27, జూన్ 2021, ఆదివారం

🥀శ్రీ కృష్ణ లీలలు

 🌹🌷💐🥀శ్రీ కృష్ణ లీలలు🥀🌹🌷💐


     ఒకసారి అర్జునుడు, శ్రీ కృష్ణుడు ఒక వృద్ధ విధవరాలి ఇంటికి అతిథులుగా వెళ్లారు. ఆ వృద్ధ విధవరాలు శ్రీకృష్ణునికి పరమ భక్తురాలు. ఆమె నిత్యం కన్నయ్యను స్మరిస్తూ తన జీవితాన్ని గడుపుతోంది. ఆమెకు నా అన్నవాళ్లు ఎవరూ లేరు. ఆమె ఉండేది ఒక పూరి గుడిసెలో... ఆమె వద్ద ఒక ఆవు ఉండేది. ఆమె ఆ గోమాత ప్రసాదించిన పాలను గ్రామంలో అమ్మి కాస్తో కూస్తో డబ్బు సంపాదించేది. ఆమె తన జీవనాధారమైన ఆవును బాగా చూసుకునేది. తాను ఎంతగానో అభిమానించే కన్నయ్య తన ఇంటికి రావడం చూసి, ఎంతగానో సంతోషపడింది. కన్నయతో పాటు విశ్వంలోకెళ్ళా శ్రేష్ఠ దనుర్థారి అయిన పార్థుడు కూడా తన వెంట రావడం చూసి తన ఆనందానికి అవధులు లేకుండా పోయింది. 


       అతిథి దేవునితో సమానం అంటారు..అలాంటిది ఏకంగా దేవుడే అతిథిగా వచ్చాడు. ఆ ముసలామె తన ఇంటిలో ఉండే ఆహార పదార్థాలను అన్నిటినీ కృష్ణార్జునులకు నివేదించింది. శ్రీకృష్ణుడు ఆమె ఆతిథ్యానికి, అలాగే ఆమె నిష్కల్మషమైన భక్తికి మెచ్చాడు. అలా కొద్దిసేపు ఆమెతో మాట్లాడి గోవిందుడు, పార్థుడు వెళ్లిపోయారు. బయటికి వచ్చిన పిమ్మట అర్జునుడు మాధవునితో ఇలా అన్నాడు..." మాధవా..! మీరు ఆమె భక్తికి మెచ్చారు కదా..మరి ఆమెకు ఒక వరాన్ని ఎందుకు ఇవ్వలేదు ? ".... దీనికి సమాధానంగా గోపాలుడు చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నాడు... " అర్జునా..! నేను ఆమెకు ఎప్పుడో వరాన్ని ప్రసాదించాను.. ఆమె ఎంతగానో ప్రేమించే తన ఆవుకు రేపు మరణాన్ని ప్రసాదించాను.. ఆ గోవు రేపటి సూర్యోదయానికి పూర్వమే తుదిశ్వాస విడుస్తుంది.."  సంభ్రమాశ్చర్యాలకు లోనైన పార్ధుడు తిరిగి కన్నయతో " మాధవా..ఇది వరమా, లేక శాపమా..?  గోవు మరణిస్తే తన కడుపు నిండేదెలా..? అసలు ఆమె ఆవు సహకారం లేకుంటే ఈ ధరిత్రి పై జీవించగలదా...?  మళ్లీ కృష్ణయ్య నవ్వుతూ ఇలా సమాధానం ఇచ్చారు... " కౌంతేయా..! నీవు నన్ను అర్థం చేసుకోలేదు. ఆమె ఆవు గురించి ఎక్కువగా ఆలోచిస్తోంది. ఆవును ఎలా పోషించాలి, ఆవుకు మేత ఎలా సేకరించాలి, ఆవు శుచిగా, శుభ్రంగా ఉండటానికి ఎలా నీటితో స్నానం చేయించాలి....ఇలా పలు విధాలుగా ఎక్కువ సమయం ఆ గోవు గురించే ఆలోచిస్తూ, నన్ను స్మరించడం మర్చిపోతోంది. అదే ఆ ఆవు కనుక లేకపోతే, ఆమె రోజంతా నన్ను సేవిస్తూ, స్మరిస్తూ ఉంటుంది కదా..! సరైన సమయం వచ్చినప్పుడు నేను తనని ఈ భూమి నుంచి తీసుకు వెళ్ళిపోతాను.. నా సేవలో తరించి తన జన్మను ధన్యం చేసుకుంటుంది. మరణానంతరం తాను తప్పక నా లోకాన్ని చేరుకుంటుంది..."

                    వాసుదేవుని మాటలు విన్న పార్థుడు ఎంతగానో సంతోషించాడు...

             

  చూశారా..మనకు ఎన్నో కష్టాలు వస్తుంటాయి..ఆ కష్టాలు అనేవి భగవంతుడు పెట్టే పరీక్ష వంటిది.. కష్టాలు నశించిన పిమ్మట మనకు తప్పక ఆనందం లభిస్తుంది.. ఎన్ని కష్టాలు వచ్చినా కృష్ణయ్య లీలలోని భాగమేనని సర్దుకుపోవాలి.. ఆ తర్వాత అంతా ఆ పరమాత్ముడే చూసుకుంటాడు....

కామెంట్‌లు లేవు: