6, ఆగస్టు 2020, గురువారం

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం



అష్టమ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము

సముద్రమునుండి అమృతము ఉద్భవించుట - శ్రీమహావిష్ణువు మోహినిగ అవతరించుట

ఓం నమో భగవతే వాసుదేవాయ
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

8.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)

నిఃసత్త్వా లోలుపా రాజన్ నిరుద్యోగా గతత్రపాః|

యదా చోపేక్షితా లక్ష్మ్యా బభూవుర్దైత్యదానవాః॥6614॥

మహారాజా! లక్ష్మీదేవి దైత్యులను, దానవులను ఉపేక్షించుటచే వారు బలహీనులై, భోగాసక్తులై ప్రయత్న శీలములను కోల్పోయి, సిగ్గు విడిచి, ప్రవర్తింపసాగిరి.

8.30 (ముప్పదియవ శ్లోకము)

అథాసీద్వారుణీ దేవీ కన్యా కమలలోచనా|

అసురా జగృహుస్తాం వై హరేరనుమతేన తే॥6615॥

అనంతరము సముద్రమథనము జరుగుచుండగ కమలలోచనయైన వారుణీ దేవి కన్యారూపమున ప్రకటమయ్యెను. భగవంతుని అనుమతితో అసురులు ఆమెను స్వీకరించిరి.

8.31 (ముప్పది ఒకటవ శ్లోకము)

అథోదధేర్మథ్యమానాత్కాశ్యపైరమృతార్థిభిః|

ఉదతిష్ఠన్మహారాజ పురుషః పరమాద్భుతః॥6616॥

మహారాజా! పిదప అమృతమును అభిలషించుచు సురాసురులు సముద్రమును మథించుచుండగా, అందుండి ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమాయెను.

8.32 (ముప్పది రెండవ శ్లోకము)

దీర్ఘపీవరదోర్దండః కంబుగ్రీవోఽరుణేక్షణః|

శ్యామలస్తరుణః స్రగ్వీ సర్వాభరణభూషితః॥6617॥

8.33 (ముప్పది మూడవ శ్లోకము)

పీతవాసా మహోరస్కః సుమృష్టమణికుండలః|

స్నిగ్ధకుంచితకేశాంతః సుభగః సింహవిక్రమః॥6618॥

అతని భుజములు దీర్ఘములై బలిష్ఠముగా నుండెను. ఆయన కంఠము శంఖమును బోలి సుందరముగా నుండెను. కన్నులు అరుణకాంతితో ఒప్పుచుండెను. ఆ పురుషుని శరీరము శ్యామలవర్ణముతో శోభిల్లుచుండెను. మెడలో వనమాల గలిగి, సర్వాంగముల యందు ఆభరణములతో అలంకృతుడై యుండెను. పీతాంబరధారియైన ఆ పురుషుని చెవులయందు మణికుండలములు విరాజిల్లుచుండెను. అతడు విశాల వక్షఃస్థలమును గలిగి, సింహవిక్రముడై తేజరిల్లుచుండెను. నుదుట మృదువైన ముంగురులు నిగనిగలాడుచుండగా అనుపమ సౌందర్యమూర్తియైన ఆ పురుషుడు దివ్య కాంతులతో విరాజిల్లు చుండెను.

8.34 (ముప్ఫది నాలుగవ శ్లోకము)

అమృతాపూర్ణకలశం బిభ్రద్వలయభూషితః|

స వై భగవతః సాక్షాద్విష్ణోరంశాంశసంభవః॥6619॥

ఆ మహాత్ముడు చేతులయందు కంకణములు గల్గి అమృతముతో నిండిన కలశమును పట్టుకొనియుండెను. అతడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు యొక్క అంశాంశావతారము.

8.35 (ముప్పది ఐదవ శ్లోకము)

ధన్వంతరిరితి ఖ్యాత ఆయుర్వేదదృగిజ్యభాక్|

తమాలోక్యాసురాః సర్వే కలశం చామృతాభృతమ్॥6620॥

8.36 (ముప్పది ఆరవ శ్లోకము)

లిప్సంతః సర్వవస్తూని కలశం తరసాహరన్|

నీయమానేఽసురైస్తస్మిన్ కలశేఽమృతభాజనే॥6621॥

8.37 (ముప్పది ఏడవ శ్లోకము)

విషణ్ణమనసో దేవా హరిం శరణమాయయుః|

ఇతి తద్దైన్యమాలోక్య భగవాన్ భృత్యకామకృత్|

మా ఖిద్యత మిథోఽర్థం వః సాధయిష్యే స్వమాయయా॥6622॥

అతడే ఆయుర్వేద ప్రవర్తకుడు, యజ్ఞ భోక్త, ధన్వంతరిగా విఖ్యాతుడు. దైత్యుల దృష్టి అతని చేతులయందున్న అమృతకలశముపై బడెను. వెంటనే వారు బలవంతముగా ఆ అమృత కలశమును లాగుకొనిరి. వారు మొదటినుండియు సముద్రమథనము ద్వారా లభించిన వస్తువులను అన్నింటిని తామే పొందవలెనని ఆరాతపడుచుండిరి. అసురులు ఆ అమృత కలశమును లాగుకొని పోవుచుండగా, దేవతల మనస్సులు విషాదభరితములయ్యెను. అంతటవారు శ్రీహరిని శరణు జొచ్చిరి. భక్తుల పాలిటి కల్పతరువైన భగవంతుడు వారి దైన్య స్థితిని గాంచి, వారితో ఇట్లనెను- దేవతలారా! మీరు ఖిన్నులు కావలదు. నేను నా మాయ ద్వారా అసురులమధ్య పరస్పరము కలహమును సృష్టించి, మీ మనోరథమును ఈడేర్తును

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం
7702090319

కామెంట్‌లు లేవు: