6, ఆగస్టు 2020, గురువారం

రామాయణమ్ .22


.
గౌతమ మహర్షి ఆతిధ్యం స్వీకరించిన పిదప విశ్వామిత్ర మహర్షి ఈశాన్యదిక్కుగా ప్రయాణమయినాడు.
 అన్నదమ్ములిరువురూ ఆయనను అనుసరించినారు.
.
జనకుడి యజ్ఞ శాల ప్రవేశించారు మహర్షి!.
.
మహాత్ముడు అయిన విశ్వామిత్ర మహర్షి రాక తెలిసికొని జనకమహారాజు తన పురోహితుడైన శతానందులవారిని వెంట నిడుకొని అతిశీఘ్రముగా ఆయన వద్దకు చేరి అర్ఘ్యపాద్యాదులొసగి ఆ మహానుభావుని తగురీతిని సత్కరించి అంజలి ఘటించి నిలుచున్నాడు.
.
జనకుడిని యజ్ఞము ఏవిధముగా జరుగుతున్నదో అడిగి తెలుసుకున్నారు మహర్షి.
.
అప్పుడు జనకుడి మదిలో ఒక ఉత్సాహమేర్పడి ,
మహర్షివెంట ఉన్న ధనుర్ధారులైన రాకుమారులెవరో తెలుసుకోవాలని కోరిక కలిగింది.
.
మహర్షీ వీరిరువురూ ఎవరు?
పద్మపత్రాల వంటి కన్నులు,
అశ్వినీ దేవతల సౌందర్యం,
దేవతాసమానపరాక్రమము,
గజ సింహ సమానమయిన నడక ,
చూడగానే దేవతలవలే కనపడే ఈ బాలురెవ్వరు?
 ఎవరివారు? నీతో కాలి నడకనే ఇచ్చటికి వచ్చినారెందుకు?
.
 జనకుడి ప్రశ్నల పరంపరకు చిరునవ్వుతో మహర్షి ఇలా సమాధాన మిచ్చారు.
.
వీరు అయోధ్యా పురాధీశుడు దశరధమహారాజు కుమారులు రామలక్ష్మణులు! ..... అని చెప్పి!.
.
తాటకద్రుంచి వైచి యతిదర్పితుడైన సుబాహుసాయకోత్పాటితు చేసి
గీటడిచి ధర్మ మెలర్పన్ అహల్య శాపముచ్ఛాటన
మొందజేసి కడు సమ్మద మారగ నీగృహంబునం
జాటగనున్న శంకరుని చాపము జూడగ వచ్చిరి ఏర్పడన్
.
తాటకను చంపినవారు వీరే ,
సుబాహుడిని మృత్యువు కౌగిటిలోకి తోసినది వీరే ,
అహల్య శాపవిమోచనము గావించినవారు వీరే !
నీ ఇంట వున్న శివధనుస్సును చూడటానికి ఇప్పుడు ఇక్జడికి వచ్చారు.
.
ఇది వింటున్న శతానందులవారు ఆనందంతో ఎగిరి గంతువేసి ఏమిటి మహర్షీ? మా అమ్మ అహల్యకు శాపవిమోచనమయినదా ? అని ఆత్రుతతో ప్రశ్నించాడు.
.
శతానందులవారు అహల్యాగౌతముల కుమారుడు.
.
N.B..
పై పద్యం భాస్కర రామాయణంలోనిది
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
**********************

కామెంట్‌లు లేవు: