8, సెప్టెంబర్ 2021, బుధవారం

సంస్కృత మహాభాగవతం

 *8.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఆరవ అధ్యాయము*


*బ్రహ్మాదిదేవతలు 'పరంధామమునకు విచ్చేయుము' అని శ్రీకృష్ణుని అర్థించుట - భగవానుని ఆదేశముతో ప్రభాసతీర్థమునకు వెళ్ళుటకు సిద్ధమగుచున్న యాదవులను చూచి ఉద్ధవుడు శ్రీకృష్ణుని కడకు ఏతెంచుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*6.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*అథ తస్యాం మహోత్పాతాన్ ద్వారవత్యాం సముత్థితాన్|*


*విలోక్య భగవానాహ యదువృద్ధాన్ సమాగతాన్॥12408॥*


*శ్రీశుకుడు ఇట్లు వచించుచుండెను* అంతట ద్వారకానగరమున పెక్కు అపశకునములు ఉప్పతిల్లెను. మహోత్పాతములు చెలరేగెను. వాటికి ఆందోళన చెంది, యాదవప్రముఖులు శ్రీకృష్ణుని కడకు విచ్చేసిరి. అప్పుడు ఆ ప్రభువు వారితో ఇట్లు నుడివెను.


*శ్రీభగవానువాచ*


*6.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*ఏతే వై సుమహోత్పాతా వ్యుత్తిష్ఠంతీహ సర్వతః|*


*శాపశ్చ నః కులస్యాసీద్బ్రాహ్మణేభ్యో దురత్యయః॥12409॥*


*6.35 (ముప్పది ఐదవ శ్లోకము)*


*న వస్తవ్యమిహాస్మాభిర్జిజీవిషుభిరార్యకాః|*

*ప్రభాసం సుమహత్పుణ్యం యాస్యామోఽద్యైవ మా చిరమ్॥12410॥*


*శ్రీకృష్ణుడు ఇట్లనెను* "పూజ్యులారా! ప్రస్తుతము ద్వారకయందు అంతటను అపశకునములు, ఉత్పాతములు విజృంభించుచున్నవి. బ్రాహ్మణోత్తములు మనవంశమునకు ఘోరమైన శాపమును ఇచ్చియున్నారు. దానికి తిరుగులేదని మీకును తెలియునుగదా! ప్రాణములను దక్కించుకొనదలచినచో మనము ఇచట నిలువరాదు. నేడే వెంటనే పరమ పవిత్రమైన ప్రభాస తీర్థమునకు వెళ్ళెదము.


*6.36 (ముప్పది ఆరవ శ్లోకము)*


*యత్ర స్నాత్వా దక్షశాపాద్గృహీతో యక్ష్మణోడురాట్|*


*విముక్తః కిల్బిషాత్సద్యో భేజే భూయః కలోదయమ్॥12411॥*


ప్రభాసతీర్థముయొక్క మహిమ మిగుల అద్భుతమైనది. పూర్వము దక్షప్రజాపతి శాపకారణముగా చంద్రుడు క్షయరోగమునకు గుఱియయ్యెను (దక్షప్రజాపతి తన కుమార్తెలలో ఇరువదియేడు మందిని చంద్రునకు ఇచ్చి పెండ్లిచేసెను. వారిలో రోహిణి అను తరుణి అతిలోకసుందరి. అందువలన చంద్రుడు ఆమెయందు అధికముగా ఆసక్తి చూపుచూ, తక్కినవారిని అంతగా ఆదరింపకుండెను. అందువలన వారు దుఃఖితులై తమ తండ్రియైన దక్షునికడ తమ బాధను వెళ్ళబోసిరి. అప్పుడు దక్షుడు క్రోధోద్రిక్తుడై 'చంద్రా! నీవు మా కుమార్తెలయెడ నిరాదరమును చూపితివిగాన క్షయరోగను పొందుము' అని శపించెను. ఆ విధమగా చంద్రుడు క్షయరోగ పీడితుడయ్యెను). అంతట అతడు ప్రభాస క్షేత్రమునకు వెళ్ళి, అచటి పవిత్రతీర్థమున స్నానమొనర్చెను. వెంటనే అతడు తన పాపఫలితమైన రోగమునుండి విముక్తుడయ్యెను. అంతేగాక,ఎప్పటివలె ఆ చంద్రుడు తన కళలతో తేజరిల్లెను.


*6.37 (ముప్పది ఏడవ శ్లోకము)*


*వయం చ తస్మిన్నాప్లుత్య తర్పయిత్వా పితౄన్ సురాన్|*


*భోజయిత్వోశిజో విప్రాన్ నానాగుణవతాంధసా॥12412॥*


*6.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*


*తేషు దానాని పాత్రేషు శ్రద్ధయోప్త్వా మహాంతి వై|*


*వృజినాని తరిష్యామో దానైర్నౌభిరివార్ణవమ్॥12413॥*


మహాత్ములారా! కావున మనము వెంటనే ప్రభాస తీర్థమునకు వెళ్ళుదము. అచటి పవిత్రజలములలో స్నానములను ముగించుకొని, దేవతలకును, పితృదేవతలకును తర్పణములను సమర్పింతము. షడ్రసోపేతములైన, రుచికరములగు భోజనపదార్థములతో బ్రాహ్మణోత్తములను సంతుష్టులను గావించెదము. పాత్రులైన వారికి ఉత్తమములైన దానములను భక్తిశ్రద్ధలతో సమర్ఫింతము. ఆ విధముగా మనము బ్రాహ్మణుల ఆశీర్వచనములను పొంది, సముద్రమును నౌకలతోవలె సంకటములనుండి తరింతము".


*శ్రీశుక ఉవాచ*


*6.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*


*ఏవం భగవతాఽఽదిష్టా యాదవాః కులనందన|*


*గంతుం కృతధియస్తీర్థం స్యందనాన్ సమయూయుజన్॥12414॥*


*శ్రీశుకుడు పలికెను* పరీక్షిన్మహారాజా! శ్రీకృష్ణభగవానుడు ఇట్లు ఆదేశింపగా, యాదవులు అందరును ప్రభాసతీర్థమునకు వెళ్ళుటకు ఏకగ్రీవముగా నిశ్చయించుకొని, తమ రథములను (బంద్లను/వాహనములను) సిద్ధపరచుకొనిరి.


*6.40 (ముప్పది నలుబదియవ శ్లోకము)*


*తన్నిరీక్ష్యోద్ధవో రాజన్ శ్రుత్వా భగవతోదితమ్*


*దృష్ట్వారిష్టాని ఘోరాణి నిత్యం కృష్ణమనువ్రతః॥12415॥*


*6.41 (నలుబది ఒకటవ శ్లోకము)*


*వివిక్త ఉపసంగమ్య జగతామీశ్వరేశ్వరమ్|*


*ప్రణమ్య శిరిసా పాదౌ ప్రాంజలిస్తమభాషత॥12416॥*


మహారాజా! శ్రీకృష్ణసేవా పరాయణుడైన ఉద్ధవుడు ఆ పరమాత్ముని సముచిత వచనములను సావధానముగా వినెను. యాదవుల ప్రయాణసన్నాహములను గమనించెను. అనుక్షణము సంభవించుచున్న భయంకరములైన పెక్కు దృశ్యములను గుర్తించెను. పిమ్మట అతడు సకలజగత్తునకు సర్వేశ్వరుడైన శ్రీకృష్ణుని సన్నిధికి ఏకాంతముగా వెళ్ళెను. పిదప ఆ స్వామి పాదపద్మములకు ప్రణమిల్లి, ప్రాంజలియైన ఆ ప్రభువునకు ఇట్లు విన్నవించెను-


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఆరవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: