*🙏మహర్షుల దివ్య చరిత్రలు🙏*
*10.ఉదంక మహర్షి.*
ఉదంక మహర్షి భృగువంశంలో పుట్టాడు . గౌతమ మహర్షి దగ్గర విద్య నేర్చుకున్నాడు . ఆ కాలంలో గురువుగారికి సేవచేస్తూ విద్య నేర్చుకునేవారు . గురువుగారు శిష్యుడ్ని పిలిచి శిష్యా ! నీ చదువు అయిపోయింది . ఇంక నువ్వు వెళ్ళిపోవచ్చు అంటే చదువయిపోయినట్లే . అంతే గానీ , ఇప్పట్లో సర్టిఫికెట్లు లాంటివి ఏమిలేవు . చాలా సంవత్సరాలు గడిచిపోయినా ఉదంక మహర్షి చదువయిపోయిందని గౌతమ మహర్షి చెప్పలేదు . ఉదంకుడు కూడ అలా సేవ చేస్తూనే ఉండిపోయాడు . ఒకసారి అడవినుంచి కట్టెల మోపు తీసికొచ్చి కిందపడేసినప్పుడు ఉదంకుడి జుట్టు దాంట్లో చిక్కుకుని కట్టె పుల్లలతో పాటు ఊడి వచ్చేసింది . ఆ ఊడిపోయిన జుట్టు తెల్లగా ఉండడం చూసి ఉదంకుడు అయ్యో ! నా బాల్యం , యౌవనం అంతా ఇక్కడే గడిచిపోయింది . నా చదువు ముసలితనం వచ్చినా పూర్తవలేదని బాధపడ్డాడు . గౌతమ మహర్షి ఉదంకుణ్ణి పిలిచి నాయనా ! బాధపడకు నీ గురుభక్తిని పరీక్షించాను . నీ ముసలితనం పోయేలా చేస్తాను . నాకూతుర్నిచ్చి పెళ్ళి చేస్తాను అన్నాడు . మరి గురువుగారి కూతుర్ని చేసుకోకూడదు కదా అని ఆలోచించకు నీ శరీరాన్ని మార్చినట్టే ఆమె శరీరాన్ని కూడా మార్చి పెళ్ళి చేస్తానని చెప్పి తన కూతుర్నిచ్చి పెళ్ళిచేశాడు గౌతమమహర్షి .
మన ఉదంకుడు అంతటితో ఊరుకున్నాడా .... స్వామీ ! మీకు గురుదక్షిణ ఇస్తాను అన్నాడు . గౌతమ మహర్షి నీ గురుభక్తే నాకు గురుదక్షిణ . ఇంకేమీ వద్దు నాయనా ! అన్నాడు . ఉదంక మహర్షి ఊరుకోక గురువుగారి భార్యని అడిగాడు . ఆవిడ కూడ అదే చెప్పింది . కాని ఉదంకుడు ఏదో ఒకటి అడగమన్నాడు . అపుడు గురువుగారి భార్య మిత్రసహుడు అనే మహారాజు భార్యకి కుండలాలు ఉన్నాయి , అవి నాకు కావాలి అనడిగింది . ఉదంకుడు బయలుదేరి మిత్రసహుడనే రాజు దగ్గరకి వచ్చాడు . ఆ రోజుల్లో రాజుకి ఒక శాపం ఉంది . రాక్షసుడిగా తిరుగుతూ మనిషి మాంసం తినమని . ఉదంకుడిని చూడగానే రా ! రా ! వచ్చావా .. ఇప్పుడే నిన్ను తినేస్తా అన్నాడు . ఉదంకుడు మహారాజా ! నీ భార్య కుండలాలు నాకు ఇప్పించు . అవి నా గురువుగారి భార్యకిచ్చి మళ్ళీ వస్తాను , అప్పుడు నన్ను తినెయ్యి అన్నాడు . సరే నిన్ను చూస్తే మంచివాడిలా ఉన్నావు ఇప్పిస్తానని భార్యకి చెప్పి కుండలాలు ఇప్పించాడు రాజు . ఉదంకుడు ఆ కుండలాలు తీసుకుని , ఇవి గురువుగారి భార్యకిచ్చి వస్తాను నన్ను తింటానన్నావు కదా ! అప్పుడు తిను అన్నాడు . అన్నమాట ప్రకారం తిరిగివచ్చిన ఉదంకుని చూసి రాక్షసుడి మనసు కరిగిపోయింది . స్వామీ ! “ నన్ను క్షమించు ” అన్నాడు . ఉదంక ముహర్షి ఆకసుడి వీపు నిమిరి పరవాలేదులే , అన్నాడు . ఉదంక మహర్షి చెయ్యి తగలగానే
రాక్షసుడికి రాజు రూపం వచ్చేసింది . మిత్రసహమహారాజు ఉదంక మహర్షిని మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అన్నాడు . భోజనం చేస్తుండగా అన్నంలో తలవెంట్రుకలు వచ్చాయి . ఉదంక మహర్షి రాజుని గుడ్డివాడయిపోతావని శపించాడు . రాజు తిరిగి ఉదంక మహర్షిని శపించాడు . ఉదంక మహర్షి రాజుకిచ్చిన శాపం ఉపసంహరించుకుని వెళ్ళిపోయాడు . ఏమయినా మహరులకి కోపం ఉండకూడదు కదా .... ఉదంక మహర్షి కుండలాల్ని ఒక పట్టుబట్టలో చుట్టుకొని తీసికెడుతున్నాడు . మధ్యలో ఆకలికి ఆగలేక ఒక చెట్టెక్కి ఆ మూటని ఒక కొమ్మ మీద పెట్టి పండ్లు కోసుకుంటున్నాడు . ఆ మూట క్రింద పడిపోయింది . ఆ మూటని ఒక నాగరాజు తీసికుని పుట్టలోంచి పాతాళంలోకి వెళ్ళిపోయాడు . అప్పుడు ఉదంక మహర్షి ఆ పుట్టని తవ్వడం మొదలెట్టాడు . ఇది చూసి ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వచ్చి ఉదంకా ! ఆ కుండలాలు పాతాళలోకంలో ఉన్నాయి . నువ్వు పడుతున్నది అనవసర శ్రమన్నాడు . ఉదంకుడు ఎక్కడ ఉన్నా సరే అవి నా గురువుగారి భార్యకివ్వాల్సిందే అని సుళ్ళీ తవ్వడం మొదలు పెట్టాడు .
అప్పుడు ఇంద్రుడు ఉదంకుడు ఉపయోగిస్తున్న కర్రకి వజ్రాయుధానికి వున్నంత శక్తినిచ్చాడు . అలా తవ్వుతుంటే భూదేవి భయపడిపోయి పాతాళానికి దారిచ్చేసింది . పాతాళ లోకంలో కుండలాలు ఎక్కడ ఉన్నాయో తెలియక ఉదంకుడు నాగుల్ని ప్రార్థించాడు . ఉదంకుడు నలుపు తెలుపు దారాలతో బట్టలు వేస్తున్న ఇద్దరు ఆడవాళ్ళనీ , చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు కుమారులనీ , పెద్ద గుఱ్ఱమెక్కి ఉన్న ఒక గొప్ప పురుషుణ్ణి చూసి స్తోత్రం చేశాడు . వాళ్ళు నీకేం కావాలో అడగమన్నారు . ఉదంక మహర్షి ఈ నాగులన్నీ నాకు వశమయిపోవాలన్నాడు . అయితే నువ్వు ఈ గుఱ్ఱం చెవిలో ఊదమన్నాడు ఆ మహాపురుషుడు . ఉదంకుడు అలా చెయ్యగానే పాతాళలోకమంతా కూడ మంటలు వచ్చేశాయి . తక్షకుడు అనే పాము తక్షణమే కుండలాలు తెచ్చి ఉదంకుడకి ఇచ్చేసింది . ఉదంకుడికి గురువుగారి భార్య ఇచ్చిన గడువు ఆ రోజుతో అయిపోతుంది . అతడు బాధపడుంటే గుఱ్ఱం మీద ఉన్న ఆ దివ్య పురుషుడు ఈ గుర్రమెక్కి ఎక్కడికి వెళ్లాలో తల్చుకో అక్కడికి వెళ్ళిపోతావన్నాడు . ఉదంకుడు గుఱ్ఱం మీద కూర్చుని గౌతమ మహర్షి ఇంటికి వచ్చాడు . గురుపత్ని అహల్య కుండలాలు ధరించి పూజ పూర్తిచేసుకుని బ్రాహ్మణులకి భోజనం పెట్టింది.
ఉదంక మహర్షి గురువుగార్ని దివ్యపురుషుడు , ఆరుగురు కుమారులు , తెలుపు , నలుపు దారాలతో బట్టలు వేస్తున్న ఇద్దరు స్త్రీలు వీళ్ళందరూ ఎవరు స్వామీ ? అని అడిగాడు . గౌతమ మహర్షి నాయనా ! ఆ దివ్య పురుషుడు ఇంద్రుడు , ఆరుగురు కుమారులున్నారే వాళ్ళు ఆరు ఋతువులు , ఆడవాళ్ళని ఇద్దర్ని చూశావు కదా ! అది రాత్రి పగలు , ద్వాదశ చక్రం చూశావు కదా అది పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సర కాలం . ఇంద్రుడికి స్నేహితుడున్నాడే పర్జన్యుడు అతడే ఆ గజ్జం . ఇవన్నీ చూడగలిగిన నువ్వు ఎంతో అదృష్టవంతుడివి . ఇంక నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి నీ భార్యతో కలిసి వెళ్ళమన్నాడు . ఉదంక మహర్షి తపస్సు చేసుకోవడానికి వెళ్ళినా కూడ నాగరాజు తక్షకుడు చేసిన అవమానం మర్చిపోలేక జనమేజయ మహారాజుతో సర్పయాగం చేయించాడు . అస్తీక మహర్షి వచ్చి ఆ యాగం ఆపించి నాగుల్ని రక్షించాడు . ఉదంక మహర్షి శివుడ్ని గురించి గొప్ప తపస్సు చేశాడు . శివుడు ప్రత్యక్షమై ఉదంకా ! నీకు ఏంకావాలో కోరుకో అన్నాడు . మన ఉదంకుడు డబ్బు కావాలి లేకపోతే మంత్రి పదవి కావాలి అని అడగలేదు . స్వామి ! నేను ఎప్పుడు ధర్మాన్ని విడవకుండా , నిజాన్నే మాట్లాడుతూ నీ మీద భక్తి కలిగి ఉండాలి అన్నాడు . శివుడు నువ్వు లోకం కోసం నుంచి పనులు చేస్తూ జీవించు అని దీవించాడు ఉదంకుణ్ణి .
ఆ కాలంలో మధుకైటభులు అనే రాక్షసుల వంశంలో ధుంధుడు అనే వాడు పుట్టాడు . వాడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి వరం తీసుకుని దేవతల్ని , గంధర్వుల్ని . , రాక్షసుల్ని అందర్నీ చంపేస్తున్నాడు . సముద్రం దగ్గర పెద్ద గొయ్యి చేసుకుని దాంట్లో పడుకుంటూ వుండేవాడు . వాడు విడిచిన గాలి సంవత్సరానికి ఒకసారి పైకి వచ్చి పెద్దగాలి దుమారం లేపేది . అది వచ్చినప్పుడు ఏడు రోజులదాకా చెట్లు ఊగుతూనే ఉండేవి . అందరూ చాలా భయపడున్నారని ఉదంక మహర్షి బృహదశ్వుడు అనే రాజుకి చెప్పి ఆ రాక్షసుణ్ణి చంపించమని అడిగాడు . బృహదశ్వుడి కొడుకు కువలాశ్వుడు తండ్రి మాట ప్రకారం ఆ రాక్షసుణ్ణి చంపేశాడు .
ఒకసారి శ్రీకృష్ణుడు హస్తినాపురం నుంచి ద్వారకానగరానికి వెడుతూ ఉదంక మహర్షి ఆశ్రమానికి వచ్చాడు . ఉదంక మహర్షి ఆయన్ని పూజించి స్వామీ ! నువ్వు సంధి చెయ్యకలిగి కూడ కౌరవులకీ , పాండవులకీ యుద్ధం జరిగేలా ఎందుకు చేశావు ? అని అడిగారు.
శ్రీకృష్ణుడు ఉదంక మహర్షితో సత్త్వరజ , తమోగుణాలు నావశంలో ఉంటాయి . మరుత్తులు , వసువులు అందరూ నాలోంచే పుట్టారు . ఓంకారంతో ఉన్న వేదాలు నేనే . నాలుగు ఆశ్రమాలు , అన్ని కర్మలు , అన్ని మోక్షాలు నావశంలో ఉంటాయి . మనస్సు చేసే ధర్మాలన్నింటికి కారణం నేనే . బ్రహ్మ , విష్ణువు , ఈశ్వరుడు ఈ మూడూ నేనే . లోక రక్షణకోసం అధర్మాన్ని జయించి ధర్మాన్ని కాపాడతాను . కౌరవులు అధర్మం గల పన్లే చేశారు , వాళ్ళని చంపడం కోసమే యుద్ధం జరిగేలా చేశానని చెప్పాడు . అప్పుడు ఉదంక మహర్షి విశ్వరూపం చూపించమని అడిగి విశ్వం అంతా వ్యాపించి ఉన్న ఆయన రూపాన్ని చూసి నా జన్మ ధన్యమైందని ఆనందించాడు .
*శ్రీకృష్ణుడు నీకు ఏం వరం కావాలో కోరుమన్నాడు . నేనుండే ప్రదేశంలో నీళ్ళు లేక అందరూ బాధపడుతున్నారు . నీరు ఇమ్మని అడిగాడు ఉదంకుడు . బ్రతికినంత కాలం నువ్వు తల్చుకోగానే వర్షాలు పడతాయని వరమిచ్చాడు శ్రీకృష్ణుడు . ఆ మేఘాన్ని ' ఉదంకమేఘం ' అంటారు . ఉదంకుడు బ్రతికినంతకాలం లోకాన్ని ఉద్ధరించడానికే బ్రతికి చివరకి మోక్షం పొందాడు . ఉదంక మహర్షి మనం గురుభక్తితో , స్వార్ధం లేకుండ అందరి కోసం మంచి పన్లు చెయ్యడం ఎలాగో తెలియచెప్పాడన్నమాట.*
*10.ఉదంక మహర్షి.*
*Note:- మహర్షుల దివ్య చరిత్రను ఫార్వర్డ్ చేసి ప్రతి ఒక్క హిందూ చేత చదివిద్దాం. ఆ మహర్షుల దివ్య ఆశీస్సులు పొందు దాము*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి