శ్రీశివాష్టోత్తరశత పంచచామరావళి . (శివ శతకము)
1. శివా! భవా! నమో೭స్తుతే! విశేష భక్త వత్సలా! - భవాని వామ భాగమందు భవ్యయై వసింపగా
నవీన దివ్య తేజసంబు నాట్యమాడు నీ దరిన్. - నివాసముండుమా మదిన్. వినీల కంధరా! శివా!
2. నమో೭స్తు తే. సదా శివా! సనాతనా! నమో೭స్తు తే. - నిమేషమందె నీల కంఠ! నీ కృపా కటాక్షముల్
ప్రమోదమందఁ జేయుఁగా, ప్రభావపూర్ణ తేజమై, - నమస్కరింతునయ్య నీకు. నన్నుఁ గాంచుమా! శివా!
3. శశాంక శేఖరా! హరా! విశాల నేత్ర! సుందరా! - ప్రశాంత చిద్విరాజమాన భవ్య భక్త వత్సలా!
నిశీధిలో విశేష కాంతి నింపి లింగమూర్తిగా - నశేష భవ్య భక్త కోటి యార్తిఁ బాపితే! శివా!
4. ఉపాసనా ప్రభావ మెన్న నో హరా! పొసంగునే? - కృపా నిధీ! ఉపాసకుల్ నిరీక్షణన్ నినున్ గనన్
ప్రపూజ్యమాన దివ్య తేజ భద్ర లింగ దర్శనం - బపూర్వమై, యమేయమైన హాయి గొల్పుఁగా! శివా!
5. సమస్త దోష హారి వంచు జాగరంబుఁ జేసి, నిన్ - ప్రమోద మందఁ జేయఁ బూను భక్త కోటిఁ గాంచితే?
క్షమింపుమా దురాత్ములన్, విశాల నేత్ర! శంకరా! - నమామి భక్త వత్సలా! ప్రణామమందుమా! శివా!
భక్తజన విధేయుఁడు
చింతా రామకృష్ణారావు.🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి