27, జూన్ 2021, ఆదివారం

కథావల్లరి కొత్తకథ

 👆“ భామాకలాపం”#కథావల్లరి కొత్తకథ


“ బాబూ! నువ్వా! నిజంగానే నువ్వే? ఏమిట్రా ఇలా చెప్పాపెట్టకుండా అకాల దర్శనం”…. సంభ్రమం, సంబరం, సంశయం సుజాత గొంతులో! “ సాన్వి ఏది నాన్నా?”…. అడిగింది…..అతని వెనకాలకు మోర సాగించి చూస్తూ… కోడలి కోసం! 


“ సాన్వీని వాళ్ళింటి దగ్గర దించి వచ్చానమ్మా. లోపలికి రానిస్తావా? లేక ప్రశ్నలతో చంపేస్తావా?”…. కొడుకు గొంతులో చికాకుకు ఉలిక్కిపడింది సుజాత! “ రా రా లోపలకు!”…. అంటూ, పక్కకు తొలిగి దారిచ్చింది కొడుక్కు! అప్పటికే నిద్ర లేచి వచ్చిన తండ్రికి…” హాయ్ నాన్నా! రేపు మాట్లాడుకుందాం! ముప్ఫై గంటల ప్రయాణం కదా! డేమ్ టైయర్డ్!”…. అంటూ పెట్లు లాక్కుంటూ, మేడమీదకు వెళ్ళిపోయాడు శౌరి! “ కాఫీ ఇవ్వనా బాబూ!”… అంటున్న తల్లికి, వద్దని సైగ చేసి… గట్టిగా తలుపేసుకున్నాడు! మొహామొహాలు చూసుకున్నారు భార్యాభర్తలు. “వియ్యలారికి ఫోన్ చేసి, సాన్వీని పలకరించనా … అన్న భార్యను..” ప్రస్థుతం వద్దు”… అంటూ ఆపాడు ఆమె భర్త రమణ! 


        శౌరీ, సాన్వీ జెట్ లాగ్ తో అలిసిపోయి పడుకున్న ఆ పదిగంటల సమయంలో …ఇరువైపుల తల్లితండ్రుల మధ్యా చాలా మంతనాలే అయ్యాయి. ఇరువైపుల వారూ సున్నితమనస్కులు, సంస్కారవంతులూ, ఎంతో సరదాపడి, సాంప్రదాయాలు చూసుకుని వియ్యమందినవారు! ఈ పరిస్థితి కొంత ఆశ్చర్యంగానూ, ఆందోళనగా ఉంది. అందుకే ఒప్పందంగా కొన్ని నిర్ణయాలు … పిల్లల పరోక్షంలో తీసుకున్నారు. “ పిల్లల మధ్య ఎంత పెద్ద గొడవలయినా… సర్ది చెప్పుకోవాలి తప్పా, విడిపోయే పరిస్థితులు కల్పించుకోకూడదని, ఎవరి  బిడ్డ పక్షాన తప్పున్నా, అవతలివారు అపార్ధాలు చేసుకోకూడదని, పిల్లలిద్దరికీ నచ్చే పరిష్కారం చూడాలని “… అనుకున్నారు! 


సాన్వీ తల్లయితే… “ మా అమ్మాయి వలన ఏం తప్పు జరిగినా మీరు క్షమించి, కడుపులో పెట్టుకోవాలి వదినగారూ!”…అంటూ బ్రతిమాలుతున్నట్టు అంటుంటే, సుజాత..” మీరలా అంటే కోపం వస్తుంది సరోజా నాకు! చాలా కష్టంగా ఉంది మనసుకు! ఏం శౌరి నుండి కూడా తప్పులుండచ్చు కదా! పాతతరం తల్లిలా మీరు మాట్లాడద్దు. నా మటుకు నేను, సాన్వీ నుండే సమస్యను ఆలోచించి, నిర్ణయం తీసుకుంటా! దయచేసి మీరు బేలగా మాట్లాడద్దు!”… అంటూ సాంత్వనిచ్చి, ఫోను పెట్టేసింది! 


       పిల్లలిద్దరూ వచ్చి, మూడురోజులయింది. ఒక్కముక్క వాళ్ళ నోటి నుండి ఊడిపడలేదు! ఎవరి మూడ్స్ లో వాళ్ళు కూరుకుపోయారు! ఆరోజు ఉదయం ఐదింటికి… ధ్యానంలో కూర్చుందే కానీ… సుజాత మనస్సంతా సాన్వీ మీదే ఉంది. శౌరి మీద కోపం ఉండచ్చు, కానీ ఎంతో ప్రేమగా ఉండే తనను ఒక్కసారయినా పలకరించనంత కోపమా ఆ అమ్మాయికి “….అనుకుంది! 


“సాన్వి… ఇరవై ఆరేళ్ళ సౌందర్యరాశి! అందానికి తగ్గ వ్యక్తిత్వం! అన్నిటికీ మించి కూచిపూడి నాట్యంలో ఇరవై యేళ్ళ కఠోర సాధన, పిన్నవయసులోనే వందలకు పైగా నాట్యప్రదర్శనలిచ్చి….పలు సాంస్కృతిక సంస్థలనుండి పురస్కారాలూ, బిరుదులూ అందుకున్న “ నాట్యమయూరి”! ఆమె తన కోడలు అనుకుంటేనే తన మనసు గర్వంతో ఉప్పొంగిపోతుంది”…. సుజాతకు ఆలోచనల్లో ధ్యానం కుదరలేదు. లేవబోతుంటే…. రెండు కాఫీకప్పులతో వచ్చాడు శౌరి! 


తల్లికొక కప్పు అందించి….నాందీ, ప్రస్థావన లేకుండా….” అమ్మా! నీకు పంజరంలో బంధించిన ఒక మనిషికి  …స్వేచ్ఛ పోయి, ఊపిరాడక గింజుకుపోతుంటే ఎలా ఉంటుందో తెలుసా? “…. అంటూ సూటిగా అడిగాడు తల్లిని! “ ఏమయింది బాబూ?”… అంది ఆమె! “ సాన్వీని పెళ్ళి చేసుకున్నాకా, నా పరిస్థితి అలాగే అయిపోయిందమ్మా! నాకంటూ సొంతంగా…జీవితం లేకుండా….అన్నీ ఆమెతో ముడిపెట్టేసుకుంది! “…. అన్నాడు! 


“ భార్య జీవితం భర్తతో కాకుండా ఎవరితో ముడిపెట్టుకుంటుంది శౌరీ! చాలా వింతగా మాట్లాడుతున్నావే! “…. అన్న తల్లితో… “ నీకు అలా అర్ధమయ్యిందా! వివరంగా చెప్తా విను! 


            ************************


“ శౌరీ! ఈ వీకెండ్ మనం సరదాగా మీ తెలుగు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్దామా? చాలా బోర్ గా ఉంది!”


“ సాన్వీ! నాకు మామూలుగానే ఫ్రెండ్స్ తక్కువ! అందులో తెలుగువాళ్ళు మరీ తక్కువ. లాస్ట్ వీక్ వెళ్ళాం కదా … లంచ్ కు! ఇక్కడ అలా ఇన్విటేషన్ లేనిదే వెళ్ళకూడదు. సరదాగా ఇంటిపని చేసుకుందాం! గ్రోసరీ తెచ్చుకుందాం!  వంట నేను చేస్తా ! సరేనా!”-


“ అమెరికా అంటూ ఏవేవో వూహించుకుని వచ్చేసా! లైఫ్ చాలా నిస్సారంగా ఉంది! ఈపాటికి ఇండియాలో ఎన్ని ఆక్టివిటీస్ ఉండేవి! వినాయక చవితి , దసరా నుండి సంక్రాంతి వరకూ ఎంత బిజీగా ఉండేదాన్నో… ఊపిరి సలపని ప్రదర్శనలతో! ఇక్కడ బయటకెడితే చలి, ఇన్నేసి బట్టలు కప్పుకుని ఏం ఎంజాయ్ చేస్తాం? అయినా ఏమున్నాయి ఇక్కడ…పెద్దగా చూడడానికి. అవే మాల్స్, అన్నీ ఒకేలా ఉండే ఇళ్ళూ, మనని చూసి, హలో అని పలకరించి మొహం తిప్పేసుకునే అమెరికన్స్! నాకు అస్సలు నచ్చలేదు శౌరీ అమెరికా! మనం ఇండియా వెళ్ళిపోతే హాయిగా ఉండచ్చు కదా!”


“ సాన్వీ! ఇవన్నీ నీకు పెళ్ళికి ముందు తెలియదా? అమెరికాలో జీవనపరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకోకుండానే పెళ్ళి చేసుకున్నావా? పదేళ్ళయింది నేను ఇక్కడకు వచ్చి! నేను అమెరికాలో పుట్టడం వలన నేను అమెరికన్ సిటిజన్ ను! నా ఉద్యోగం, నా ఫ్రెండ్స్, హాబీస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. నేను ఇండియా వచ్చి ఏం చెయ్యాలి? డోంట్ బీ రిడిక్యులస్!”


“ ఇండియాలో ఏం చెయ్యాలా? అదే ప్రశ్న నేనూ వేస్తే? నాకు ఇక్కడ ఏమీ లేదు. ఇద్దరి పేరెంట్స్ అక్కడే. నా ప్రాణప్రదమైన డాన్స్ అక్కడే! ఇక్కడ ఒక పంజరంలో చిలుకలా పడున్నా శౌరీ!”…. 


“ సాన్వీ ! అయిన దానికీ ,కాని దానికీ కన్నీరు పెట్టుకోకు. నాకు చిరాకు! అసలు మా అమ్మననాలి. నాకు ప్రొఫెషనల్ కావాలంటే, ఇలా డాన్సర్ ను కట్టిపెట్టింది. ఇప్పుడు ఆ డాన్సర్ ఏమో నా నెత్తి మీదెక్కి తోచట్లేదని , తైతక్కలాడుతోంది!”…. 


“ అంత క్రూయల్ గా మాట్లాడకు. నా డాన్స్ ప్రోగ్రామ్ చూసే నన్ను చేసుకున్నావు. అంటే… అందంగా ఉంది, తండ్రికి ఆస్థి ఉంది, ప్రొఫెషనల్ డిగ్రీ లేదు కనుక, అమెరికాలో వంటచేస్తూ, నీ సరదాలు తీరుస్తూ షోపీస్ లా పడుంటాననా చేసుకున్నావు?”


“ సాన్వీ రోజూ ఇదే వాదనతో బోర్ కొట్టించకు! ఇప్పటికే నీకోసం చాలా మార్చుకున్నా! నీకిష్టం లేదని అకేషనల్ నాన్ వెజ్, బూజ్ వదిలేసా! సరదాగా ఫ్రెండ్స్ తో చిల్ అవుట్ చేస్తూ… ఆడే పోకర్ గేమ్ వదిలేసా! ఆదివారం టెన్నిస్ లేదు, జిమ్ లేదు! క్లబ్ కు రమ్మంటే రావు! బయట ఫుడ్ ఎంజాయ్ చెయ్యవు. ఎంత సేపని నువ్వు నువ్వు నువ్వే అని కూర్చుంటా. నువ్వు కాదు … నేను ఉన్నది పంజరంలో! ఐ యాం గెటింగ్ సఫకేటెడ్! చాలా తప్పు చేసా ఈ పెళ్ళి చేసుకుని! “


“ ఇనఫ్ శౌరీ! చాలానే మాట్లాడావు. వాటెబౌట్ మై డ్రైవింగ్? ఎప్పుడు నేర్పిస్తావు? లైబ్రరీ కి తీసుకెళ్తానన్నావు? ఏదీ? నువ్వు నాకు ఇండిపెండెంట్ గా డీల్ చేసే ఏ స్కిల్సూ నేర్పించవు! కానీ నాతోనే టైమ్ అంతా వేస్ట్ అయిపోతుందని కంప్లయింట్! ఓకే! ఇకపై నిన్ను విసిగించను! నేనే మేనేజ్ చేసుకుంటా!”


ఈ విధంగా మొదటి ఆరునెలలూ, మనుషులు కూడా గడ్డకట్టే చలికాలంలో గడిచిపోయాయి. మెల్లగా మంచు కరగిపోయింది. క్షణాల్లో వచ్చిచేరిందా అనేనట్టు… అన్నివేపులా పచ్చదనం అలుముకుంది. జనాలు ఒళ్ళు వెచ్చబెట్టుకోడానికి… ఆరుబయళ్ళు ఆశ్రయించారు. ఆరోజు శౌరి ఆఫీసు నుండి ఐదింటికి తిరిగి వచ్చేసరికి… అతని బుర్ర తిరిగిపోయే దృశ్యం ఇంటి ముందు పచ్చికలో! 


         వనకన్యలా… పసుపుపచ్చని చీరకు ఆకుపచ్చ చెంగావి చీర, మోకాళ్ళ క్రిందదాకా… కట్టుకుని, గులాబీరంగు పాదాలకు సిరిమువ్వ గజ్జెలు తగిలించి, ఆమె ఒత్తయిన పొడుగాటి జడను జడకుప్పెల్లో బంధించి, అసలే విశాలమయిన మృగనయనాలకు నల్లని కాటుక రేకలు దిద్ది, నుదుటన నయాపైసంత బొట్టు పెట్టుకుని…. ఇంటిబయట పచ్చికలో….చెంగుచెంగున నృత్యం చేస్తూ సాన్వి!


    పక్కన లాప్ టాప్ లో నట్టువాంగం పెట్టుకుని, క్రిష్ణశబ్దం అద్భుతంగా అభినయిస్తూ… నాట్యం చేస్తోంది


" రఘువంశ సుధాంబుధి చంద్రా

రత్నాకర సమ గంభీరా

శతకోటి మన్మధాకారా

సురభుజబల రణశూర

నారీజన మానస చోరా

మహామేరు సమానాధీరా

కవిజన పోషక మందారా

పరరాజ శత్రు సంహారా....రారా స్వామి రారా!

యధువంశ సుధాంబుధి చంద్రా.....స్వామి రారా!..."

అంటూ.... లయబద్ధంగా కరచరణాలను కదిలిస్తూ….సాత్వికాభినయం చేస్తుంటే….వ్యాహ్యాళికి బయలుదేరిన.. ఆ కమ్యూనిటీలోని దొరలు, దొరసానులూ… ఆమె నృత్యపదర్శనకు ముగ్దులై నిలబడిపోయి ఉన్నారు. 


ఇరుగుపొరుగు …బయట లాన్లలో నిలబడే… వీక్షిస్తున్నారు. ఆమె నాట్యం ముగించడంతోనే అందరూ చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తూ… “సో గ్రేస్ ఫుల్, అమేజింగ్ టాలెంట్…”…అంటూ ప్రశంశిస్తూ వెళ్ళిపోయారు. శౌరికి … సాన్వి చేస్తున్న ఈ ఎక్సిబిషన్ కు చాలా కోపం వచ్చింది. “ ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని, బయటే ఎందుకు తైతక్కలాడడం? ఎంత పరువు తక్కువ. హౌ ఎంబారసింగ్! నైబర్ హుడ్ లో ఇలా పిచ్చి డాన్సులు చేస్తే, స్యూ చేస్తారు నన్ను!”…. అంటూ తలపట్టుకున్నాడు. సాన్వీ మాత్రం “ కే రే హుట్!”…. అన్నట్టు తలెగరేసి వూరుకుంది! 


       ఆరోజు నుండి… సాన్వీ మరే అడ్వంచర్ చెయ్యకుండా… పెందరాళే వచ్చేయడం… తనతో పాటూ తిప్పుకోవడం చేస్తున్నాడు. తనకిష్టమైన జాజ్ సంగీతం వినడం, టీవీలో ఇష్టమైన సీరీస్ చూడడం బాగా తగ్గిపోయాయి! పుస్తకపఠనానికి పూర్తిగా స్వస్థి! 


ఈలోపున సాన్వీకి కమ్యూనిటీలో కొందరు స్నేహితులయ్యారు. ఒకరోజు శౌరీ … ఆఫ్ తీసుకుని ఇంటికి రాగానే … సాన్వీ కనపడలేదు ఇంట్లో! సెల్లార్ లోంచి ఏవో శబ్దాలొస్తే… కిందకు దిగి వెళ్తే… అక్కడ సాన్వీ.. ఇద్దరు అబ్బాయిలకూ, ఇద్దరు అమ్మాయిలకూ సాల్సా డాన్స్ నేర్పిస్తోంది. 


ఈ కూచిపూడి అమ్మాయేంటి?… ఈ లాటిన్ డాన్స్ ఏంటి… అని పిచ్చెక్కింది శౌరికి! అతన్ని వెయిట్ చెయ్యమని చెప్పి…”2-3, 3-2…. నౌ 3-2… నౌ 1,3,5,7….. బీట్స్…. “…అంటూ రిధిమ్ కు తగ్గట్టు స్టెప్స్ వేయిస్తూ…” నౌ ద సెషన్ ఈజ్ ఓవర్”… అంటూ ముగించింది. వాళ్ళు శౌరికి షేక్ హాండ్ ఇచ్చి… “షి ఈజ్ టూ గుడ్”! అనుకుంటూ వెళ్ళిపోయారు! దీని విషయమై మరో చిన్న గాలీవాన భార్యాభర్తల మధ్య! వాళ్ళ వివరాలు, పుట్టుపూర్వోత్తరాలు తెలియకుండా, అలా ఇళ్ళల్లోకి రానివ్వకూడదని… వాళ్ళలో కొందరికి నేరచరిత్ర ఉంటుందని, వాళ్ళు ముందు ముందు ఇబ్బందులు పెడతారని… శౌరి వాదన! దాన్ని కొట్టిపడేస్తూ సాన్వి! 


వీళ్ళనే పట్టుకుని మెల్లగా… కార్ డ్రయివింగ్ నేర్చేసుకుంది సాన్వీ! డ్రైవర్స్ లైసెన్స్ టెస్ట్ తీసుకునే ముందురోజునతెలిసింది శౌరికి. శౌరి చాలా భయస్థుడు. నిదానస్థుడు! పరాయిదేశంలో ఉంటున్నపుడు వాళ్ళ పద్ధతులను, వాళ్ళ చట్టాలనూ గౌరవించాలని భావించే మనిషి. అతను భయపడ్డట్టే…సాన్వి ఆదరాబాదరా డ్రైవింగ్ నేర్చుకుని, లైసెన్స్ తెచ్చుకున్నా… పూర్తిగా ఆ నగరం గురించి అవగాహన లేకుండా డ్రయివ్ చెయ్యడం వలన… రెండుసార్లు టికెట్స్ కూడా వచ్చాయి. దాంతో….ఈ అమ్మాయి ఏరోజు ..ఏ తలనొప్పి తెస్తుందా అనే టెన్షన్ ఎక్కువయింది శౌరికి! 


         మెల్లగా తెలుగుసంఘాలతో పరిచయాలు చేసుకుంది సాన్వి! నాలుగయిదు చిన్నాచితకా డాన్స్ ప్రోగ్రామ్స్ ఇచ్చింది. వాటి కోసం శౌరి తన ప్రాజెక్ట్ పనులన్నీ పక్కన పెట్టి… తిరగాల్సి వచ్చింది!రెండుసార్లు బోస్టన్ వెళ్ళాలంది, మరోసారి అట్లాంటా! ఓపిగ్గానే తిప్పుతున్నాడు కానీ, తనకంటూ పర్సనల్ స్పేస్ లేకుండా ఇలా ఎన్నాళ్ళో తెలియట్లేదు! 


శౌరి బేసికల్ గా మంచివాడే! స్త్రీలంటే గౌరవం ఉన్నవాడే! కానీ సాన్వీ కోరుకునే కళాకారిణి జీవితం అతని అనుభవంలో ఎక్కడా చూడలేదు. పరిచయాలు పెంచుకుంటూ… చకచకా ఆమె ఇతరులతో అల్లుకుపోయే తీరు… ఆ బిడియస్థుడికి కాస్త ఇబ్బందిగా ఉంటోంది. తెల్లనివన్నీ పాలూ, నల్లని వన్నీ నీళ్ళు కాదని ఈ అమ్మాయికి ఎలా చెప్పాలో తెలియడం లేదు. 


          వాళ్ళ జీవితంలో అతిపెద్ద అగడ్త సృష్టించినరోజు ఆరోజు! సాన్వీని తీసుకుని లైబ్రరీకి వెళ్ళాడు శౌరి! ఆమెను డ్రామా అండ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెక్షన్లో వదిలి… అతను క్లాసిక్స్ సెక్షన్ కు వెళ్ళిపోయాడు! తిరిగి వచ్చేప్పుడు తను మ్యూజియమ్  లో ఉన్నానని… సాన్వీ ఇచ్చిన మెస్సేజ్ చూసుకుని…మ్యూజియమ్ లోకి ప్రవేశించాడు. అక్కడ ఏ మాత్రం కొత్తా, తడబాటూ లేకుండా… సాన్వీ అక్కడ గుమికూడిన ఓ ఏభైమందికి… కూచిపూడి శైలిలో నవరసాలను అభినయిస్తూ… డెమాన్ స్ట్రేషన్ ఇస్తోంది! 


“ దిస్ ఈజ్ శ్రింగార్… ద లవ్ అండ్ డిలైట్… దిసీస్ హాస్య, ద లాఫ్టర్.. దిస్ ఈజ్ రౌద్రమ్, ద ఫ్యూరీ అండ్ ఏంగర్…. అంటూ అద్భుతంగా అభినయిస్తూ చూపిస్తోంది. ఇంతలో అనుకోకుండా గుంపులోంచి… ఒక భారతీయసంతతి వాడే… అస్థిరంగా తూలుతూ వచ్చి, సాన్వీ చెయ్యి పట్టుకున్నాడు! “ నాతో కలిసి డాన్స్ చెయ్యి! ఇద్దరం కలిసి డెమో ఇద్దాం!”…. అంటూ ఆమె నడుం చుట్టూ చెయ్యేసి, ఇబ్బంది పెడుతున్నాడు. సాన్వీ ఈ హఠాత్ సంఘటనకు బిత్తరపోయి, గింజుకోసాగింది! 


కోపం పట్టలేక శౌరి అతనిపై చెయ్యిచేసుకోడం, కాప్స్ రావడం , కొంత గొడవ తరువాత, వీళ్ళను విడిచిపెట్టడం జరిగింది. 

ఇన్నేళ్ళూ ఒక్కరోజు కూడా ఎలాంటి వివాదాల్లో చిక్కుకోని  శౌరి… ఈ సంఘటనతో చాలా చికాకుపడ్డాడు. ఈవార్త లోకల్ పేపర్లలో రావడం అతన్ని మరింత కలవర పరిచింది. భార్యాభర్తల మధ్య రేగిన గొడవ చిలికి చిలికి గాలివానయ్యి… సాన్వీ ఇండియా వెళ్ళిపోతానని మంకుపట్టు పట్టడంతో… ఆమెను ఇండియా తెచ్చి వదిలేయడానికి…పేరెంట్స్ కు నోటీస్ ఇవ్వకుండానే… ఇదిగో ఇలా వచ్చేసాడు! 


           **************************

“ ఇంత కధ నడిపిందమ్మా నీ కోడలు. పట్టుపట్టి చేసావు కదా! ఇప్పుడు ఈ మేరేజ్ ఎంత వరకూ నిలబడుతుందో కూడా అనుమానమే!”..అంటూ నిరసనగా మాట్లాడుతున్న కొడుకును చూసి భయం వేసింది సుజాతకు! 


“ ఇండియాలోనే ఉండిపో శౌరీ! ఏ గొడవా వుండదు!”…. ఈ మాటలు శౌరి తండ్రివి, ఎప్పుడొచ్చారో వాకింగ్ నుండి! అంతా విన్నట్టే ఉన్నారు! 


“ నాన్నా! అదెలా సాధ్యం?ఇప్పటికిప్పుడు అన్నీ ఎత్తిపెట్టుకుని ఇండియా ఎలా వచ్చేయాలి? “…. అన్నాడు శౌరి కాస్త కోపంగా! 


“ కుదరకపోతే రిజైన్ చేసేవోయ్! మన వ్యాపారంలో పార్ట్ తీసుకో! ఉన్న ఒక్కడివీ… అక్కడ సెటిల్ అవ్వడానికని పంపలేదు నిన్ను. ఇక్కడ ఏం తక్కువని? ఇక్కడ అమర్చిన ఆస్థిపాస్థులు ఎవరు అనుభవించాలి? నువ్వూ, సాన్వి విడిపోయే ప్రసక్తి లేదు! ఇద్దరూ ఒకేచోట ఉండి తీరాలి. దిస్ ఈజ్ ఫైనల్!”…. అని గట్టిగానే చెప్పి, లోపలికి వెళ్ళిపోయారు! 


         ఇంక సుజాత మొదలుపెట్టింది. “ బాబూ! ఆ పిల్లకు డాన్సే సర్వస్వంరా! 20 ఏళ్ళ నాట్యసాధన, కెరియర్ ఒక్కసారి ఎలా వదిలేసుకోగలదు? పాపం అమెరికా వెళ్ళనంటే… వాళ్ళ వాళ్ళు నువ్వు మంచిపిల్లాడివని…నయాన నచ్చచెప్పి పంపారు. తనకు తోచినట్టు తను అక్కడ తన నాట్యాన్ని తీర్చిదిద్దుకుందామని ప్రయత్నించింది! ఇక్కడకు మీరిద్దరూ…వచ్చేస్తే, తన వ్యవహారాలు వాళ్ళ గురువుగారూ, వాళ్ళ నాన్నగారూ చూసుకుంటారు! నీకు పెద్ద టెన్షన్ ఉండదు! నువ్వు కూడా ఇక్కడే మీ కంపెనీకి ట్రాన్స్ ఫర్ పెట్టుకో! మధ్యమధ్యలో…యుఎస్ వెళ్ళి… వస్తూ ఉండచ్చు ఇద్దరూ! “…. బుజ్జగించింది కొడుకును! 


“ మొత్తానికి ఇరికించేసారమ్మా! నా జీవితంలో ఏ మార్పూ ఉండదు. ఒక పంజరం నుండి ఇంకా పెద్ద పంజరంలోకి! అంతే కదా! “…. అంటూ విసురుగా లోపలికి వెళ్ళిపోయాడు శౌరి! 


                **********************


“ భామనే సత్యభామనే

వయ్యారి ముద్దుల… సత్యభామనే …

భామనే పదియారువేల కోమలూ లందరిలోనా….

లలనా చెలియా మగువా సఖియా…

రామరో గోపాలదేవుని ప్రేమనూ దోచినదానా… భామనే।। 


భామరో శృంగార జగదభిరామినే

ముఖవిజిత హేమాధామనే

ద్వారకాపురాఢ్యురామనే

వయ్యారి సత్యభామనే…. అంటూ సత్యభామ ఆహార్యంలో దేదీప్యమానంగా వెలిగిపోతోంది సాన్వి వేదికమీద! 


తన పొడవైన బంగారుజడను… అతిశయంగా కుడిచేత పట్టి….క్రిష్ణుని పట్ల తన ప్రేమలోని వివిధ పార్శ్వాలను అభినయిస్తోంది! క్రిష్ణుడికి దూరమై తనెంత విరహవేదన అనుభవిస్తోందో చెప్తూ.. తాము కలిసి వున్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నామో చెప్తూ… తన నాట్యాభినయంతో ప్రేక్షకులను ముగ్దుల్ని చేసింది సాన్వి! ప్రేక్షకుల్లో కూర్చున్న శౌరిని చూసినప్పుడల్లా… ఆమె మొహంలో చిరునవ్వుతో కూడిన మైమరుపు చూసి… శౌరి మనసు ఆమెపట్ల ,ప్రేమతో నిండిపోయింది! 


         “ఇంత గొప్ప కళాకారిణినా తను పంజరంలో బంధించబోయాడు. పైగా తనను బంధీ చేసిందని నేరారోపణతో…! కళలు దైవదత్తము! కళాకారుల ఆత్మ తమ కళలతో పెనవేసుకుని ఉంటుంది. ఆ కళను దాని సహజవాతావరణం నుండి లాక్కునిపోయి… బంధిస్తే.. ఆ కళాకారునికి ఏం చెయ్యాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అయ్యి… తన కళను రక్షించుకునే దిశలో ప్రయత్నిస్తాడు. సాన్వీ విషయంలో అదే అయ్యింది. ఆమె కళ భారతీయం, ఆమె ఆత్మ భారతీయం, ఆమె మూలాలు భారతీయం! భారతదేశపు నేలతో ఆమెకున్న అనుబంధం తను త్రుంచకూడదు! ఆమె కోసం, అమ్మానాన్నల కోసం…కష్టమైనా, నష్టమైనా… తను ఇక్కడే ఉండాలి! “…. అని మనసులో ధృఢనిశ్చయం చేసుకున్నాకా…అతనికి చాలా హాయిగా అనిపించింది. 


జీవనదిని వదిలి ,మరీచికల వెంట పరుగెట్టిన తనకు… శృంఖలాలు తెగి… స్వేచ్ఛ వచ్చిన భావన! 


         నాట్య ప్రదర్శనానంతరం… గ్రీన్ రూమ్ లో కోడలి… సత్యభామ బంగారుజడను సున్నితంగా జడ నుండి విడదీస్తోంది సుజాత! 


“ అత్తయ్యా! ఈ బంగారుజడ ఇకపై…అచ్చంగా నాదే కదూ!”…. అంది నవ్వుతూ సాన్వి! అర్ధం కానట్టు చూసింది సుజాత!


“ నా పెళ్ళిలో ఈ జడ నా చేతికిచ్చి , ఏమన్నారు మీరు? ఏడాదిలో… నా కొడుకు..ఈ జడ పట్టుకుని ఇండియా వచ్చేయాలి అన్నారా ? లేదా? “…. అంటూ … కిలకిలా నవ్వింది ఆధునిక సత్యభామ సాన్వి! 


ఆశ్చర్యంతో, ఆనందంతో నోరు పెగలని అత్తగారితో….


“ ఇంతినే చామంతినే మరుదంతినే విరిబంతినే

జాణతనమున సతులలో నెరజాణనై వెలిగేటిదాన! …. భామనే సత్యాభామనే!”….. 


అంటూ జడపట్టుకుని వయ్యారంగా అభినయిస్తున్న సాన్విని బుగ్గమీద గట్టిగా ముద్దుపెట్టుకుని…


.” అవును తల్లీ! శౌరి ఎప్పుడూ సత్యాపతే! మీరజాలగలడా నీ యానతి మరి! “… అంది అత్తగారు హాయిగా నవ్వేస్తూ! 


ధన్యవాదాలతో

శశికళా ఓలేటి!

కామెంట్‌లు లేవు: