6, ఆగస్టు 2020, గురువారం

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - ఎనిమిదవ అధ్యాయము*

*సముద్రమునుండి అమృతము ఉద్భవించుట - శ్రీమహావిష్ణువు మోహినిగ అవతరించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*8.7 (ఏడవ శ్లోకము)*

*తతశ్చాప్సరసో జాతా నిష్కకంఠ్యః సువాససః|*

*రమణ్యః స్వర్గిణాం వల్గుగతిలీలావలోకనైః॥6592॥*

తరువాత అందుండి అప్సరసలు ప్రాదుర్భవించిరి. వారు మేలి వస్త్రములు కలిగి, కంఠములయందు సువర్ణాభరణములతో వెలుగొందుచుండిరి. వారు మనోహరమైన గమనములతో, విలాసవంతమైన చూపులతో దేవతలకును ఆకర్షించుచుండిరి.

*8.8 (ఎనిమిదవ శ్లోకము)*

*తతశ్చావిరభూత్సాక్షాచ్ఛ్రీ రమా భగవత్పరా|*

*రంజయంతీ దిశః కాంత్యా విద్యుత్సౌదామనీ యథా॥6593॥*

పిమ్మట, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవియే ఆవిర్భవించెను. ఆమె శ్రీహరియందు అనురాగము కల్గియుండెను. ఆ దేవి మెరుపుతీగవలె ధగధగలాడుచు తన దేహకాంతితో దశదిశలను వెలుగులతో నింపుచుండెను.

*8.9 (తొమ్మిదవ శ్లోకము)*

*తస్యాం చక్రుః స్పృహాం సర్వే ససురాసురమానవాః|*

*రూపౌదార్యవయోవర్ణమహిమాక్షిప్తచేతసః॥6594॥*

ఆమె తన సౌందర్యము, ఔదార్యము, తారుణ్యము, రూపసౌభాగ్యము మున్నగు వాని మహిమలచే అందరి చిత్తములను ఆకర్షించుచుండెను. దేవతలు, అసురులు, మానవులు అందరును ఆమెను గ్రహించుటకై వాంఛించుచుండిరి.

*8.10 (పదియవ శ్లోకము)*

*తస్యా ఆసనమానిన్యే మహేంద్రో మహదద్భుతమ్|*

*మూర్తిమత్యః సరిచ్ఛ్రేష్ఠా హేమకుంభైర్జలం శుచి॥6595॥*

ఇంద్రుడే స్వయముగా ఆమె ఆసీనురాలగుటకై ఒక అద్భుతమైన ఆసనమును తీసికొని వచ్చెను. పవిత్రమైన నదులు మూర్తీభవించిన బంగరు కలశములతో నిర్మలజలములను అభిషేకమునకు తీసికొని వచ్చెను.

*8.11 (పదకొండవ శ్లోకము)*

*ఆభిషేచనికా భూమిరాహరత్సకలౌషధీః|*

*గావః పంచ పవిత్రాణి వసంతో మధుమాధవౌ॥6596॥*

పృథ్వి అభిషేకమునకు యోగ్యమైన ఓషధులను అన్నింటిని ఇచ్చెను. గోవులు, పంచగవ్యములను, వసంత ఋతువు చైత్ర వైశాఖములయందు ఉత్పన్నమగు పూవులను, పండ్లను సమర్పించెను.

*8.12 (పండ్రెండవ శ్లోకము)*

*ఋషయః కల్పయాంచక్రురభిషేకం యథావిధి|*

*జగుర్భద్రాణి గంధర్వా నట్యశ్చ ననృతుర్జగుః॥6597॥*

ఈ పదార్థములతో ఋషులు విధ్యుక్తముగ ఆ లక్ష్మీ దేవికి అభిషేకమొనర్చిరి. గంధర్వులుమంగళ ప్రదమైన గీతములను ఆలపించిరి. నర్తకీమణులు నృత్యములనొనర్చుచు పాటలు పాడిరి.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

కామెంట్‌లు లేవు: