24, ఆగస్టు 2020, సోమవారం

శ్లోకం

అనగనగా ఒక రామ భక్తుడు, రాముడంటే వల్లమాలిన ప్రేమ. పోనీలే అని విష్ణువన్నా నమస్కరిస్తాడు కాని శివుడి పేరు ఎత్తడు.
ఒక సారి ఓ పండితుడి దగ్గరికి వెళ్లి రోజూ చదువుకునేలా విష్ణువును గూర్చి ఒక శ్లోకం వ్రాసి ఇమ్మన్నాడు.

ఆ పెద్దాయనకీ తెలుసు ఇతడికి శివుడు అంటే పడదని సరే ఒక కాగితం మీద మంచి శ్లోకం ఒకటి వ్రాసి ఇచ్చాడు. విష్ణువుని స్తుతిస్తూ వ్రాసాను. మీ విష్ణువు సంతోషిస్తాడు చదువుకో అంటూ.

"గవీశపాత్రో నగజార్తిహారీ కుమారతాతః శశిఖండమౌళిః
లంకేశ సంపూజితపాదపద్మః పాయాదనాదిః  పరమేశ్వరో నః "

ఆశ్చర్య పోయాడు చదవగానే అందులో ఏమని చెప్పబడింది? "పరమేశ్వరః నః పాయాత్" అని. అంటే పరమేశ్వరుడు మనలను కాపాడు గాక అని అర్ధం. తక్కిన పదాలన్నీ ఆ పరమేశ్వరునికి  విశేషణాలు.. అర్ధం చూడండి :

గవీశపాత్రః = గవాం ఈశః  గవీశః  ఆవులకు ప్రభువు అయిన వృషభం. అది వాహనంగా కలవాడు గవీశపాత్రః అంటే సదాశివుడు .

నగజార్తి హారీ = నగజ అంటే పార్వతీ దేవి ఆవిడ ఆర్తిని పోగొట్టిన వాడూ అంటే సాంబశివుడే. 

కుమారతాతః .... తాతః అనే సంస్కృత పదానికి తండ్రి అని అర్థం కుమారస్వామి యొక్క తండ్రి అయిన వాడూ, శివుడే నిస్సందేహంగా.

శశి ఖండ మౌళి: అంటే చంద్రవంక శిరసున ధరించిన వాడూ.

లంకేశ సంపూజిత పాద పద్మ: లంకాధిపతి అయిన రావణుని చే పూజింపబడిన పాదపద్మములు కలవాడూ. 

అనాదిః = ఆది లేని వాడూ అంటే ఆదిమధ్యాన్తరహితుడు అయినవాడూ అటువంటి  పరమేశ్వరః నః పాయాత్

వృషభ వాహనుడూ, పార్వతీ పతి, కుమార స్వామి తండ్రీ, చంద్రశేఖరుడూ, రావణునిచే సేవింప బడిన వాడూ అనాది అయిన పరమేశ్వరుడు మనలను కాచు గాక అనేది తాత్పర్యం .

అర్ధం తెలియగానే మతి పోయింది. వ్రాసిన వాని మీద పిచ్చ కోపం వచ్చింది అది పట్టుకుని తెగ తిరిగాడు.  చివరికి ఒకాయన అది విష్ణువుని కీర్తించేదే  ఏమీ అనుమానం లేదు అని అతడిని ఓదార్చాడు.

ఇది మరో ఆశ్చర్యం .

అనాది అనే మాటలో ఉంది అంతా.., కిటుకు చూడండి పరమేశ్వరుడు ఎలాటివాడూ  అంటే "అనాదిః" అట. అంటే ఆది లేని వాడు. అంటే..
"పరమేశ్వర" లో ఆది అక్షరం లేనివాడు.
ఇప్పుడు ఏమయ్యింది? "రమేశ్వరః" అయ్యింది. అంటే లక్ష్మీపతి అయిన విష్ణువే కదా!

గవీశపాత్రః... లో గ తీసెయ్యండి.., వీశపాత్రః అవుతుంది.
విః  అంటే పక్షి అని అర్ధం. వీనామ్  ఈశః  వీశః.. పక్షులకు రాజు అంటే గరుడుడు, ఏతా వాతా గరుడ వాహనుడైన విష్ణువు .

నగజార్తి హారీ ... మొదటి అక్షరం తీసెయ్యండి..
గజార్తి హారీ.. గజేంద్ర మోక్షణము చేసిన విష్ణువు.
కుమారతాతః.. ఆది అక్షరం తీసేస్తే.. మారతాతః.. మన్మధుని తండ్రి అయిన విష్ణువు.

శశి ఖండ మౌళి:.. మొదటి అక్షరం లేక పోతే శిఖండమౌళిః.. నెమలిపింఛము ధరించిన విష్ణువు .
 
లంకేశ సంపూజిత పాద పద్మ:.. మళ్ళీ ఆది లేనిదిగా చెయ్యండి,
కేశ సంపూజిత పాద పద్మ:... క అంటే బ్రహ్మ , ఈశః  అంటే రుద్రుడు.. అంటే బ్రహ్మ రుద్రేన్ద్రాదులు బాగుగా పూజించిన పాదపద్మములు కల విష్ణువు.
అతడు మనలను కాపాడు గాక ....

గరుడ వాహనుడూ, గజేంద్రుని ఆర్తిని పోగొట్టిన వాడూ, మన్మధుని తండ్రీ, నెమలి పింఛము దాల్చిన వాడూ, బ్రహ్మ రుద్రాదుల చేత పూజింపబడిన పాద పద్మములు కలవాడూ అయిన రమేశ్వరుడు.. విష్ణువు మనలను కాచు గాక అనే తాత్పర్యం .

ఇప్పటికి అతడు శాంతించాడు.

సమన్వయించుకోకపోతే జీవితాలు దుర్భరం ఔతాయి, సర్వదేవతలలో   విష్ణువుని దర్శించగలిగితే వాడు వైష్ణవుడు . సర్వ దేవతలలో శివుని దర్శించగలిగితే వాడు భగవంతుడి భక్తుడు.

     🙏 సర్వేజనా సుఖినో భవంతు 

కామెంట్‌లు లేవు: