8, డిసెంబర్ 2020, మంగళవారం

ముగ్గురు మహిళలు..

 *ముగ్గురు మహిళలు..*


"అయ్యా! మా అమ్మాయి, కొన్ని చిత్రాలు పెన్సిల్ తో వేసింది, మీరు చూడండి" అంటూ మా పోస్టుమాన్ (క్షమించాలి, గబుక్కున తెలుగు పదం గుర్తు రాలేదు!) ఒక పుస్తకం ఇచ్చాడు..


చక్కటి బొమ్మలు గీసింది, శివ పార్వతులు, లక్ష్మీ నారాయణులు, రాధాకృష్ణులు, కృష్ణ లీలలు, ఇలా దేవీ దేవతల చిత్రాలు, రంగవల్లులు వేసే స్త్రీల చిత్రాలు, ఒకటేమిటి అన్ని రకాల చిత్రాలు వేసింది..అన్నింటికన్నా ఎక్కువగా మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి చిత్రాన్ని ఎక్కువ సార్లు వేసింది..అలాగే త్రిమూర్తి స్వరూపుడు దత్తాత్రేయుడి చిత్రాన్ని కూడా వేసి ఉన్నది..ఏదో ఆషామాషీగా ఆ బొమ్మలను వేయలేదు..చాలా శ్రద్ధగా వేసింది..


సంతోషం తో నేనూ, మా ఆవిడా చెప్పాము, "అమ్మా! చాలా బాగున్నాయి" అని..ఆ పిల్లా సంతోష పడింది.."మన స్వామివారి ప్రేరణ తోనే ఈ చిత్రాలన్నీ వేయగలిగాను.." అన్నది..మా ఇద్దరికీ ఒక్కక్షణం ఆ మాట అర్ధం కాలేదు.."ప్రేరణ ఏ విధంగా పొందావు..?" అన్నాను..నిరంతరం స్వామివారి గురించే ఆలోచించేదానిని..అందుకని ముందుగా నా బొమ్మలు స్వామివారి చిత్రం తోనే మొదలుపెట్టాను.." అన్నది..ఎంత ఆరాధన అని అనిపించింది..


ఆ అమ్మాయి పేరు..షేక్ రంజాన్ బీ, వాళ్ళ నాన్న షేక్ మౌలాలీ....ముస్లిములు..


"అయ్యగారూ..నేను దత్తదీక్ష తీసుకుందామని అనుకుంటున్నాను..తీసుకోవచ్చా..?" 

ఈ మాట పోయిన దత్తదీక్షా సమయం లో నన్ను అడిగింది ఓ యువతి..ఆ యువతీ..ఆమె భర్తా ఇద్దరూ శ్రీ స్వామివారి ని అత్యంత భక్తిగా కొలుస్తారు..ఆ సంగతి మాకందరికీ బాగా తెలుసు..ఈ దంపతుల గురించి సంవత్సరం క్రితం వ్రాసి, సోషల్ మీడియా లో పోస్ట్ చేసివున్నాను..


"సరే! " అన్నాను..ప్రక్కరోజుకే దీక్షావస్త్రాలు తీసుకొచ్చుకున్నది..శ్రీ స్వామివారి సమాధి వద్ద ఉంచిన దీక్షా మాలలు మెడలో ధరించింది..అత్యంత నిష్ఠతో దీక్ష కొనసాగించింది..చివరగా అందరు భక్తులతో పాటు అగ్నిగుండం లోంచి నడచి వచ్చి..శ్రీ స్వామివారి సమక్షం లో దీక్ష విరమించింది..


ఆ యువతి పేరు కరిష్మా..ఆవిడకూడా ముస్లిమే..


"ప్రసాద్ గారేనా..స్వామీ నేను స్వామివారి సమాధి మీద పరచుకోవడానికి వస్త్రాన్ని ఇద్దామనుకుంటున్నాను..మీరు తీసుకుంటారా..?" అని ఒకావిడ ఓ సంవత్సరం క్రితం ఫోన్ చేసింది..


"అమ్మా..మీరు భక్తితో సమర్పించేది వస్త్రమైనా పర్లేదు..తీసుకుంటాము.." అన్నాను..


"చాలా సంతోషం స్వామీ..మీకు అనేక కృతజ్ఞతలు.." అన్నది..


ఆ ప్రక్కరోజు ఉదయమే స్వామివారి మందిరానికి వచ్చి, తాను తెచ్చిన వస్త్రాన్ని అర్చకస్వామి చేతికిచ్చి..స్వామివారి విగ్రహం దగ్గర నిలబడి..శాస్త్రోక్తంగా అర్చన చేయించుకున్నది..వెళ్లేముందు నా దగ్గరకు వచ్చి..అన్నదానం చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో కనుక్కుని..తన వీలు చూసుకొని..ఇక్కడ అన్నదానం చేస్తానని చెప్పి..ఆరోజు తన తరఫున అన్నదానం లో ఒక స్వీట్ చేయించమని అడిగి..అందుకయ్యే ఖర్చును..మేము వద్దని వారిస్తున్నా వినకుండా నా చేతిలో పెట్టి వెళ్ళిపోయింది..


ఆ తరువాత చాలా సందర్భాలలో స్వామివారికి పూలమాలలు పంపడమో..లేదా...అన్నదానం కోసం విరాళం ఇవ్వడమో చేస్తూనే ఉన్నది..


ఈ యువతి పేరు అష్రాఫ్ జాన్..ముస్లిమే..


ఈ ముగ్గురిలోనూ సారూప్యత ఏమిటంటే..వీళ్లకు శ్రీ స్వామివారంటే అత్యంత భక్తి..విశ్వాసం..శ్రీ స్వామివారు కోరుకునేది కూడా ఆ రెండే..మతాన్ని కాదు.


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: