8, సెప్టెంబర్ 2021, బుధవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*410వ నామ మంత్రము* 8.9.2021


*ఓం శివపరాయై నమః*


శివుడే పరుడుగా ఉత్కృష్టుడుగా గలిగిన జగన్మాతకు నమస్కారము.


శివుని కంటె పరమైన పరమేశ్వరికి నమస్కారము.


శివుని గూర్చి భక్తులకు ఎరుక కలిగించు జగదీశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శివపరా* యను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం శివపరాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ లలితాంబికను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ తల్లి సర్వాభీష్టసిద్ధులుగా అనుగ్రహించును.


పరమేశ్వరుడు శివుడయితే, పరమేశ్వరి శక్తి. ఈ శక్తిలేనిదే ఈశ్వరునకు శరీరమేలేదని భావము ఈ నామ మంత్రమందు ఉన్నది. త్రిమూర్తులలో ఒకడు శివుడు. ఆ త్రిమూర్తులకన్నను పరమేశ్వరి పూర్వురాలు. అమ్మవారు ఆదిపరాశక్తి. శివునికన్న పరమైనది. గనుకనే శ్రీమాత *శివపరా* యని అనబడినది. శివశక్త్యైక్యము అని అంటాము. అలాగే పిపీలకాది బ్రహ్మపర్యంతము శక్తికి ఏవిధముగా అధీనమైయుండునో, శివుడు కూడా శక్తికి అధీనమైనవాడే. శివునికన్న వేరైనది. అధికురాలు అగుటచే అమ్మవారు *శివపరా* యని అనబడినది. సృష్టి కార్యము శక్తి ప్రమేయము, సహాయము లేనిదే శివుడు చేయలేడు. 


*స్వాధీన వల్లభా* (లలితా సహస్ర నామావళి యందలి 54వ నామ మంత్రము) భర్త అయిన శివుని తన అధీనంలో ఉంచుకోగలిగినది పరమేశ్వరి. (పరమేశ్వరుడు శక్తితో కూడి ఉన్నప్పుడే సృష్టి-స్థితి-లయ కార్యములను చేయగలుగుతున్నాడు. కాబట్టి శివుడు శక్తికి అధీనుడగుటచే, ఆ తల్లి *శివపరా* యని అనబడినది.


సౌందర్యలహరిలో శంకరభగవత్పాదులవారు ఇలా చెప్పారు.


*శివః శక్త్యా యుక్తో- యది భవతి శక్తః ప్రభవితుం*


*న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి|*


*అతస్త్వామ్ ఆరాధ్యాం హరి-హర-విరిన్చాదిభి రపి*


*ప్రణంతుం స్తోతుం వా కథ-మక్ర్త పుణ్యః ప్రభవతి|| 1 ||*


అమ్మా! పరమశివుడే అయినా నీతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే సర్వశక్తిమంతుడై లోకవ్యవహారములు చేయ గలుగు తున్నాడు. అదే నీతోడు లేనినాడు శంకరుడే అయినా ఇసుమంత కూడా కదలలేడు కదా. (శక్తితో ఉంటే శివం-కదలగలిగేది,శక్తి లేకుంటే శవం - కదలలేనిది)

శివరూపమైన లింగం శక్తిరూపమైన పానుపట్టం లేనిదే నిలబడలేదుగా.

అంత శంకరుడే పరాధీనతతో నీ ఆధారముతో నిలువగా ఇక సామాన్యులు నినువిడచి జీవించుట ఎట్లుసాధ్యం.

నిన్ను నిత్యము శివుడు, విష్ణువు, బ్రహ్మ మొదలైన దేవాదిదేవతలే కొలుస్తూ ఉంటారు.

అటువంటి నిన్ను కొలవాలన్నా నీ పాదపద్మాలు సేవించాలన్నా ఎన్నో జన్మ జన్మల పుణ్యం చేసినవారికి తప్ప అన్యులకు ఆ భాగ్యము దక్కదు కదా.


కనుక పరమేశ్వరి *శివపరా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం శివపరాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: