15, జూన్ 2024, శనివారం

సమస్య పూరణ.

 *అతివలc గాంచినన్ విముఖుcడై చనువాcడనగా రసజ్ఞుడౌ*

ఈ సమస్యకు నాపూరణ. 



సతతము ధ్యాన యోగములు సాధన చేసెడి పుత్రుడున్ యథో


చితముగ తల్లి దండ్రులకు సేవలు చేసెడి శ్రావణాఖ్యుడున్


అతివలc గాంచినన్ విముఖుcడై చనువాcడనగా - రసజ్ఞుడౌ


హితుడును కావ్యకన్యకకు హేమవిభూషణ లిచ్చు మెచ్చుచున్.


అల్వాల లక్ష్మణ మూర్తి

దశ పాప హర దశమి

 గంగా జయంతి  సందర్భంగా తెలియజేయుచున్న విషయము,రేపు అనగా 16-6-24, న గంగా జయంతి కావున,ఈరోజు ను దశ పాప హర దశమి అని అంటారు, గంగా గంగా అని  తలుచుకుంటే గంగా స్నాన ఫలితం వస్తుందంటారు. కాబట్టి గంగా జయంతి రోజు న గంగాదేవి 12 నామాలు చెప్పే శ్లోకం పటించి, స్నానం చేస్తే ఆ శ్లోకంలో చెప్పిన విధంగా, మహాపాతక నాశన ఫలితం  కలుగుతుందని ఆశిద్దాం, శ్లోకం : నందినీ నళినీ సీత మాలినీ చ మహాఫగా విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపధగామిని భాగీరధి భోగవతి జాహ్నవీ త్రిదశయేశ్వరీ,ద్వాద శైతాని నామాని యత్ర ,యత్ర జలాశ యే, స్నానకాలే పఠేేనిత్యం, మహాపాతకనాశని.   శుభం భూయాత్. గ౦గ నదీ జలములు కలిగియున్న వారు ఆ జలముల తో స్నానముచేసిన ఇ౦కా మంచిది. 🙏🙏🙏🙏

రామాయణం యుద్ధకాండ 23/37*

 

*రామాయణం యుద్ధకాండ 23/37*


        ‌ రాముడిని చూసిన కుంభకర్ణుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొని పరుగు పరుగున ఆయన వైపు వస్తున్నాడు. అప్పుడు రాముడు వాడి వక్షస్థలంలోకి బాణములతో కొట్టాడు. ఆ బాణములు తగిలి రక్తం బాగా కారింది, కాని ఆ కుంభకర్ణుడు ఇంకా వ్యగ్రతని పొంది రాముడి మీదకి వస్తున్నాడు. ఇంక వీడిని నిగ్రహించకపోతే కష్టమని రాముడు భావించి, తీవ్రమైన ములుకులు కలిగిన బాణములని ప్రయోగించాడు. ఆ బాణములు ఆ కుంభకర్ణుడి వక్షస్థలంలో తగిలి వాడి చేతిలో ఉన్న ఆయుధములు జారిపోయి, కళ్ళు తిరిగినంత పనయ్యింది. తరువాత రాముడు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ కుంభకర్ణుడి కుడి చెయ్యి నరికేశాడు. ఆ చెయ్యి కిందపడినప్పుడు దాని కింద కొన్ని వేల వానరాలు పడి చనిపోయాయి. అప్పుడా కుంభకర్ణుడు తన ఎడమ చేతితో ఒక చెట్టుని పట్టుకుని రాముడి మీదకి వచ్చాడు, అప్పుడు రాముడు ఐంద్రాస్త్రంతో వాడి ఎడమ చేతిని భుజం వరకూ నరికేశాడు. 


రెండు చేతులు పోయినా ఆ కుంభకర్ణుడు తన పాదాలతో వానరాలని తొక్కడం ప్రారంభించాడు. అప్పుడు రాముడు రెండు అర్ధచంద్రాకార బాణములతో వాడి రెండు తొడలని నరికేశాడు. తరువాత వాడి శిరస్సుని ఖండించారు. అప్పుడు వాడి శరీరంలో సగభాగం సముద్రంలో పడిపోయింది, మిగిలిన సగభాగం లంకా ద్వారం వరకూ పడిపోయింది. 


కుంభకర్ణుడు చనిపోయాడన్న వార్త విన్న రావణుడు ఏడుస్తూ " అయ్యయ్యో, నిద్రపోతున్నవాడిని లేపి నిష్కారణంగా యుద్ధానికి పంపాను. ఎవడు యముడిని, ఇంద్రుడిని ఓడించాడో అటువంటి నా తమ్ముడు ఇవ్వాళ రాముడి చేతిలో నిహతుడయిపోయాడు. నేను కుంభకర్ణుడిని పంపకపోయినా బాగుండేది. రాముడి ముందు నువ్వు కాదు, కుంభకర్ణుడు కాదు, మహోదర, మహాపార్ష, ప్రహస్తులు ఎవ్వరూ నిలబడలేరని నా తమ్ముడు విభీషణుడు చెప్పాడు. ధర్మాత్ముడైన విభీషణుడిని అవమానించి వెళ్ళగొట్టాను. ఇప్పుడు కుంభకర్ణుడు మరణించాడు, నా కుడి భుజం ఇవ్వాళ విరిగిపోయింది " అని కిందపడి ఏడుస్తుంటే, రావణుడి యొక్క కుమారులు, కుంభకర్ణుడి యొక్క కుమారులు అక్కడికి వచ్చారు. 


వాళ్ళన్నారు " నాన్నగారు! మీరు అంత బాధ పడకండి. మేము యుద్ధంలోకి వెళ్ళి మీరు కోరుకున్నట్టుగా రామలక్ష్మణులని నిగ్రహించి వస్తాము " అన్నారు.


అప్పుడు రావణుడు " ఇప్పటికయినా నా కోరిక తీర్చండి " అన్నాడు.


అప్పుడు యుద్ధరంగంలోకి రావణుడి కుమారుడైన నరాంతకుడు వచ్చి చాలా భయంకరమైన యుద్ధం చేశాడు. అంగదుడు తన పిడికిలిని బిగించి ఆ నరాంతకుడి తల మీద ఒక దెబ్బ కొట్టేసరికి, వాడు తల పగిలి చనిపోయాడు. తదనంతరం మహోదరుడిని నీలుడు సంహరించాడు. దేవాంతకుడిని, త్రిశిరుడిని (మూడు తలకాయలతో ఉంటాడు) హనుమంతుడు సంహరించాడు. ఉన్మత్తుడిని గవాక్షుడు సంహరించాడు.   


ఆ తరువాత అతికాయుడు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు రాముడు " విభీషణ! అంత పెద్ద శరీరంతో ఉన్నాడు, అసలు వాడెవడు " అని అడిగాడు. 


అప్పుడు విభీషణుడు " ఆయన సామాన్యుడు కాదు. ఆయన వేదం చదువుకున్నాడు, బ్రహ్మగారి దెగ్గర వరాలు పొందాడు. ఆయన కవచాన్ని ఎటువంటి బాణం పెట్టి కొట్టినా అది పగలదు. అందుచేత అతనిని నిహతుడిని చెయ్యడం చాలా కష్టం " అన్నాడు.


ఆ అతికాయుడు యుద్ధంలో చాలా మందిని నెత్తురు కారేటట్టు కొట్టాడు, ఎందరినో నిగ్రహించాడు. అప్పుడు లక్ష్మణుడు ఆ అతికాయుడితో యుద్ధం చెయ్యబోతుంటే వాడన్నాడు " లక్ష్మణా! నువ్వు పిల్లవాడివి, నీతో నాకు యుద్ధం ఏమిటి. నేను అతికాయుడిని, చిన్న చిన్న వాళ్ళతో నేను యుద్ధం చెయ్యను, అలా చెయ్యడం నాకు అసహ్యం. నన్ను ఎదిరించి నిలబడగలిగిన నా స్థాయివాడు ఎవడన్నా ఉన్నాడా వానర సైన్యంలో " అన్నాడు.


అప్పుడు లక్ష్మణుడు " ఈ డాబులెందుకురా, నాతో యుద్ధం చెయ్యి " అన్నాడు. 


అతికాయుడన్నాడు " పిల్లవాడివి, అగ్నిహోత్రాన్ని ఎందుకు పైకి లేపుతావు, నిద్రపోతున్న సింహాన్ని ఎందుకు లేపుతావు. ఆ తరువాత నీ శరీరం పడిపోయాక బాధ పడతావు. వెళ్ళి రాముడిని పిలువు " అన్నాడు.


అప్పుడు లక్ష్మణుడు " నీ బతుక్కి రాముడు కావాలేంటి, నీకు నేను సమాధానం చెబుతాను " అని అర్ధచంద్రాకార బాణాలని అతికాయుడి మీదకి ప్రయోగించాడు. ఆ బాణాలు తగిలాక వాడన్నాడు " అబ్బో నీతో యుద్ధం చెయ్యవలసిందే " అని ఐంద్రాస్త్రం, వాయువ్యాస్త్రం మొదలైన ఎన్నో అస్త్రాలని లక్ష్మణుడి మీద ప్రయోగించాడు. ఆ అస్త్రములన్నిటికి లక్ష్మణుడు ప్రతిక్రియ చేశాడు. లక్ష్మణుడు ఎన్ని బాణములను ప్రయోగించినా, ఎన్ని అస్త్రములను ప్రయోగించినా, అన్నీ వాడి యొక్క కవచానికి తగిలి పడిపోతున్నాయి. 


ఆ సమయంలో వాయుదేవుడు వచ్చి లక్ష్మణుడితో " వాడికి బ్రహ్మగారు ఇచ్చిన వరం ఆ కవచం. వాడు ఆ కవచం పెట్టుకుని ఉన్నంతసేపు ఎవరు ఏది పెట్టి కొట్టినా ఆ కవచం పగలదు. బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే వాడి కవచం పగులుతుంది " అన్నాడు.


అప్పుడు లక్ష్మణుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి ఆ అతికాయుడిని సంహరించాడు. 


అతికాయుడు మరణించాడన్న వార్త విని రావణుడు క్రుద్ధుడై, సామాన్యమైన వారిని పంపిస్తే వీలులేదని మళ్ళి ఇంద్రజిత్ ని పిలిచి " నువ్వు యుద్ధానికి వెళ్ళవలసిన సమయం ఆసన్నమయ్యింది " అన్నాడు.


అప్పుడా ఇంద్రజిత్ 4 గుర్రములు పూన్చిన రథం ఎక్కి అనేకమంది సైన్యంతో యుద్ధ భూమిలోకి ప్రవేశించాడు. ఆయన చుట్టూ సైన్యం మొహరించి ఉంది, కాని ఇంద్రజిత్ మాత్రం కొంతసేపు ఎవరికీ కనపడలేదు.(ఆ సమయంలో చుట్టూ మోహరించిన సైన్యం మధ్యలో ఉన్న ఇంద్రజిత్ సమిధలు, పుష్ప మాలికలు, ఎర్రటి వస్త్రాలతో అగ్నిహోత్రంలో హోమం చేస్తాడు. ఆ హోమం చేశాక ఆ హోమాగ్ని సుడులు తిరుగుతూ పైకిలేస్తుంది, అప్పుడు ఒక నల్ల మేకని పట్టుకొచ్చి తన పళ్ళతో దాని కంఠాన్ని కొరికి, మెడ చీల్చి, ఆ మేక మాంసాన్ని ఆ హోమాగ్నిలో వేస్తాడు {వీటిని ఆభిచారిక హోమాలు అంటారు, ఇవి చాలా ప్రమాదకరమైనవి}. అప్పుడా పుష్పాలని, అక్షతలని తన ఆయుధముల మీద వేసి, ఎర్రటి వస్త్రాలు కట్టుకొని, రథం ఎక్కి మాయమయిపోతాడు, ఇంక ఎవరికీ కనపడడు. ఆ ఇంద్రజిత్ గుర్రాల చప్పుడు కాని, వాడి ధనుస్సు యొక్క శబ్దము కాని, వాడి బాణ ప్రయోగం కాని ఎవరికీ వినపడదు, అర్ధం కాదు. ఆయనకి అందరూ కనపడతారు, కాని ఆయన ఎవరికీ కనపడడు. ఒక్క విభీషణుడు మాత్రమే ఆయనని మాయా బలంతో చూడగలడు)


హోమాన్ని పూర్తి చేసిన ఇంద్రజిత్ రథం ఎక్కేటప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారికి నమస్కారం చేసి, బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి ఆవాహన చేసుకున్నాడు. ఆయన రథం ఎక్కగానే ఆ రథం ఎవ్వరికీ కనపడలేదు, అప్పుడాయన ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. మేఘాల మధ్యకి వెళ్ళిన ఇంద్రజిత్ దిక్కులని, విదిక్కులని మంచుతొ కప్పేసి, ధనుష్టంకారం కూడా వినపడకుండా కొన్ని వేల బాణాలను ప్రయోగం చేసి హనుమంతుడిని, సుగ్రీవుడిని, ద్వివిదుడిని, మైందుడిని, అంగదుడిని, గంధమాదనుడిని, జాంబవంతుడిని, సుషేణుడిని, వేగదర్సిని, నీలుడిని, గావాక్షుడిని, కేసరిని మొదలైన అనేకమంది వానర వీరులని తన బాణములతో కొట్టి భూమి మీద పడేశాడు. అన్ని కోట్ల వానర సైన్యాన్ని బ్రహ్మాస్త్రం చేత కట్టి పడేశాడు. 


అప్పుడు వాడు పైనుంచి ఒక పెద్ద నవ్వు నవ్వి రామలక్ష్మణులతో అన్నాడు " ఒకసారి నాగ పాశాలతో మిమ్మల్ని కట్టాను, కాని మీరు విడిపించుకున్నారు. ఇవ్వాళ బ్రహ్మాస్త్రంతో మిమ్మల్ని కట్టేస్తాను, ఇవ్వాల్టితో యుద్ధం అయిపోతుంది " అన్నాడు.


అప్పుడు రాముడు లక్ష్మణుడితో " లక్ష్మణా! ఇవ్వాళ మనకి వేరొక దారిలేదు. వాడు బ్రహ్మగారికి చెందిన బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించి కొడుతున్నాడు, ఆ బ్రహ్మాస్త్ర బంధనం చేత మొత్తం వానర సైన్యం పడిపోయింది. ఎదురుగా ఉన్న వీరుడైతే మనం కొట్టచ్చు, కాని వాడు మాయా యుద్ధం చేస్తున్నాడు, కనుక మనం వాడిని కొట్టలేము. అందుచేత వాడు కొడుతున్న బాణ పరంపరకి ఓర్చుకున్నంతసేపు ఓర్చుకో, తరువాత స్పృహతప్పినవాడు పడిపోయినట్టు రణభూమిలో పడిపో. అప్పుడు వాడు ఎన్ని బాణములు కొట్టాలో అన్ని బాణములతో మన శరీరాలని కొడతాడు. అలా కొట్టేశాక శత్రువు మరణించాడనుకొని, జయలక్ష్మిని పొందాననుకొని వాడు అంతఃపురంలోకి వెళ్ళిపోతాడు. ఆ తరువాత బతికుంటే చూద్దాము. ముందు వాడిని కొట్టెయ్యని " అన్నాడు.


 ....మిగతా రేపు.....

    సర్వం శ్రీపరమేశ్వరార్పణమస్తు. 

శైలజావాస్తుజ్యోతిషాలయము. 9059743812

14, జూన్ 2024, శుక్రవారం

అప్సరసల పేర్లు↓

 #↓


ఏడుగురు అప్సరసల పేర్లు↓

1) రంభ. 2) ఉర్వశి 3) మేనక  4) తిలోత్తమ 5) సుకేశి 6) ఘృతాచి 7) మంజుగోష.


సప్త సంతానములు↓ అంటే

1) తటాక నిర్మాణం 2) ధన నిక్షేపం 3) అగ్రహార ప్రతిష్ట 4) దేవాలయ ప్రతిష్ట 5) ప్రభంధ రచన 6) స్వసంతానం (పుత్రుడు).

 

తొమ్మిది రకాల ఆత్మలు↓

1) జీవాత్మ 2) అంతరాత్మ 3) పరమాత్మ  4) నిర్మలాత్మ 5) శుద్దాత్మ 6) జ్ఞానత్మ  7) మహాధాత్మ  8) భూతాత్మ  9) సకలాత్మ.


(దశవిధ క్షీరాలు) పదిరకాల పాలు↓

1) చనుబాలు 2) ఆవుపాలు 3) బర్రెపాలు 4) గొర్రె పాలు 5) మేక పాలు 6) గుర్రం పాలు 7) గాడిద పాలు 8) ఒంటె పాలు 9) ఏనుగు పాలు 10. లేడి పాలు.


ముందు ముందు ఇంకొంత తెలుసుకుందాం...

సర్వే సుజనాః సుఖినోభవంతు👐

విప్రతేజం✍️నిత్య పితృయజ్ఞ సంకల్ప సిద్ధులు,


ద్వాపరయుగం 🐚* 🔔 *కలియుగం*

 🌹🌷🪷🛕🪷🌷🌹


    *🪈ద్వాపరయుగం 🐚*

      🔔 *కలియుగం* 🔔

*************************

*ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు*


 *శ్రీ కృష్ణుడు బలరాముడితో “అవతార పరిసమాప్తి జరిగిపోతుంది.  మీరు తొందరగా ద్వారకా నగరమును విడిచి పెట్టెయ్యండి” అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు.*


*ఇతడు శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు.*


*ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి “కృష్ణా! మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడుకున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేక పోతున్నాను. నిన్ను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి” అన్నాడు.*


*అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమయిన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు.*


*ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం.*


*దీని తర్వాత  కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు.*


*“ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది.*


*కలియుగం ప్రవేశించగానే మనుష్యులయందు రెండు లక్షణములు బయలు దేరతాయి. ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం.*


*ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు.*


*కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించుకుంటారు. కోపము చేతను, అపారమయిన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి.*


*కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదము ప్రమాణము కాదు. కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు.*


*అల్పాయుర్దాయంతో జీవిస్తారు. రాజ యోగం చేయడం మరచి పోతారు. తద్వారా బ్రహ్మ యోగం అనబడే క్రియా యోగం లేదా నేనున్నా స్థితికి చేర్చే లయ యోగం ఒకటి ఉందనేది తెలుసుకోరే ప్రయత్నం చేయరు. ఆడంబరాలకు ప్రాధాన్యతనిస్తారు. ఉపవాసములు తమ మనసును సంస్కరించుకోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు.*


*ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతశ్శుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు.*


*మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసుకోలేకపోతారు.*


*ఇంద్రియములకు వశులు అయిపోతారు.⁠⁠⁠⁠ రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు.*


*ఎవడికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు.*


*కలియుగంలో ఏ రకంగా ఆర్జించాడన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించాడన్నది ప్రధానం అవుతుంది.*


*ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహా పురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి.*


*కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ, అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములలో కాలు పెట్టాలి. అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి.*


*కానీ అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు.*


*కాబట్టి నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. యింద్రియముల చేత ఏది సుఖమును యిస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో. దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు? వెళ్ళిపో!*


*కలియుగంలో గాని ఏ యుగంలోగాని నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో. ధ్యానం చేయడం విడిచిపెట్టకు. నీదారి శ్వాస దారి కావాలి. శ్వాస దారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి శ్వాస క్రియ లోనూ నేను వున్నాను. వుంటాను. ఇది విశ్వసించు ఉద్ధవా! ప్రయత్న పూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము ధ్యానం, యింద్రియ నిగ్రహము, చేయుట , నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు.*


*ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివ్వరి సందేశం...*


*ఈ సందేశం ఉద్ధవుడికే అనుకుంటే పొరపాటు. ఇది మనందరికోసం పరమాత్మ చెప్పిన సత్యం.*


    🌹🙏🙏🪷🙏🙏🌹

*సేకరించినది భాగస్వామ్యం* 

            చేస్తున్నాను 

*న్యాయపతి నరసింహారావు*

శ్రీవారి ధ్వజస్తంభం

 🙏🪷🙏🪷🙏

తిరుమల లో శ్రీవారి ధ్వజస్తంభం వెనుక ఉన్న కథ మీకు తెలుసా?

🛕🛕🛕🛕🛕

కర్ణాటక దండేలీ అడవుల్నుంచి 75 అడుగుల

పొడవున్న 6 టేకుమానులు తీసుకుని 16 చక్రాల

ట్రాలీ బయలుదేరింది. ఇంత భారీ వాహనం 

చేరాల్సిన గమ్యం 430 కిలోమీటర్లు!డ్రైవర్ 

రెండు చేతులూ జోడించి దేవుని ప్రార్ధించాడు.

వందల కంఠాలు"గోవిందా! గోవిందా!" 

అంటూ ప్రతిధ్వనించాయి. అతన్ని ఏ శక్తి 

నడిపిందో మరుసటిరోజు సాయంత్రానికి 

గమ్యానికి చేరువలో అలిపిరి వద్దకు ఆ ట్రాలీ 

చేరుకుంది. డ్రైవర్ దిగి కొండవేపు చూశాడు.

కలియుగ దైవం వేంచేసివున్న సప్తగిరి. 

చుట్టూ చూశాడు. వేలాది యువతులు 

హారతులిచ్చి, గోవిందా, గోవిందా అంటూ 

తన్మయులైనారు.


అక్కడే ఉన్న టి.టి.డి.చైర్మన్ నాగిరెడ్డిగారికి,

ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ పివిఆర్కే ప్రసాద్ గారికి

నమస్కరించి" ఘాట్ రోడ్డు 18 కిలోమీటర్లు,

ఏడు ఎనిమిది క్లిష్ఠమైన మలుపులున్నాయి.

ఇది నా జీవితంలోనే గొప్ప సాహసం.

ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రక్కును ఆపకుండా కొండ

మీదకు తీసుకుపోతాను. మధ్యలో పిట్టగోడలు

దెబ్బతినొచ్చు,అంచులు తగిలి బండరాళ్లు

దొర్లిపడవచ్చు,మీరు హామీ ఇస్తే పైకి చేర్చి 

తీరుతాను అన్నాడు" వారు డ్రైవరుతో

పైకి చేర్చే బాధ్యత నీది.మిగిలిన బాధ్యతలు మావి

అని అభయం ఇచ్చారు. వాహనాల రాకపోకలను,

పాత ఘాట్ రోడ్డుకు మళ్లించారు. ట్రక్కు 

బయలుదేరింది.వెనుకే వాహనాల్లో అందరూ

బయలుదేరారు. ఒక్కో మలుపు తిరుగుతుంటే

మానులు తగిలి, బండలు ఊడిపడ్డాయి.

పిట్టగోడలు కూలిపడ్డాయి. ట్రాలీ లోయలో పడిపోతుందేమో

అని వెనుక వారికి భీతి కలిగేది.

ఇలా గుండెలు ఉగ్గబట్టుకుని, ఫీట్లు చేసుకుంటూ 

సంభ్రమాశ్చర్యాల మధ్య 55 నిమిషాల్లో..

సూర్యాస్తమయం లోగా

ట్రాలీ తిరుమల చేరిపోయింది. 

వేలాది భక్తుల ఆనందోత్సాహాలతో

గోవిందా..గోవిందా..నామస్మరణతో 

తిరుమల కొండ ప్రతిధ్వనించింది!

☘స్వామి వారి ధ్వజస్తంభం కోసం 

దండేలీ అడవుల్లోపుట్టి 300 ఏళ్ల వయసున్న 

ఈ 6 టేకుమానులు స్వామి వద్దకు 

క్షేమంగా చేరుకున్నాయి👌


🍀ఏమిటీ ధ్వజస్తంభం కథ?


నాగిరెడ్డిగారు మర్రి చెన్నారెడ్డి ఆదేశాల మేరకు 

టిటిడి చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు. 

తిరుమలలో అనేక మరమ్మత్తులు చేపట్టారు. 

అందులో భాగంగానే ధ్వజస్థంభానికి బంగారు 

తాపడానికి పాలిష్ చేయడం.

నాగిరెడ్డి గారికి తోడుగా సమర్ధుడైన 

ఐ.ఏ.ఎస్ అధికారి పి.వి.ఆర్.కె.ప్రసాద్ గారు 

ఎక్జిక్యూటివ్ ఆఫీసరుగా వున్నారు.

ఈ పనులన్నీ ప్రసాద్ గారు చిత్తశుద్ధితో చేసేవారు!

అప్పటి ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ వెంకటరామయ్య!

ఇలా ధ్వజస్తంభం చుట్టూ వున్న నాలుగు వరుసల

గోల్డ్ ప్లేట్లు విప్పి పాలిష్ చేసే సమయంలో 

అసలు విషయం బయటపడింది. 

ధ్వజస్తంభాన్ని టేకుతో చేస్తారు. చూస్తే 

ఆ మానంతా పుచ్చిపోయివుంది. భూమిలో 

ఉండాల్సిన భాగం అసలే కనిపించడం లేదు? 

మరి ఏ ఆధారంతో ధ్వజస్తంభం నిలిచిఉంది? 

కేవలం ఆ బంగారు ప్లేట్ల ఆధారంతో అది ఉంది. 

రేపో మాపో అది కూలిపోవచ్చు!

మరి ఇప్పుడేం చేయాలి? ఏం చేయాలి?

వేరే వారైతే దాన్ని తాత్కాలికంగా ఏదో 

చేసేయ్యండి. 75 అడుగుల టేకుమానులు 

బజారులో దొరకవు అని సర్దుబాటు చేసేవారు! 

కానీ ఇక్కడ ఉన్నది..నాగిరెడ్డి, పివిఆర్కే ప్రసాద్! 

స్వామి వారి సేవలో అచంచల భక్తి వున్నవారు.

స్వామివారికి, ఆయన భక్తులకు ఏ చిన్న లోపం 

జరిగినా ఆ పాపం తమదే అని విశ్వసించే వారు.

అందుకే "ధ్వజస్తంభాన్ని పునర్మిద్దాం" 

అని ప్రకటించారు👌

ప్రకటించారు సరే..అసలు కథ ఇప్పుడే మొదలైంది!


🛑ధ్వజస్తంభం వాడే మానుకి ఆగమశాస్త్రం 

ప్రకారం నిర్ణీత లక్షణాలు ఉండాలి.! 


ఆ మానుకి,ఎలాంటి తొర్రలు,పగుళ్లు,వంకలు,

కొమ్మలు ఉండకూడదు.75 అడుగుల ఎత్తున్న 

ఒకే మాను కావాలి. వందేళ్లకు పైగా మన్నిక

కల్గిన టేకు చెట్టు అయివుండాలి. 


ఎక్కడ? ఎక్కడ?


ఈ లక్షణాలున్న చెట్లు దొరుకుతాయి?

☘పాత మాను గురించి తెలుసుకుంటే 

దొరుకుతుంది అని 190 సంవత్సరాల 

రికార్డులన్నీ పరిశీలిస్తే..

ఎక్కడా ఈ ధ్వజస్తంభం ప్రస్తావన లేదు. 

మరో వేపు నాగిరెడ్డిగారు, ప్రసాద్ గారు ఇద్దరి 

నియామకాల గడువు పూర్తి కానున్న తరుణం. 

ఈ కొద్ది రోజుల్లో మనం..... 

ఇది చేయగలమా????ప్రశ్నలు???


🍀ఆ సమయంలో బెంగుళూరు నుండి వచ్చిన

ఓ భక్తుడు వారిని కలిసి" అయ్యా! మీరు 

ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నట్లు 

రేడియోలో విన్నాను. అటువంటి మానులు 

కర్ణాటక దండేలీ అడవుల్లో ఉన్నాయి. 

మీరు అనుమతిస్తే నేను ఆ పనిచేసి పెడతాను!

వారంలోగా ఆ భక్తుడు వంద చెట్లను పరిశీలించి,

అందులో నిర్ణీత ప్రమాణాలకు అనుకూలంగా 

ఆరు చెట్లను ఎంపిక చేశారు.అదే వారంలో 

కర్ణాటక ముఖ్యమంత్రి గుండూరావుగారు 

కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి 

వచ్చారు..ఆయన ముందు ఈ ప్రతిపాదన ఉంచారు.

ఆయన ఆనందంగా మహద్భాగ్యం అన్నారు.

ధ్వజస్థంభానికి ఒక్కమాను సరిపోతుంది. అయినా 

ముందు జాగ్రత్తగా 6 చెట్లనూ తీసుకున్నారు. 

సమస్య అక్కడితో అయిపోలేదు.

దట్టమైన అడవిలో, కొండ వాలులో ఉన్న వీటిని 

మొదటికంటా తీయించి 8 కిలోమీటర్ల కిందికి 

తీసుకు రావడం చిన్న పనికాదు. రోడ్డు నిర్మించే

బాధ్యత చీఫ్ కన్జర్వేటర్ తీసుకుంటే..

సోమానీ పేపర్ మిల్లు వారు ఈ భాగ్యం

మాకు ప్రసాదించండి అని..దుంగల్ని 

క్రేన్ల సహాయంతో రోడ్డు వరకూ చేర్చారు. 

ట్రాలీకి 70,000 రూపాయల అద్దె! ట్రాలీ

బయలుదేరింది. ఎటువంటి ఆటంకాలు 

లేకుండా తిరుమల చేరుకుంది!

1982 జూన్ 10వ తేదీన 

ధ్వజస్థంభాన్ని ప్రతిష్టించారు!


🍁ఉత్సవం చివరన నాగిరెడ్డిగారు ట్రైలర్ 

యజమానికి 70 వేల రూపాయల చెక్కును 

అందించారు! యజమాని.. 

"స్వామివారి సేవకు నాకు బాడుగా? 5 రోజులు 

ఆయనతో వున్న నేను కదా చెల్లించాలి!" 

అని దానిని తిరస్కరించారు!

డ్రైవరును స్వామివారి సమక్షంలో సత్కరించారు.

స్వామి వారి సన్నిధిలో నాగిరెడ్డి, పివిఆర్కె ప్రసాద్, 

ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ వెంకట్రామయ్యను

సత్కరించి, ఆయన చేతిలో ఓ కవర్ ఉంచారు!

అది విప్పి చూసిన వెంకట్రామయ్య కళ్ళలో 

కన్నీళ్లు.. ఏడేళ్లుగా ఎదురు చూస్తున్న తన 

ప్రమోషన్ ఆర్డర్ అది! ఇలా..స్వామివారి 

సన్నిధిలో.. ఎందరికి ప్రాప్తం?..అనుకుంటూ..

ఆయన రెండు చేతులూ జోడించి 

ఆనందడోలికల్లో మునిగిపోయారు!

🙏🔵🙏🔵🙏

గురువార్పణం

 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏


*గురువార్పణం**🙏


ఒక పేద,అమాయకపు *గురు** భక్తురాలు ఒక గ్రామంలో ఉండేది. గోక్షీరాన్ని, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముకొంటూ జీవనాన్ని సాగించేది. ఆమె ఎక్కడ విన్నదో ఎవరన్నారో గానీ గురువార్పణం అన్న మాట విన్నది... అదేదో మంత్రమనుకొని ప్రతి విషయానికీ గురువార్పణం మనడం మొదలుపెట్టింది.


ఆ పదమెంతగా అలవాటయ్యిందంటే నిద్ర లేవగానే గురువార్పణం, పడుకొనే ముందు గురువార్పణం, భుజించే ముందు, భోజనం తరువాత, బయటకెళ్ళే ముందు ఇంటికొచ్చిన తరువాత..గురువార్పణమే. చెత్త ఊడ్చి పారేసేటప్పుడు, గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడూ గురువార్పణం అనటమే


ఆవిడ ఇలా మొదలుపెట్టగానే ఆ ఊరిలో కలకలం చెలరేగింది.


ఆ ఊళ్లోని ఒక అవధూత/*గురువు**పాత దేవాలయంలో *గురువు**పై చెత్త, గోమయం పడుతోంది... ప్రతీ రోజూ పూజారి శుభ్రం చేసినా మర్నాడు మళ్ళీ చెత్త పడుతోంది. ఎవరికీ అర్ధంకాక నిఘా పెట్టారు ఊరి జనమందరి మీదా. ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం, అక్కడ *గురువు**పై చెత్త పడటం ఒకే సమయంలో జరగడం గమనించి ఊరందరూ ఈవిడ చేసినదానికి ఉగ్రులై ఆ దేశపు రాజు దగ్గరకు తీసుకుపోయారు.


రాజుగారు చెప్పినదంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా కారాగార శిక్ష విధించారు.. ఖిన్నురాలై ఏడ్చుకొంటూ కారాగారం లోకి వెళ్తూ గురువార్పణమంది.


మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది... నాకీ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుడిలా... . ఐనా పట్టించుకోకుండా యధాతధంగా పూజలు చేశారు. ...ఆమె కటిక నేల పై పడుకొనే ముందు గురువార్పణమనుకుంది. రెండవ రోజు *గురువు**గారి విగ్రహం నేలపై పడుకొనుంది.


ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు. ఈ లోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బ్రొటనవేలు నుండి రక్తం ధారాపాతంగా ద్రవించసాగింది. అప్రయత్నంగా గురువార్పణం అనగానే గాయం మాయమయ్యింది. అది చూసిన కారాగృహాధికారి ఆ వెంటనే రాజుగారికి చెప్పాడు.


అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు.


“మహాప్రభో *గురువు**గారి విగ్రహం బ్రొటన వేలు నుంచి ధారాపాతంగా రక్తమొస్తోంది. ఎన్ని కట్లు కట్టినా ఆగట్లేదు. విషయం అర్ధమవ్వ ట్లేదు” అని వాపోయారు.


రాజుగారు వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు. నీ గాయం అకస్మాత్తుగా ఎలా నయమైపోయిందని.


“నాకు తెలియదు” అంది...


“సరే ఏదో మంత్రం చదివావట కదా ?” అని ప్రశ్నిస్తే ఆమె గురువార్పణం అనే అన్నాను అని బదులిచ్చింది.


సభలోని వారందరూ హతాశులయ్యారు.


ఆమెని “నీకు గురువార్పణమంటే ఏమిటో తెలుసా?” అని అడిగితే “తెలియదు ఏదో మంత్రమనుకుంటా. ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను. అలా అనటం తప్పాండీ? ఆ మంత్రం నేను జపించకూడదా? ఐతే తెలియక చేసిన తప్పును క్షమించండి.” అని ఏడుస్తూ బేలగా అన్నది.


సభికులందరి కళ్లూ చెమర్చాయి ఆమె అమాయకత్వానికి. ఆమెకు గురువార్పణం అనడంలో అర్ధాన్ని వివరించి కాళ్ళ మీద పడ్డారు.


ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోదించడం మొదలెట్టింది. అయ్యో తెలియక ఎంత అపరాధం చేశాను.. స్వామివారి మీద చెత్త పోసాను. నా గాయాన్ని *గురువు**కి అంటగట్టా ను. నా పాపానికి శిక్షేముంటుంది అనుకొంటూ అవధూత/గురువు ఆలయానికి పరుగు పరుగునపోయింది.


*గురువు**ని చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది. ఆ రోజు నుంచీ శుద్ధిగా భోజనం వండి తినే ముందు గురువార్పణమనడం మొదలుపెట్టింది. ఆ *గురువు** గారు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టారు,


సకల చరాచర సృష్టికర్త తనంతట తానే కావాల్సింది తీసుకోగలడు.


  భోజనమైన తరువాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండా రాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమ పూర్వకంగా స్వీకరిస్తాడు.మన *గురువు**


ఆమె భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న అవధూత /*గురువు**

లీలలను మనం కొనియాడడానికి మాటలున్నాయంటా రా?!


ఎందుకు ఇంక ఆలస్యం ఒకసారి గురువార్పణం' అని అనుకుందాం,


సర్వే జనాః సుఖినోభవంతు

*సర్వం గురుమయం **🙏

*సర్వం గురువార్పణమస్తు**🙏

GRT హోటల్ కాశి/వారణాసిలో

 GRT వారు కాశి/వారణాసిలో హోటల్ కమ్ సత్రం ప్రారంభించింది.


దక్షిణ భారత ఆహారాన్ని అందిస్తారు. గది అద్దెలు నామమాత్రం. ఆహారం ఉచితం.


మేము ఇటీవల వారణాసికి వెళ్లి GRT నిర్మించిన సత్రంలో బస చేసాము....

పేరు మాత్రమే సత్రం, కానీ గదులు అన్ని సౌకర్యాలతో అద్భుతంగా ఉన్నాయి, మీకు ఎక్కడా లభించదు.


గరిష్టంగా ముగ్గురు ఒక గదిలో ఉండగలరు... వారు ఉదయం కాఫీ, టిఫెన్, లంచ్, సాయంత్రం టీ మరియు రాత్రి భోజనం అందిస్తారు. ... రూమ్ సర్వీస్ లేదు... అన్ని ఆహారాలు ఉచితంగా మరియు అపరిమితగా...అమావాస్య రోజున వారు ఉల్లిపాయలు & వెల్లుల్లి లేకుండా ఆహారాన్ని అందిస్తారు.


మేము గత అమావాస్యకు అక్కడ ఉన్నాం ఎలా నిర్వహించాలా అని ఆలోచిస్తున్నాము... మేము డైనింగ్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు అది ఉల్లి/వెల్లుల్లి లేని ఆహారం అని సూచించే పెద్ద బోర్డు ఉంది. అనేక రకాల వస్తువులు.... నిజానికి బయటి ఆహారం మనకు సరిపడదు కాబట్టి వారు తమ అతిథులను అక్కడ మాత్రమే తినమని పట్టుబట్టారు.

ఖాళీ చేస్తున్నప్పుడు ఆ అన్నదాన ట్రస్ట్ కోసం సహకారం అందించాలనుకున్నాము.. వారు అంగీకరించలేదు...


ఒక టిప్ బాక్స్ ఉంది... టిప్ ఇవ్వడం తప్పనిసరి కాదు... కానీ మేము అది లేకుండా వెళ్లలేము ఎందుకంటే వారి సేవ నిజంగా అద్భుతమైనది.... మీరు చుట్టూ తిరగడానికి అక్కడ చాలా EVలు లభిస్తాయి... V ఆనందించారు మేము అక్కడ ఉండడానికి మరియు GRT యొక్క సేవ నుండి టోపీలు...

వారణాసికి వెళ్లే ఎవరైనా, GRTలో ఉండండి... గది అద్దె కూడా చాలా చౌకగా ఉంటుంది... గదులు స్టార్ హోటల్ గదుల్లా ఉన్నాయి... సరికొత్త మోడల్ హైఫై ఫిట్టింగ్స్‌తో. 


ఇక్కడి నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని ప్రదేశాలు... శంకర మఠం, గంగానది, విశ్వనాథర్ ఆలయం మరియు ఇతర దేవాలయాలకు వెళ్లడానికి మీకు పుష్కలంగా ఎలక్ట్రిక్ వాహనాలు లభిస్తాయి.


GRT హోటల్..కాంటాక్ట్ నెం.7607605660.


వసతి కోసం వారి వెబ్‌సైట్‌ని సందర్శించండి...

https://www.grtkasichatram.com/ లేదా GOOGLE IT మరియు లాగిన్ అవ్వండి.

ఆన్‌లైన్ ద్వారా మాత్రమే బుకింగ్.


కాశీని సందర్శించాలనుకునే వ్యక్తులకు ఇది ఉపయోగకరంగా ఉండవచ్చు. 👍🏻


ఓం నమః శివాయ 🌹🙏🌹


www.grtkasichatram.com

ఎద్దు కధ

 💦 *`చందమామ కథలు (Chandamama Kathalu) - 138`*


*🐥ఎద్దు కధ:*


*అనగనగా గోపయ్య అనే రైతు దగ్గర ఒక గొప్ప ఎద్దు ఉండేది... అది చాలా బలంగా ఉండేది. అయినా అది చాలా శాంతంగా ఉండేది. గోపయ్య ఏ పని చెబితే దాన్ని, చాలా ఇష్టంగా చేసి పెట్టేది.*


*గోపయ్య కూడా ఆ ఎద్దును చాలా ప్రేమగా, జాగ్రత్తగా చూసుకునేవాడు. దాన్ని అస్సలు కొట్టేవాడు కాదు. దాని మీద ఈగను కూడా వాలనిచ్చేవాడు కాదు. ఆ ఎద్దు గురించి అందరితోనూ గొప్పగా చెప్పేవాడు.*


*ఒకసారి గోపయ్య ఊళ్ళో పెద్ద మనుషులతో మాట్లాడుతూ "నా ఎద్దు నూరు బండ్లను ఒకేసారి లాగేస్తుంది- కావాలంటే వెయ్యి నాణేలు పందెం" అనేశాడు. కొందరు ఆ మాటను వినీ విననట్టు ఊరుకున్నారు కానీ, గోపన్న అంటే సరిపోనివాళ్ళు కొందరు జట్టు కట్టి, "పందెం అంటే పందెం" అన్నారు.*


*పందెం రోజు రానే వచ్చింది. ఊళ్ళో వాళ్ళు నూరు బండ్లనూ వరుసగా ఒకదాని వెనుక ఒకటి కట్టి ఉంచారు. గోపయ్య ఎద్దును తెచ్చి మొదటి బండికి కట్టాడు. ఎద్దుకు ఇదంతా కొత్తగా ఉంది. అయినా యజమాని తెచ్చి నిలబెట్టాడు గనక, అట్లా ఊరికే నిలబడిందది. అందరూ 'లాగు లాగు' అన్నారు. కానీ ఎద్దు మాత్రం కదల్లేదు. గోపయ్య ఏం చెబుతాడోనని ఎదురు చూస్తూ అది అట్లానే నిలబడి ఉన్నది.*


*గోపయ్యకు తల తీసేసినట్లయింది. 'ఎద్దు బళ్ళను ఎందుకు లాగట్లేదు?' అని చికాకు మొదలైంది- ఆ చికాకులో 'తను దానికి లాగమని చెప్పనేలేదు' అని అతనికి గుర్తుకే రాలేదు. పైపెచ్చు, అది 'నా పరువు తీస్తోంది' అని చటుక్కున కోపం కూడా వచ్చేసింది: "వెయ్యి నాణేలు... పోగొట్టకు! వెయ్యి నాణేలు!! ఎప్పుడైనా చూశావా? అంత తిండి తినేది ఎందుకట, ఈ మాత్రం లాగలేవా?!" అని తిడుతూ, అందరు రైతుల లాగానే తనూ దాన్ని మొరటుగా చర్నాకోలతో కొట్టటం మొదలు పెట్టాడు అతను.*


*గోపయ్య అంతకు ముందు ఎన్నడూ దానితో కోపంగా మాట్లాడలేదు. ఏనాడూ దాన్ని తిట్టలేదు; ఒక్క దెబ్బకూడా వెయ్యలేదు! మరి ఇప్పుడు అతను అంత కోపంగా అరవటం, పైపెచ్చు చర్నాకోలతో కొట్టటం ఎద్దుకు ఏమాత్రం నచ్చలేదు. దాంతో అది పూర్తిగా మొండికేసింది- ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. దాన్ని కొట్టీ కొట్టీ అలసిపోయిన గోపయ్య పదిమందిలోనూ ఓటమిని అంగీకరించాల్సి వచ్చింది. డబ్బుతోబాటు పరువునూ పోగొట్టుకొని, తలవంచుకొని ఇల్లు చేరుకున్నాడతను.*


*"గతంలో అవసరం ఉన్నప్పుడు చాలా సార్లు ఈ ఎద్దే వంద బండ్లను అలవోకగా లాగేసింది గదా, మరి ఇవాళ్ల ఎందుకు లాగలేదు?!" అన్న ఆలోచన రాలేదు, కోపంతో రగిలిపోతున్న గోపయ్యకు. అయితే ఆరోజు సాయంత్రం చూసేసరికి, ఎద్దు మేత మేయకుండా- స్తబ్దుగా నిలబడి ఉన్నది. దాని ఒంటినిండా చర్నాకోల వాతలు- ఆ గాయాల చుట్టూ ఈగలు ముసురుతుంటే అది విసురుకోవటం కూడా లేదు. గోపయ్య వంకే చూస్తూ కన్నీరు కారుస్తున్నది!*


*దాన్ని చూసే సరికి గోపయ్య హృదయం ద్రవించింది. దాని గాయాలకు మలాం రాస్తూ అతను తన తప్పును గ్రహించాడు: 'ఈ మూగ జంతువుకూ హృదయం ఉంది. తన మాట నెగ్గాలన్న తొందరలో తను దాన్ని అనవసరంగా, కౄరంగా శిక్షించాడు. సున్నితమైన దాని మనసుకు గాయం కలిగించాడు!'*


*గోపయ్య కళ్ల నీళ్ళతో దానికి క్షమాపణ చెప్పుకొని, నిమిరి, ముద్దుచేసి, దగ్గర చేసుకున్నాడు. అతని మనసును గ్రహించిన ఎద్దు కూడా కొంత కుదుటపడ్డది.*


*తెలివి తెచ్చుకున్న గోపయ్య తర్వాతి రోజున మళ్ళీ గ్రామస్తులతో పందెం కాశాడు. 'ఈసారి పందెం రెండు వేల నాణేలు' అన్నారు గ్రామస్తులు. ఈసారి గోపయ్య ఎద్దుని కొట్టలేదు సరికదా, కనీసం అదిలించను కూడా లేదు. ప్రేమగా వీపు నిమిరి, 'లాగురా!' అనేసరికి, ఎద్దు వంద బండ్లనూ లాక్కొని ముందుకు ఉరికింది!*


*గోపయ్య పందెం నెగ్గటమే కాదు; జీవితాంతం‌ ఉపకరించే పాఠం ఒకటి నేర్చుకున్నాడు- 'ఎంత తొందర, ఎంత చికాకు ఉన్నా సరే, మనసుల్ని మటుకు గాయపరచకూడదు' అని.*


*చక్కని ఈ కథని మళ్ళీ ఓసారి చదవగలరని కోరుతూ...*


*జాగ్రత్తగా చూస్తే, పసి పిల్లలలో కూడా అనంతమైన శక్తి దాగి ఉన్నది.*


*ప్రేమ, ఆప్యాయతలు వాళ్ళు తమ ఈ శక్తిని వాస్తవీకరించుకునేందుకు సహాయపడతాయి. మంచి తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు అందరూ పిల్లల హృదయాల్ని అర్థం చేసుకొని సున్నితమైన మనసులతోటి సున్నితంగానే ప్రవర్తించాలి.*

కణాదుడు

 *కణాదుడు:* క్రీ. పూ. 2 వ శతాబ్ది.


జాల సూర్య మరీచి స్థం

యత్ సూక్ష్మ్యం దృశ్యతే రజః

ప్రధమం తత్ పరిమాణానాం

త్రస రేణు రితి స్మృతిః


విభజించడానికి వీల్లేనటువంటి పరమాణువు పరిమాణం గురించి చెప్తూ, కిటికీల ద్వారా ప్రసరించు సూర్యరశ్మి సోకినప్పుడు కంటికి కనబడే అత్యంత సూక్ష్మమైన ధూళికణాల పరిమాణంలో ‘త్రసరేణం’ అంటే ఆరోభాగపు  పరిమాణం అని చెప్పబడింది. సూర్యరశ్మిలో కనపడే అతిసూక్ష్మ కణము అంగుళములో 349525 వభాగం. దానిలో ఆరింట ఒక వంతు మాత్రమే పరమాణు పరిమాణం.అంటే ఘనపు అంగుళంలో అతి సూక్ష్మభావం అని కణాదుడి ప్రతిపాదన.


కణాదుడు తన "అణువైశేషిక సిద్ధాంతం"లో ఎన్నో అంశాలను సోదాహరణంగా నిరూపించాడు. సాపేక్షత గురించి కూడా ఈ సిద్ధాంతంలో చెప్పాడు. ఈయన నాస్తికుడు. 🙏

ఎలా ప్రవర్తించాలి

 *మనం ఎలా ప్రవర్తించాలి?* 


 *మైత్రా:* 

 మనం అందరితో స్నేహంగా ఉండాలి.   ఆదిశంకరులు ఒకచోట ఇలాచెప్తూ...

 *ద్వయిమై సంయత్రికో విష్ణుః ఐ వైర్తం కుబ్యసి మయ్యసహిష్ణుః* II 

 “నీకు ఒక్కరికే చైతన్యం ఉంది.   నా దగ్గర కూడా ఉంది.   ఇది ప్రతిచోటా ఉంది.   అలాంటప్పుడు నా మీద నీకెందుకు కోపం?”  అని ఒక శ్లోకంలో చెప్పాడు.   కాబట్టి అందరితో ప్రేమగా మెలగాలి. అదొక్కటే కాదు వారు చెప్పింది....

 *కరుణ ఏవా యసి* 

 మనం అందరిపట్ల దయగా ఉండాలి.   ఇతరుల బాధలను దూరం చేయాలనే కోరికను "కరుణ" అంటారు.   మన కళ్లముందే చాలా మంది బాధపడుతున్నారు.   వారి బాధలను తీర్చే శక్తి మనకు ఉంటే, వారి బాధలను తీర్చాలి.   దానికి విరుద్ధంగా, మనం స్వార్థపరులుగా ఉంటే, ప్రపంచానికి మనవల్ల ఏమి ప్రయోజనం?   పరోపకారం లేని మానవుల కంటే జంతువులు శ్రేష్ఠమైనవని శాస్త్రాలు చెబుతున్నాయి.   కాబట్టి మన జీవితాలు అర్థవంతంగా ఉండాలంటే మనం ఇతరుల పట్ల దయ చూపాలి.

-- *జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీతీర్ధ మహాస్వామి వారు*

వసుచరిత్రలో సవతుల కయ్యం!

 


వసుచరిత్రలో సవతుల కయ్యం!


శా: ఆమందాకిని మౌళిఁ బూని నను నర్ధాంగీకృతం జేసి 'తౌ

నౌ మేల్మే' లని యార్య యల్గఁ ,బ్రణతుండై ,తత్పదాంభోజ యో

గా మర్షంబున గంగయు న్మొరయఁ జూడాభోగ సమ్యక్క్రియా

సామర్ధ్యంబున వేఁడు శంభుఁడు కృతిస్వామిం గృపన్ బ్రోవుతన్.


వసుచరిత్రము- అవతారిక- రామరాజ భూషణకవి !


ఇది రామరాజ భూషణ కవి రచించిన వసుచరిత్రలోని పద్యం. కృతిపతికి పరమశివుని ఆశీర్వాద మందజేసేపద్యం.

బలే చమత్కారాన్ని రంగరించాడుకవి. ఇద్దరు పెళ్ళాలమొగుఁడు యిరుకున బడక తప్పదేమో? వెనక పారిజాతాపహరణంలో ఆదెబ్బ యెలా ఉంటుందో ముక్కుతిమ్మన గారు మనకు రుచి చూపించారు. సత్య కాలితాపుకి కృష్ణుని తలబొప్పి గట్టింది. దాసుని తప్పు దండంతోసరియని యామె కాళ్ళకు మొక్కి యెలాగో బయట పడ్డాడు.


ఇపుడా సౌభాగ్యం శాంపిల్గా శంకరునకు చవిచూపుతున్నారు మనకవిగారు యీపద్యంలో. వినండి!


" పార్వతి పరమేశ్వరునిపై కోపించిందట. అవును కోపంరాదామరి. తానుండగానే గంగమ్మను తెచ్చి నెత్తిన బెట్టుకుని

ఊరేగుతున్నాడాయె! అందుకే పరమేశ్వరుణ్ణి నిలదీసి గట్టిగా అడిగేసింది. కాదుకాదు మాటలతో కడిగేసింది ' ఆగంగను నెత్తిని బెట్టుకొని ఊరేగుతూ దానిని కప్పిబుచ్చుట కోసమేగదా నన్ను అర్ధనారిగా (సగము ఆడది ) జేసినావు. ఆహా !నీయుక్తి తెలిసినదిలే!

ఎంత మోసకారివి. నిన్ను నమ్మి మోసపోతినిగదా " యని తన యాగ్రహమును ప్రకటింప, వేరుదారిలేక శంకరుడు క్రిందకు తలవంచి యామె పాదములను తాకినాడట! శ్రీకృష్ణుని వలెనే దాసునితప్పు దండముతో సరిపెట్టజూచెనన్నమాట. ఏమైన నేమి శంకరుడు తలవంచ శిరసున నున్న గంగా జలములు ఆమెపాదములను ప్రక్షాళణమొనరించినవి. అనగా గంగకూడ సవతిని పూజించినట్లయినది.మెడలోనున్నపాములుబుసబుసలతోక్షమింపబ్రతిమాలినవి.యిలాచాలాతెలివిగా,  శంకరుడు పాదాభివందనము చేయుటతో,ఇటు సవతి పరిచర్యల నొనరించుటతో నామెకోపము పటాపంచెలయినదట. శంకరుడు సవతికయ్యపు గండమునుండి క్షేమముగా బయటపడినాడట. అట్టి శంకరుడు కృతిభర్తను బ్రోచుగాత! యని యాశీస్సు.


కవి పార్వతిని అర్ధనారీశ్వరిగా నొనర్చుటకు ఒక కారణమును జెప్పినాడు. అట్లు చేయుట వలన నామె సగము

ఆడదియై సంతానమును పొందుటకు అనర్హ యైనదట! సంతానమే స్త్రీజన్మకు సాఫల్యము.గదా! గొడ్రాలును ఉపేక్షించి సంతానము కొరకై మగవాడు మరల పెండ్లియాడుట లోకరీతి. భార్య యుండగా పునర్వివాహ మేల ?యని యడుగు వారికి సమాధానము చెప్పుట సులభమగునుగదా, అదిగో ఆలోకరీతిని అడ్డు జేసికొనుటకై నన్ను అర్ధనారిని జేసి దీనిని నెత్తి కెక్కించు కొన్నావని పార్వతి వాదన! ఆహా! కవికెంత గొప్పయూహ!


అందుకే కిమ్మనకుండా శంకరుడు పార్వతికి మొక్కినాడు.గంగమ్మచేత కాళ్ళుకడిగించినాడు. ఇది చాలా తెలివైన పనిగదా , సరి . ఆమె కోపము పోయినది . శంకరుడు ప్రసన్నత నొందినాడు.


ప్రబంధకవులలో సవతి కయ్యములను ప్రస్తావించిన కవులిద్దరు.తిమ్మన సుదీర్ఘముగా వర్ణించి దానికొరకొక కావ్యమునే(పారిజాతాపహరణము)

వ్రాయగా, రామరాజ భూషణుడు ఒకే ఒక పద్యంతో సరిపెట్టినాడు మిక్కిలి చమత్కారంగా!

                            .స్వస్తి!🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

సంద్యోపాసన

 సంద్యోపాసన ఎవరిని ఉద్దేశించి చేస్తున్నాము?


సంధ్య ఉపాసనకు ఉపాస్య దేవత ఎవరని ఒక ఔత్సాహికుడు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారిని ప్రశ్నించాడు.


• సూర్యమండలమునా? (ఖగోళ గ్రహమునా? – అది ద్రవ్య రాశి)


• సూర్య దేవతనా? ( పరిమిత శక్తి కల జీవుడా? )


• విశ్వాత్మ అయిన హిరణ్యగర్భుడా? (అతడూ జీవుడే కదా? )


• విశ్వపరిపాలకుడైన ఈశ్వరుడా? ( సాపేక్షమైన బ్రహ్మ కదా?)


• బ్రహ్మమా?


దానికి స్వామి వారు అన్నియును అని చెప్పారు. 


అదెలా కుదురుతుంది ఇవన్నీ వేరు వేరు కదా అని అతడు ప్రశ్నించగా


 ఆయన ఇలా చెప్పారు:


ఉదాహరణకు నన్ను తీసుకోండి. ఎందరో నాపై గౌరవం చూపుతున్నారు.అందరూ గౌరవిస్తున్న వస్తువు “నేనే” అయినప్పటికీ గౌరవం చూపుతున్న వ్యక్తులను బట్టి కొంత కొంత మార్పు జరుగుతున్నది. 


౧. సామాన్య జనులు నా చుట్టును మహా సంస్థానపు ఆర్భాటములైన వస్త్ర భూషణాలు పరివారం చూసి ఆనందిస్తారు


౨. కొందరు నా పీఠాదిపత్యమును గౌరవిస్తారు


౩. కొందరు నా (సన్న్యాస) ఆశ్రమమును చూసి గౌరవిస్తారు


4. కొందరు నా భౌతిక దేహమునకు


5. కొందరు నా భౌతిక స్థితిని వదిలేసి నా అంత:కరణ పారిశుద్ధ్యమును, ఆధ్యాత్మిక బలమును, ఉపాసనా శక్తిని గౌరవిస్తారు


6. చాలా తక్కువమంది నా చిత్తును చూసి గౌరవిస్తారు

కానీ అందరి గౌరవం “నేను” అనబడే నా మీదనే కదా.


 ఉపాసకుని ఉపాసన అతడి స్వభావం పై ఆధార పడివుంటుంది. ఉపాసిన్చేవారిని ఉపాసింపబడే వస్తువు భేదం చూపించదు. కాబట్టి నువ్వు చెప్పిన అన్నీ కూడా ఉపాసనకు అర్హములే. అన్నీ ఒకటే.


 వారి వారి స్థాయిని బట్టి వారి ఉపాసన వుంటుంది. కర్మ, భక్తి, జ్ఞాన మార్గములు నిత్య ఉపాసనలో స్థానములు వున్నవి.


 సంద్యోపాసన అతి సామాన్యముగా తోచినా అత్యుత్తమ స్థాయికి కూడా ఉపయోగపడగలదు. సామాన్య ప్రారంభ సాధకునికి ఎంత ఉపకరిస్తుందో తపస్సిద్ధునకు కూడా అంత ఉపకరిస్తుంది. కాబట్టి దాన్ని తృణీకరించతగదు. విస్మరించడం తప్పు.

పంచాంగం 14.06.2024 Friday.

 ఈ రోజు పంచాంగం 14.06.2024  Friday.


స్వస్తి  శ్రీ చాన్ద్రమాన క్రోధి నామసంవత్సర: ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠ మాస శుక్ల పక్ష: అష్టమి తిధి భృగు వాసర: ఉత్తరఫల్గుని నక్షత్రం సిద్ది యోగ: భద్ర తదుపరి బవ కరణం. ఇది ఈరోజు పంచాంగం.


అష్టమి రాత్రి 12:03 వరకు.

ఉత్తరఫల్గుని ఈ రోజు పూర్తిగా ఉంది.


సూర్యోదయం : 05:45

సూర్యాస్తమయం : 06:47


వర్జ్యం : మధ్యాహ్నం 01:15 నుండి మధ్యాహ్నం 03:03 వరకు.


దుర్ముహూర్తం : పగలు 08:21 నుండి 09:14 వరకు తిరిగి మధ్యాహ్నం 12:42 నుండి 01:34 వరకు.


అమృతఘడియలు : రాత్రి 12:05 నుండి 01:53 వరకు..


రాహుకాలం : పగలు 10:30 నుండి 12:00 వరకు.


యమగండం: మధ్యాహ్నం 03:00 నుండి 04:30 వరకు.

 


శుభోదయ:, నమస్కార:

ఈ బ్లాగు మనందరిది

 ఈ బ్లాగు మనందరిది దీని అభివ్రుద్దికి మీ వంతుగా మీకు తొచిన ద్రవ్యం ఈ మొబైలు నంబర్కు 9848647145 డొనేటు చేయండి.