6, ఆగస్టు 2020, గురువారం

మహాయోగి శ్రీ త్రైలింగ స్వామి..!!

పుట్టింది తెలుగు దేశంలో అయినా,
ఆయన గడిపిన కాలమంతా కాశీలోనే.
ఆయన చూపించిన మహిమలు అపారం.
వారు పొందిన సిద్దులనేకం. వారి దివ్య విభూతి అనంతం.

ఆయనే త్రైలింగ స్వామి. అసలు పేరు శివరామయ్య.
విశాఖపట్నం జిల్లా విజయనగరం దగ్గరలో హాలియా గ్రామంలో జన్మించారు. సంపన్న బ్రాహ్మణ కుటుంబం.
తండ్రి నరసింహారావు, తల్లి విద్యావతి,

ఆయన జననం 19-12-1607.
తల్లి పూజ చేసుకొంటుంటే శివలింగం నుంచి వింత కాంతి ఈ బాలుడిమీద పడటం చూసి యోగ్యుడవుతాడు అనుకొన్నారు.
చిన్నప్పటి నుంచి ఐహిక వాంఛల మీద కోరిక లేదు.
నలభైఏళ్ళకు తండ్రి,యాభైరెండోఏట తల్లి చనిపోయారు.
స్మశానాన్నే ఇల్లుగా చేసుకొని ఆస్తినంతా సవతి తమ్ముడు శ్రీధరుడికి ఇచ్చేసి, అక్కడే ఇంకో ఇరవై ఏళ్ళు గడిపాడు.

స్వగ్రామం వదిలి పాటియాలా సంస్థానంలో బస్తర్ చేరాడు. అక్కడ భాగీరధి స్వామితో పుష్కర తీర్ధానికి వెళ్ళాడు. ఆయన దీక్షను ఇచ్చి గణపతి స్వామి అనే దీక్షా నామం ఇచ్చాడు.అప్పటికి అయ్యగారి వయస్సు డబ్భైఎనిమిది. గురు సమక్షంలో పదేళ్ళ సాధన చేసి, అద్భుత శక్తుల్ని సంపాదించుకొన్నాడు. గురువు మరణించిన తర్వాత
తీర్థ యాత్రలు చేస్తూ రామేశ్వరం చేరాడు.

అక్కడ స్వంత ఊరివారు కనిపించి ఇంటికి రమ్మని కోరినా వెళ్ళలేదు.రామేశ్వరంలో ఒక బ్రాహ్మణబాలుడు చనిపోతే శవాన్ని తీసుకొని వెళ్తూ తలిదండ్రులు విలపిస్తుంటే,
గుండె కరిగి కమండలం లోని నీరు వాడిమీద చల్లాడు. వెంటనే బాలుడు బ్రతికి అందర్నీ ఆశ్చర్యపరచాడు. ఆయన మహత్తు అందరికి తెలిసి సాక్షాత్తు శ్రీరామ లింగేశ్వరుడే గణపతి స్వామి అనుకొన్నారందరూ.
అక్కడి నుండి నేపాల్ చేరాడు.
అక్కడ అడవిలో తపస్సు చేస్తుంటే ఒక పులి వచ్చి ఆయనకు ఎదురుగుండా కదలకుండా కూచునిపోయింది.

రాజుగారి బంధువు ఈ దృశ్యాన్ని చూసి చకితుడైనాడు. పులిని చంపటానికి ప్రయత్నిస్తే వారించాడు.
ఆయన రాజుకు ఈ విషయం చెప్పాడు.
నేపాల్ రాజు వచ్చి సాష్టాంగ పడి అనేక కానుకలిస్తే, తీసుకోకుండా జంతుహింస చేయవద్దని హితవు చెప్పాడు స్వామి.అక్కడి నుంచి టిబెట్,తరువాత మానససరోవరం సందర్శించి, దారిలో ఎన్నో అద్భుతాలను చూపి, హిమాలయాలలో చాలాకాలం తపస్సు చేసి నర్మదా నదీ తీరంలో, మార్కండేయ ఆశ్రమంలో ‘ఖలీ బాబా” అనే అహోరాత్రాలు తపస్సు చేసే యోగిని దర్శించాడు.

ఒకరోజు తెల్లవారు జామున నర్మదా నదిలో పాలు ప్రవహిస్తున్నట్లు,ఈ స్వామి దాన్ని తాగుతున్నట్లు
ఖలీ బాబా చూశారు.గణపతిలోని మహిమేమిటో గ్రహించారు.విషయం తెలిస్తే ఆయన ఇక అక్కడ ఉండరు.

1733లో ప్రయాగ చేరారు. తపో నిష్టలో ఉండగా
ఒకసారి కుంభ వృష్టి కురుస్తోంటే శిష్యుడు రామ తరణ భట్టాచార్య ఆశ్రమంలోకి పోదామని చెప్పినా కదలలేదు. దూరంలో ఒక పడవ మునిగిపోతోందని దాన్ని రక్షించాలని సంజ్న చేశారు.అతడు అక్కడికి వెళ్ళే లోపున పడవ మునుగుతుంటే దిగంబర స్వామి అక్కడ పడవ మీద చేరి దాన్ని రక్షించాడు. శిష్యుడు ఆశ్చర్యం ప్రకటించగా ప్రతి వాడిలోను మహాశక్తులు అజ్ఞాతంగా ఉంటాయని
వాటిని గుర్తించే వారు తక్కువ అని తెలిపారు.

1737లో కాశీ చేరారు దిగంబర గణపతి స్వామి.
అప్పటికి ఆయనకు 130 ఏళ్ళు.
కాశీలో 150 యేళ్ళు గడిపారు.
ఆయనది 300 పౌన్ల బరువైన భారీ విగ్రహం.
గడ్డాలు, మీసాలు పెరిగి దీర్ఘ శరీరంతో దిశ మొలతో, మెడలో పెద్ద రుద్రాక్ష మాలతో, పెద్దబాన పొట్టతో
కాశీ నగర వీధుల్లో సంచరించేవాడు.
గంటలసేపు గంగాజలంపై పద్మాసనంలో తేలి ఉండేవాడు. అలాగే గంటలకాలం నదీగర్భంలో మునిగి ఉండేవాడు. అంటే కుంభకవిద్యలో అద్భుతమైన నేర్పు ఉండేదన్న మాట.కుష్టు రోగులకు సేవచేసి వారిని ఆదరించాడు.

వేద వ్యాస ఆశ్రమం చేరి, అక్కడ సీతానాథా బందోపాధ్యాయుని క్షయ వ్యాధి పోగొట్టి,
హనుమాన్ ఘాట్ చేరాడు.
ఒక మహారాష్ట్ర స్త్రీ రోజు విశ్వేశ్వరుడి అభిషేకం చేసి వస్తు ఈ దిగంబర స్వామిని రోజు చూస్తూ ఏవగించుకొనేది. ఆమె భర్తకు రాచ పుండు. ఆమెకు అందరు దిగంబర స్వామిని అర్ధించమని కోరారు. కానీ తాను తూలనాడిన ఆయన దగ్గరకు వెళ్ళటానికి సందేహించింది.
చివరికి వెళ్లి కాళ్ళమీద పడింది.
ఆయన ఇచ్చిన విభూతితో జబ్బు మాయమైంది.

కాశీ మహానగరంలో ఎందరో తెలుగువారు ఉపాధ్యాయులుగా, అధ్యాపకులుగా ఉన్నారు.
వారు ఈ దిగంబర స్వామి తెలుగు వాడని గుర్తించారు. ఆయనకు "త్రైలింగ స్వామి” అనే పేరు పెట్టారు.
తెలుగు దేశం అంటే త్రిలింగ దేశమే కదా.
అప్పటి నుంచి ఆ పేరే స్థిరపడిపోయింది.

1800లో తన మకాంను దశాశ్వ మేధ ఘాట్ నుండి బిందు మాధవంకు మార్చారు.
ఎప్పుడూ మౌనమే, ధ్యానమే, తపస్సు, యోగ సమాధే. కనుకే ఆయన్ను “మౌన బాబా” అన్నారు.

కాశీరాజు వీరిని తన పడవలోకి ఆహ్వానిస్తే వెళ్ళారు. రాజు బ్రిటిష్ వారు బహుమతిగా ఇచ్చిన కత్తిని స్వామి చూడాలని ముచ్చటపడితే ఇచ్చారు.
అది పొరపాటున గంగలో జారిపడిపోయింది.
రాజుకు కోపం వచ్చి తిట్టాడు. స్వామి తన చెయ్యి గంగా నదిలో పెట్టి ఒకే రకంగా ఉండే రెండు కత్తులను తీసి అందులో రాజుదేదో గుర్తించి తీసుకోమన్నాడు.
రాజు గుర్తించలేకపోతే తానే గుర్తించి చెప్పి ఇచ్చాడు. రెండోదాన్ని గంగలోకి విసిరేశారు స్వామి..

దిగంబరంగా తిరగటం కొంతమందికినచ్చక కేసుపెట్టారు. కోర్టులో కేసు నడిచింది. ఆయన్ను బంధించి తీసుకొని రమ్మని మేజిస్ట్రేట్ ఆర్డర్ వేసాడు.
అలాగే గబ్బిట దుర్గాప్రసాద్ తెచ్చారు. ఈయన మహిమలను అధికారులు ఆయనకు వివరించారు. ఆయన తాను తినే మాంసం స్వామి తింటే శిక్షించను అన్నాడు. స్వామి సైగలతో తాను తినే దాన్ని మేజిస్ట్రేట్ తింటారా అని ప్రశ్నించాడు. వెంటనే తన చేతిలో మల విసర్జన చేసుకొని నోట్లో వేసుకొని తినేశారు. మతి పోయింది మేజిస్ట్రేట్ కు. అయితే సుగంధ పరిమళం
కోర్టు అంతా వ్యాపించింది. స్వామి మహిమ తెలిసి దిగంబరంగా తిరిగే హక్కు ఇచ్చాడు.

ఒకసారి ఒక ఆకతాయి..ఆయన బజారులో వెళ్తుంటే మర్మాంగాన్ని గుంజాడు. అది కొన్ని గజాలు సాగింది. వాడు భయపడి పారిపోయాడు.
దుండగులు కొందరు సున్నపు తేట ఇచ్చి పాలు అని చెప్పారు. శుభ్రంగా తాగేశాడు స్వామి.
వెంటనే మూత్రరూపంలో దాన్ని అంతట్ని విసర్జించాడు.

శ్రీరామ కృష్ణ పరమహంస 1868లో కాశీ వచ్చినప్పుడు తన మేనల్లుడు హృదయనాథ్తో కలిసి మౌనస్వామిని దర్శించారు. ఆయనకు బాబా నశ్యం వేసుకొనే కాయ కానుకగా ఇచ్చారు. స్వామిని “నడయాడే విశ్వనాథుడు” అని చెప్పారట పరమహంస.
ఇంకోసారి అర్ధమణుగు పాయసం వండించి తీసుకొని వెళ్లి స్వామికి అందించి తినిపించారట.
పరమహంస స్వామిని "ఈశ్వరుడు ఏకమా అనేకమా” అని ప్రశ్నిస్తే - సమాధి స్తితిలో ఏకం అనీ, వ్యావహారిక దృష్టిలో అనేకం అని సైగలతో చెప్పారు స్వామి. పరమహంస, స్వామిని తన ఆశ్రమానికి ఆహ్వానించి సత్కరించారు. ఇద్దరూ మహా పురుషులే. పరమహంసలే ఒకరి విషయం రెండో వారికి తెలుసు.
ఎన్నో అద్భుతాలు చేసిన రామకృష్ణులు స్వామిని అంతగా గౌరవించారంటే బాబా ఎంత మహిమాన్వితుడో తెలుస్తోంది.

ఒకసారి రాజఘాట్ నుండి విద్యానందస్వామి
అనే యతి వీరిని దర్శించటానికి కేదార్ ఘాట్లో ఉన్న మనస్వామి దగ్గరకు వచ్చారు.
ఇద్దరు గాఢంగా ఆలింగనం చేసుకొన్నారు.
కాసేపట్లో అందరు చూస్తుండగానే ఇద్దరు మాయమైనారు. అరగంట తర్వాత స్వామి తిరిగి వచ్చారు.
తాను ఆయన్ను రాజ ఘాట్లో దింపి వచ్చాను అని స్వామి అందరి సందేహాల్ని తీర్చారు.

పంచగంగా ఘట్టంలో చిన్న భూగృహం నిర్మింపజేసుకొని 32 ఏళ్ళు సేవ చేసి, ఆయన విగ్రహాన్ని చేయించాలని రెండునెలల గడువు కావాలని కోరితే,
మరణాన్ని వాయిదా వేసుకొని, భక్తుడైన మంగళదాస్ కోర్కె తీర్చి భూగృహం చేరి ఉదయం ఎనిమిది నుండి మధ్యాహ్నం మూడు వరకు యోగ సమాధిలో ఉండి, తానే బయటకు వచ్చి భక్తుల హారతులు అందుకొని యోగాసనంలో కూర్చుండి, బ్రహ్మ రంధ్రాన్ని ఛేదించుకొని 26-12-1887న సర్వజిత్ సంవత్సర పుష్య శుద్ధ ఏకాదశి సోమవారం త్రైలింగ స్వామి తమ ఇహ జీవితాన్ని చాలించుకొన్నారు.

ఆయన శరీరాన్ని చెక్కపెట్టెలో పెట్టి ఆయన కోరిన విధంగానే తాళం వేసి అసి నది నుండి వరుణ నది దాక ఊరేగించి గంగా నదీ ప్రవాహంలో వదిలారు.
ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాశీ విశ్వేశ్వరునికి ఎలా నిత్యం అభిషేకం, పూజా జరుగుతాయో స్వామి విగ్రహానికి కూడా కేదార్ ఘాట్లోన మఠంలో జరగటం విశేషం. పతంజలి యోగంలో విభూతి పాదంలో చెప్పిన అణిమాది అష్ట సిద్ధులు, కుంభక యోగంలో త్రైలింగ స్వామి సిద్ధింప జేసుకున్నారు. ఆయన సంస్కృతంలో రాసిన “మహా వాక్య రత్నావళి”కి వ్యాఖ్యను బెంగాలిలో రాశారు. కాని మన తెలుగు వారి దృష్టి ఇంకా దానిపై పడకపోవటం విచారకరం అంటారు బాధతో బి. రామరాజు గారు. (ఆంధ్ర యోగులు రచయిత).

280 సంవత్సరాలు జీవించి, స్వచ్చంద మరణాన్ని పొంది, యోగ సిద్దులలో త్రివిక్రములై ఆశ్రిత జన కల్పవృక్షమై మౌన ముద్రాలన్కారులై తెలుగువారై ఉండి ఉత్తర దేశంలో, అందులోను కాశీ మహా క్షేత్రంలో బ్రహ్మ రధం పట్టించుకొన్న త్రిలింగ యోగి నామ ఉచ్చారణ చాలు మనం తరించటానికి.
(సేకరణ)

కామెంట్‌లు లేవు: