6, ఆగస్టు 2020, గురువారం

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము*

*సముద్రమునుండి అమృతము ఉద్భవించుట - శ్రీమహావిష్ణువు మోహినిగ అవతరించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*8.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*

*ధర్మః క్వచిత్తత్ర న భూతసౌహృదం త్యాగః క్వచిత్తత్ర న ముక్తికారణమ్|*

*వీర్యం న పుంసోఽస్త్యజవేగనిష్కృతం న హి ద్వితీయో గుణసంగవర్జితః॥6606॥*

ఒకనియందు ధర్మబుద్ధి గలదు, కాని, వానికి భూతదయలేదు. మరొకనికి త్యాగము ఉండును. కాని, అది మోక్షహేతువు కాకుండెను. ఇంకొకడు బలసంపన్నుడే, కాని, అతడు మృత్యుముఖమునుండి తప్పించుకొనలేడు. గుణాతీతుడు అద్వైతస్థితిలో యున్నవాడితో, నాకేమి పని?

*8.22 (ఇరువది రెండవ శ్లోకము)*

*క్వచిచ్చిరాయుర్న హి శీలమంగలం క్వచిత్తదప్యస్తి న వేద్యమాయుషః|*

*యత్రోభయం కుత్ర చ సోఽప్యమంగలః సుమంగలః కశ్చ న కాంక్షతే హి మామ్॥6607॥*

ఒకడు దీర్ఘాయుష్మంతుడే కాని, వాని సౌశీల్యము శుభప్రదమైనది కాదు. ఒక్కొక్కరియందు ఆ శీలము కూడా ఉంటుంది కాని, వాని ఆయుఃప్రమాణము ఎంతయో తెలియదు. ఈ రెండునూ ఉన్నవాడు అమంగళవేషధారియై యున్నాడు. సకల సద్గుణ సంపన్నుడైనవాడు, నన్ను కోరుటయే లేదు.

*8.23 (ఇరువది మూడవ శ్లోకము)*

*ఏవం విమృశ్యావ్యభిచారిసద్గుణైర్వరం  నిజైకాశ్రయతాగుణాశ్రయమ్|*

*వవ్రే వరం సర్వగుణైరపేక్షితం  రమా ముకుందం నిరపేక్షమీప్సితమ్॥6608॥*

ఇట్లు తర్కించి, చివరకు లక్ష్మీదేవి తాను చిరకాలమునుండి కోరుకొనుచున్న శ్రీహరినే వరించెను. ఏలయన, అతని యందు సకలసద్గుణములను స్థిరముగా భాసిల్లుచుండెను. ప్రాకృతగుణములు అతనిని ఏ మాత్రమూ స్పృశింపవు. అనగా అతడు త్రిగుణాతీతుడు. అణిమాది సిద్ధులు అతనిని కోరుకొనుచున్నను అతడు వాటిని అపేక్షింపడు. వాస్తవముగా లక్ష్మీదేవికి ఏకైక ఆశ్రయుడు ఆ శ్రీహరియే. కనుక ఆమె ఆయననే వరించెను.

*8.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*

*తస్యాంసదేశ ఉశతీం నవకంజమాలాం థ మాద్యన్మధువ్రతవరూథగిరోపఘుష్టామ్|*

*తస్థౌ నిధాయ నికటే తదురః స్వధామ  సవ్రీడహాసవికసన్నయనేన యాతా॥6609॥*

లక్ష్మీదేవీ నవవికసిత పద్మమాలను ఆయన మెడలో వేసెను. ఆ మాలచుట్టును మత్తిల్లిన మధుపములు ఝంకారము చేయుచుండెను. ఆ దేవి సిగ్గుతో దరహాసము చేయుచు ప్రేమతో నిండిన చూపులతో తన నివాసస్థానమగు శ్రీహరియొక్క వక్షఃస్థలమును చూచుచు ఆయన సమీపమున నిలబడెను.

*8.25 (ఇరువది ఐదవ శ్లోకము)*

*తస్యాః శ్రియస్త్రిజగతో జనకో జనన్యా వక్షో నివాసమకరోత్పరమం విభూతేః|*

*శ్రీః స్వాః ప్రజాః సకరుణేన నిరీక్షణేన యత్ర స్థితైధయత సాధిపతీంస్త్రిలోకాన్॥6610॥*

జగన్నాథుడైన శ్రీమహావిష్ణువు, జగజ్జనని, సకల సంపదలకు అధిష్ఠాత్రియైన లక్ష్మీదేవికి తన వక్షఃస్థలమే శాశ్వత నివాసస్థానముగా చేసెను. లక్ష్మీ దేవియు అచట విరాజిల్లుచు వాత్సల్యపూర్ణములైన కృపాదృష్టులతో ముల్లోకములను, లోకపాలురను, తన ప్రియమైన ప్రజలను సంపన్నులను గావించెను.

*8.26 (ఇరువది ఆరవ శ్లోకము)*

*శంఖతూర్యమృదంగానాం వాదిత్రాణాం పృథుః స్వనః|*

*దేవానుగానాం సస్త్రీణాం నృత్యతాం గాయతామభూత్॥6611॥*

ఆ సమయమున శంఖారావములు, తూర్యనాదములు, వీణా వేణు మృదంగధ్వనులు మ్రోగెను. గంధర్వులు, అప్సరసలు గానము చేయుచు నృత్యముల నొనర్చిరి.

*8.27 (ఇరువది ఏడవ శ్లోకము)*

*బ్రహ్మరుద్రాంగిరోముఖ్యాః సర్వే విశ్వసృజో విభుమ్|*

*ఈడిరేఽవితథైర్మంత్రైస్తల్లింగైః పుష్పవర్షిణః॥6612॥*

బ్రహ్మదేవుడు, పరమశివుడు, అంగిరసుడు మొదలగు ప్రజాపతులు, పుష్పములను వర్షించుచు భగవానుని గుణములను, స్వరూపమును, లీలలను వర్ణించునట్టి మంత్రముల ద్వారా ఆ స్వామిని ప్రస్తుతించిరి.

*8.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*

*శ్రియా విలోకితా దేవాః సప్రజాపతయః ప్రజాః|*

*శీలాదిగుణసంపన్నా లేభిరే నిర్వృతిం పరామ్॥6613॥*

దేవతలు, ప్రజాపతులు, ప్రజలు, మొదలగువారందరును లక్ష్మీదేవి కృపాదృష్టిచే సచ్ఛీలము మున్నగు ఉత్తమ గుణములతో పరమానంద భరితులైరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

కామెంట్‌లు లేవు: