ॐ వినాయక చవితి సందేశాలు
-----------------------
సందేశం - 4
వినాయకుని షోడశ నామాలు
మనం ఏ దైవాన్ని పూజించాలన్నా, ఏ వ్రతం చేయాలన్నా, మరే ఇతర దైవ కార్యం జరుపుకుంటున్నా,
ముందుగా పసుపు ముద్దగా గణపతినిచేసి, ఆయనని పూజిస్తాం.
ఏ కార్యక్రమం చేయదలచుకున్నా, ఏ ప్రయాణం ప్రారంభించుకుంటున్నా,
పని నిర్విఘ్నంగా పూర్తవడానికి వినాయకుణ్ణే ప్రార్థిస్తాం.
ఆయనని తలచే షోడశ (16) నామాల అర్థాలు తెలుసుకొందాం.
ముందుగా ఆ పదహారు నామాలనీ శ్లోకాలరూపంలో, వాటిని చదివితే వచ్చే ఫలితంతో చదువుదాం.
సుముఖశ్చైకదంతశ్చ
కపిలో గజకర్ణకః |
లంబోదరశ్చ వికటో
విఘ్నరాజో గణాధిపః || 1 ||
ధూమ్ర కేతుః గణాధ్యక్షో
ఫాలచంద్రో గజాననః |
వక్రతుండ శ్శూర్పకర్ణో
హేరంబః స్కందపూర్వజః || 2 ||
షోడశైతాని నామాని యః
పఠేత్ శృణు యాదపి |
విద్యారంభే వివాహే చ
ప్రవేశే నిర్గమే తథా |
సంగ్రామే సర్వ కార్యేషు
విఘ్నస్తస్య న జాయతే || 3 ||
ఇపుడు వాటి అర్థాలు చూద్దాం.
1. సుముఖః - అనుగ్రహిస్తూ మనని చూస్తున్న (సు)ముఖంతో కనిపిస్తున్నవాడు,
2. ఏకదంతః - ఒక దంతము కలవాడు,
3. కపిలః - లేత సిందూరపు రంగు కలవాడు,
4. గజకర్ణిక - ఏనుగు చెవులు గలవాడు,
5. లంబోదరః - పెద్ద బొజ్జ కలవాడు,
6. వికటః - కష్టాలనీ, పాపాలనీ తొలగించగలవాడు,
7. విఘ్నరాజః - విఘ్నాలను అదుపుజేయగలవాడు,
8. గణాధిపః - గణాలకి అధిపతి
9. ధూమ(మ్ర)కేతుః - యుద్ధకాలాలలో తన రథానికి యజ్ఞధూమమే జెండాగా కలవాడు,
10. గణాధ్యక్షః - సర్వ గణాలకీ అధ్యక్షుడు,
11. ఫాలచంద్రః - నుదిటిమీద చంద్రరేఖ గలవాడు.
12. గజాననః - ఏనుగు ముఖము కలవాడు,
13. వక్రతుండః - వంకరగా పెట్టిన తన తుండము ద్వారా ఓంకారాన్ని తలపింపజేసేవాడు,
14. శూర్పకర్ణః - చేట ఆకారంలో విశాలమైన చెవులు కలవాడు,
15. హేరంబః - గాదెవంటి బొజ్జ కలవాడు,
16. స్కంద పూర్వజః - కుమారస్వామికి అన్న.
రామాయణం శర్మ
భద్రాచలం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి