మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..
*చిరు బోధ!..*
శ్రీ దత్తాత్రేయ స్వామి వారు కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందాలని నిర్ణయం తీసుకునే ముందు తాము సజీవ సమాధి చెందాలని అభిలషించారు.. తనను సజీవంగా సమాధి చేయమని మా తల్లిదండ్రులైన శ్రీధరరావు, నిర్మలప్రభావతి గార్లకు, శ్రీ చక్కా కేశవులు గారికి, శ్రీ మీరాశెట్టి గారికి చాలా సార్లు చెప్పారు..వారెవరూ కూడా ఆ ప్రతిపాదనకు ఒప్పుకోలేదు..శ్రీ స్వామివారిని అటువంటి నిర్ణయం తీసుకోవద్దని బ్రతిమలాడారు..తామెవ్వరమూ ఆ పని తమ చేతులతో చేయలేమని ఖరాఖండిగా చెప్పేసారు..శ్రీ స్వామివారు మాత్రం.."సమయం అయిపోయింది..నేను వచ్చిన కార్యం కూడా పూర్తి అయింది..ఇక ఎక్కువ రోజులు నేను ఇక్కడ వుండటానికి లేదు..అది మీరు గ్రహించాలి.." అని చెప్పసాగారు..
ఈ సంప్రదింపులు ఇలా జరుగుతున్న సమయం లో శ్రీ స్వామివారు తమ సాధనను తీవ్రం చేశారు..కఠోర తపస్సు చేయసాగారు..ఆహారం తీసుకోవడం దాదాపుగా మానివేశారు..తరచూ వచ్చి తనను కలవొద్దని మా తల్లిదండ్రులకు చెప్పారు..ఏదైనా అవసరం కలిగితే తానే కబురు చేస్తానని కూడా చెప్పారు..శ్రీ స్వామివారు ఆహారం తీసుకున్నా..తీసుకోకపోయినా..నా చేత మాత్రం ఆహారాన్ని స్టీలు కారియర్ ద్వారా మా అమ్మగారు పంపించేవారు..ఆశ్రమం లోని వంటగది వద్ద ఆ కారియర్ ను ఉంచి నేను మా పొలానికి వెళ్ళేవాడిని..తిరిగి వచ్చేసమయానికి ఆ కారియర్ ఎక్కడ నేను పెట్టానో అక్కడే ఉండేది..వెనక్కు తీసుకొచ్చేసేవాడిని..ఒక్కొక్కసారి మాత్రం శ్రీ స్వామివారు తాను ధ్యానం నుండి లేచిన తరువాత..కారియర్ లోని ఆహారాన్ని కొద్దిగా తీసుకుని..శుభ్రంగా కడిగి పెట్టేవారు..శ్రీ స్వామివారు ఆరోజు ఆహారం స్వీకరించారు అనుకోవడానికి అదే గుర్తు నాకు..
ఒకరోజు విజయవాడ నుంచి మల్లికార్జున రావు గారని ఒక సిద్దాంతి గారిని శ్రీ చెక్కా కేశవులు గారు మొగలిచెర్ల కు పంపారు..శ్రీ మల్లికార్జున రావు గారు దేవాలయాల ప్రతిష్టలు బాగా చేస్తారని పేరు.. శ్రీ చెక్కా కేశవులు గారి ద్వారా శ్రీ స్వామివారి గురించి విని..శ్రీ స్వామివారిని చూడాలనే కుతూహలంతో..మల్లికార్జున రావు గారు మొగలిచెర్ల కు వచ్చారు..
"శ్రీ స్వామివారు తీవ్ర సాధన లో ఉన్నారనీ..ఎవ్వరినీ కలవ వద్దని చెప్పారని.." నాన్న గారు మల్లికార్జున రావు గారికి చెప్పి.."రేపుదయం మా అబ్బాయి ప్రసాద్..పొలానికి వెళుతూ..శ్రీ స్వామివారికి ఆహారం తీసుకెళ్లి ఆశ్రమం లో పెట్టి..వెళుతుంటాడు..మీరు కూడా ప్రసాద్ తో కలిసి వెళ్ళండి..మీరు మధ్యాహ్నం వరకూ అక్కడే వుండండి.. ఒకవేళ శ్రీ స్వామివారు ధ్యానం నుంచి లేచి వస్తే..మీరు వారిని కలవ వచ్చు..పూర్తిగా మీ అదృష్టం మీద ఆధారపడివుంది.." అని చెప్పారు..
"నాకు ప్రాప్తం వుంటే..స్వామివారిని చూస్తాను..లేకుంటే లేదు.." అన్నారు మల్లికార్జున రావు గారు..
ప్రక్కరోజు ఉదయాన్నే..ఎద్దుల బండి సిద్ధం చేయించారు నాన్న గారు..నేనూ మల్లికార్జున రావు గారు అందులో ఎక్కి బైలుదేరాము..మేము ఆశ్రమం చేరేసరికి..అత్యంత ఆశ్చర్యకరంగా శ్రీ స్వామివారు..ఆశ్రమం బైట వైపు నిలబడి వున్నారు..చాలా ప్రశాంతంగా..చిరునవ్వుతో నిలుచుని వున్నారు..బండి కొద్దిగా ఇవతలి వైపు ఆపుకొని..నేనూ, మల్లికార్జున రావు గారు ఇద్దరమూ శ్రీ స్వామివారి వద్దకు వెళ్ళాము..శ్రీ స్వామివారిని చూడగానే..మల్లికార్జున రావు గారు..సాష్టాంగనమస్కారం చేశారు..శ్రీ స్వామివారు లోపలికి రమ్మన్నట్లు గా సైగ చేసి..ఆశ్రమం లోకి వెళ్లారు..మేమిద్దరమూ కూడా శ్రీ స్వామివారి వెనకాలే లోపలికి వెళ్ళాము..ధ్యానం చేసుకునే గది ముందు శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని కూర్చుని..మమ్ములను కూడా కూర్చోమన్నారు..
కేశవులు గారు మల్లికార్జునరావు గారిని తమవద్దకు పంపుతున్నట్టు శ్రీ స్వామివారికి ముందే తెలుసా?..అనే నా సందేహానికి శ్రీ స్వామివారి చల్లని చిరునవ్వే సమాధానం!.
"ఏమిటి విషయాలు?..నన్ను చూద్దామని వచ్చారా?..మంచిది..కేశవులు గారు బాగున్నారా?.." అన్నారు స్వామి వారు..సందేహం లేదు..శ్రీ స్వామివారు చక్కటి అవగాహన్ తోనే ఉన్నారని నాకూ మల్లిఖార్జున రావు గారికీ అర్థమైపోయింది..శ్రీ స్వామివారు అడిగిన వాటికి మల్లికార్జున రావు గారు తలూపుతూ వున్నారు..ఒక్కమాట కూడ మాట్లాడలేదు..
"సుమారు డెబ్భైయేళ్ళ వయసు గడచిపోతోంది..ఇప్పటికైనా మీ ఇష్టదైవం పాదాలను గట్టిగా పట్టుకోండి.." అని చెప్పి..తన కుడిచేతిని మల్లికార్జునరావు గారి తల మీద పెట్టి.."దేవాలయములో విగ్రహ ప్రతిష్ఠ చేసినంత మాత్రాన దైవాన్ని చులకనగా చూడొద్దు.. జాగ్రత్త..అహంకారం వద్దు.." అన్నారు..ఎప్పుడైతే స్వామివారి హస్తం తన తలను తాకిందో..మరుక్షణమే మల్లికార్జున రావు గారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు..ఆయన కళ్లలోంచి ధారగా కన్నీళ్లు వచ్చాయి.."స్వామీ..మిమ్మల్ని కలుస్తానని అనుకోలేదు..నేను చాలా దేవాలయ ప్రతిష్టలు చేసాను..ఆ విషయం లో నన్ను మించిన వాడు లేడనీ..నేను ప్రతిష్ట చేయబట్టే దైవానికి పూజలు జరుగుతున్నాయని అహంకారం ఉంది..అది తప్పని తెలిసింది..ఇకనుంచి బుద్ధిగా..దైవాన్ని భక్తి తో కొలుస్తాను.."అన్నారు..
శ్రీ స్వామివారు లేచి నిలబడి.."మంచిది..శుభం జరుగుతుంది..ఇక వెళ్ళిరండి..నాకూ ధ్యానానికి సమయం అవుతోంది..కేశవులు గారిని అడిగానని చెప్పండి.." అన్నారు..శ్రీ స్వామివారు చాలా క్లుప్తంగా చెప్పినా..మల్లికార్జునరావు గారికి అందులోని సారాంశం చక్కగా బోధపడింది..మళ్లీ శ్రీ స్వామివారికి సాష్టాంగనమస్కారం చేసుకున్నారు మల్లికార్జునరావు గారు..ఆయన కళ్ల నుంచి కన్నీళ్లు ఆగటం లేదు..
మొగలిచెర్ల లోని మా ఇంటికి తిరిగొచ్చాక..మా తల్లిదండ్రులతో జరిగిన విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పి..తన అహంకారాన్ని వదులుకోమని స్వామివారు చెప్పారని కూడా చెప్పి..పదే పదే శ్రీ స్వామివారిని తలచుకుంటూ..విజయవాడ కు తిరిగి వెళ్లారు మల్లికార్జునరావు గారు.
సర్వం..
శ్రీ దత్తకృప!.
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి