6, ఆగస్టు 2020, గురువారం

*మహారాజ్ఞి మండోదరి*



*Part.7*

అని మండోదరితో ఆనాటితో తనకు బంధం తీరినదని పలికి వీరుడై రణరంగానికి బయలుదేరాడు. తనభర్తకు చేజేతుల చంపుకోవడానికి కులీనయైన ఏ స్త్రీ ఆశించదు. మరణమెప్పటికి తప్పదు కాబట్టి ఉత్తమలోకాలు చేరి సద్గతిని పొంది సుఖించాలని ఆమె కోరుకోవడంలో ఉపకారమే ఉన్నది. భారతీయ సతీధర్మాలను ఇలా ఆయా పాత్రల ముఖతః నిరూపించాడు కవి. పరోపకార శీలం, స్వార్ధరహిత్యం, ఆత్మ పరిశీలనం, సత్యస్ఫ్రకంగా పాత్రల మనోభావాలను చిత్రించుట అంత తేలికయైన పనికాదు. పాత్రలలోని త్యాగైక గుణసంపదకు వన్నెలు దిద్దడం మహా ప్రజ్ఞాశీలియైన కవికి మాత్రమే గలదనుట నిర్వివాదాంశం.

అలా రావణుడు రణభూమి చేరి ఆ దాశరథి చేత విహుతుడైనాడు. అది తెలిసి రావణాంతఃపుర స్త్రీలంతా విలపించారు. కులస్త్రీలను చెరపట్టిన పాపమేనని భావించారేగాని శ్రీరామాదులను దూషించినవారు లేరు. రావణుని స్వ్యం కృతాపరాధానికి నొచ్చుకుంటూ మండొదరి చేసిన విలాపాలు ధర్మ ప్రతిపాదికమైనవి. మరొక్కసారి వేంకటకవి ఆమెచేత దీర్ఘోపన్యాసం చేయించాడు. శ్రీరాముని దైవత్వాన్ని రావణునిలోని ఆసురీప్రవర్తనను మరల మరల చాటి చెప్పించాడు. పౌరుష ప్రత్తపోన్నతుడై సిద్ధ గంధర్వాది దేవతా గణాన్ని గడగడ వణికించిన తనభర్త శ్రీరాముని చేతిలో నిర్జింపబడుట సిగ్గుపడవలసిన విషయమని, అంతా దైవయోగమని విలపించినది. శ్రీమన్నారాయణుడే శ్రీరాముడని ఆ దంపతులు యుద్ధానికి ముందే తెలిసికున్నారు. అయినా తన భర్త ఔన్నత్యం మీద ఆమెకంత విశ్వాసం. తన భర్త గొప్పదనాన్ని శ్రీరముని దైవత్వాన్ని పదిమందిలో తెలియజెప్పడానికే కవి మండోదరికి ఆ అవకాశం కల్పించి ఉంటాడు. అన్నింటికంటే ముఖ్యంగా మండోదరిచేత సీతా శీలవృత్తాన్ని మరల ప్రకటింపచేస్తాడు.
మండోదరి మరల అంటున్నది. ఒక వ్యక్తి వినాశానికి ఆ వ్యక్తిలోని దోషాలేనని పలికినది. తన భర్త ముందు ఇంద్రియాలను గెలిచి తర్వాత ముజ్జగాలను గెలిచాడట. అంతా తపోబల సంపదగలవాడు తన భర్త అని ఆమె ఉద్దేశం. ఇంద్రియ విజయం వల్ల అతనికి అతని యింద్రియాలే చివరకు శత్రువులైనాయట. అంత మనో నిగ్రహ శక్తులున్న్వాడైనా చివరకు ఇంద్రియ లోలత్వం వల్లనే వినాశాన్ని కొనితెచ్చుకున్నాడత. చపలాత్ములైన పురుషులందరికి ఈమె ఎంతో చక్కటి సందేశాని అందించినది. రామునితో వైరం మాని సీతని ఇమ్మని పలికిన హిరం నీకు రుచించలేదు. ఇది విధిచోదితమని పలికిన మండోదరి సౌమ్యగుణ్శీల సంపద కొనియాడదగియున్నది. ఇంద్రియలోలురైన ప్రతివారికి రావణుడే ఉదాహరణ.

తన భర్త చేపట్టిన అకార్యాలపట్ల ఆమె యెంతగా కుమిలిపోయినదో ఆమె చేసిన హెచ్చరికల ద్వారా తెలుస్తున్నది. సమయం దొరికినప్పుడంత తన భర్తలోని దురాగతాలను అనుభావానికి వచ్చిన తత్ఫలితాలను ఆమె వివరణగా చెప్పడం భార్యమాటలలోని పరమార్ధాలు తెలిసికూడ, అహాన్ని విడిచి ప్రవర్తించకపోవడమే లంకకు చేటు తెచ్చినది. రావణాసురుడు సామాన్యుడు కాదుగదా! పోగాలం దాపురించిన వాళ్లు “కనరు, వినరు, మూర్కొనరని” సూరిగారన్నట్లు ఏ రకమైన వ్యసనపరుడైనా పడే కష్టాలు తెలిసి కూడ తాము చేపట్టిన మార్గాన్ని విడిచిపెట్టరు. వాళ్లలోని అహంకారం అలాంటిది. స్త్రీల మాటను మగవాళ్లు అసలు ఖాతరుచేయరు. చివరికి అందుకోవలసిన ఫలితాన్ని అందుకుని అలమటించడం అతి సామాన్య ధోరణి మగవాళ్లకు. సామాన్యులే అలాంటి బుద్ధితో ప్రవర్తిస్తే పదితలలవాడికి ఇంకెంత బింకం ఉండాలి మరి. ఏది ఏమైనా మండోదరి మాత్రం కడవరకు తనభర్తను బ్రతికించుకోవాలనే విశ్వప్రయత్నం చేసి ఎన్నో విషయాలు గుర్తింపచేస్తుంది. రావణుడు ఇంతవరకు చేసిన పనులకంటే సీతను కొనిరావడమే లంకకు చేటు కలిగించిన విషయమని హెచ్చరించినది.
ఇంకా ఇలా అంటుంది పుణ్యవతి అయిన మహారాజ్ఞిపై నీకు పుట్టిన మోహమే నీ పాలిట అగ్నిశిఖ. అంతేగాదు “నిన్ను, నన్ను, గులమును, నిఖిల సుతుల హితుల మంత్రుల నెల్ల” దహించినదనుటలో ఆ సాధ్వికి భర్త చేష్టలు ఎంత అనర్ధదాయక మైనవో వివరించింది. “అరుంధతి, రోహిణి కంటె విశిష్టమైనది, క్షమాగుణం గలది, సౌభాగ్యవతులకు నిదర్శనమైనది. వారాశి సుతకు దృష్టాంతభూమియై తేజరిల్లుచున్నది. పతిభక్తిగలది, పరమసాధ్వి, నబల, సర్వానవద్యాంగి, మహితశీల, మాన్యయైన సీతను మ్రుచ్చిలి దెచ్చి ఏం సుఖపడినావు బృహత్ఫలితాన్ని పొందావు. కులం నశించినది అని రావణుని బలహీనబుద్ధిని ఏకరువుపెట్టినది. స్వయకృత అపరాధిగ నిర్ణయించినది. ఆ సతిని చెరపట్టిననాడే దహించిపోవలసిన వాడివి కాని కాలకర్మాలు కూడిన నాడే పరిపక్వమైన ఫలితం అని సూచించినది. ఉత్తమసతుల చెఱబడితే కలిగే అనర్ధాన్ని కన్నుల గట్టించినది. ఆమె హృదయ ఔన్నత్యాన్ని కవి చక్కగ రూపించాడు. మండోదరి ఒకసారి సీతను గూర్చి నాకంటే ఆమె అంత అందగత్తియా? అని వితర్కించింది. ఆ మండోదరియే సీతాదేవి సౌశీల్యాన్ని ఎంతగా కొనియాడినదో చూశారుగా. అలాంటి బంగారు శలాక సీతమ్మ. అంటే అగ్నిశిఖవంటిదని గూడ నర్మగర్భంగా తెలియచేసింది. నువ్వు చేపట్టిననాడే నిన్ను దహించివుండేది కాని పతిపరాయణ సీత నీ కాలకర్మాలకై ఎదురుచూచింది అనడంలో శత్రు వర్గపు స్త్రీ అయివుండి గూడ అమలినమైన భావాలతో సీతను కొనియాడిన మండోదరి ప్రశంసనీయ. ఈ ధర్మాధర్మ ప్రకటనకు మండోదరియే దగినపాత్ర అని వేంకట కవి భావించడం ఎంతో సముచితంగా వున్నది. పుణ్య పాపాలను పరిశీలించి ఆయా కర్మలు ఫలితాలు ఎలావుంటాయో విభీషణుణ్ణి, రావణుణ్ణి ఉదాహరణగా నిరూపించిన నేర్పరి. శ్రీమద్రామాయణంలో పరనింద చేసిన పాత్ర సృష్టి మృగ్యం. ఒక సామాన్య స్త్రీ అయినచో జ్ఞాతుల, సహచరుల చేష్టలను దుయ్యబట్టి నిందోక్తులతో బాధపెట్టడం లోకసహజం. ఉత్తములెప్పుడు తమను తామే పరిశీలించుకుని పశ్చాత్తాపులౌతారు. వేరొకరైనచో తన మరది విభీషణుడు, అతని భార్య యింటి గుట్టునంతా రామునికి చెప్పి తన భర్త మరణానికి కారకులైనందుకు తీవ్రంగా నిరసించి, నిందించి, కఠినోక్తులతో హింసించేవారు. కాని అయోనిజయైన మండోదరి మనస్తత్వమే వేరు. ఆమె తన యింటిని, పరిసరాలను, తన కుటుంబసభ్యులనే గాక, భర్త రావణుని గూడ చక్కగా అవగాహన చేసుకున్న కుశాగ్రబుద్ధిగలది. అందుకే తన బంగారమే మంచిదైతే అన్న సామెతగా తప్పులన్ని తన భర్తలోనే చూడగలిగిన ఉదార స్వభావం గలది.

Srinuswami🙏
[05/08, 11:54 am] +91 99772 99911: *మహారాజ్ఞి మండోదరి*
*Part-8*

అంతే కాదు విభీషణుడు చేసిన హెచ్చరికలు, హితోక్తులు లెక్కచేయక చేటు తెచ్చుకున్నావని తన భర్తనే అంటుంది కాని విభీషణుని ఆమె ఏమీ అనలేదు. శుభాశుభకర్మలకు ఫలితం సుఖదుఃఖాలని అనుభవానికి రాగలవని తీర్మానించినది. మరది విభీషణుని మన్నించినది. ఉత్తమ సతీధర్మాలు తెలిసిన మగువ మండోదరి. వాల్మీకి వ్యాసాదులేగాక ఎందరో గొప్ప కవులు మాత్రమే స్త్రీల ఔన్నత్యానికి పెద్దపీట వేసారు. మగువని ఆదరించి గౌరవించిన వాడే సుఖశాంతులని మన దివ్యగ్రంధాల సూచనగా నిర్ధారించారు.

మండోదరి తాను ఐశ్వర్యోపేతను, అందగత్తెను అను సాభిప్రాయ వ్యక్తీకరణ కూడ చేసుకున్నది. లోకంలో ఇది కొందరిపట్ల సహజమేననవచ్చును. రూపవతులైన యువతులు రావణుని కెందరో ఇంటగలరనీ, మోహవివశుడై వాళ్ల అందాల్ని చూడక సీతను పెద్ద అందగత్తెగా భావించాడని తలంచినది. ఇది కూడ పరస్త్రీ వ్యామోహ బద్ధులైన పురుషులకొక చిన్న చురకవంటిది. పైన మాటల వలన మండోదరి తన ఆధిక్యతను చాటుకుంటుంది. ఇంతంటి అందగత్తె తన ఇంట్లోవున్నప్పటికీ రావణుని వక్రబుద్ధి ఏపాటిదో చూడండి అంటున్నాయేమో మాటలు. ఏది ఏమైనా వ్యసనం వినాశహేతువు అని హెచ్చరిస్తోంది.
అని పలికిన పలుకులలో ధర్మపత్నితో పరస్త్రీ తుల్యమైనది కాదనే బుద్ధి గరపడమే గాక సీతకంటె తానేమి తక్కువైనదిగాదని పరస్త్రీలోలుడైన పురుషునికి తన భార్య సౌందర్యం తెలుసుకునే శక్తి చాలదని అలాంటి బుద్ధిలోపమే తన భర్తకు గలదని తత్ఫలితాన్ని అందుకున్నాడని నిరూపించిన ఉత్తమ యిల్లాలు. ఆమెలోని అభిజాత్యం అలాంటిది. జానకి ఆనందంగ భర్తతో సుఖం అనుభవిస్తుంటే చెఱగొన్న ఫలితంగా తనకీ వైధవ్యం అని రోదించిందా సతి, భార్యాభర్తలకు ఎడబాటుచేసిన కర్మఫలమేనని ఆమె విశ్వాసం. “నారీ చౌర్యమిదంక్షుద్రం కృతం శౌటిర్యమానినా” అన్నట్లు అతని నీచ బుద్ధిని గర్హించినది. పతివ్రతాపహరణమే అతని పాలిట కాలసర్పమై విషజ్వాలలచే దహించినదని పలుమార్లు మండోదరి వాకొన్నది. ఉత్తమ సతీధర్మాలకు నిలయం ఆమె హృదయం. ఆమెచేత కవి మరొక సత్యాన్ని లోకాలకు చాటిచెప్పించాడు. గొప్ప ఐశ్వర్యంతో తలతూగి భర్తతో కలిసి, అనుపమ భోగసంపదలు అనుభవించి ఉద్యానవనాది వివిధ దేశాలు సందర్శించిన తాను నేడు భోగ సంత్యక్తయై కాంతి హీనమైన జీవితం గడపవలసి వచ్చినందుకు చింతించినది. “భూవిభుల భోగ భాగ్యములు నమ్మదగవు చపలము లరయ ..” అని రాజ భోగాలన్ని అశాశ్వతాలని గర్హించినది. ఆమెలోని సత్యసంధత అనుపమానమైనది. అందుకే రాక్షసేంద్రా! అకారణ మృత్యువు కలుగదు. నీకు కూడ మైథిలిని అపహరించిన కారణంగానే మరణం సంభవించినదని కార్యకారణ హేతువుతో తర్కించినది. రావణుని ప్రేరణచేసిన తన ఆడపడుచు శూర్పణఖను గాని, రావణ వధకు కారకుడైన విభీషణునిగాని ఒక్కమాట అని కష్టపెట్టలేదు. ఎంతకూ అతడి కర్మ ఫలమేనని పలుమార్లు నొక్కి చెప్పడంలో కవి ఉద్దేశం ఎంతటివాడికైన కర్మఫలం అనుభవించక తప్పదనే సత్యాన్ని మండోదరి ముఖతః పాఠకలోకానికి అందించాడు.

మండోదరి తన భర్త ఔన్నత్యాన్ని, ఐశ్వర్యాన్ని, అందాన్ని చూచి మిక్కిలి గర్వించినది. అతని ఠీవిని పదే పదే స్మరించుకున్నది. స్త్రీల మానసిక భావాలను నిసర్గ రమణీయంగా వర్ణించాడు.
అని తన గర్వానికి కారణం వివరించినది. విక్రమాధికుడు, అహవశూరుడు, ధీరుడు, శౌర్యగుణోన్నతుడు అయిన భర్తగల తనకు ఎలాంటి ఆపద రాబోదని విశ్వసించినందున, మానవుని చేతిలో మరణిస్తాడని ఊహించలేదని దుఃఖించినది. అయితే పాఠకులు ఒక్క విషయాని గుర్తుంచుకోవాలి. మండోదరి రావణుడు ఇద్దరు రామావతార రహస్యం తెలిసినవాళ్లుగ, రాముడు దైవస్వరూపుడే అని మనకి చెప్పిన వాళ్లు గదా! మరల రాముడనే మానవుడి చేతిలో మరణం అనడానికి కారణం, రామావతార రహస్యాని పాఠకులకు ఒక్కమారైనా తెలియ చెప్పాలనే కవి మదిలోని ఆరాటాన్ని అలా ప్రదర్శింపచేసి వుంటాడు. అంతే వైభవోపేతంగా అలరారే రావణుని శరీరం రాముని కార్ముక విముక్తమైన వాడియైన శరజాలంతో క్షతమై నెత్తుటిదోగి విఖండితమై కొండవలె పడి ఉన్నదని దుఃఖితయైన సుశీల ఈమె. మృత్యువుకే మృత్యువైన నీవెట్లు మృతుడవైనావని భర్త ప్రతాపాన్ని ప్రకటించింది.

శభ్దవైచిత్రితో, దత్తపదుల విన్యాసంతో రావణాసురుని దర్పాన్ని వర్ణించిన వేంకటకవి రచన పోతనామాత్యుని పద్యరచనా కౌశలానికి ధీటైనది. రావణాసురుని మదరూప, ఐశ్వర్యటోపాలన్నిటిని ఏకరువు పెట్టి భోరున విలపించిన పతిపరాయణ రావణుని గుణశీల వర్ణనం, పతి స్వరూప స్వభావాలను, పరాక్రమోన్నతులను లోకాలకు పదే పదే చాటినదీ మయుని పుత్రి. పతి యందలి ప్రగాఢ అనురాగమే ఆమెనట్లు పలికించినది. తన భర్తకు గల భక్తియుక్తులు, శక్తిసామర్ధ్యాలు, దయాదాక్షిణ్యాలు ప్రవచించిన మండోదరి ప్రేమమూర్తి, భర్తవియోగ దుఃఖితయైన మండోదరి స్త్రీ జనోచిత భావాలకి తార్కాణం.
ఇలాంటి ఉన్నతుడైన భర్తను పోగొట్టుకొని కఠినాత్మనై జీవించియున్నానని శోకించినది. ఒకపరి పుత్ర శోకంతో, మరల పతి మరణంతో తీరని వ్యధతో హతనైతినని, సమస్త బాంధవ విరహితనై దుఃఖించవలసిన దౌర్భాగ్యానికి పెద్దప్రొద్దు విలపించినది. తర్క వితర్కాలతో కూడిన పలుకులెన్నో వినిపించినా సీతాసతివంటి పరస్త్రీ అపహరణమే రావణుడు అంతం కావడానికి ప్రధానకారణమని పదే పదే నినదించినది ఆమె కంఠం. దునుజేంద్రా! ధర్మం తప్పి పతిశెవా పరాయణులైన, ధర్మనిరతులైన పుణ్యమూర్తులైన కులస్త్రీలను, సువ్రతల్ను చెరబట్టి వాళ్ల భర్తలను వధించావు. ఆ సతీమతల్లుల హృదయ ఘోష నీ పాలిట శాపమైనది. కలకంఠికంట ఒలికిన కన్నీళ్ళకు కారణమైన వాడు ఎంతటి మహోన్నతుడైన నశిస్తాడను సత్యం నీ పట్ల ఋజువైనది. లోకత్రయాన్ని యేలగలిగిన ప్రతాపశాలివైన నీకు పరదారాభిలాష పతనానికి కారణమని తోచకుండుట తాను చేసుకున్న దౌర్భాగ్యమేనని విచారించినది. భీరువుగా సీతను అపహరించిననాడే నీ సౌర్యం నశించినది అంటూ రావణ దురాగతాలను వినయంతో చాటిన బుద్ధిశాలిని సాధుశీల. రావణుని మూర్ఖత్వానికి నొచ్చుకున్నది. పరదారాభిలాషనే పురస్కరించుకుని విలపించినది. అంటే స్త్రీలోలుడైన వాని వంశానికి చీడ తప్పదని పదే పదే నినదించినది. ఆమె విలపించిన తీరు చిత్రంగా వుంటుంది. కదనరంగంలోని శరీరాన్ని చూచి మండోదరి “అసుర పుంగవ ప్రియురాలినట్లు నేడు కదనమేదిని గౌగిట గదియబట్టి నాదువదనంబు చూడవు, మోదమిడవు. నన్ను గడదానిగ జూడ న్యాయమగునె” అని పలవించినది. వీర స్వర్గమలంకరించిన భర్తను చూచి పరిపరివిధాలుగా దుఃఖించినది. అప్పుడు కూడ భార్యభర్తకు దూరంగా జీవించుట తగనిపని యని ఆమె ఉద్దేశం. ఆ మహాసాధ్విని చూచి సపత్నులు ఓదార్చుచు విభీషణుడు మండోదరి దుఃఖాన్ని ఉపశమింపచేసి నాడు ఊరట కలిగించాడు.
*కవి* యిలా యుద్ధకాండలో మండోదరి పాత్రచిత్రణచేసి జీవం పోశాడు. విద్యావినయ సంపదలు, సంస్కృతీ సంప్రదాయాలు, వినయాహంకారాలు అన్నింటిలో పరిపుష్టంగా తీర్చిదిద్ది ఆమెనొక మహోన్నత మహిళామణిగ సృజించిన కవి ప్రతిభ ప్రశంసావహమైనది. ఉజ్వలమణిదీపం, లోకధర్మప్రతిష్ఠాపనకే కవి మండోదరిని సృష్టించి ఉంటాడనే వ్యక్తిత్వం గలది. ఆమెను గూర్చి పలికిన ఈ క్రింది మాటలు ఇక్కడ ప్రస్తావించదగినివిగా భావిస్తాను.

“ఎంతో సారవంతమైన పాదులో పుట్టి అందంగా, ఏపుగా ఎదిగే తీవతోనల్లు కోటానికి మహోన్నతమూ, శఖోపశఖా విలసితము అయిన పెద్ద వృక్షము కొఱకు వెదకటం, అలాంటి వృక్షానికి అల్లుకొని ఎంతో ఎత్తు పెరగాలని, ఎన్నో పూలు పూయాలని, కాయలు కాయాలని కలలు కనడము, ఆ కొరిక నెరవేరగా నిలువెల్ల పులకరించి తన అదృష్టానికి తానే ఆశ్చర్యపడుటము, అపరిమిత ఆనందాన్ని అనుభవించడము లోక సహజం. కాని ఆ చెట్టుకొక వేరు పురుగుపుట్టి, చీడతగిలి, బలహీనమై, గాలిదెబ్బకు కొమ్మలు విరిగి, కూకటి వ్రేళ్లతో పెళ్లగిలిపోతే ఆతీవ కుప్పకూలి ప్రక్కన బడి ఎంత దుఃఖాన్ని అనుభవిస్తుందో ఎవరికి తెలుసు?” అనే మాటల వల్ల ఆమె ఆవేదన ఒకరికి చెప్పినా అర్ధంకాని అనంతమైనది. అనుభవించిన వాళ్ళకే తెలిసినది. అలాంటి బాధాపరితప్త మానసయైన మండోదరి పట్ల *కవి* చెప్పిన మాటలు సముచితంగా వున్నాయి.🙏🙏🙏🙏🙏
********************

కామెంట్‌లు లేవు: