*జీవిత (అనంతర) భీమా*
మన శరీరాన్ని పురము అని గృహము అని శరీరానికి ఉన్న రంధ్రాలను ద్వారాలని పిలవడం వేదాంత శాస్త్రంలో ఒక పరిపాటి. భాగవతంలోని పురంజనో పాఖ్యానము లో ఈ వర్ణన కనిపిస్తుంది. చాలా వేదాంత గ్రంథాలలో కూడా ఈ ఈ విధమైన వర్ణన కనిపిస్తుంది.
కఠోపనిషత్తులో యముడు నచికేతుని తో ఈ శరీరము పదకొండు ద్వారాలున్న పురము అని అంటాడు. అందరికీ నవ రంధ్రాలు లెక్క సరిపోతుంటే యముడికి రెండు ద్వారాలు ఎక్కువ ఎక్కడినుంచి వచ్చాయి అనేది ప్రశ్న. యముడు జీవుల యొక్క పుట్టుక మరణము వీటిని గురించిన పూర్తి వివరాలు తెలిసినవాడు. ఆ కఠోపనిషత్తు కు వ్యాఖ్యానం రాస్తూ శంకరులవారు మనకు కనపడనివీ యముడికి మాత్రమే కనపడిన, ఆ మిగిలిన రెండు ద్వారాలను వివరిస్తారు.
తల్లి కడుపులో పిండ రూపంలో ఉన్న జీవుడికి ఆహారం బొడ్డు ద్వారా వెళుతుంది. ఆ జీవుడికి అప్పటికి మిగిలిన నవరంధ్రాలు ఏర్పడవు. అందువల్ల జీవుడికి మొదటి రంధ్రం బొడ్డు (నాభి). ఇది జీవుడు పుట్టగానే మూసుకుపోతుంది. జీవులందరికీ ప్రాణం పోయేటప్పుడు నవరంధ్రాలలో ఏదో ఒక రంధ్రం నుంచి ప్రాణవాయువు బయటకు వెళ్ళిపోతుంది. ఇది సాధారణమైన మరణము. మహాయోగులకు బ్రహ్మజ్ఞానులకు ప్రాణవాయువు మరణ సమయంలో తల పైన ఉన్న బ్రహ్మరంధ్రం గుండా బయటకు వెళుతుంది. అది కూడా ఒక ద్వారమే. అందరు జీవులకు దానిని తెరిచే విధానం తెలీదు. మరణ పర్యంతం ఆ ద్వారము మూసుకొని ఉంటుంది. నాభి, బ్రహ్మరంధ్రము రెండు కలిపితే కఠోపనిషత్తులో యముడు చెప్పిన ఏకాదశ ద్వారాల లెక్క తేలుతుంది.
ఏకాదశ ద్వారా లైనా నవ ద్వారా లైనా కింద వివరింప బోయే విషయంలో తేడా రాదు.
వాస్తు శాస్త్ర ప్రకారం మామూలు ఇల్లు కట్టినా రాజభవనం నిర్మించినా ద్వారాలు ఎప్పుడూ సరి సంఖ్యలో ఉండాలి. బేసి సంఖ్య లో ఉండకూడదు. బేసి సంఖ్యలో ఉంటే అరిష్టము. ఆ ఇల్లు కాని ఆ పురము కానీ ఎక్కువ కాలం ఉండవు. ఢామ్మని కూలిపోతాయి.
భగవంతుడు మన శరీరాన్ని నిర్మించేటప్పుడు వాస్తు పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. దీనివల్ల ఈ ఇల్లు లేదా ఈ పురము ఎప్పుడైనా కూలి పోయేటట్లు ఏర్పాటు జరిగింది. కూలడం తధ్యం. ఎప్పుడు కూలు తుందో మాత్రం సరిగ్గా లెక్క చెప్పలేము. భగవంతుడు నిర్లక్ష్యంగా చేశాడా కావాలనే అలా చేశాడో తెలీదు. ఏదైతేనేమి డిజైన్ లో లోపము వచ్చింది. ఇప్పుడు ఇంక చెయ్యగలిగింది కూడా ఏమీ లేదు. కానీ గుడ్డిలో మెల్ల. భగవంతుడు నష్టాన్ని తగ్గించుకోడానికి ఇన్సూరెన్సు ప్రణాళిక ఒకటి ఏర్పాటు చేశాడు.
అందరికీ తెలిసిన విషయమే. కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఆ ఇన్సూరెన్సు యాక్సిడెంట్లను ఆపదు. ప్రమాదం జరిగిన తర్వాత వచ్చే నష్టాన్ని కొంత వరకు పూడుస్తుంది.
భగవంతుడు మన కొరకు ఏర్పాటు చేసిన ఈ ఇన్సూరెన్సు విషయం కూడా అంతే. మరణం ఆగదు. కానీ దాని తర్వాత వచ్ఛే కష్టాలు తగ్గుతాయి కొన్ని సౌకర్యాలు వస్తాయి.
*ఈ ఇన్సూరెన్సు తాలూకు ప్రీమియము భగవంతుడికి మనం భక్తితో చేసే పూజయే. కాబట్టి ఆ ఇన్సూరెన్సు తీసుకుని క్రమం తప్పకుండా అందరూ రోజూ ప్రీమియం చెల్లిస్తూ ఉండండి..*
భీమా ఉంటే ధీమా ఉంటుంది. ఇందులో లోపం ఒక్కటే. పక్కవాడి ఇన్సూరెన్స్ కోసం మనమూ, మనకోసం పక్క వాళ్ళూ ప్రీమియం కట్టడానికి వీలు లేదు. ఎవరి ప్రీమియం వాళ్లే కట్టుకోవాలి. తస్మాత్ జాగ్రత జాగ్రత.
*పవని నాగ ప్రదీప్*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి