శ్రీపంచమి)*


విద్యాభ్యాసానికి ప్రారంభం అక్షరాభ్యాసం.

అక్షరాలను దిద్దించడంతో విద్యాభ్యాసం ప్రారంభం అవుతుంది. *అక్షరం* అంటే క్షయం లేనిది, నాశనం లేనిది అని అర్ధం. 

మనం సంపాదించే సంపదల్లో ఏదైనా నశిస్తుంది కానీ, అక్షర సంపద, విద్యా సంపద మాత్రం నశించదు. అటువంటి అక్షరాభ్యాసాన్ని ప్రారంభించే ముందు

*సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి*

*విద్యారంభం కరిష్యామి సిద్ధి ర్భవతుమే సదా*

అని చదువుల తల్లి అయిన 

శ్రీసరస్వతీదేవిని ప్రార్ధించడం ఆచారం. 

చదువుల తల్లి, అక్షరాల అధిదేవత, విద్యాధిదేవత, పుస్తకపాణి, జ్ఞానప్రదాయిని అయిన శ్రీసరస్వతి జన్మదినం - *మాఘ మాసం శుక్ల పక్ష పంచమి*

 ఈ సందర్భంగా జరుపుకునే పండుగే - *శ్రీ పంచమి* .

 దీనికే *వసంత పంచమి* 

అని కూడా పేరు. 

విద్యలకు అధిదేవత అయిన 

శ్రీసరస్వతీదేవి బ్రహ్మదేవుడి దేవేరి. తెల్లటి పద్మంపైన కూర్చుని, ఒక కాలు నిలువుగాను, మరొక కాలు దానిపైన అడ్డముగానూ ఉంచుకుని తెల్లని దుస్తులు, పువ్వులు, తెల్లని పూసల కంఠహారం ధరించి వీణను, పుస్తకాలను చేతులలో ధరించి ఉంటుందని శ్రీసరస్వతీదేవిని గురించి పద్మ పురాణం పేర్కొంది. అంటే సరస్వతీదేవి అహింసాదేవత! చల్లనితల్లి! బ్రహ్మవైవర్త పురాణంలో కూడా ఈ విషయమే ఉంది. ఈ పురాణంలో దుర్గ, సావిత్రి, శ్రీమహాలక్ష్మి, సరస్వతి, శ్రీరాధాదేవి అనే ఐదుగురు ప్రకృతిశక్తు లనీ, వీరిలో మూడవ దేవత సరస్వతి పరమాత్మ నుంచి ఉద్భవించిన వాణికి, విద్య, జ్ఞానబుద్ధులను చెప్తోంది. అటువంటి జ్ఞానప్రదాయిని కరుణ వుంటేనే విద్యాప్రాప్తి, జ్ఞానప్రాప్తి కలుగుతా యని అని పురాణ వచనం. శ్రీసరస్వతీ దేవి జన్మదిన మైన 

శ్రీపంచమిని దక్షిణభారతంలో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.

 శ్రీపంచమి నాడు పిల్లలకు అక్షరాభ్యాసం చేస్తే అపార మైన జ్ఞానం లభిస్తుంది. నిరాటంకంగా విద్యాభివృద్ధి జరుగుతుంది అని శాస్త్రవచనం. ఈ రోజున ఉదయమే లేచి, స్నానాది క్రతువులు తీర్చుకుని, అమ్మవారి పూజలు తెల్లటి వస్త్రాలు, పూసలతో అలంకరణ చేసి, పాలు, వెన్న మొద లైన పదార్థాలు నివేదన చేసి, ఆ తరువాత చిన్న పిల్లలకు విద్యారంభం చేస్తే, ఆ చిన్నారులకు ఆసరస్వతీదేవి విద్యను ప్రసాదిస్తుంది. 

ఈ రోజున,

శ్రీసరస్వతీదేవితో పాటు, వినాయకుడు, శ్రీమహావిష్ణువు, పరమశివుడు, సూర్య భగవానుడు కూడా ప్రత్యేకపూజలు అందుకుంటారు.


*యా కుందేందు తుషార హార* *ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా*

*యా వీణా వరదండమండిత కరా యా శ్వేత పద్మాసనా*

*యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా*

*సామాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేష జాడ్యాపహా!*


కొందరు 2న, కొందరు 3న జరుపుకుంటారు. 

         🌹🙏🌹

పాలాశ కుసుమం వృథా*

:-

*పాలాశ కుసుమం వృథా*


సంస్కృత మహాకావ్యాలకు వ్యాఖ్యానం రచించిన మల్లినాథ సూరి తండ్రేమో మహా పండితుడు. ఈయనకు మాత్రం విద్యాగంధం అబ్బలేదట. పెళ్లయ్యాక ఆయన జీవితం మారిపోయింది. ఓరోజు అత్తారింటికి వెళ్తే, పూజకు పూలు తెమ్మని కోరింది భార్య. ఎర్రగా మెరుస్తున్న మోదుగుపూలను తెచ్చాడు. ఈయనకు శాస్త్రజ్ఞానం లేదని గ్రహించి, ఈ శ్లోకం చెప్పింది భార్య.

రూప యౌవన సంపన్నా, విశాల కులసంభవా

విద్యావిహీన శోభంతే, పాలాశ కుసుమం వృథా

–ఇదేమిటో సూరికి అర్థం కాలేదు. కానీ అసాధారణ ధారణ వల్ల పాదాలు గుర్తుపెట్టుకుని, ఊళ్లోని మరో పండితుడిని అర్థమడిగాడు. ‘అందము, యౌవనము కలిగి ఎంత మంచి వంశంలో జన్మించినా, విద్య లేకపోతే శోభించడనీ, అలాంటివాడు పూజకు పనికిరాని మోదుగుపువ్వు లాంటివాడనీ అర్థం చెప్పాడాయన. తనకు చదువులేదని భార్య ఎత్తిపొడిచిందని అర్థం చేసుకున్న సూరి ఎవరికీ చెప్పకుండా కాశీకి వెళ్లిపోయి, పన్నెండు సంవత్సరాల పాటు చదువుకుని, తిరిగి అత్తగారింటికి వచ్చి, వారి అరుగు మీద కూర్చున్నాడు. ఎవరో యాత్రికుడనుకుని ఇంట్లోకి భోజనానికి పిలిచారు. భార్యే వడ్డించింది. చారులో ఉప్పు లేదు. అప్పుడు సూరి–

చారు చారు సమాయుక్తం హింగు జీర సమన్వితం

లవణ హీన నరుచ్యంతే పాలాశ కుసుమం వృథా

(చారు ఎంత కంటికింపుగా ఉన్నా, ఇంగువా జీలకర్రా వేసినా, ఉప్పు లేకపోతే రుచిగా ఉండదు. అది పనికి రాని మోదుగు పువ్వుతో సమానం)

అని శ్లోకం చెప్పగానే, ‘పాలాశ కుసుమం వృథా’ మాట ఎక్కడో విన్నట్టుగా ఉందే అని ఆయన ముఖం వంక తేరిపార జూసి, అతిథి భర్తే అని గ్రహించి, మహాపండితుడై తిరిగి వచ్చినందుకు ఆమె పరమానంద పడిందని కథ.


*సేకరణ* 👆

31, జనవరి 2025, శుక్రవారం

వివాహం గురించి

 🙏వివాహం గురించి సంక్షిప్త వ్యాసం 🙏

వివాహ శబ్ద నిర్వచనము వివాహ శబ్దములో 'వి' అనియు, 'వాహః' అనియు రెండు భాగములున్నవి. 'వి' అనుదానికి విశిష్టత అని యర్థము. 'వాహః' అనుదానికి పొందించుట అని యర్ధము.


ఈ విషయము వీరమిత్రోదయము - సంస్కార కాండలో ఇటుల విస్తరించి చెప్పబడినది.


“వివాహః | వహ ప్రాపణే ఇత్యస్మాద్దాతోః, భావే ఘజీ కృతే వహనం వాహః | విశిష్టో వాహః వివాహః | వైశిష్ట్యం చ ప్రతిగ్రహాద్యష్టవిధో పాయాన్యతమోపాయేన హోమాది సప్తపద నయనాంత కర్మాభి సంస్కృతత్వమ్ | తథా చ వివాహ పదార్డో (ద్విదల) ద్విఫల స్సిద్ధ్యతి |  స్వత్వోత్పాదనం  సంస్కారాధానం చేతి | తదేతత్ స్పష్టీకృతం పారస్కరేణ | పిత్రి ప్రత్తా మాదాయ గృహీత్వా ని మతి  వరం దదాతీత్యంతేన |


అనువఱకు ప్రతిగ్రహము మొదలుకొని చెప్పబడిన బ్రాహ్మాది పైశాచాన్త వివాహము లెనిమిదింటిలో నేవిధముగానైనను స్వీకరించిన కన్యతో హోమము మొదలుకొని సప్తపదివఱకు గల సంస్కారములచే సంస్కరింపబడుట అని వివాహశబ్దమున కర్థము. ఇది వివాహములో ప్రధానమని తాత్పర్యము.

యాజ్ఞవల్క్య స్మృతి ననుసరించి పూర్వీకులు ఎనిమిది విధాలైన వివాహాలను శాస్త్ర సమ్మతం చేసారు. ఈ వివాహాల వలన వదూవరులు సుఖ సంతోషాలు పొందుతారని తెలియజేసారు . అవి


1 బ్రాహ్మ :- విద్య మరియు ఆచారాలు గల వరునికి కన్యనిచ్చి చేసే వివాహం

2 దైవ :- యజ్ఞయాగాదులు జరిపించిన పురోహితునికి ఇవ్వవలసిన రుసుమునకు బదులుగా కన్యాదానం చేయడం

3 ఆర్ష :- కన్యాశుల్కంగా వరుడినుంచి ఒక జత ఆవు-ఎద్దులను తీసుకుని పెళ్ళి చేయడం

4 ప్రాజాపత్య :- కట్నమిచ్చి పెళ్ళి చేయడం

ఇంతవరకు చెప్పిన వివాహాలు మాత్రమే ధర్మ శాస్త్రం సమ్మతించినది.

5 ఆసుర :- వరుడు ధనమిచ్చి వధువును కొనడం

6 గాంధర్వ :- ప్రేమ వివాహం ఇది క్షత్రీయులకు మాత్రమే చెప్పబడింది  దుష్యంతుడు -- శకుంతల వివాహం ఇది కేవలం క్షత్రీయులకు ధర్మ సమ్మతమే.

7 రాక్షస :- వధువును ఎత్తుకెళ్ళి పెళ్ళి చేసుకోవడం

8 పైశాచ :- వధువును నిద్రిస్తున్నప్పుడో, మత్తులో ఉన్నప్పుడో ఆమె అభీష్టానికి వ్యతిరేకంగా అపహరించడం

(వీటిలో మొదటి నాలుగు రకాలు ధర్మశాస్త్రాలు ఆమోదించినవి కాగా చివరి నాలుగు రకాలను ధర్మశాస్త్రాలు ఆమోదించలేదు.)


వివాహము స్త్రీ పురుషులలోని అపూర్ణత్వమును తొలగించి, వారికి పూర్ణత్వ మొసగజాలిన యొక పవిత్ర సంస్కారము, స్త్రీపురుషులిర్వురు దానికి రెండు పక్షములు. ఈ రెంటిని కలిపి - అనగా ఈ యుభయ శక్తులను సమన్విత మొనర్చి, ఈ సమన్వితశక్తిని ఏకలక్ష్యోన్ముఖము సేయుటయే ఈ సంస్కారముయొక్క ముఖ్యోద్దేశ్యము. ఈ సంస్కార ప్రయోజనము కేవలము ఇహలోకమునకే పరిమితముకాక, పరలోకమునకు గూడ ప్రాప్తమై యున్నది. కేవలము శారీర - ఐంద్రియ పరితోషము మాత్రము వివాహమునకు గమ్యముగాక, కర్తవ్యపాలనము, దైవారాధనము, అతిథిపూజ, సంతానప్రాప్తి, అధ్యాత్మికోన్నతి, పారివారిక, సామాజిక శ్రేయము నిశ్రేయము దీనికి గమ్యములు  కావుననే ఇది సర్వసంస్కారములలో నుత్తమ మయినదిగాను పవిత్రమయినదిగాను ఋషులు ప్రతిపాదించినారు.


“విశేషణ వాహయతీతి వివాహః” అనగా వివాహితులయిన దంపతులకు విశేషముగా గృహస్థ ధర్మములను వహింపఁజేయు సంస్కార విశేషమునకు వివాహము అని పేరు (చెప్పినారు). దీనికి పాణిగ్రహణమని వ్యవహారము గలదు. ఈ సంస్కార విశేషము ప్రత్యక్ష ప్రయోజనము, పరోక్ష ప్రయోజనము ఉభయప్రయోజనము నయి యున్నది. ఇట్టి ప్రయోజనములతోగూడిన సంస్కార జనక క్రియా కలాపము వివాహమని సారాంశము.


హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైంది. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధాన కర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్లి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా విభేదాలు తలెత్తినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం వివాహానంతరం స్త్రీ పురుషులకు అనేక సంప్రదాయక విధులు నిర్వహించే అర్హత కలుగుతుంది

వివాహం కానివారు, వివాహానంతరం అనేక కారణాలతో విడిపోయిన స్త్రీ, పురుషులు సంప్రదాయక కార్యక్రమాలను నిర్వహించడానికి అనర్హులని హిందూ ధర్మశాస్త్రం వివరిస్తుంది. దంపతులైన స్త్రీ పురుషులు మాత్రమే సంప్రదాయక విధి నిర్వహణకు అర్హులౌతారు. కాబట్టి హిందూ సంప్రదాయంలో వివాహానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తీర్ధయాత్రల సమయంలో చెప్పే సంకల్పం, దేవతామూర్తుల కల్యాణం, సత్యనారాయణ వ్రతం, హోమం, యజ్ఞం, యాగం లాంటివి నిర్వహించాలంటే గృహస్థు ధర్మపత్ని సమేతంగా జరపాలనే నియమం ఉంది. వివిధ కులాలను బట్టి, ప్రాంతాలను బట్టి కొద్దిపాటి తేడాలున్నప్పటికీ, స్థూలంగా భారతదేశంలో జరిగే హిందూ వివాహాలన్నీ ఒక పద్ధతిలోనే సాగుతాయి.

 సమర్పణ 

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కోపంతో మాట్లాడితే

 🙏🕉️శ్రీమాత్రేనమః.శుభోదయం🕉️🙏               🔥 కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతావు..అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతావు..అనవసరంగా మాట్లాడితే అర్ధన్ని  కోల్పోతావు..అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతావు.. అబద్దాలు మాట్లాడితే పేరును కోల్పోతావు.. ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకతతో జీవిస్తావు🔥జీవితంలో ఏదీ కోల్పోయినా పర్వాలేదు కానీ.. ఎదుటి వారు మన మీద పెట్టుకున్న నమ్మకం మాత్రం కోల్పోయేలా చేసుకోవద్దు.. ఎందుకంటే నమ్మకం ఒక్క సారి పొతే ఎంత ప్రయత్నించినా తిరిగి రాదు..జీవితంలో లెక్కలేనన్ని బంధాలు అవసరం లేదు..ఉన్న కొద్ది బంధలలో జీవం ఉంటే చాలు..జీవం లేని ఎన్ని బంధాలున్నా ఒక్కటే లేకపోయినా  ఒక్కటే🔥బియ్యం మరిగే పాలలో వేస్తే పాయసం అవుతుంది.. అదే మరిగే నీటిలో వేస్తే అన్నం అవుతుంది.. అదే బియ్యం బొగ్గుతో కాలిస్తే చేడుకి ఉపయెగించే పదార్థం అవుతుంది.. అదే బియ్యం పసుపులో కలిస్తే శుభానికి ఉపయెగించే అక్షితలు అవుతాయి.. మనం కూడా అంతే.. మనం నలుగురిలో కలిసే విధానం బట్టే మన యెగ్యత నిర్ణయించబడుతుంది🔥🔥మీ  *అల్లoరాజు భాస్కరరావు. శ్రీ విజయ ఆయుర్వేదిక్ జనరల్ ఏజన్సీస్. D.N.29-2-3 గోకవరం బస్టాండ్ దగ్గర స్టేట్ బ్యాంక్ ఎదురుగా రాజమండ్రి వైద్య సలహాలు ఉచితం మందులు అయిపోయినా వారు రాలేని వారికి కొత్త వారికి మందులు కొరియర్ ద్వారా పంపబడును 9440893593. 9182075510* 🙏🙏🙏

మేలిమిఁ గూర్చ,

 ఉ.మేలిమిఁ గూర్చ, జాతి కనిమేషుల వోలె తపించి, పేర్మితో

ఆలనకై కృశించుచు, శ్రమార్జితమౌ ధనధాన్య వృధ్ధికై

తాలిమిఁ దీర్చు కర్షకులు ధన్యులు, వారి సమాదరింపగా

పాలకు లెంచునట్లు పరిపాలన జేయఁ దలంచు భారతీ!!౹౹17


ఉ.భీతిఁ దొఱంగి ధర్మ పరిపీడిత దుష్కృత దుష్ట మార్గపుం

జేతల మించి, ఆప్తుల విశిష్ట మనోరథులైన ధార్మిక

త్రాతల కెంచి చేసిన అధర్మపు కర్మల దైవమెప్పుడే

రీతి సహింప నోర్చు, సమరింపక, భీకర భాతి భారతీ ౹౹ 18

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*

*కలియుగాబ్ది 5125*

*శ్రీ శాలివాహన శకం 1946 స్వస్తి శ్రీ    చాంద్రమాన క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం  - శిశిర ఋతువు - మాఘ మాసం - శుక్ల పక్షం  - ద్వితీయ - శతభిషం -‌‌ భృగు వాసరే* (31.01.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*

ఆహారపు రుచులు

 ఆహారపు రుచులు మరియు వాటివలన మానవ శరీరముకు కలుగు ఉపయోగాలు  - 


    రుచులు మొత్తం 6 రకాలు .  అవి 


  తీపి , పులుపు , ఉప్పు , చేదు , కారము , వగరు  అని 6 రకాలుగా ఉంటాయి. మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలో ఈ ఆరు రుచులు అంతర్లీనంగా ఉంటాయి. మనుష్య శరీరం నందు రోగాలు పుట్టుటకు మరియు రోగాలు తగ్గుటకు మనకి ఈ ఆరు రుచులు సమ్మిళితమైన ఆహారమే ప్రధాన కారణం .

        ప్రథమంగా ముందు మన ప్రాచీన ఆయుర్వేదం లో మానవ శరీరం గురించి

 మానవశరీరం నందు ఏడు చర్మములు , ఏడు ధాతువులు , ఏడు ఆశయాలు , ఏడు వందల శిరలు , అయిదు వందల పేశిలు , తొమ్మిది వందల స్నాయువులు , మూడు వందల ఎముకలు కాని చరకుడు వివరించిన దానిప్రకారం ఎముకలు మూడువందల ఆరు. పాశ్చాత్త్యా సిద్ధాంతం ప్రకారం రెండువందల పదియే కలవు. రెండు వందల పది సంధులు , నూట ఏడు మర్మస్థానములు , ఇరవైనాలుగు ధమనులు , మూడు దోషములు , మూడు మలములు , తొమ్మిది స్రోతస్సులు , పదహారు కండరములు , పదహారు సన్నని జాలములు అనగా సన్నని నరముల అల్లికలు , ఆరు కూర్చములు అనగా ఎముకల కట్టలు నాలుగు మరియు శిరల కట్టలు రెండు రకాలు . నాలుగు పెద్దతాళ్లు , ఏడు కుట్లు , పదనాలుగు ఎముకల కూటములు , పదనాలుగు సీమంతములు , ఇరువది రెండు శ్రోతస్సులు , రెండు ప్రేవులు , మూడున్నరకోట్ల రోమకూపములు.   ఇంత ఉత్క్రుష్టమైనది మానవశరీరం . నిద్రాహార విహారాలలో మార్పులు మరియు హెచ్చుతగ్గుల వలన శరీరంలో రోగాలు సంభవిస్తాయి.

           కొన్ని రకాల ద్రవ్యములను తినిన యెడల శరీరంలో రోగాలు నశించగలవు. కొన్నిరకాల ఆహారపదార్థాలను తినిన యెడల శరీరం నందు కొత్తకొత్త రోగాలు పుట్టును . అసలు రోగం అంటే ఏంటో మీకు తెలియచేస్తాను .శరీరధారకములు అగు వాత, పిత్త, శ్లేష్మములలో ఉండవలసిన ప్రమాణం కంటే హెచ్చుతగ్గులు ఉండుటయే రోగం . 

          మనం తీసుకునే ప్రతి ఆహారం 6 రకాల రుచులతో సమ్మిళతం అయి ఉంటుంది అని చెప్పాను కదా .  ఇందులో మొదటివగు తీపి , పులుపు , ఉప్పు ఇవి వాత దోషమును పోగొట్టును . చేదు , కారం , వగరు ఇవి కఫాన్ని హరించును . వగరు, చేదు , తీపి రసములు పిత్తదోషమును హరించును . ఆహారం జీర్ణం అయిన తరువాత వేడిచేయుట , చలువచేయుట అను రెండు విధాలుగా మాత్రమే ఉండును.  


  మధురరస గుణములు  - 

   తీపిగా ఉన్న పదార్థాలను తినటం వలన , పుట్టినప్పటి నుండి అలవాటు పడిన సప్త ధాతువులకు బలం కలుగును.

   చిన్నపిల్లలకు , ముసలివారికి , దెబ్బలు తగిలిన వారికి , బలం క్షీణించినవారికి , రక్తమాంసములు క్షీణించినవారికి తీపి పదార్థాలు చాలా హితకరం అయినవి.

   శరీరవర్ణం పెరుగుటకు , వెంట్రుకల వృద్ధికి , ఇంద్రియ బలం పెరుగుటకు , ఓజస్సు వృద్ది చెందుటకు ఈ మధుర రసం ఉపయోగపడును.

   శరీరంకి మంచి పుష్టిని ఇచ్చును.   కంఠస్వరం పెరుగును .   బాలింతలగు స్త్రీలకు ఎండిపోయిన పాలను వృద్ది పరుచును.   ఆయుష్షుకు కారణం , ప్రాణరక్షణకరమైనది .   వాత, పిత్త, విషాలను హరించును . 


  గమనిక  - 

          ఈ మధుర రసమును అధికంగా వాడిన మేధస్సుతో కూడిన కఫ వ్యాధులను పుట్టించును .శరీరం లావెక్కును . అగ్నిబలం తగ్గును అనగా జఠరాగ్ని తగ్గును. ఇరువది అగు మేహరోగాలు జనించును. అర్బుదం అనగా గడ్డతో కూడిన కేన్సర్ వచ్చును.


 ఆమ్లరసం గుణములు  - 

   ఈ ఆమ్లరసం ( పులుపు ) అగ్నిదీప్తి అనగా జఠరాగ్ని పెంచును.   హృదయముకు బలమునిచ్చును.

   ఆహారాన్ని అరిగించును.   రుచిని పుట్టించును .    శరీరం నందు వేడి కలుగచేయును .   మలాన్ని విడిపించును.   తేలికగా జీర్ణం అగును.   కడుపులో బిగిసి ఉన్న వాయువుని బయటకి వెడలించును.


  గమనిక  - 

        దీనిని అధికంగా వాడినచో కఫమును పెంచును , రక్తపిత్త వ్యాది అనగా నోటివెంట రక్తం పడువ్యాధిని పుట్టించును , శరీర అవయవాల పట్టు సడలించును , తిమ్మిరి , భ్రమ , దురదలు , పాండురోగం , విసర్పవ్యాధి , శరీర భాగాల్లో వాపు , దప్పిక, జ్వరం వంటి వ్యాధులను పుట్టించును . 


   లవణ రస గుణాలు  - 

   ఈ లవణ రసం శరీరంలో స్తంభించిన దోషాన్ని విడిపించి బయటకి పంపును .    జఠరాగ్ని పెంచును.

   చమురు కలది.   చెమట పుట్టించును .    తీక్షణమైనది , రుచిని పుట్టించును .    వ్రణములు అనగా గడ్డలు పగిలేలా చేయును .   శరీరం నందు మలినపదార్థాలు విడగొట్టి బయటకి పంపును 


  గమనిక  - 

           ఈ లవణ రసాన్ని అధికంగా వాడటం వలన వాతారక్త వ్యాధిని కలిగించును . బట్టతలను తగ్గించును .  వెంట్రుకలు నెరిసిపోవును , శరీరం ముడతలు పడును. దప్పికను కలిగించును , కుష్టు రోగము కలుగును. విసర్పి రోగం కలుగును. బలమును  హరించును .


   తిక్త ( చేదు ) రస గుణాలు  


ఇది అరుచిని హరించును .   శరీరం నందలి క్రిములను , దప్పిక , విషమును , కుష్టు , మూర్ఛని హరించును .    మూర్చ, జ్వరాలను , శరీరం నందలి మంటలను, వేడిని , కఫాన్ని హరించును .

   శరీరం నందలి వ్రణాల నుండి కారు దుష్టజలాన్ని , మాంసం నందలి కొవ్వుని కరిగించును. ఎముకల్లో మూలుగను , శరీరంలో మలమూత్రాలను హరించును .   తేలికగా జీర్ణం అగును.   బుద్దిని పెంచును.

   చమురు హరించును .   స్త్రీల పాలు యందు మరియు కంఠం నందలి దోషాలు పొగొట్టును.


  గమనిక  - 

          అధికంగా తీసుకున్న ధాతువులను క్షీణింపచేసి వాత రోగాల్ని పుట్టించును .

 

  కటు ( కారం ) రసం గుణాలు  - 

   ఈ కటు రసం కంట రోగం , కుష్టు , వాపు పోగొట్టును .   వ్రణములు తగ్గించును    శరీరం నందలి దుష్ట జలాన్ని , కొవ్వుని హరించును .    జఠరాగ్ని పెంచును.   అన్నమును జీర్ణింపచేయును .   రుచిని పుట్టించును .   సన్నని నరములలోని దోషాలు కూడా శోధించి వ్యర్థాలను బయటకి పంపును .

   నవరంధ్రాలు ను తెరిపించును.   కఫాన్ని హరించును .


  గమనిక  - 

        దీనిని అతిగా తీసుకున్నచో దప్పిక పుట్టించును . శుక్రమును , బలాన్ని నశింపచేయును. మూర్చని కలిగించును. అంగములు ముడుచుకున్నట్లు చేయును . వణుకు పుట్టించును .నడుము , వీపు నందు నొప్పి కలుగచేయును .


  కషాయ ( వగరు ) రస గుణములు  - 

   వగరు పదార్థం పిత్తశ్లేష్మాలని హరించును .   రక్తాన్ని శుద్దిచేయును .   నొప్పిని కలిగించును.   వ్రణాలను మాన్చును.   శరీరం నందలి దుష్ట జలాన్ని తీసివేయును .   ఆమమును స్తంభింపచేయును .   మలాన్ని గట్టిపరుచును.   చర్మాన్ని నిర్మలంగా చేయును .

 

  గమనిక  - 

       దీనిని అతిగా సేవించిన మలబద్దకం , కడుపు ఉబ్బరం , గ్యాస్ , గుండెజబ్బులు , దప్పిక, లివరు చిక్కిపోవుట, సంభోగ శక్తిని నశింపచేయును . మలబద్దకం కలిగించును.

       పైన చెప్పిన విధంగా మనం తీసుకునే ఆహార పదార్థం యొక్క రుచిని బట్టి మన ఆరోగ్యం అధారపడి ఉండును.