*7.09.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - ఆరవ అధ్యాయము*
*బ్రహ్మాదిదేవతలు 'పరంధామమునకు విచ్చేయుము' అని శ్రీకృష్ణుని అర్థించుట - భగవానుని ఆదేశముతో ప్రభాసతీర్థమునకు వెళ్ళుటకు సిద్ధమగుచున్న యాదవులను చూచి ఉద్ధవుడు శ్రీకృష్ణుని కడకు ఏతెంచుట*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*6.25 (ఇరువది ఐదవ శ్లోకము)*
*యదువంశేఽవతీర్ణస్య భవతః పురుషోత్తమ|*
*శరచ్ఛతం వ్యతీయాయ పంచవింశాధికం ప్రభో॥12400॥*
ప్రభూ! పురుషోత్తమా! నీవు యదువంశమున అవతరించి, నూట ఇరువదియైదు సంవత్సరముల కాలము గడచినది.
*6.26 (ఇరువది ఆరవ శ్లోకము)*
*నాధునా తేఽఖిలాధార దేవకార్యావశేషితమ్|*
*కులం చ విప్రశాపేన నష్టప్రాయమభూదిదమ్॥12401॥*
*6.27 (ఇరువది ఏడవ శ్లోకము)*
*తతః స్వధామ పరమం విశస్వ యది మన్యసే|*
*సలోకా ల్లోకపాలాన్నః పాహి వైకుంఠకింకరాన్॥12402॥*
"జగదాధారా! దేవకార్యములు అన్నియును అన్నివిధములుగా పూర్తియైనవి. లోకకంటకులైన కంసాది దుష్టులను పరిమార్చితివి. గోవర్ధనోద్ధరణాది మహాకార్యములను నెఱపుటద్వారా సజ్జనులను కాపాడితివి. ఇంక ఇప్పుడు ఇచట నీవు చేయవలసిన కార్యములు ఏమియు లేవు. విప్రుల శాపకారణముగా యదువంశము దాదాపు అంతరించినట్లే. మా మనవి నీకు అంగీకారమైనచో, నీ పరంధామమైన వైకుంఠమునకు ఏతెంచుము. అట్లొనర్చి, నీ సేవకులము, లోకపాలురము ఐన మమ్ము, మా లోకములను కాపాడుము. వైకుంఠనాథా! పాహి-పాహి"
*శ్రీభగవానువాచ*
*6.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*
*అవధారితమేతన్మే యదాత్థ విబుధేశ్వర|*
*కృతం వః కార్యమఖిలం భూమేర్భారోఽవతారితః॥12403॥*
*6.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*
*తదిదం యాదవకులం వీర్యశౌర్యశ్రియోద్ధతమ్|*
*లోకం జిఘృక్షద్రుద్ధం మే వేలయేవ మహార్ణవః॥12404॥*
*కృష్ణభగవానుడు ఇట్లనెను* "బ్రహ్మదేవా! నీవు చెప్పినరీతిగనే నేను నిశ్చయించుకొంటిని. భూభారము తొలగినది. మీ దైవకార్యము నెరవేరినది. ప్రస్తుతము యాదవులు శౌర్యపరాక్రమములచేతను, ధనసంపత్సమృద్ధి కారణమునను గర్వోన్మత్తులై యున్నారు. వారు ఈ పృథ్విని కబళించుటకు సిద్ధముగానున్నారు. సముద్రమును చెలియలికట్టవలె వారిని నేను అదుపులో ఉంచినాను.
*6.30 ( ముప్పదియవ శ్లోకము)*
*యద్యసంహృత్య దృప్తానాం యదూనాం విపులం కులమ్|*
*గంతాస్మ్యనేన లోకోఽయముద్వేలేన వినంక్ష్యతి॥12405॥*
గర్వోన్మత్తులైయున్న ఈ యాదవులయొక్క విస్తారమైన వంశమును అంతరింపజేయకుండా నేను నా ధామమును చేరినచో, వీరు లౌకికమర్యాదలను ఉల్లంఘించి ప్రవర్తింతురు. దానివలన లోకము నాశనమగును.
*6.31 ( ముప్పది ఒకటవ శ్లోకము)*
*ఇదానీం నాశ ఆరబ్ధః కులస్య ద్విజశాపజః|*
*యాస్యామి భవనం బ్రహ్మన్నేతదంతే తవానఘ॥12406॥*
పుణ్యాత్మా! బ్రహ్మదేవా! బ్రాహ్మణుల శాపకారణముగా ఇప్పటికే యదువంశనాశనము ప్రారంభమైనది. ఈ కార్యము పూర్తియైన పిదప నేను నీ సత్యలోకమునకు వచ్చి, పిమ్మట నా వైకుంఠధామమును చేరెదను".
*శ్రీశుక ఉవాచ*
*6.32 ( ముప్పది రెండవ శ్లోకము)*
*ఇత్యుక్తో లోకనాథేన స్వయంభూః ప్రణిపత్య తమ్|*
*సహ దేవగణైర్దేవః స్వధామ సమపద్యత॥12407॥*
*శ్రీశుకుడు వచించెను* జగదీశ్వరుడైన శ్రీకృష్ణుడు ఇట్లు పలికిన పిమ్మట స్వయంభువుడైన బ్రహ్మదేవుడు ఇంద్రాదిదేవతలతోగూడి ఆ ప్రభువునకు ప్రణమిల్లి, ఆ స్వామిని వీడ్కొని, తన లోకమునకు చేరెను.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి