మాంగల్య సూత్రధారణలో మూడు ముళ్ళు వేయడానికి కారణం వారి శరీరం, మనస్సు, ఆత్మలు లయం కావడం ద్వారా, ఆ మూడు ముళ్ళ బంధం ఏడేడు జన్మ ల బంధంగా మారుతుందని, ఆదర్శ దాంపత్యముగా నిలుస్తుందని, నూరేండ్ల పంటగా స్థిరపడుతుందని అర్థం.
వివాహ వేడుకలోని సప్తపది లో నూతన దంపతులు వేసే ఏడడుగులకు ఏడు అర్ధాలు ఉన్నాయి.
మొదటి అడుగు - శరీర బలం కోసం
రెండవ అడుగు - మానసిక బలం కోసం
మూడవ అడుగు - కష్టమైనా, సుఖమైనా కలిసి బ్రతకడం కోసం
నాలుగో అడుగు - ఆరోగ్యం కోసం
అయిదవ అడుగు - పశుసంపదల వినియోగం కోసం
ఆరవ అడుగు - ఋతు సంపదలు అనుగ్రహించడం కోసం
ఏడవ అడుగు - హోమాన్ని చేసే అవధూత ఆశీర్వాదం కోసం
"ధర్మమార్గంలోనూ, అర్థ సంపాదనలోనూ, దాని వినియోగం లోనూ, దైహిక, మానసిక కోర్కెలు ను సాధించడంలోనూ, నా సహ ధర్మచారిణిని అతిక్రమించను, వేరొకరితో కలిసి నన్ను అంకితం చేసుకోను" అని వివాహ ప్రతిఙ్ఞ చేయిస్తారు.
కన్య ఇల్లాలుగా, ఇల్లాలు తల్లి గా, బ్రహ్మచారి గృహస్తుడుగా, గృహస్తుడు తండ్రి గా మారి సంతానాన్ని మంచి పౌరులు గా తీర్చి దిద్దడమే భారతీయ సంస్కృతి. 'ఓం కారం లో అర్ధం కూడా అదే,' అ'కారం,' ఉ'కారం,' మ'కారం అనే ప్రణవాలు ఉన్నవి.' అ'కారం పురుషుడైతే' ఉ'కారం స్త్రీ అయితే' మ'కారం సంతానం అవుతుంది.
సంతాన విషయం లో ప్రేగు అమ్మ దైతే, పేరు నాన్నది. అమ్మ ఒడి గుడి అయితే, నాన్న భుజం లోకాన్ని చూపే బడి. అమ్మ జోలపాట ఎలాగో, నాన్న నీతి పాఠం అలాగ. గుండెల్లో దాచుకున్న అమ్మ ప్రేమ గొప్పదా? గుండెల మీద తన్నినా కిమ్మనక నవ్వే నాన్న ప్రేమ గొప్పదా? వెరసి ఇద్దరూ పెద్ద బాలశిక్ష లోని పదాలూ, అర్ధాలూ, అందుకే "మాత్రుదేవో భవ, పితృ దేవో భవ" అనితైత్తిరీయోపనిషత్తు తెలుపుతుంది.
సంతానం కలిగిన తర్వాత వారికి సేవలు చేస్తూ "ఇది గాక సౌభాగ్య, మిదిగాక తపము, ఇదిగాక వైభవం ఇలనొకటి కలదా" అని పరవశించని తల్లులు ఉంటారా? అమ్మ చూపేది ప్రేమే. భార్య అందించేది ప్రేమే. అమ్మ ప్రేమ లో వాత్సల్యముంటే, భార్య ప్రేమలో అనురాగం కనిపిస్తుంది. ఆ ఇద్దరి ప్రేమ బంధంలో ముడిపడి ఉండేది పురుషుని జీవితం. జీవితాన్ని ఇచ్చేది తల్లయితే, ఆ జీవితానికో అర్థాన్ని ఇచ్చేది సతి. వారిద్దరి సేవలను జీవితోత్సవంగా చేసుకోవాలి పురుషుడు....
***********************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి