27, జూన్ 2021, ఆదివారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*నిరంతర ధ్యానం..*


శ్రీ స్వామివారు సాధన చేసుకునే గది ముందు దాదాపు అరగంట నుంచీ నేను ఎదురు చూస్తూ వున్నాను..శ్రీ స్వామివారు బైటకు రాలేదు..చేసేదేమీ లేక, నా చేతిలో ఉన్న స్టీలు బాక్స్ ను ప్రక్కనున్న వంట గదిలో పెట్టి నేను తిరిగి మొగలిచెర్ల లోని మా ఇంటికి వెళ్ళిపోయాను..ప్రక్కరోజు ఉదయం మళ్లీ ఆహారం తీసుకొని వచ్చాను..ఆ గది తలుపులు మూసే ఉన్నాయి..శ్రీ స్వామివారు బైటకు రాలేదు..వంటగదిలో చూస్తే..నిన్న నేను తీసుకొచ్చిన అన్నపు డబ్బా అలానే ఉన్నది..కనీసం ఆ డబ్బా మూత కూడా తీసిన జాడలు లేవు..ఇలా సుమారు నాలుగు రోజుల పాటు..రోజూ నేను ఆహారం తీసుకు రావడం..ముందురోజు తెచ్చిన డబ్బానును పట్టుకొని ఇంటికి తిరిగి వెళ్లడం జరుగుతున్నది..


అమ్మతో ఈ విషయమే చెప్పాను.."అమ్మా!..నువ్వు రోజూ అన్నం పంపుతున్నావు..స్వామివారు తినడం లేదు..కనీసం ఆ గది నుంచి బైటకు కూడా వస్తున్నట్లు లేరు..ఈరోజు ఐదవ రోజు..ఇందాక నువ్విచ్చిన డబ్బా ను అక్కడ వంటగదిలో పెట్టి వచ్చాను..నిన్నటిది తీసుకొచ్చాను..ఆయనే వండుకుంటున్నారేమో తెలీదు..ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం నేను గమనిస్తూనే వున్నాను..అన్నం తింటున్నట్లు లేదు..తపస్సులోనే ఉన్నారేమో తెలీదు".. అని.."అలాగా.." అన్నది అమ్మ .


ఆరోరోజు ఉదయం ఎనిమిది గంటల లోపే నేను ఆశ్రమానికి వెళ్ళిపోయాను..ఆరోజు శ్రీ స్వామివారికి ఆహారం ఇచ్చి..అటునుంచి మా పొలానికి వెళ్లి రమ్మని నాన్నగారు చెప్పారు.(మాగాణి గా పిలువబడే మా పొలం..మన్నేరు నది అవతల మఱ్ఱిగుంట గ్రామ సరిహద్దుల లో ఉన్నది..శ్రీ స్వామివారి ఆశ్రమం మీదుగానే వెళ్ళాలి..కాలినడకనే వెళ్లి వస్తుండే వాళ్ళము..) యధాప్రకారం నేను తెచ్చిన డబ్బాను ఆశ్రమం లోని వంటగదిలో పెట్టి..నేను మా పొలానికి వెళ్ళిపోయాను..అక్కడ పని చూసుకొని సాయంత్రం నాలుగు గంటల వేళ తిరిగి ఆశ్రమానికి వచ్చాను..శ్రీ స్వామివారి కోసం ఎదురుచూడకుండా నేరుగా వంటగది లోకి వెళ్లి, ఆ  డబ్బా చేతులోకి తీసుకొని బైటకు వచ్చాను..


ఇంతలో శ్రీ స్వామివారు తాను ధ్యానం చేసుకుంటున్న గది తలుపు తీసుకొని బైటకు వచ్చారు..నన్ను గమనించారో లేదో తెలీదు..నేరుగా బావి వద్దకు వెళ్లి..గబ గబా బావిలోంచి నీరు తోడుకొని..నెత్తిన పోసుకున్నారు..దాదాపు ఇరవై నిమిషాల పాటు అలా స్నానం చేస్తూనే ఉన్నారు..దగ్గరలోనే ఉన్న నన్ను పట్టించుకోలేదు సరికదా..నా వైపు కూడా చూడలేదు..


స్నానం పూర్తి అయ్యాక..నీళ్లు కారుతున్న ఆ దేహం తోనే ఐదారు నిమిషాల పాటు సూర్యుడికి అభిముఖంగా నిలబడ్డారు..ఆ తరువాత వెనక్కు తిరిగి లోపలికి వస్తూ..నన్ను చూసి ఆగి.."అన్నం తెచ్చావా?.." అన్నారు..

"ఉదయమే తెచ్చి ఇక్కడ పెట్టి మాగాణికి వెళ్ళాను స్వామీ..మీరు అప్పుడు లేరు..ఇప్పుడు వెనక్కు తీసుకెళదామని అనుకున్నాను.." అన్నాను..


ఒక్కక్షణం నన్ను తేరిపారా చూసి..నా చేతిలో ఉన్న డబ్బాను తీసుకొని..వంటగది ముందున్న బల్ల మీద కూర్చుని..అందులోని అన్నాన్ని తిన్నారు..బావి వద్దకు వెళ్లి చేయి కడుక్కుని.. నా దగ్గరకు వచ్చి..

"ఈరోజు తారీఖు ఎంత?.." అన్నారు..

చెప్పాను..


కళ్ళు మూసుకొని ఏవో లెక్కలు వేసుకొని..కళ్ళు తెరచి.."వారం రోజులు పూర్తి అయ్యాయి.." అని గొణుక్కున్నారు.. నావైపు తిరిగి .. "నువ్వు ఇంటికెళ్లు..రేపు ఎల్లుండి కూడా ఆహారం వద్దు..అమ్మా నాన్న గార్లను ఆ తరువాత రోజు రమ్మన్నానని చెప్పు.." అన్నారు..


సరే నన్నట్లుగా తలూపి..నేను వచ్చేసాను..జరిగిందంతా పూసగ్రుచ్చినట్లు అమ్మకు నాన్నకు చెప్పాను..


"వారం పాటు ధ్యానం లో ఉన్నారా?..ఎలా ఉన్నారో?..ఇలా ఏ ఆహారం తీసుకోకుండా వుంటే..ఆరోగ్యం క్షీణించి..ఏదైనా జరిగితే కష్టం కదండీ.." అని నాన్నగారితో అన్నది అమ్మ.


నాన్నగారు.."సరే ప్రభావతీ!..రెండు రోజుల తరువాత మనలను రమ్మన్నారు కదా..మనమే వెళ్ళొద్దాము..అప్పుడు అడుగుదాము" అన్నారు..


ఆ తరువాత మూడోరోజు అమ్మా నాన్న గార్ల సందేహానికి సమాధానం దొరికింది..


ఆ విషయ ప్రస్తావన రేపు తెలుసుకుందాము..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: