8, డిసెంబర్ 2020, మంగళవారం

ధార్మికగీత - 103*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                         *ధార్మికగీత - 103*

                                   *****

         *శ్లో:- సత్యం జన విరోధాయ ౹*

                *అసత్యం జనరంజనం  ౹*

                *సురా విక్రీయతే స్థానం  ౹*

                *దధి క్షీరం  గృహే గృహే ౹౹*

                                   *****

*భా :- సత్యమే దైవము. దైవమే సత్యము. సత్యమే ధర్మానికి ఆధారము. జగత్తు సత్యమూలకము. సత్యమే పరమపదము. సత్యము లేని పూజలు, నోములు ,జపాలు,   తపాలు వ్యర్థం. ఇంతటి మహత్తర శక్తి గల సత్యము నేటి ఆధునిక ,సాంకేతిక యుగంలో జనానికి అప్రియమై పోతున్నది. సత్యాన్ని నమ్ముకుంటే పుట్టగతులు లేవని ప్రజల ప్రగాఢ విశ్వాసము.వృత్తి ప్రవృత్తులు అసత్యమయమై జనరంజకమౌతున్నాయి. ప్రతి రంగంలోను అసత్యము, అధర్మము, అవినీతి రాజ్యమేలుతున్నాయి. సత్యాన్ని, సత్యవ్రతులను అవహేళనకు, అపహాస్యానికి గురి చేస్తున్నాయి. సత్యధర్మనిరతులైన రాముడు అడవులపాలు, హరిశ్చంద్రుడు అష్టకష్టాలపాలైన విషయం మనకు తెలిసిందే.  సమాజంలో మనిషిని,మానవత్వాన్ని మంటగలిపే సారా విక్రయకేంద్రాలు ఉరికి దూరంగా స్థిరమైన ప్రదేశాల్లో నెలకొల్పబడుతున్నాయి. అయినా దానికోసం జనం తమంతట తామే ఉరుకులు, పరుగులు తీస్తారు. అసత్యం అంత ప్రియంగా ఉంటున్నదన్నమాట. ఇక  చక్కని ఆరోగ్యదాయకమైన పాలు, పెరుగు ఇంటింటికీ తిరిగి దైన్యంగా అమ్మకాలు జరుపబడుతున్నాయి. అనగా సత్యం తన మనుగడకోసం గడపగడపా ఎక్కి,దిగ వలసిన దౌర్భాగ్యం,దయనీయ స్థితి దాపురించిందన్నమాట. నేటి లోకంతీరుకు అద్దం పెట్టే యీ భావనలను ప్రతివారు మనసుపెట్టి ఆలోచించాలని, అప్రమత్తంగా ఉండాలని సారాంశము.*

                               *****

                *సమర్పణ  :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: