25, ఆగస్టు 2022, గురువారం

ఆచార్య నాగార్జునుడు

 ఆచార్య నాగార్జునుడు  - 


      నాగార్జునుడు ప్రపంచ ప్రసిద్ది చెందిన మహా పురుషుడు . ఆయన విద్యావేత్త , రసవేత్త , మంత్రవేత్త , తంత్రవేత్త , యంత్రవేత్త , ప్రజావేత్త  మరియు కాయసిద్ధి పొంది జరా మరణాలు ను జయించి అతీంద్రియ శక్తులు సాధించి అదృష్యరుపుడు అయ్యి సంచరిస్తున్న అమరవేత్త. ఆయన జననం గురించి వాదోపవాదాలు ఉన్నా ఆయన పక్కా ఆంద్రుడు అనే వాదన బలంగా ఉంది. 


         గౌరనకవి రచించిన నవనాధ చరిత్ర అనే ద్వీపకావ్యంలో సిద్ద నాగార్జుని చరిత్ర వర్ణింప బడినది. దాని ప్రకారం నాగార్జునుడు ఒక రాజపుత్రుడు. ఒకనాడు వేటకి పోయి విధివశాన సర్పరూపమ్ పొంది మద్దిచెట్టు తొర్రలో దాగినాడు. శాపం నుండి బయటపడే మార్గం కోసం అన్వేషిస్తుండగా కొంతకాలానికి అటుగా వచ్చిన ప్రసిద్ధ రసశాస్త్రవేత్త మీననాధుడు అనే రసయోగి నాగార్జునిని గమనించి శాపనివ్రుత్తి చేసాడు. ఆనాటి నుండి ఆయన నాగార్జున నామముతో మీననాధ మహర్షికి ప్రియశిష్యుడు అయినాడు. గురువు వద్ద అణిమాది అష్టసిద్దులను అభ్యసించి అదేవిదంగా ఔషద , తంత్ర, మంత్ర , యంత్ర రహస్యాలు అభ్యసించి గురువు ఆనతిమేరకు లోకసంచారానికి బయలుదేరాడు నాగార్జునుడు సిద్ధి పొందడం వలన సిద్ధనాగార్జునుడు అయ్యాడు.


              ఈయన శాతవాహన రాజుల గౌరవం పొంది వారి రాజ్యంలోని నేటి నాగార్జున కొండ వద్ద ఒక మహావిశ్వ విద్యాలయాన్ని స్థాపించి విద్యాబోధన చేశాడు . ఆ సమయంలో శాతవాహన రాజులు ఆర్ధిక ఇబ్బందులకు గురికాగా తన రసవిద్యా నైపుణ్యంతో శ్రీ పర్వతమును బంగారంగా మార్చివేశాడు. అప్పుడు కాళికా దేవి ప్రత్యక్షం అయ్యి సృష్టి స్వభావానికి విరుద్దం అయిన కార్యం తగదు అని వారించగా నాగార్జునుడు మళ్లి ఆ బంగారుకొండ ని రాతికొండగా మార్చివేశాడు . 


              ఆ తరువాత ఈయన టిబెట్ మరియు చైనా మొదలయిన ప్రాంతాలలో పర్యటించి బౌద్ధ సన్యాసిగా అనేకమందికి విద్యాదానం చేశాడు . అచ్చట 200 సంవత్సరాలు గడిపి దక్షిణ భారతదేశంలో మరొక 200 సంవత్సరాలు గడిపి ఆ తరువాత నేటి శ్రీశైలం కొండపైన 120 సంవత్సరాలు గడిపాడు అని టిబెట్ ఆచార్యుడు తారానాధ పండితుడు పేర్కొన్నాడు . 


              మన్దాన భైరవుడు రచించిన ఆనంధకంధం అనే గ్రంథంలో సిద్ధనాగార్జుని వంటి ఎందరెందరో సిద్ధులు , భైరవులు  అతిమానుష ప్రజ్ఞ సంపాదించిన వారై జీవన్మ్రుతులుగా పవన భక్షులుగా గగన వీధుల్లో సంచరిస్తున్నారు అని వివరించబడింది.


  సిద్ధనాగార్జునుడు రచించిన గ్రంథాలు  - 


 *  సుశ్రుత ఉత్తర తంత్రం .


 *  రసవైశేషిక సూత్రం 


 *  లోహశాస్త్రం .


 *  కచ్చపుట తంత్రం.


 *  రస కచ్చపుట .


 *  ఆరోగ్య మంజరి.


 *  యోగాసారం .


 *  రసేంద్ర మంగళం 


 *  రతి శాస్త్రం . 


 *  సిద్ధ నాగార్జునీయం .


          మొదలయిన అధ్బుత గ్రంథాలు రచించారు.


      ఈయన అతి సులువయిన , ఔషద ప్రక్రియలని రూపొందించి ఆనాటి అనేక పట్టణాలలో , గ్రామాలలో ప్రజల ఉపయోగార్ధం ఆ ప్రక్రియలను రాతి పలకాల మీద చెక్కిన్చాడని నేటికి దొరుకుతున్న అనేక శాసనాల వల్ల తెలుస్తుంది.


  

 

24, ఆగస్టు 2022, బుధవారం

మగువ "ముక్కుపుడక

 👆

🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

       *మగని ప్రేమకు గుర్తు*             

    *మగువ "ముక్కుపుడక"*           

  (చొప్పకట్ల సత్యనారాయణ గారు)

                  🌷🌷🌷

'మగని ప్రేమకే గుర్తు మగువ ముక్కుపుడక' అన్నాడో కవి. ఆడవారు ముక్కుపుడక ధరించడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే ఆడవారు ముక్కుపుడక ధరించడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో మీకు తెలుసా? సంప్రదాయం ప్రకారం వివాహ సమయానికి అమ్మాయిలకు ముక్కుపుడక తప్పనిసరి అని అనేది ఆచారం. ఇప్పటికీ కొన్ని కుటుంబాల్లో ఈ విధానాన్ని ఆచరిస్తున్నారు. ఏడు, పదకొండు సంవత్సరాలకు ముక్కు కుట్టిస్తారు. కానీ చిన్న వయస్సులో కుట్టించడం వల్ల ఆరోగ్యపరంగా చాలా మంచిదట.


ముక్కుకి కుడివైపున సూర్యనాడి ఉంటుంది. కుడివైపు ముక్కుకు మండలాకారమైన ఒకరాయి ధరించాలని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఎడమవైపున చంద్రనాడి టుంది. అందువల్ల ముక్కుకు ఎడమవైపున అర్ధ చంద్రాకారంలోని ముక్కు పుడక ధరించాలని పండితులు చెప్తున్నారు.ముక్కు, చెవులకు రంధ్రాలు చేయడం శరీరారోగ్యానికి మంచిదని శాస్త్రాలు చెబుతున్నాయి.


కొండగాలి తగలడం వల్ల తరచూ ముక్కుకు సంబంధించిన రొంప, పార్శ్వ నొప్పి, ముక్కు దిబ్బడ, సైనస్‌లు పూడుకుపోవడ వంటి సమస్యలు వస్తుంటాయి. వీటినుంచి రక్షణ కోసం గిరిజన మహిళలు ముక్కుపుడక వంటివి విధిగా ధరిస్తారు.మరోవైపు ముక్కు ఎడమవైపున ముక్కుపుడక ధరించడం ద్వారా ఆడవారికి గర్భకోశవ్యాధులు తగ్గుతాయట. పురుటి నొప్పులు ఎక్కువ కలగకుండా సుఖ ప్రసవం అవడానికి సహకరిస్తుందట. కన్ను, చెవికి సంబంధించిన నరాలు ఆరోగ్యంగా ఉంటాయట. చెవికి సంబంధించిన వ్యాధులు అనగా చెవిపోటు, చెవుడు వంటివి కలుగకుండా ముక్కుపుడక సహాయపడుతుంది. అంతేకాదు దీన్ని ధరించడం వల్ల శ్వాస సంబంధమైన వ్యాధులు ధరిచేరవు ప్రత్యుత్పత్తి మెరుగుపడుతుందని వైద్యులు చెప్తున్నారు.


ఇంకా అందం కోసం ముక్కుపుడకను ధరించే మహిళలు ఎక్కువ. భామాకలాపంలో ఒకసారి సత్యభామ చెలికత్తెను శ్రీకృష్ణుని వద్దకు రాయబారం కోసం వెళ్ళమంటుంది. ఎన్ని లంచాలు ఇస్తానన్నా, ఎన్ని నగలు ఇస్తానన్నా వెళ్లనంటుంది. విసిగిన సత్య చివరకు అసలు నీకేం కావాలో చెప్పవే అని అడిగితే సత్యభామ ముక్కున ఉన్న ముక్కెర కావాలంటుంది. అది ఇవ్వగానే లంకెబెందెలు దొరికినంత సంతోషంతో శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి రాయబారం నడుపుతుంది. దేవతలందరికీ అందరికీ ముక్కెర తప్పకుండా ఉంటుంది. బెజవాడ కృష్ణానది పొంగి కనకదుర్గమ్మ ముక్కెరను తాకితే భూమి మీద ఎవ్వరూ మిగలరని పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి గారు కాలజ్ఞానంలో చెప్పారు.


అలంకారంగా స్థిరపడిన ముక్కెరను మేనమామ లేదా కాబోయే భర్త మాత్రమే బహూకరించడం అనేది ప్రాచీన కాలంనుంచీ వస్తున్న సాంప్రదాయం. బయటి వాళ్ళెవరైనా ఇవ్వజూపితే అది చాలా తప్పు. తాళిబొట్టు మాదిరిగానే వివాహసమయంలో ధరించిన ముక్కుపుడకను జీవితాంతం తీయరు కొందరు. అది ఉన్నంతకాలం భర్త క్షేమంగా ఉంటాడన్నది వారి నమ్మకం. అందుకే దీన్ని సౌభాగ్యానికి సంకేతంగా చెబుతారు.


పూర్వకాలంలో ఏడేళ్ళ వయసులోనే ముక్కు కుట్టించి బంగారుతీగ చుట్టించేవారు పెరిగిన తర్వాత దాన్ని తీసి రాళ్ళు పొదిగిన పుడకలు పెట్టేవారు ఎంత పేదవారైనా దీనిని మాత్రం బంగారంతోనే చేయించుకుంటారు దక్షిణ భారతదేశంలో దీన్ని ఎక్కువగా కుడివైపు పెడితే, ఉత్తరాదిన మాత్రం ఎడమవైపు పెడుతుంటారు .

                             స్వస్తి!

 #పిప్పలాదుడు


#పిప్పలాదుడు ఉపనిషత్తును రచించిన జ్ఞాని!!

#జన్మించిన 5ఏండ్ల వరకూ శని ప్రభావం ఉండకుండా చేసిన మహానుభావుడు

#మహర్షి దధీచి మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేస్తున్నప్పుడు,ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక, సమీపంలో ఉన్న ఒక పెద్ద రావి చెట్టు రంద్రం లో తన 3 సంవత్సరాల బాలుడిని ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది.  ఈ విధంగా మహర్షి దధీచి మరియు ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు.కానీ రావి చెట్టు యొక్క రంద్రం లో ఉంచిన పిల్లవాడు ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు.ఏమీ కనిపించకపోవడం,ఎవరూ లేకపోవడం తో, అతను ఆ రంద్రం లో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరిగాడు.  తరువాత,ఆ రావి ఆకులు మరియు పండ్లు తినడం ద్వారా, ఆ పిల్లవాడి జీవితం సురక్షితంగా ఉంది.

   

#ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళ్ళాడు.  నారదుడు,రావి చెట్టు యొక్క కాండం భాగం లో ఉన్న పిల్లవాడిని చూసి, అతని పరిచయాన్ని అడిగాడు-

#నారదుడు- నువ్వు ఎవరు?

#అబ్బాయి: అదే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది.

#నారదుడు- నీ తండ్రి ఎవరు?

#అబ్బాయి: అదే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.

# అప్పుడు నారదుడు దివ్యదృష్టి తో చూసి ఆశ్చర్యపోయి హే అబ్బాయి!  నీవు గొప్ప దాత మహర్షి దధీచి కొడుకువి.  నీ తండ్రి అస్తిక తో  దేవతలు ఒక పిడుగు లాంటి ఆయుధాన్ని సృష్టించి(వజ్రాయుధం) రాక్షసులను జయించారు.  మీ తండ్రి దధీచి 31 ఏళ్లకే చనిపోయారు అని నారదుడు చెప్పాడు.

#అబ్బాయి: మా నాన్న అకాల మరణానికి కారణం ఏమిటి?

 #నారదుడు- మీ తండ్రికి శనిదేవుని మహాదశ ఉంది.

 #పిల్లవాడు: నాకు వచ్చిన దురదృష్టానికి కారణం ఏమిటి?

 #నారదుడు- శనిదేవుని మహాదశ.

   

#ఈ విషయం చెప్పి దేవర్షి నారదుడు రావి ఆకులు మరియు పండ్లు తిని జీవించే బిడ్డకు పేరు పెట్టాడు మరియు అతనికి దీక్షను ఇచ్చాడు.

 #నారదుని నిష్క్రమణ తరువాత, పిల్లవాడు పిప్పలడు నారదుడు చెప్పినట్లుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు.  బ్రహ్మాదేవుడు బాల పిప్పలాద ను వరం అడగమని కోరినప్పుడు, పిప్పలాద తన కళ్లతో ఏదైనా వస్తువును చూస్తే కాల్చే శక్తిని అడిగాడు.అలా అన్నింటినీ కాల్చివేయడం ప్రారంభించాడు.శని దేవుడి శరీరంలో మండడం ప్రారంభించాడు.  విశ్వంలో కలకలం రేగింది.  సూర్యుని కుమారుడైన శనిని రక్షించడంలో దేవతలందరూ విఫలమయ్యారు.


#సూర్యుడు కూడా తన కళ్ల ముందు కాలిపోతున్న కొడుకుని చూసి బ్రహ్మదేవుడిని రక్షించమని వేడుకున్నాడు.చివరికి బ్రహ్మదేవుడు పిప్పల ముందు ప్రత్యక్షమై శనిదేవుడిని విడిచిపెట్టడం గురించి మాట్లాడాడు కానీ పిప్పలాదుడు సిద్ధంగా లేడు.బ్రహ్మాదేవుడు ఒకటి కాకుండా రెండు వరాలు ఇస్తాను అన్నాడు. అడగటానికి  అప్పుడు పిప్పాలాదుడు సంతోషించి ఈ క్రింది రెండు వరాలను అడిగాడు-


 1- పుట్టినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదు.తద్వారా మరెవ్వరూ నాలా అనాథ కాకూడదు.


 2- అనాథ అయిన నాకు రావి చెట్టు ఆశ్రయం ఇచ్చింది.  కావున సూర్యోదయానికి ముందు రావి చెట్టుకు నీరు సమర్పించే వ్యక్తికి శని మహాదశ బాధ ఉండకూడదు.

 

దానికి   బ్రహ్మాదేవుడు 'తథాస్తు' అని వరం ఇచ్చాడు.అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మదండంతో ఆయన పాదాలపై పడి మండుతున్న శనిని విడిపించాడు.శనిదేవుని పాదాలు దెబ్బతినడం వల్ల అతను మునుపటిలా వేగంగా నడవలేకపోయాడు.అందుకే శని

 "శనిః చరతి య: శనైశ్చరః" అంటే మెల్లగా నడిచే వాడు శనైశ్చరుడు అని, శని నల్లని శరీరం కలవాడు. మంటల్లో కాలిపోవడంతో అవయవాలు కాలిపోయాయి.

        శని యొక్క నల్లని విగ్రహాన్ని మరియు రావి చెట్టును పూజించడం యొక్క ఉద్దేశ్యం ఇదే.తరువాత పిప్పలాదుడు ప్రశ్న_ఉపనిషత్తును రచించాడు, ఇది ఇప్పటికీ విస్తారమైన జ్ఞాన భాండాగారంగా ఉంది.


#సర్వోజనా సుఖినోభావంత్

చేబదులు

 "నాన్నగారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు ఉంటే సర్దుతారా..?" తన్నుకొస్తున్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ అడిగాడు ఆయన ! 


ఈ మాటలు అన్నది సాదా సీదా వ్యక్తి అయితే పెద్దగా ఆశర్యం ఉండేది కాదేమో ! 


కానీ ఐదు రూపాయలు చేబదులు అడిగిన వ్యక్తి 

టంగుటూరి ప్రకాశం గారి రెండో కుమారుడు హనుమంతరావు గారు ! 


అప్పు అడిగింది తుర్లపాటి కుటుంబరావు గారిని !


సాక్షాత్తు ఒక రాష్ట్రాన్ని పరిపాలించిన మాజీ ముఖ్యమంత్రి కొడుకు నోటినుంచి కన్నీటితో వచ్చిన మాటలు విన్న తరువాత ఎవరికైనా కంట తడి రాక మానదు ! 


ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి చివరి రోజుల్లో ఆర్థిక భారంతో ఆయన పడిన ఇబ్బందులకు ప్రత్యక్ష సాక్షి ఈ ఐదు రూపాయలు ! 


చెన్నై లో క్షణం తీరికలేని పనులు ముగించుకుని నివాసానికి చేరుకున్న టంగుటూరి ప్రకాశం గారికి కొద్దిగా అస్వస్థత గా ఉందని తెలిసి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న తుర్లపాటి కుటుంబరావు గారు వారి నివాసానికి చేరుకున్నారు ! 


లోపలి నుంచి బయటకు వచ్చిన టంగుటూరి కుమారుడు తుర్లపాటి కుటుంబరావు గారి దగ్గరకు వచ్చి గద్గద స్వరంతో " నాన్న గారికి మందులు తీసుకురావాలి..ఓ ఐదు రూపాయలు సర్దుతారా.." అనంటంతో షాక్ తో తుర్లపాటి కుటుంబరావు గారి నోటెంబట క్షణ కాలం మాట రాలేదు ! 


వెంటనే తేరుకుని ఉబికి వస్తున్న కన్నీటిని అతి ప్రయత్భం మీద ఆపుకుంటూ జేబులోనుంచి ఐదు రూపాయిలు తీసి ఆయన చేతిలో పెట్టాడు ! 


ఈ చేదు నిజాల్ని తుర్లపాటి కుటుంబరావు గారు స్వయంగా తన పుస్తకంలో కళ్ళకు కట్టినట్టు వివరించారు !!


దేశం కోసం తన ఆస్తినంతా ధారపోసి చివరి రోజుల్లో కటిక దారిద్రాన్ని అనుభవించిన టంగుటూరి లాంటి మహోన్నత వ్యక్తులను నేటి భారతంలో ఆశించగలమా ? 


ముఖ్యమంత్రి పదవి అంటే  తర తరాలకు సరిపడా ఆస్తులను దోచుకుని తమ వారసులకు పంచి పెట్టే ఒక అద్భుత దీపంగా భావించే ప్రస్తుత రోజుల్లో దేశం కోసం సొంత ఆస్తులను అమ్ముకుని రూపాయికి లేని అటువంటి  ముఖ్యమంత్రిని చూడగలమా ? 

చూడగలమా ? 


అంటే చూడలేమనే సమాధానం వస్తుంది ! 


ఆ తరం వేరు 

నేటి తరం వేరు !


ఆనాటి రాజకీయాలు వేరు 

ఈనాటి అరాచకీయాలు వేరు ! 


డియర్ రాజకీయ నాయకులూ / పాలకులూ మీ మీ ఓటు బ్యాంకు  రాజకీయాలు ఎలా ఉన్నా సంవత్సరంలో ఒకసారైనా ఇటువంటి మహానీయుడి పేరున మంచి కార్యక్రమాలు చేపట్టండి !


దేశం కోసం నిస్వార్థంగా సేవ చేయగలిగారు కాబట్టే టంగుటూరి నేటికీ ప్రజల గుండెల్లో చిరస్మరనీయుడు అయ్యారు !


ఈ రోజు టంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా మహానుభావుడికి నివాళులు !

23, ఆగస్టు 2022, మంగళవారం

కాఫీగురించి

 *కాఫీగురించి రెండుపద్యాలు.....*  



కప్పు కాఫిని లొట్టలేయుచు కాంక్ష తోడుత త్రాగగా 

సిప్పు సిప్పున మోదమందుట చిత్రమౌట నటుంచుమా!

ఎప్పుడైన పరాయి యిండ్లకు నేగ కాఫిని పోయమిన్ 

చిప్పమోమట దిక్కుగా మన సిగ్గు పోవదె తల్చగా 


చింతజేయగ కాఫి త్రావుట చిత్రమౌ వ్యసనమ్ముగా 

వింతచేష్టలు పుట్టి వ్రేల్చును వేళలందున త్రావమిన్ 

గొంతు లెండును జీరవోవును క్రుంగిపోవును ప్రాణముల్ 

సుంతయైనను శాంతముండదు స్రుక్కి త్రెళ్ళుగ మానవుల్ 

*~శ్రీశర్మద*

నిత్య సంతోషపరుడు

 

నిత్య సంతోషపరుడు

ప్రతి మనిషి సంతోషంగా ఉండాలని సదా కోరుకుంటాడు కానీ ఎంతమంది సంతోసహాయంగా ఉన్నారు అని విచారిస్తే ప్రతి వారు తాను సంతోషంగా లేను అనే అంటారు.  ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పరు. దీనికి కారణం ఏమిటో విచారిద్దాం. ఒక విద్యార్థి దగ్గరకు వెళ్లి అడిగితే తాను పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తానో  లేదో అనే దిగులు వుంది అందుకే నేను సంతోషంగా లేను అంటారు.  ఒక గృహస్తు వద్దకు వెళ్లి అడిగితే తన సంపాదన తన అవసరాలకు సరిపోవటం లేదు అందుకే నేను సంతోషంగా లేను అని అంటాడు .  ఇలా ప్రతివానికి ఏదో ఒక దిగులు, వెలితి జీవితంలో చోటు చేసుకుంటుంది.  లేని వారికి లేదని దిగులు.  ఉన్నవానికి ఉన్న దాన్ని కాపాడుకోవడం ఎలా అనే దిగులు.  ఇలా చెప్పుకుంటూ పోతే దిగులు, విచారం, అసంతృప్తి లేని మనిషి లేనే లేడనేది సత్యం.  ఎన్ని బాధలు ఉన్నా తాను సంతోషంగా ఉండాలని ప్రతి మనిషి కోరుకుంటాడు.  అంతేకాక తాను సంతోషంగా ఉండటానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తుంటాడు కూడా. ఒక ప్రయత్నం తరువాత ఒక ప్రయత్నం సాగిస్తూనే వుండాడు.  కానీ జీవితం విచిత్రమైనది ఒకటి సాధిస్తే మనస్సు దాని తర్వాత ఇంకొకటి కోరుతుంది.  అదే అవసరాలు, కోరికలు.  ఈ ఆధునిక యుగంలో ఎన్ని వున్నా కూడా మనిషి ఇంకా ఇంకా ఇంకొకటి కావాలని కోరుకుంటున్నారు. గతంలో నీకు లేనిది ఇప్పుడు వచ్చింది కదా మరి దానితో నీవు సుఖంగా ఉండొచ్చు కదా అంటే లేదు నీకు వెంటనే ఇంకొకటి కావాలని కోరిక కలుగుతుంది. నీకు ఫాను కావలి గాలి ఆడడం లేదు అన్నావనుకో ఫ్యాను పొందితే చల్లని గాలి కావలి ఏరుకులర్ కావలి అంటావు.  అది వచ్చిన తర్వాత ఎయిర్ కండిషనర్ కావాలి అంటావు.  అంటే మనిషి ఒకటి పొందిన తరువాత దానితో తృప్తిగా లేకుండా అంతకన్నా మెరుగైనది ఇంకొకటి కావాలనే వాంచ కలుగుతున్నది. దీనిని బట్టి తెలిసేది ఏమిటంటే ఏదీ కూడా నిన్ను సంతోష పెట్టటం లేదు ఇంకొకటి ఉంటే సంతోషంగా వుంటాను అనుకుంటావు కానీ అది కూడా నీకు సంతోషాన్ని ఇవ్వటంలేదు. మరి నీవు ఎప్పుడు సంతోషంగా వున్నావు అంటే భవిష్యత్తులో ఉండొచ్చేమో అని అంటావు. "తృప్తస్య భవిష్యామి" నిజానికి బౌతికంగా వున్నది ఏదైనా కొంతకాలం మాత్రమే నీకు సంతోషాన్ని ఇస్తుంది.  అది ఒక నిమిషమో, రోజో లేక కొన్ని రోజులో ఇంకా అయితే కొన్ని సంవత్సరాల్లో.  కానీ యదార్ధం ఏమిటంటే ఏది కూడా నీకు జీవితాంతం సంతోషాన్ని ఇవ్వదు. 

ఈ సృష్టిలో ఒక నియమం వున్నది అదేమిటంటే ప్రతిదీ మార్పు చెందుతూ ఉంటుంది.  ఆ మార్పు అభివృద్ధి వైపు కావచ్చు లేక వినాశనం వైపు కావచ్చు. ముందుగా అభివృద్ధి వైపు అయితే అవ్వ వచ్చు కానీ కాలాంతరంలో వినాశనం వైపుకు మళ్లుతుంది. అదే విధంగా మనిషి జీవితంలో కూడా ఒక వయస్సులో సంతోషాన్ని ఇచ్చేది కాలాంతరంలో వయస్సు పెరిగినప్పుడు అదే వస్తువు సంతోషాన్ని ఇవ్వలేదు. అదే అంటే అదే కాదు అలాంటిదే ఇంకొక క్రొత్తవస్తువు కూడా.  ఉదాహరణకు నీవు చిన్నగా వున్నప్పుడు మూడు చక్రాల చిన్న సైకిలు నీకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.  నీవు కొంత పెరిగి రెండు చక్రాల సైకిలు తొక్కటం అలవాటు అయినప్పుడు నీకు మూడు చక్రాల సైకిలు అస్సలు నచ్చదు.  మరి రెండు సంవత్సరాల క్రింతం వరకు అది నీకు ఇష్టమైన వస్తువు కదా మరి ఇప్పుడు ఎందుకు కాదు అంటే. ఇప్పుడు నీవు దానికన్నా సౌకర్యంగా వున్న వస్తువు నిన్ను ఆకర్షించింది.  అంతే కాదు నీవు ఇంకా కొంత పెరిగిన తరువాత మోటారు సైకిలు ఫై నీ మనస్సు ఆకర్షితం అవుతుంది.  అది లభిస్తే సైకిలు నీకు నచ్చదు.  అంటే ఎప్పుడు నీవు ఉన్నదానికన్నా మెరుదైనదే ఆనందాన్ని ఇస్తున్నది. దీనిని బట్టికూడా మనకు బాధపడేది ఏమిటంటే మన కోరికలు మారుతున్నాయి.  అంటే ఉన్నదానికన్నా మెరుగైనది మనస్సు సదా కోరుకుంటున్నది.  మరి నాకు జీవితాంతం సంతోషం కావలి అది ఎలా సాధ్యం.

ఈ ప్రపంచాన్ని చుస్తే మనకు తెలిసేది ఏమిటంటే ఇక్కడ ప్రతిదీ మారుతున్నది.  మారేది ఏది నీకు శాశ్విత సుఖాన్ని ఇవ్వటంలేదు. ఇంకొక సత్యం కూడా నీకు అవగతం అవుతుంది నీకు సుఖాన్ని ఇచ్చింది కాలాంతరంలో దుఃఖదాయకంగా మారుతున్నది.  మరి నాకు జీవితాంతం సంతోషం కావలి అది ఎలా సాధ్యం.

సృష్టిలో సదా మారకుండా ఉండేది ఏదైనా ఉంటే అది నీకు ఎల్లప్పుడూ సుఖాన్ని ఇవ్వవచ్చు.  మరి సృష్టి నియమమే మార్పు కదా మరటువంటప్పుడు మారకుండా ఉండేది ఏది.

ఆ శోధన ఫలితమే మనకు మన మహర్షులు ప్రబోధించిన ఉపనిషత్ జ్ఞ్యనం. అఖండ జ్ఞ్యాన సంపన్నులైన మహర్షులు వారి వారి అనుభవాలతో తెలుసుకున్న సత్యాలే ఉపనిషత్తులు. ఉపనిషత్తులు మనకు ఇచ్చిన జ్ఞ్యానమే బ్రహ్మ జ్ఞ్యానం ఏది తెలుసుకుంటే ఇంకొకటి తెలుసుకోవలసిన అవసరం లేదో అదే బ్రహ్మ జ్ఞ్యానం.  సాధకుడు నిత్య సాధనతో తెలుసుకోవలసిన సత్యమే బ్రహ్మ జ్ఞ్యానం. కాబట్టి ప్రతి సాధకుడు తనకు తానుగా తెలుసుకోవలసింది బ్రహ్మ జ్ఞ్యానం మాత్రమే. కాబట్టి సాధక ఇప్పుడే మేల్కొని నిత్యసాధన పరుడవు కమ్ము సదా సంతోషపరుడవు కమ్ము. 

ఓం తత్సత్ 

ఓం శాంతి శాంతిశాంతిహి 

మీ భార్గవ శర్మ

 

బాదరాయణ సంబంధాత్

 బాదరాయణ సంబంధం:: కథ చెబుతా...

 

మనకి "వేలు విడిచిన సంబంధాలు ", "బీరకాయ పీచు సంబంధాలు" లాగానే "బాదరాయణ సంబంధం" ఒకటి ఉంది. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ బాదరాయణ సంబంధం మీద కొన్ని కథలున్నాయి. అందులో ఒకటి ఇదిగో....

 

కోనసీమలో కేశనకుర్రు అనే గ్రామం ఒకటుంది. ఆ గ్రామం లో అమాయక బ్రాహ్మణ కుటుంబం ఒకటి. భార్య, భర్త- ఇద్దరే కుటుంబ సభ్యులు. మరీ సంపన్నులు కాక పోయినా కాస్త సంపన్నులే! దేనికీ లోటు లేదు. అతిథి మర్యాదలు సాదరంగా చేస్తారని ఆ పరిసర ప్రాంతాల వారందరికీ తెలుసు. యజమాని పేరు కామయ్య. 


 

ఓరోజు కామయ్య గారి ఇంటి ముందు ఓ గుర్రబ్బండీ ఆగింది. నిగనిగలాడుతూ జరీ పంచె, కండువాతో ఉన్న ఓ పెద్ద మనిషి దిగేడు. బండి తోలే మనిషి పెట్టె తెచ్చి హాల్లో పెట్టేడు. వెనుకనే హుందాగా నడచి వచ్చాడీ పెద్ద మనిషి. బండి తోలే మనిషి తిరిగి వచ్చి గుర్రానికి గడ్డి వేసి బండి లోనే కూర్చున్నాడు. కామయ్య ఏదో పని మీద పై ఊరుకెళ్ళేడు. పెరట్లో పని చేసుకుంటున్న భార్య సీతమ్మ ఈ పెద్దమనిషి ని చూసి హడావుడిగా హాల్లోకొచ్చింది కొంగుతో చేతులు తుడుచుకుంటూ. 


"అబ్బాయి ఇంట్లో లేడేమిటమ్మా?" అన్నాడు పెద్ద మనిషి సావకాశంగా కాళ్ళు జాపుకుని కండువా తీసి కుర్చీ మీద పెట్టి. 

"పై ఊరు పని మీద వెళ్ళారు. వచ్చేస్తారు." అని వినయంగా చెప్పి కాళ్ళు కడుక్కోడానికి నీళ్ళు తేవడానికి వెళ్ళింది. 


ఆమె వివాహమై కొద్ది కాలం మాత్రమే అయింది. పెళ్ళి లో చూడని భర్త తరుఫు బంధువనుకుంది ఆమె. 


కాళ్ళు కడుక్కుని, ఆమె పెట్టిన పలహారం సుష్టుగా తాను సేవించడమే కాకుండా బండివాడికి కూడా పెట్టించాడు పెద్ద మనిషి. 


ఇంతలో కామయ్య తిరిగి వచ్చాడు." ఇదిగో, ఆయన వచ్చారు. " ఆమె లేచి నిలబడింది అంతవరకు పిచ్చాపాటి కబుర్లు చెప్తున్న సీతమ్మ .

"రావోయ్, అల్లుడూ. ఉదయమే ఎక్కడికో వెళ్లి పోయావ్!" అంటూ చనువుగా పలుకరించాడు. 


 

"అర్జెంటుగా పని పడింది. పక్కూరు వెళ్ళేను. కాఫీ, పలహారం సేవించారా?" అని అభిమానంగా అడిగేడు కామయ్య. 


"అన్నీ చక్కగా పెట్టింది అమ్మాయి. అమ్మాయి ఎవరనుకున్నావు? సాక్షాత్తూ అన్నపూర్ణ!" అన్నాడు సీతమ్మ ని మెచ్చుకోలుగా చూస్తూ. 


"నేను మళ్ళీ ఒకసారి బయటకు వెళ్ళవలసి ఉంది. మీరు కాస్త విశ్రమించండి. భోజనం వేళకు వచ్చేస్తాను. కలసి భోంచేద్దాం. ఏమీ అనుకోకండి. " అని నొచ్చు కుంటూ లేచాడు కామయ్య. 


"భలే వాడివే! నిరభ్యంతరంగా వెళ్ళి రా. " నీతో కలసి భోంచేసాక నేను కచేరీ పని చూసుకొని వెళ్ళి పోతాను." అన్నాడు పెద్ద మనిషి పత్రిక తిరగేస్తూ. 


అతని బాధ్యత  భార్య కప్పజెప్పి వడివడిగా బయటకెళ్ళిపోయాడు కామయ్య. అతడు దినపత్రిక తిరగేస్తూ కూర్చోగా సీతమ్మ వంట పనిలో పడింది. 


ఆమె వంట పూర్తి అయ్యేసరికీ బయటకెళ్ళిన కామయ్య తిరిగి వచ్చేసాడు. 

ఇద్దరికీ వెండి కంచాలలో వడ్డన చేసింది సీతమ్మ. సుష్టుగా భోజనం చేశాడు పెద్ద మనిషి. అరుగు మీద బండీవాడు కూడా భోంచేశాడు. 


పెద్ద మనిషి గదిలో బయలుదేరడానికి సిద్ధమౌతూండగా, "మీ బంధువు మంచి భోజన ప్రియుడే సుమీ. " పెరట్లో మెల్లగా అన్నాడు భార్య తో కామయ్య. 

"మా బంధువు అంటారేమిటి? ఆయన మీ తరుఫు వారు కాదూ?" అంది సీతమ్మ విస్తుపోతూ. 

 

"అబ్బే, మావైపు వారు కాదు. " అన్నాడు కామయ్య. 


దంపతులు ఇద్దరూ హాల్లోకి వచ్చే సరికి పెద్ద మనిషి పెట్టె బండి లోనికి చేర్చడమూ, అతను బయలుదేరడానికి సిద్దంగా ఉండడమూ గమనించారు. 


"వస్తానోయ్. కచేరీ పని చూసుకొని వెళ్ళి పోతాను. వస్తాను తల్లీ. మంచి భోజనం పెట్టేవు. " అని బండి వైపు నడిచాడు పెద్ద మనిషి. 


అతడి వెనుకనే నడచి వెళ్ళి, "అయ్యా, తమరు ఎవరో పోల్చుకోలేకపోయాను.  మన సంబంధం....." నసుగుతూ సందేహం వెలిబుచ్చాడు కామయ్య. 


గట్టిగా ఓ నవ్వు నవ్వి, "మనది బాదరాయణ సంబంధమోయ్. " అన్నాడు పెద్ద మనిషి. ఇతడు తెల్ల ముఖం పెట్టడం చూసి, "అర్థం కాలేదూ? బదరి అంటే రేగు. నీ ఇంటి ముందు రేగు చెట్టు ఉంది కదా. నా బండి చక్రాలు రేగు చెట్టు తో చేసినవే! అదే మన సంబంధం!" అని బండి ఎక్కేసాడు పెద్ద మనిషి. అంతే కాదు, కొసమెరుపు గా...


"శ్లో: అస్మాకం బదరీ చక్రం 

       యుష్మాకం బదరీ తరుః

       బాదరాయణ సంబంధాత్ 

       యూయం యూయం వయం వయం. " 

 

అని ఓ శ్లోకం కూడా వదిలేడు. బండి కదిలింది. బండి మలుపు తిరిగే వరకూ నిర్ఘాంతపోయి నిలిచి చూస్తూ ఉండిపోయారా అమాయక దంపతులు!

 

                    🤣🙏

ధర్మాకృతి

 ధర్మాకృతి : గిణి


సుబ్రహ్మణ్య శాస్త్రిగారి ఉద్యోగధర్మాన శ్రీస్వామినాథన్ బాల్యము విల్లుపురము, తిండివనం చిదంబరం, ఫిరంగిపేట, వికరవాండి మొదలైన గ్రామాల్లో గడిచింది. ముందు జీవితమంతా గ్రామగ్రామంగా విజయం చేయబోతున్నారనేందుకు సూచనేమో ఈ త్రిప్పట.

పెద్దకుమారుడు కలిగిన తొమ్మిదేళ్ళ తరువాత ఇక పుత్రులు కలగరేమో బెంగపడుతున్న సమయంలో పుట్టిన వారవడంతో శ్రీస్వామినాథన్ అంటే తల్లిదండ్రులకు ఎంతో ముద్దు, గారాబం. డానికి తోడు చురుకుదనం, మంచి నడవడి, చక్కదనం, మంచి మాటకారితనం, ఇవన్నీ కలసి వారిపై మరింత ఆదరాన్ని కలుగజేశాయి. ఇన్ని వన్నెలున్న తమ కుమారుని పంచవన్నెల రామచిలుకకు కన్నడ పర్యాయపదమైన ‘గిణి’ అనే పేరుతో పిలుచుకోసాగారు. 


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

ఏకాదశులు

 *ఏకాదశులు వాటి విశిష్టతలు*


ఏకాదశి అనగానే హిందువులకు గుర్తుకు వచ్చేవి తొలఏకాదశి ముక్కోటి ఏకాదశి. కొంతమంది ఏకాదశికి ఉపవాసం ఉంటారు. ప్రతి నెలలోనూ రెండు సార్లు ఏకాదశులు వస్తాయి. వీటిలో దేని ప్రత్యేకత దానిదే.  ప్రతి నెలకు రెండు పక్షాలు ఉంటాయి. 1. శుక్లపక్షము 2. కృష్ణ పక్షము … పక్షానికొక ఏకాదశి చొప్పున్న .. ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశులుంటాయి.


ప్రతి నెల పౌర్ణమికి,అమావాస్యకు ముందు ఈ ఏకాదశులు వస్తూ ఉంటాయి. ఆషాడ శుక్ల ఏకాదశిని ప్రధమ ఏకాదశిగా పరిగణిస్తారు. సంవత్సరం మొత్తంలో ఇలాంటి శుద్ధ ఏకాదశులు 12 వస్తాయి. ప్రతి నెల అమావాస్యకు ముందు వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అంటారు. సంవత్సరం మొత్తంలో ఇలాంటి బహుళ ఏకాదశులు 12 వస్తాయి. వీటిలో ప్రతి ఏకాదశికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ…. హిందువులు ముఖ్యంగా నాలుగు ఏకాదశులను విశేషంగా పరిగణిస్తారు. అవే


1. ఆషాడ శుద్ధ ఏకాదశి ( తొలి ఏకాదశి / శయనేకాదశి )

2. కార్తీక శుద్ధ ఏకాదశి

3. పుష్య శుద్ధ ఏకాదశి ( వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి )

4. మాఘ శుద్ధ ఏకాదశి ( భీష్మ ఏకాదశి ) వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి.


చైత్రమాసం నుంచి వచ్చే ఏకాదశుల పేర్లు – వాటి ఫలాలు ఓసారి చూద్దాం

చైత్రశుద్ధ ఏకాదశి (పున్నమి ముందు వచ్చే ఏకాదశి) – ‘కామదా’ – కోర్కెలు తీరుస్తుంది.

చైత్ర బహుళ ఏకాదశి (అమావాస్య ముందు వచ్చే ఏకాదశి) – ‘వరూధిని’ – సహస్ర గోదాన ఫలం లభిస్తుంది.

వైశాఖ శుద్ధ ఏకాదశి – ‘మోహిని’ – దరిద్రుడు ధనవంతుడు అవుతాడు.

వైశాఖ బహుళ ఏకాదశి – ‘అపరా’ – రాజ్యప్రాప్తి.

జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి – ‘నిర్జల” – ఆహార సమృద్ధి.

జ్యేష్ఠ బహుళ ఏకాదశి – ‘యోగిని’ – పాపములను హరిస్తుంది.

ఆషాఢ శుద్ధ ఏకాదశి – ‘దేవశయనీ’ – సంపత్ ప్రాప్తి(విష్ణువు యోగనిద్రకు శయనించు రోజు- తొలిఏకాదశి).

ఆషాఢ బహుళ ఏకాదశి – ‘కామికా’ కోరిన కోర్కెలు ఫలిస్తాయి.

శ్రావణ శుద్ధ ఏకాదశి – ‘పుత్రదా’ – సత్సంతాన ప్రాప్తి.

శ్రావణ బహుళ ఏకాదశి – ‘ఆజా’ – రాజ్య పత్నీ పుత్ర ప్రాప్తి, ఆపన్నివారణ.

భాద్రపద శుద్ధ ఏకాదశి – ‘పరివర్తన’ (యోగనిద్రలో విష్ణువు పక్కకు పొర్లును, అందుకే పరివర్తన యోగసిద్ధి).

భాద్రపద బహుళ ఏకాదశి – ‘ఇందిరా’ – సంపదలు, రాజ్యము ప్రాప్తించును.

ఆశ్వయుజము శుక్ల ఏకాదశి – ‘పాపంకుశ’ – పుణ్యప్రదం.

ఆశ్వయుజము బహుళ ఏకాదశి – ‘రమా’ – స్వర్గప్రాప్తి.

కార్తీక శుద్ధ ఏకాదశి – ‘ప్రబోధిని’ – (యోగనిద్ర పొందిన మహావిష్ణువు మేల్కొనే రోజు) జ్ఞానసిద్ధి.

కార్తీక బహుళ ఏకాదశి – ‘ఉత్పత్తి’ – దుష్టసంహారం (మురాసురుని సంహరించిన కన్య విష్ణుశరీరం నుండి జనించిన రోజు).

మార్గశిర శుద్ధ ఏకాదశి – ‘మోక్షదా’ – మోక్షప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).

మార్గశిర బహుళ ఏకాదశి – ‘విమలా’ -(సఫలా) – అజ్ఞాన నివృత్తి.

పుష్య శుద్ధ ఏకాదశి – ‘పుత్రదా’ – పుత్రప్రాప్తి (ఇది వైకుంఠ ఏకాదశి).

పుష్య బహుళ ఏకాదశి – ‘కళ్యాణీ’ (షట్ తిలా) ఈతిబాధా నివారణం.

మాఘ శుద్ధ ఏకాదశి – ‘కామదా’ (జయా) – శాపవిముక్తి.

మాఘ బహుళ ఏకాదశి – ‘విజయా’ – సకలకార్య విజయం.

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి – ‘ఆమలకీ’ – ఆరోగ్యప్రదం.

ఫాల్గుణ శుద్ధ ఏకాదశి – ‘సౌమ్య’ – పాపవిముక్తి

(కొన్నికొన్ని పురాణాలలో ఏకాదశులకున్న పేర్ల విషయంలో కొన్ని బేధాలున్నాయి. వాటిని ఇక్కడ ప్రస్తావించట్లేదు)


24 ఏకాదశులలోనూ – సౌరమానంలో ప్రసస్తమైన ధనుర్మాసంలో (మార్గశిర/పుష్యమాసాల్లో) వచ్చే శుక్లపక్ష ఏకాదశిని “వైకుంఠ ఏకాదశి”గా కీర్తిస్తున్నాం. దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు.  సౌరమానం ధనుర్మాసం కాగా, అందులో వచ్చే వైకుంఠ ఏకాదశి చాంద్రమానానుసారిణి, శ్రీమన్నారాయణునకు సూర్యుడు కుడికన్ను, చంద్రుడు ఎడమకన్ను. కన్నులు వేర్వేరు ఐనా దృష్టి మాత్రం ఒక్కటే అయినట్లుగా సూర్యచంద్రులు వేర్వేరు అయినా….. కాంతితత్త్వం ఒక్కటే అనే మహాతత్వాన్ని ఈ పర్వదినం సూచిస్తుంది.


వైకుంఠ ఏకాదశి సామాన్యంగా మార్గశిర, పుష్య మాసాల్లో వస్తుంది. రావణుని బాధలు తాళలేని దేవతలు బ్రహ్మను వెంటబెట్టుకొని వైకుంఠము చేరి, హరివాసరమైన మార్గశిర శుక్ల ఏకాదశినాడు శ్రీహరిని ప్రార్థించి, తమ బాధను విన్నవించారు. స్వామి బ్రహ్మాదులకు దర్శనమిచ్చి, అభయం ఇచ్చుట జరిగింది. దేవతల బాధా నివారణకి ఈ ఏకాదశియే మార్గం చూపింది.


🚩 * 🚩

22, ఆగస్టు 2022, సోమవారం

వందే కృష్ణం జగద్గురుం

 కృష్ణ తత్వాన్ని చక్కగా వివరించిన "కార్తికేయ 2 " సినిమా లోని కొన్ని అద్భుతమైన మాటలు..


కృష్ణుడు అంటే సత్యం, ఆనందం, పరబ్రహ్మ స్వరూపం. అన్ని దైవ స్వరూపాలు ఆత్మ తత్వాన్ని బోధించేవే.


కృష్ణుడు దేవుడు అనే భక్తితో కన్నా ఒక గురువుగా స్వీకరిస్తే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను దాటి అద్భుతాలు చూడొచ్చు


గీతతో కోట్లమందికి దారిచూపించిన 

అతనికన్నా గురువెవ్వరు..?


రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా

 గొప్ప ఆర్కిటెక్ట్ ఎవ్వరు..?


నమ్మినవారి కోసం 

ఎంతటి వలయాన్నైనా ఛేదించే అతనికన్నా గొప్ప నమ్మకస్తుడు ఎవరు..?


యుద్ధం చేస్తే ఇన్ని లక్షల మంది తెగటారిపోతారు, 

ఇన్ని లక్షల లీటర్ల రక్తం ఏరులై పారుతుంది, యుద్ధం వద్దు సంధి ముద్దు అని చెప్పి ఒప్పించాలని శతకోటి ప్రయత్నాలు చేసిన అతనికన్నా ముందుచూపున్న గొప్ప శాంతిదూత ఎవరు...?


చూపుతోనే మనసులోని మాటచెప్పే అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు


వేణుగానంతోనే గోవుల్ని, గోపికల్ని కట్టిపడేసే అతనికన్నా గొప్ప మ్యూజిషియన్ ఎవరు..?


నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు....?


ధర్మం కోసం 

యుద్ధం చేయమని చెప్పిన అతన్నిమించిన వీరుడెవరు...?


 నమ్ముకున్న వాళ్ళ వెంట ఉండి విజయమో వీర స్వర్గమో కర్త్యవం ముఖ్యం 

ఫలితం దైవాధీనం అని చెప్పి నడిపించిన అతనికన్నా 

గొప్ప దార్శనికుడు ఎవరు...?


కరువూ కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజెవ్వరు..?


హోమ యాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న    కైమటాలజిస్ట్ ఎవరు..?


అన్ కంట్రోలబుల్ ఆర్.పి.యం.తో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతన్ని మించిన   కైనటిక్ ఇంజనీర్ ఎవరు..?


మరణం ఎప్పటికైనా తథ్యం అని గీత ద్వారా చెప్పి నడిపించే అతనికన్నా 

గొప్ప విరాగి ఎవరు..?


అతనొక ఫైటర్, సింగర్, టీచర్, వారియర్, మ్యూజిషియన్, మేజిషియన్, దార్శనికుడు అనంతంలో నిండియున్న సృష్టి...


వందే కృష్ణం జగద్గురుం

విజయం సాధించి తీరుతాం

 చక్కని కథ. విధి చేసేది ఎప్పుడూ మన మంచికే. 


*ఒక ధనవంతుడు ఉండేవాడు. ఒక సెలవు రోజున పడవ తీసుకుని సరదాగా సముద్రంలో ఒంటరిగా షికారుకి వెళ్లాడు. అతను సముద్రంలో కొంచెం దూరం చేరుకున్నాక అకస్మాత్తుగా తీవ్రమైన తుఫాను వచ్చింది.*  


 *తుఫాను వల్ల అతని పడవ పూర్తిగా ధ్వంసమవ్వడంతో అతను సముద్రంలోకి దూకేశాడు. లైఫ్ జాకెట్ ఉండడం వల్ల నీటిలో తేలుతూ, తుఫాను శాంతించిన తర్వాత ఒక ద్వీపానికి చేరుకున్నాడు. కానీ, ఆ ద్వీపంలో మనుషుల జాడ లేదు. చుట్టూ సముద్రం తప్ప ఏమీ కనిపించడంలేదు.*   


 *అప్పుడా వ్యక్తి "నా జీవితంలో నేను ఎవరికీ చెడు చేయనప్పుడు నాకే ఎందుకిలా జరిగింది అని" బాధపడ్డాడు. ఆ తర్వాత "తనను మరణం నుండి రక్షించిన భగవంతుడు, తీరం చేరుకునేందుకు కూడా దారిని చూపిస్తాడని" మనసులో దేవుణ్ణి గట్టిగా విశ్వసించాడు.* 


 *ఆ ద్వీపంలోనే ఒంటరిగా నివసిస్తూ అక్కడ పండే ఆకులు, పండ్లు తింటూ బతకడం అలవాటు చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత నెమ్మదిగా అతనిలోని ఆశలు నీరుగారిపోవడం మొదలైంది. కానీ దేవుడిపట్ల అతని విశ్వాసం మాత్రం తగ్గించుకోలేదు. దాంతో తన జీవితమంతా ఈ దీవిలో గడపక తప్పదని నిర్ణయించుకుని ఆ ద్వీపంలో తాను నివసించేందుకు ఓ గుడిసె నిర్మించుకోవడం ప్రారంభించాడు.* 


 *గుడిసె నిర్మాణం పూర్తవ్వగానే మళ్ళీ అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో వాతావరణం మారిపోయింది. అతని గుడిసెపై పిడుగు పడి గుడిసె కాలిపోసాగింది.* 


 *ఇదంతా చూసి విస్తుపోయిన ఆ వ్యక్తి ఆకాశం వైపు చూస్తూ "దేవుడా! ఎంతవరకు నీకిది న్యాయం, ఎన్ని కష్టాలు ఎదురైనా నీపై ఎప్పుడూ విశ్వాసాన్ని కోల్పోలేదు. నిన్నే నమ్ముకున్నాను. నువ్వెందుకు నాపై దయ ఎందుకు చూపడంలేదు స్వామీ" అంటూ నిరాశనిస్పృహలలో కూరుకుపోయి ఏడవడం ప్రారంభించాడు.* 


 *అంతలో అకస్మాత్తుగా ఒక పడవ ఆ ద్వీపం సమీపంలోకి వచ్చింది.* 


 *పడవలోంచి ఇద్దరు వ్యక్తులు దిగి వచ్చి మిమ్మల్ని రక్షించేందుకు వచ్చామని చెప్పారు. కాలిపోతున్న గుడిసె దూరం నుంచి మాకు కనబడి ఈ నిర్జనద్వీపంలో  ఎవరో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది. మీరు మీ గుడిసెను కాల్చిఉండకపోతే, ఇక్కడ మీరున్న విషయం మాకు తెలిసి ఉండేది కాదని అన్నారు.* 


 *అప్పుడు ఆ వ్యక్తి కళ్లలో నీళ్ళు తెచ్చుకుని ఆ భగవంతుని క్షమాపణలు కోరుతూ "ఓ ప్రభూ! నన్ను రక్షించడానికి నువ్వే పిడుగు రూపంలో నా గుడిసెను తగలబెట్టావని నేను గ్రహించలేకపోయాను. నువ్వు నా సహనాన్ని పరీక్షించావు. కానీ, నేనే అందులో విఫలమయ్యాను. నిశ్చయంగా నిన్ను నమ్మినవారిని తప్పకుండా కాపాడతావని నువ్వు నిరూపించుకున్నావు. దయచేసి నన్ను క్షమించు ప్రభూ" అని మనసులోనే నమస్కరించుకున్నాడు.* 

 

 *ఈ కథలోని నీతి* 


 *“సుఖంలోనైనా, దుఃఖంలోనైనా, తనను నమ్మినవారితో దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు. సహనం కోల్పోయినప్పుడు మనిషికి ఒక్కోసారి దేవుడిపై కోపం వస్తుంది. కానీ, మనిషిపై దేవుడు ఎప్పుడూ కోపం తెచ్చుకోడు. ఆయన ఎల్లప్పుడు మంచినే చేస్తాడు. జీవితంలో అప్పుడప్పుడు మనకు కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి. మనం, నిరాశతో దేవుడు లేదా విధిపై కోపం తెచ్చుకుంటాము. విశ్వాసాన్ని కోల్పోతాము. దాని కారణంగా మన ఆత్మవిశ్వాసం కూడా క్షీణించిపోయే అవకాశముంటుంది. కానీ, ఆ తర్వాత మనకు నెమ్మదిగా అర్థమవుతుంది. ఆ దేవుడు/విధి చేసింది మంచిదేనని. లేకపోతే నేను ఈ రోజు ఇక్కడ ఉండేవాణ్ణి కాదని.* 


 *కాబట్టి ఎన్ని కష్టాలు ఎదురైనా, దుఃఖం ఎంత కృంగదీసినా, కరోనాలు కాటు వేయాలని చూసినా, సమస్యలు ఎంత తొక్కేయాలని చూసినా ఎన్నడూ ఆత్మవిశ్వాసాన్ని వీడకుండా, భగవంతుడిపై భారముంచి, పట్టుదలతో మన పని మనం చేసుకుంటూ వెళితే తప్పకుండా విజయం సాధించి తీరుతాం


🌻🌞🌻🌞🌻🌞🌻🌞🌻

తక్షణ కర్తవ్యం.

 *భగవత్ సాన్నిధ్యం*


పరమానందకరమైనది, చిట్టచివరి గమ్యం భగవత్‌ సాన్నిధ్యం. దాన్ని కోరుకోవడం మానవ సహజం. కానీ, కోరుకున్నంత సులువుగా అది లభించదు. ‘భగవత్‌ సాన్నిధ్యం సులభంగా లభించడం కోసం ముందుగా సాధువుల సన్నిధికి చేరుకోవాలి’ అని మహాత్ముల అభిప్రాయం.


సాధుల హృదయము నాయది

సాధుల హృదయంబు నేను, జగముల నెల్లన్‌

సాధుల నేనే యెరుగుదు

సాధులెరుంగుదురు నాదు చరితము విప్రా!


పై భాగవత పద్యాన్ని అనుసరించి ‘సాధువుల హృదయమే నాది. అదే నేను’ అని పేర్కొన్నాడు శ్రీమహావిష్ణువు. 


సౌకర్యం ఏమంటే భగవంతుడు శరీరధారి అయి మనకు కనిపించకపోయినా, సాధువులు ఎక్కడో ఒకచోట కనిపిస్తారు. నిజమైన సాధువు కోసం అన్వేషించాలి. భగవత్‌ విభూతి నిండిన సాధువులు మన అదృష్టం కొద్దీ లభించారా భగవంతుడికి మనం సన్నిహితులం కావడం అంత కష్టమైన పనేం కాదు. అందుకే సాధు సజ్జన సాంగత్యానికి అంత ప్రాధాన్యం.


నిజమైన సాధువులు ఎలా ఉంటారో, వారిని ఎలా గుర్తుపట్టాలో ముందుగా తెలుసుకోవలసి ఉన్నది. సంత్‌ కబీర్‌దాస్‌ సాధువు గురించి గొప్పమాట సెలవిచ్చాడు.


నిరబైరీ నిహకాంమతా, సాయి సేతీ నేహ

విషియా సూఁన్యారా రహై, సంతహి కా అంగ్‌ ఎహ్‌


‘ఎవరి మీదా పగలేకపోవడం, ఏ కోరికలూ లేకపోవడం, విషయ సుఖాలపై ఆసక్తి లేకపోవడం, దైవం పట్ల దృఢమైన భక్తి సాధువు సహజ గుణాలు’ అని కబీర్‌ ప్రవచించాడు. 


అంతేకాదు, ఎంతమంది దుర్జనులు చుట్టూ ఉన్నా సాధువు మారడు. గంధపు చెట్టును పాములు ఎన్నో ఆశ్రయించినా, అది తన సహజ స్వభావమైన చల్లదనాన్ని వదులుకోదు కదా! అలాగే తమచుట్టూ ఎలాంటి వ్యక్తులున్నా వారి సహజ స్వభావంలో ఎలాంటి మార్పూ రాదు! ఎంతదూరం నుంచి చూసినా సాధువును గుర్తించవచ్చు. 


వారి శరీరం శుష్కించి ఉంటుంది. చూపు ఎప్పుడూ పైకి ఉంటుంది (ఊర్ధ దృష్టి). లోక వాసనలుండవు. ఎప్పుడూ సంచారం చేస్తూనే ఉంటారు. అందుకే కబీర్‌ ‘కబీర్‌ హరికా భావతా’ అనే దోహాలో ఈ లక్షణాలనే పేర్కొన్నాడు.


సాధువు ఎలా ఉంటాడో, ఏ లక్షణాలను చూసి అతణ్ని సాధువుగా గుర్తించాలో కూడా వివరించాడు కబీర్‌దాసు. 


‘ఎల్లప్పుడూ శ్రీహరిని భజిస్తూ ఉంటాడు. దైవానికి దూరమయ్యాననే బాధ అతణ్ని ఎప్పుడూ పీడిస్తూ ఉంటుంది. తనను గురించి ధ్యాస ఉండదు. నిదురపోతున్నట్టు కూడా కనిపించడు’ అంటాడు. 


అంతేకాదు, ‘వజ్రవైడూర్యాలు ఒకచోట రాశిగా పడనట్టు, రాజహంసలు ఒకేచోట గుంపుగా కనిపించనట్టు, సింహాలు ఒకేచోట సంచరించనట్టుగా.. సాధువులు కూడా జట్లుజట్లుగా మనకు తారసపడర’ని కబీర్‌ అభిప్రాయం.


ఆహ్వానించినంత మాత్రాన సాధువులు ఎవరి ఇండ్లకూ రారు. సద్గుణ సంపన్నులని తమకు విశ్వాసం కలిగినవారి ఇండ్లకే విచ్చేస్తారు. ఎవరింటికి సాధువుల రాకపోకలు జరుగుతూ ఉన్నాయో కనుక్కొని వారింటికి వెళ్లాలి. ఆ ఇంటి యజమానులు ఫలానా వాళ్లు సాధువులు అని నిర్ధారించుకున్న తర్వాతే కదా వారిని ఆహ్వానిస్తున్నది! అప్పుడు సాధువులు ఎవరో నిర్ధారించుకునే శ్రమ చాలావరకు తగ్గుతుంది. 


అయితే, మారుతున్న కాలాన్ని బట్టి చాలామంది సాధువుల రూపంలో, పాదపూజల నెపంతో తారసపడుతూ ఉంటారు. పైపై మెరుగులు, పటాటోపాల మాయలో పడకుండా నిజమైన సాధువును గుర్తించడం సాధకుడి బాధ్యత! సద్గురువు మార్గదర్శనంలో నిజమైన సాధువు ఎవరో తెలుసుకోవడం ఉత్తమం. 


సాధువులు ఎలా ఉంటారో, వారికి ఎలాంటి లక్షణాలుంటాయో కనిపెట్టిన తర్వాత గాని సాధకులు ముందడుగు వేయకూడదు. 


నిజమైన సాధువు తారసపడితే మాత్రం వారి అనుగ్రహం కోసం ఎన్నాళ్లు ఎదురుచూసినా తప్పులేదు. ప్రయత్నపూర్వకంగా వారిని దర్శిస్తూ ఉండాలి. వారితో మర్యాదగా సంభాషించాలి. వారి ఉపదేశాలను తు.చ. తప్పకుండా పాటించాలి. వాళ్లు పెట్టే పరీక్షలను తట్టుకోవాలి. ఇన్ని చేస్తేగానీ, సాధువు అనుగ్రహం లభించదు. వారి చల్లని దృష్టి సోకితే మాత్రం జీవితం సార్థకమవుతుంది. భగవత్‌ సాన్నిధ్యం సులభతరమవుతుంది.


ఇక సాధువులను గుర్తించి వారి ఉపదేశాలను పాఠించడమే తక్షణ కర్తవ్యం.

పవిత్రమైనవే

 🙏🌷💞 శ్రీ మాత్రే నమః శుభోదయం💞🌷🙏.              🌹 బురదలో ఉన్నప్పటికీ కలువపువ్వు పవిత్రమైనవే🌹 విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే🌹 జీవిస్తున్న స్థలాన్ని బట్టి చుట్టూ ఉండే జన్నాన్ని ఎవ్వరినీ అంచనా వేయకూడదు🌹 మనమీద మనకే నమ్మకం పెరగాలంటే అంతరాత్మకి జవాబుదారీగా ఉండాలి🌹 మనమీద ఇతరులకు నమ్మకం పెరగాలంటే మన తప్పులకు మనమే బాధ్యత వహించాలి🌹 బండరాయి సైతం ఓర్పు వహిస్తే ఆలయంలో విగ్రహంగా పూజలు అందుకుంటుంది🌹 మనిషి కూడా సహనంతో ఉంటే సాధించలేనిది ఏదీ లేదు🌹🌹🌹 మీ అల్లంరాజు భాస్కర రావు

శ్రీ విజయ ఆయుర్వేదిక్

గోకవరం బస్ స్టాండ్

Rajhamundry

9440893593🙏🙏🙏🙏

గురు దక్షిణ :---

 గురు దక్షిణ  :---


“తప్పదు నాన్నా.  అంతకన్నా నాకు వేరే దారి లేదు". కొడుకు మాటలకు ఖిన్నుడైపోయాడు రాఘవ రావు. జానకమ్మ ఎటూ చెప్పలేక కొయ్యబొమ్మలా నిలబడిపోయింది. తల్లీ, తండ్రి ఇద్దరికేసి మరోమారు చూసి బాగ్ తీసుకుని వెళ్ళిపోయాడు రాజేష్.

రాజేష్ వెళ్ళిన రెండు నిముషాల వరకూ భార్యా, భర్తా ఇద్దరూ అలానే గుమ్మం కేసి చూస్తూ ఉండిపోయారు.  ముందుగా జానకమ్మ తేరుకుని నిట్టూర్పు విడిచి వంటింట్లోకి వెళ్ళింది. రాఘవ రావు కండువా భుజమ్మీద వేసుకుని పార్కుకి బయల్దేరాడు. పదినిముషాలలో పార్కుకి చేరుకున్నాడు.  అప్పటికే అతని మిత్రులు పరమేశం, సుబ్బారావు బెంచి మీద కూర్చుని ఉన్నారు. సుబ్బారావు పక్కకు జరిగి ‘రా రాఘవా’ అని ఆహ్వానించాడు.

మ్లానవదనంతో కూర్చున్న రాఘవరావు ని చూసి , ఇంటి దగ్గర ఏదో అయ్యిందని గ్రహించారు మిత్రులు ఇద్దరూ.  కాసేపు లోకాభిరామాయణం మాట్లాడారు వాళ్ళు ఇద్దరూ. తర్వాత పరమేశం అన్నాడు “చూడు రాఘవా, నువ్వు ఏదో విషయం గురించి బాధపడుతున్నట్టున్నావు.

నీ బాధ నీ సన్నిహితులుతో పంచుకుంటే కొంత వరకూ ఉపశమనం కలుగుతుంది.  మన ముగ్గురి మధ్యా రహస్యాలు లేవుగా.”  రాఘవ రావు దీర్ఘంగా నిట్టూర్చి “మా అబ్బాయి ఇల్లు అమ్మేయమంటున్నాడు.” అన్నాడు.  “కారణం?” అడిగాడు సుబ్బారావు. “ఎనభై లక్షల, త్రీ బెడ్ రూమ్ ప్లాట్ అరవైకే వస్తోందట. మళ్ళీ ఈ అవకాశం రాదుట.  నేను ఈ ఇల్లు అమ్మితే వచ్చే డబ్బు, వాడి దగ్గర ఉన్న డబ్బు కలిపి ఆ ప్లాట్ కొంటాడట.  అదీ సంగతి.” అని కండువాతో మొహం తుడుచుకున్నాడు రాఘవ రావు.  మిత్రులు ఇద్దరూ ఆలోచనలో పడ్డారు.  కాసేపటికి సుబ్బారావు అడిగాడు “మీ ఆవిడ ఏమంది?”

“తల్లి ప్రేమ కదా, కొడుకు వైపే మాట్లాడింది.  ఎలాగూ చివర దశలో వాడి దగ్గరకు చేరవలసిన వాళ్ళమే కదా అని అంది.”

“రాఘవా, నువ్వు చాలా కష్టపడి ఇల్లు కట్టుకున్నావు. ఆ మమకారం ఉంటుంది. కానీ పరిస్తితుల్ని బట్టి మనం నడచుకోవాలి.  నీకు ఒక్కగానొక్క కొడుకు.  అతణ్ణి

కాదని అంటే, రేపు నిన్ను చూడటానికి కూడా రాడేమో ఆలోచించు.  ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉంటున్నారో మనం చూస్తున్నాంగా” అన్నాడు పరమేశం.  సుబ్బారావు కూడా పరమేశం లాగే కొడుకు దగ్గరకు వెళ్ళడమే మంచిదని సలహా ఇచ్చాడు.  ఒక అరగంట కూర్చుని ఇంటికి వచ్చాడు రాఘవ రావు. అన్యమనస్కంగానే భోంచేసి పడుకున్నాడు.  కానీ ఎంతకూ నిద్ర రావడం లేదు.  గతం పదే పదే గుర్తుకు వస్తోంది .

పంచాయతీ ఆఫీస్ వెనక ఉన్న ఖాళీ స్థలాల్ని తక్కువ రేటుకి ఇస్తున్నారని, మాస్టార్లందరూ తీసుకుని ఇల్లు కట్టుకున్నారు. అందరూ రెండు వందల గజాలు స్థలం తీసుకుంటే, రాఘవరావు భార్య కోరిక మీద నాలుగు వందల గజాల స్థలం తీసుకున్నాడు. జానకమ్మకు మొక్కలంటే ప్రాణం. అందుకే స్థలం మధ్యలో ఇల్లు కట్టుకుని చుట్టూ ఉన్న జాగాలో చాలా మొక్కలు వేసుకున్నారు. రాఘవరావు స్కూల్ లో ఉంటే, జానకమ్మే ఇంటి నిర్మాణం పనులు చూసేది.  పనివాళ్ళతో సమంగా తానూ ఎండలో నిలబడి వారిచేత పనులు చేయించేది.  వాస్తవానికి, రాఘవరావు కన్నా జానకమ్మే ఇంటి కోసం కష్ట పడింది.  ఒక ఆదివారం నాడు భార్యా భర్తలు ఇద్దరూ కడియం వెళ్లి రక రకాల పూల మొక్కలు, మామిడి, పనస, సపోటా మొక్కలు చిన్న వాన్ మీద తెచ్చుకున్నారు.  మిగతా మాస్టర్లు

‘వాళ్ళిద్దరికీ చాదస్తం అని’  విమర్శించినా వాళ్ళ ఇల్లు నందన వనంలా పెరిగాక అభినందించ కుండా ఉండలేక పోయారు. అందరూ బోరింగ్ పైపులు వేయించుకున్నా, రాఘవరావు మాత్రం నుయ్యి తవ్వించుకున్నాడు .

నూతి పళ్ళెం దగ్గరనుండి తూములు ఏర్పాటు చేసి నీళ్ళు మొక్కలకు చేరేటట్లు చేసాడు. ఉదయమే నూతి దగ్గర స్నానం చేసి, సూర్యుడికి నమస్కరించి ఇంట్లోకి వచ్చేవాడు. మామిడి చెట్టు బాగా పెరిగి పెద్దది అయ్యాకా దానికి సిమెంట్చప్టా చేయించాడు.  రాఘవరావు స్కూల్ నుంచి వచ్చాక మామిడి చెట్టుకింద ఉన్న చప్టా మీద కూర్చుంటే, జానకమ్మ కాఫీ తీసుకు వచ్చి ఇచ్చేది.  ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగేవారు.  సెలవు రోజుల్లో మిత్రులు వస్తే వాళ్ళ మీటింగ్ కూడా మామిడి చెట్టుకిందే.  వేసవికాలం సాయంత్రాలలో భార్యా భర్తలు ఇద్దరూ ఆ చెట్ల మధ్యే కూర్చుని మాట్లాడుకునే వారు.  టీచర్స్ కాలనీ లో ఏ శుభకార్యం జరిగినా రాఘవరావు ఇంటి నుండే మామిడి ఆకులు తెచ్చుకుని తోరణాలు కట్టుకునే వారు.  సపోటా పళ్ళు కూడా రాఘవరావు మిత్రులు అందరకు పంపించేవాడు.  రెండు పడక గదులు, ఒక హాలు, వంటగది అన్నీ విశాలంగా ఏర్పాటు చేసుకున్నాడు రాఘవరావు.

పాతిక ఏళ్ల అనుబంధం ఉంది ఆ ఇంటితో వాళ్ళిద్దరికీ.  ఎన్నో అందమైన అనుభూతులు, జ్ఞాపకాలు ఉన్నాయి.  వాటిని ఒక్కసారిగా వదులుకోవాలంటే రాఘవరావు తట్టుకోలేక పోతున్నాడు.  కానీ తప్పదు.

కొడుకు కోరిక తీర్చాలి. ఏం చేస్తాం? అని మధనపడుతూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు రాఘవరావు.


కొడుకు తరచూ ఫోన్లు చేయడం, భార్య కూడా పదే పదే చెప్పడంతో రాఘవరావు ఇల్లు అమ్మకానికి పెట్టాడు. ఇల్లు కొందామని వచ్చిన వారు ఇల్లుచూసి పెదవి విరిచి వెళ్ళిపోతున్నారు. పాతిక ఏళ్ల క్రితం కట్టిన ఇల్లు ఈనాటి ఫాషన్ కి అనుగుణంగా లేదని కొందరు, ఇల్లు చిన్నది, చుట్టూ స్థలం ఎక్కువ వదిలేసారని మరి కొందరు వెనక్కి వెళ్ళిపోయారు.  ఇల్లు బేరం పెట్టి రెండు నెలలు గడిచినా సరైన బేరం రాలేదు.  జానకమ్మ బెంగ పెట్టుకుంది, కొడుకుకి సాయం చేయలేకపోతున్నామని.  ఒక రోజు షావుకారు వెంకటరావు వచ్చాడు ఇల్లు చూడటానికి.  ప్రతి గది పరిశీలన చేసాడు. దొడ్డి అంతా టేపు తో కొలిచాడు.  భార్యాభర్తలు ఇద్దరూ అతను ఏం చెబుతాడా? అని ఆతృతగా చూస్తున్నారు. చివరికి పెదవి విప్పాడు షావుకారు.

“మాస్టారు, ఇల్లు కట్టి పాతిక ఏళ్ళు అయ్యింది, అంటే పాతదాని కిందే లెక్క.  ఎవరైనా కొనుక్కున్నా ఒక కుటుంబమే ఉండాలి.  మీరు ఏభై లక్షలు చెబుతున్నారు. అంత ఖర్చు పెట్టి పాత ఇంటిని ఎవరూ కొనరు. ఆ డబ్బుతో మరింత సౌకర్యంగా ఉండే కొత్త ఇల్లే కట్టుకుంటారు. ఏమంటారు?”


రాఘవరావు మౌనం వహించాడు. జానకమ్మే అంది. ‘ఇక్కడ గజం రేటు పదివేలకు పైమాటే.  అలా చూసినా, నాలుగు వందల గజాలకు నలభై లక్షలు, ఇంటికి పదిహేను, మొత్తం ఏభై ఐదు లక్షలు రాదంటారా?”  ఆమె మాటలకు చిన్నగా నవ్వాడు షావుకారు. “చూడండి అమ్మా, మీ లెక్కలు మీకు ఉంటాయి. కొనేవాడి లెక్కలు కోనేవాడికుంటాయి. నేను ఇక్కడ ఒక అపార్ట్ మెంట్ కట్టాలని అనుకుంటున్నాను. అప్పుడు ఇల్లు తీసెయాలి. అందుకని స్తలం రేట్ కి కొందామని నా ఉద్దేశ్యం. అందుచేత నలభై లక్షలకు మాత్రమే నేను కొంటాను.  ఆలోచించండి “ అని చెప్పి వెళ్ళిపోయాడు షావుకారు.

అతను వెళ్ళాకా భార్యాభర్తలు ఇద్దరూ చాలాసేపు చర్చించుకున్నారు.

చివరకు జానకమ్మే నిర్ణయం ప్రకటించింది . “మనం ఆలస్యం చేసేకొద్దీ అబ్బాయికి వచ్చిన అవకాశం చేజారి పోతుంది. నలభై లక్షలకు షావుకారికే ఇల్లు ఇచ్చేద్దాం.  మిగతా డబ్బుకి అబ్బాయే తంటాలు పడతాడు”

ఆ రాత్రే కొడుక్కి ఫోన్ చేసింది, ఇల్లు నలభై లక్షలకు షావుకారికి ఇద్దామనుకుంటున్నామని .

రాజేష్ అలాగే చెయ్యమని చెప్పాడు.  మర్నాడే రాఘవరావు షావుకారికి కబురుచేసి తమ అంగీకారం చెప్పాడు.  వారం రోజుల్లో రాఘవరావు ఇల్లు షావుకారు పరం అయ్యింది.  రిజిస్ట్రేషన్ సమయానికి రాజేష్ వచ్చి సంతకాలు చేసి డబ్బు పట్టుకుని హైదరాబాదు వెళ్ళిపోవడం చాలా స్పీడుగా జరిగిపోయింది.  నెలరోజుల తర్వాత రాజేష్ వచ్చి తల్లితండ్రుల్ని హైదరాబాదుకి  తీసుకునివెళ్లాడు. భారమైన హృదయాలతోనే వెళ్ళారు రాఘవరావు, జానకమ్మ.

కొన్నాళ్ళకు మనవల ఆట పాటలతో ఇంటి గురించి మర్చిపోయారిద్దరూ.  మరో నెల రోజులకు కొడుకు కొన్న ప్లాట్ లోకి మారారు అందరూ.  రెండు పడక గదులే ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు రాఘవరావు. కొడుకుని అడిగితే  ‘మనం ఆలస్యం చేయడంవలన, మూడు పడక గదుల ప్లాట్ చేజారిపోయిందని ‘ చెప్పాడు రాజేష్.  కొడుకు, కోడలు మనవలు ఒక గదిలో, రాఘవరావు జానకమ్మ ఒక గదిలో పడుకునే వారు. మూడు నెలలు ముచ్చటగా గడిచాయి.  ఒకరోజు మనవడు ‘నానమ్మా , నేను నీ దగ్గరే పడుకుంటానని’ పెద్దవాళ్ళ దగ్గరకు వచ్చేసాడు.  జానకమ్మ ఎంతో

సంతోషించి వాడిని దగ్గరకు తీసుకుని కథలు చెప్పి తన దగ్గరే పడుకోబెట్టుకుంది.  పది రోజులు తర్వాత మనవరాలు కూడా ‘నానమ్మా, నేనూ నీ దగ్గరే పడుకుంటానని’  జానకమ్మ దగ్గరకు వచ్చేసింది.  ఆ విధంగా రాఘవరావు పడక హాలులోని దివాను మీదకు మారిపోయింది.

ఆరునెలలు గడిచాయి.  పిల్లల ఫీజులు కట్టడానికి కొడుకు, కోడలు గొడవ పడటం చూసి, తన పెన్షన్ లో దాచుకున్న ఏభై వేలు పట్టుకొచ్చి కొడుకుకి ఇచ్చాడు

రాఘవరావు. మరో ఆరునెలలు గడిచేసరికి రాఘవరావు తన పెన్షన్ లోంచి ఐదువేలు తన దగ్గర ఉంచుకుని మిగతా ఇరవైవేలు కొడుకుకి ఇవ్వడం అలవాటు చేసుకున్నాడు.  ఇంటి ఖర్చులకి రాజేష్ సంపాదన సరిపోవడం లేదని సుమిత్ర కాన్వెంట్ లో టీచర్గా చేరింది.  వంట చెయ్యడం, మనవలు ఇద్దరినీ కాన్వెంట్ కి తయారు చేయడం జానకమ్మ డ్యూటీ గా మారిపోవడం జరిగింది. జానకమ్మకు శ్రమ ఎక్కువ అయ్యింది ఇంటి పనితో.  శివపురంలో వాళ్ళు ఇద్దరే ఉండేవారు.  వంట తక్కువ, పని కూడా తక్కువే .  విశ్రాంతిగా ఉండేది.  ఇక్కడ విశ్రాంతి అన్న మాటే లేదు. పని ..పని ..పని. 

మరో ఆరు నెలలు గడిచాయి. మనవలు ఇద్దరూ పెందరాలే పడుకోకుండా స్కూల్ విషయాలు చెప్పుకోవడం, జోకులు వేసుకోవడం చేస్తూ జానకమ్మకు నిద్ర పట్టకుండా చేయడంతో ఆమె పడక కూడా హాలు లోకి మారింది. రాఘవరావు దివాను మీద, జానకమ్మ నేలమీద చాప వేసుకుని పడుకుంటున్నారు. ఒకరోజు రాజేష్ ఏమీ తెలియనట్టు “ఇదేమిటమ్మా ఇక్కడ పడుకుంటున్నావు?” అని అడిగాడు.  మనవల గురించి ఫిర్యాదు చేయడం ఇష్టం లేని జానకమ్మ ‘మీ నాన్నకు తోడుగా ఉందామని ఇక్కడ పడుకుంటున్నాను’ అంది.

శీతాకాలం వచ్చింది.  టైల్స్ మీద చాప వున్నా జానకమ్మ చలికి తట్టుకోలేక పోతోంది.  అది చూసి రాజేష్ బజారు నుండి చిన్న పరుపు తీసుకు వచ్చి తల్లికి ఇచ్చాడు. దానికే చాలా మురిసిపోయింది జానకమ్మ.  ఒకసారి సుమిత్ర తల్లి తండ్రులు హైదరాబాద్ వచ్చారు. రాజేష్ వాళ్లకు ఎంతో మర్యాదలు చేసాడు.  పిల్లల పడకలు తల్లి తండ్రుల గదిలోకి మారాయి. రాజేష్, మావయ్య అత్తయ్య పిల్లల గదిలో పడుకున్నారు.  రాఘవరావు, జానకమ్మ

యధావిధిగా హాలు లోనే పడుకున్నారు. మొత్తం వంట పనంతా జానకమ్మ మీదే పడింది.  సుమిత్ర , తల్లి తండ్రులు వారం రోజులు ఉన్నారు.  జానకమ్మ వళ్ళు హూనం ఐపోయింది. వాళ్ళు వెళ్ళేటప్పుడు సుమిత్ర తండ్రి అన్న మాట రాఘవరావు దంపతుల్ని మరీ బాధించింది. ‘బావ గారు, అక్కయ్య గారు అదృష్టవంతులు. చక్కగా కొడుకు దగ్గర వుండి సుఖ పడుతున్నారు’ అని.  అమ్మమ్మ, తాతయ్య వెళ్లి పోగానే మనవలు మల్లీ వాళ్ళ గదిలోనే పడుకో

సాగారు.  దాంతోరాఘవరావు, జానకమ్మ లకు ఒక విషయం పూర్తిగా అర్ధమయ్యింది.  కొడుకు, కోడలు కావాలనే తమని హాలు లోకి పంపించారని.  ఆ రాత్రి దంపతులు ఇద్దరూ చాలా సేపు బాధపడ్డారు.  శివపురం వదిలి కొడుకు దగ్గరకు వచ్చి చాలా పొరపాటు చేసామని.  రెండేళ్ళు గడిచాయి. వంటరి తనంతో రాఘవరావు, పని ఎక్కువై , విశ్రాంతి లేక జానకమ్మ ఆరోగ్యం దెబ్బతింది. తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక కుమిలి పోతున్నారు వాళ్ళిద్దరూ.  ఈ మధ్యనే పరమేశం కూతురు దగ్గరకు వచ్చి రాఘవరావుని చూడటానికి రాజేష్ ఇంటికి వచ్చాడు.  ఆ సమయానికి రాజేష్ ,సుమిత్ర ఉద్యోగాలకు వెళ్ళారు.  పిల్లలు కాన్వెంట్ నుంచి ఇంకా రాలేదు.  రాఘవరావు, జానకమ్మలను చూసిఆశ్చర్య పోయాడు, ఆపై బాధ పడ్డాడు.


 “ఏమిటి రాఘవా ఇది?  ఇద్దరూ ఇలా అయి పోయారేమిటి? ఏమిటి అనారోగ్యం? డాక్టర్కి చూపించు కున్నారా?“ “ఆ ఏమీలెదు, కొద్దిపాటి నీరసం. అంతే.” అన్నాడు రాఘవరావు చిన్నగా నవ్వుతూ. ఆ నవ్వు సహజంగా లేకపోవడం గ్రహించాడు పరమేశం. ఈ లోగా పిల్లలు ఇద్దరూ వచ్చారు.  వాళ్లకు టిఫిన్ పెట్టి, పాలు ఇవ్వడం పనిలో మునిగిపోయింది జానకమ్మ.  ఒక పావుగంట ఉండి వెనుదిరిగాడు పరమేశం.  శివపురం వచ్చాకా సుబ్బారావు దగ్గర బాధపడ్డాడు పరమేశం. “మన రాఘవ పరిస్తితి ఏమీ బాగోలేదు.  ఇద్దరూ చిక్కి పోయారు.  కొడుకు వాళ్ళని

పట్టించుకోవడం లేదనిపిస్తోంది. ఇంటి బాధ్యత అంతా జానకమ్మ మీద పడింది.  చాలా శ్రమ పడుతున్నారు ఇద్దరూ. కాళ్ళూ, చేతులూ ఆడుతున్డగానే ఇలా ఉంటే, రేపు ఓపిక తగ్గిపోతే వాళ్ళ పరిస్తితి ఎంత దుర్భరమో అనిపిస్తోంది.”

కొద్దిసేపు మౌనం వహించాడు సుబ్బారావు.  తర్వాత పరమేశంతో చిన్నగా మాట్లాడాడు. ఆ మాటలకు పరమేశం చాలా సంతోషించాడు.

రెండు నెలలు గడిచాయి.  ఒకరోజు రాజేష్ ఇంటికి మిదున్, సాత్విక్ వచ్చారు.  “మేము శివపురంలో రాఘవరావు మాస్టారు దగ్గిర చదువుకున్నాము.  వచ్చే ఆదివారం మా స్కూల్ పూర్వ విద్యార్ధుల సమావేశం ఉంది.  ఆ రోజున మా గురువులు అందరినీ సన్మానించాలని నిర్ణయించాము. మాస్టారికి ఆహ్వానం పత్రిక ఇద్దామని వచ్చాం.” చెప్పాడు మిదున్.  నాన్నగారు పూజ చేసుకుంటున్నారు, కూర్చోమని చెప్పి లోపలకు వెళ్ళాడు రాజేష్. పదినిముషాలకు రాఘవరావు హాలులోకి వచ్చాడు.  మిదున్, సాత్విక్ లేచి రాఘవరావు కి నమస్కరించి, తాము వచ్చిన

పని చెప్పారు.  “నేను ఇక్కడ ఉన్నానని ఎవరు చెప్పారు?” అడిగాడు రాఘవరావు.

“పరమేశం గారు చెప్పారు సర్ . వచ్చే శనివారం ఉదయమే వచ్చి కారులో మిమ్మల్ని, మేడం గారిని తీసుకుని వెళ్లి, తిరిగి హైదరాబాద్లో దిగబెడతాం” వినయంగా చెప్పాడు మిదున్.  తప్పకుండా వస్తానని వాగ్దానం చేసాడు రాఘవరావు.

ఆరు రోజులు గడిచాకా శనివారం ఉదయమే మిదున్, సాత్విక్ ఇద్దరూ ఏ.సి. కారు తీసుకుని వచ్చి రాజేష్ అపార్ట్ మెంట్ కి వచ్చారు. ఫంక్షన్ అయ్యాకా వెంటనే వచ్చేయమని రాజేష్ , సుమిత్ర మరీ మరీ చెప్పారు.  అలాగే అని చెప్పి కారు ఎక్కారు రాఘవరావు, జానకమ్మ.  వాళ్ళు ఇద్దరికీ చాలా ఆనందంగా ఉంది.  శివపురంలో అందరిని కలవ వచ్చని, రెండోది ఆ జైలు నుంచి బయటకు వస్తున్నామని.  పరమేశం కూడా ఫోన్ చేసి చెప్పాడు’ రెండురోజులూ మా ఇంట్లోనే ఉండాలని’.  చిన్న పిల్లలు పండగకు తాత గారి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎంత హుషారుగా ఉంటారో, రాఘవరావు, జానకమ్మ కూడా అంత హుషారుగాను ఉన్నారు.  విజయవాడలో భోజనాలుచేసి, సాయంత్రానికి శివపురం చేరుకున్నారు నలుగురూ.  పరమేశం ,గిరిజ ఏంతో ఆదరంగా వాళ్ళని ఇంటిలోకి తీసుకువెళ్ళారు. మిదున్, సాత్విక్ వాళ్ళ ఇంటికి వెళ్లిపోయారు.  ఒక అరగంటకు సుబ్బారావు, పద్మలత వచ్చారు.  మిత్రులు అందరికీ భోజనాలు ఏర్పాటు చేసాడు పరమేశం.  మూడు జంటలూ కబుర్లు చెప్పుకుంటూ తృప్తిగా భోజనం చేసారు. మిత్రులు ముగ్గురి కళ్ళల్లో ఆనంద భాష్పాలు కదలాడాయి.  “నేను హైదరాబాద్ వెళ్ళాకా ఏం కోల్పోయానో ఇప్పుడు నాకు బోధపడింది” అన్నాడు రాఘవరావు.  మిత్రులు ఇద్దరూ ఆప్యాయంగా అతని భుజాల మీద చేతులు వేసారు.  ఆ రాత్రి రాఘవ రావు, జానకమ్మ చాలాసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. ఒక స్తిరమైన నిర్ణయానికి వచ్చారు ఇద్దరూ.  మర్నాడు ఉదయం శివపురం హైస్కూల్ లో జరిగిన పూర్వ విద్యార్ధుల సభ చాలా బాగా జరిగింది.  ముందుగా తమకు విద్య నేర్పిన గురువులు అందరికీ 

పాదాభివందనం చేసి, ఆ తర్వాత వేదిక మీదకు వెళ్ళారు. రాఘవరావు, మిగతా ఉపాధ్యాయులు కూడా వారి వినయానికి, సంస్కారానికి అబ్బురపడ్డారు.  అమెరికాలో, ఆస్ట్రేలియా, సింగపూర్ లలో ఉన్నవాళ్ళు కూడా సభకు వచ్చి తమ పాత మిత్రులు అందరినీ పేరు పేరునా పలకరించి మాట్లాడుకోవడం అందరినీ ఆకట్టుకుంది.  పూర్వ విద్యార్ధుల తరపున వరుణ్ మాట్లాడుతూ “ఈ సమావేశానికి మూలకారకులు మిదున్, సాత్విక్.   వాళ్ళిద్దరూ అమెరికాలో ఉన్నా అందరినీ కాంటాక్ట్  చేసి ఇక్కడికి రప్పించారు. వారికి సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.  మమ్మల్ని వృద్ధిలోకి తీసుకువచ్చిన మా గురువులు అందరికీ నా నమస్సులు.” అని అన్నాడు. తర్వాత గురువులు అందరికీ ఘనంగా సన్మానంచేసి, వెండి పళ్ళాలు కానుకగా ఇచ్చారు పూర్వ విద్యార్ధులు.  రాఘవరావు మాట్లాడుతూ, ”మిమ్మల్ని అందరినీ మా బిడ్డలుగా భావించే మేము మీకు చదువు చెప్పాం. అది గురువుగా మా బాధ్యత.  మీరు మన ఊరికి, మన స్కూలుకి  పేరు తెచ్చినట్టుగానే మన దేశానికి కూడా పేరు తీసుకురావాలి.  మీరు అందరూ పిల్లా, పాపలతో సుఖంగా ఉండాలి.  మీరు మాకు చేసిన సత్కారం, సరస్వతీదేవికి చేసిన సత్కారంగా నేను భావిస్తున్నాను” అని అన్నాడు. వెంటనే సభా ప్రాంగణం చప్పట్లతో మారుమోగింది.  చివరగా మిదున్ మాట్లాడుతూ” మన బాచ్ ఫ్రెండ్ స్నిగ్ధ డాక్టర్ గా తణుకులో ప్రాక్టీసు చేస్తోంది.  ప్రతి ఆదివారం శివపురం వచ్చి వృద్ధులైన మన గురువులకి వైద్య సహాయం అందిస్తానని వాగ్దానం చేసింది.  ఆమెకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీ అందరికీ ఒక విశేషం చూపిస్తాను రండి” అని అన్నాడు.

అందరూ నడుచుకుంటూ టీచర్స్ కాలనీకి వచ్చారు.  రాఘవరావు ఇంటిముందు ఆగాడు మిదున్.  రాఘవరావు ఆశ్చర్యానికి అంతులేదు.  తను అమ్మేసిన ఇంటికి రంగులు వేసి ఉన్నాయి.  గురువు గారికి స్వాగతం అని బోర్డు ఉంది. మిదున్, రాఘవరావు చేయి

పట్టుకుని లోపలకు తీసుకువచ్చాడు.  “మాస్టారు, మీ ఇల్లు మీకు అప్పచెబుతున్నాం. మీరు, అమ్మగారు హాయిగా ఇందులో ఉండండి.  షావుకారు దగ్గరనుండి మేము దీన్ని కొన్నాం. చాలా కాలంక్రితమే పరమేశం గారు నాకు, మీరు ఎంత బెంగగా, దిగులుగా ఉన్నారో చెప్పారు. మేము ఈ రోజు ఇలా విదేశాలలో ఉంటూ లక్షలూ, కోట్లు సంపాదిస్తున్నామంటే దానికి

మూలం మీరు పెట్టిన జ్ఞాన భిక్షే. మీకు గురుదక్షిణ చెల్లించుకోవాలనే నేనూ, నా మిత్రులు కలిసి ఈ ఇంటిని కొన్నాం.  మీ స్నేహితులు అందరూ ఇక్కడే ఉన్నారు.  మీ

ఆరోగ్య పరిరక్షణకు డాక్టర్ స్నిగ్ధ ఉంది.  మన వూరి నుండి తణుకు పది నిముషాల ప్రయాణం.  మీరు ఆనందంగా ఉండడమే మా అందరి కోరిక.  కాదనకండి.” అని రాఘవరావు రెండు చేతులూ పట్టుకున్నాడు.  కళ్ళమ్మట ఆనందభాష్పాలు కారుతుండగా రాఘవరావు, మిదున్ ని దగ్గరకు

తీసుకుని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాడు.  వెంటనే ఇంట్లోకి వెళ్లి, ప్రతిగుమ్మాన్ని తడిమి తడిమి చూసుకుని మురిసిపోయాడు. దొడ్లోకి వచ్చి, మామిడిచెట్టు కింద ఉన్న చప్టా మీద కూర్చున్నాడు. లేచి ప్రతి చెట్టుని ముట్టుకుని పరవశించి పోయాడు.  తల్లి దగ్గర నుండి తప్పిపోయిన ఆవుదూడ , చాలాసేపటికి తన తల్లి కనపడగానే ఆనందంతో ఎలా గంతులు వేస్తుందో అలా ఉంది రాఘవరావు మనసు.  ఐదు నిముషాలు గడిచాక పూర్వ విద్యార్ధులు అందరూ రాఘవరావు దగ్గర శెలవు తీసుకుని వెళ్ళిపోయారు. రాఘవరావు, మిత్రబృందం మిగిలారు.  పరమేశం, సుబ్బారావు ల చేతులు పట్టుకుని  ‘మీ ఋణం ఎలా తీర్చుకోను’ అన్నాడు రాఘవరావు బరువెక్కిన హృదయంతో.

“రోజూ మనం కలుసుకుని ఆనందంగా మాట్లాడుకోవడమే” అన్నాడు సుబ్బారావు నవ్వుతూ.

ఇన్ని రోజులకు భర్త మొహంలో వెలుగు చూసి ఆనందించింది జానకమ్మ.  ఆమె మనసు ప్రశాంత గోదావరిలా ఉంది.


""పైసజారనీకు ప్రాణమున్నంతకు

పైసపోయెనేని ప్రాణమాగు

పైసలోనగలదు పరమార్ధమంతయు,

పైసెయిలనువెలసె ప్రాణమగుచు!!


అదీ కథలోని నీతి!

 విశ్రాంతజీవులందరూ,

తస్మాత్ జాగ్రత....


మీ కంటు చివరి వరకు ఒక ఇల్లు ఉండడానికి ఉంచు కొండి. మీరు మీకు ఇష్టమైన జీవితాన్ని జీవించవచ్చు... చివరి దశలో మిమ్మల్నీ ఒక పనిమనుషులు గా మీ పిల్లలు వాడు కొంటారు. విదేశాలకు వెళ్లి 6నెలలు పిల్లలకు మనవళ్లు మనవరాళ్లకు ఊడిగం చేసి రావాల్సి వస్తది.... ఎందుకంటే విదేశాల్లో పనిమనుషులు దొరకరు ఒకవేళ దొరికిన వాళ్లు చాలా కాస్ట్లీ... ఫ్రీ గా వచ్చేది అమ్మ నాన్న లు,అత్త మామలు... ఆర్నెల్ల ముందు ఫైట్ బుక్ చేసుకుంటే చాలా చౌకగా పడతాది.. 6 నెలలు వాడుకున్నంత వాడుకోవచ్చు.. ముఖ్యంగా తల్లులకు ఎక్కువ పని. అందరూ పిల్లలు అలా లేరు కొందరు మాత్రమే...? సీనియర్ సిటిజన్స్ చివరి రోజుల్లో స్వేచ్ఛగా ఆనందంగా హ్యాపీగా బతకండి...

సేకరణ:

🙏🙏🙏🙏🙏🙏🙏🙏

చితి - చింత

 శ్లోకం:☝

*చితా చింతా సమాహ్యుక్తా*

   *బిందుమాత్ర విశేషతః |*

*సజీవం దహతే చింతా*

   *నిర్జీవం దహతే చితా ||*


భావం: చితి - చింత అనే పదాలు రెండూ సమానాలే! ఒక సున్న మాత్రమే తేడా రెండింటికి. తగులబెట్టటంలో కూడా ఎక్కువ తేడా లేదు. చితి నిర్జీవులని మాత్రమే తగులబెడుతుంది. కానీ చింత సజీవంగా ఉన్నవారిని తగులబెడుతుంది! దీనిబట్టి చింతతో పోల్చి చూస్తే చితి అంత అమంగళకరమైన పదమేమి కాదు! అని భావం.