8, సెప్టెంబర్ 2021, బుధవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*

:

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*993వ నామ మంత్రము* 8.9.2021


*ఓం అజ్ఞానధ్వాంతదీపికాయై నమః*


అజ్ఞానమనే అంధకారమునందు జ్ఞానదీపము వంటి పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అజ్ఞానధ్వాంతదీపికా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం అజ్ఞానధ్వాంతదీపికాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగదీశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులకు ఆ తల్లి వారిలోని అజ్ఞానమును తొలగించి, జ్ఞానప్రకాశమును అనుగ్రహించును.


ధ్వాంతము అంటే చీకటి. అజ్ఞానధ్వాంతము అంటే అజ్ఞానమనే చీకటి. దీపిక అనగా జ్యోతి. అజ్ఞానమనే చీకట్లలో జ్ఞానమనే జ్యోతివంటిది పరమేశ్వరి గనుకనే *అజ్ఞానధ్వాంతదీపికా* యని అనబడినది. పరమేశ్వరి తన భక్తులలోని అజ్ఞానమను చీకట్లను తొలగించి జ్ఞానజ్యోతులను ప్రసాదిస్తుంది. ఈ దేహమే నిత్యము, సత్యము అనియు ఈ దేహమే ఆత్మ అనుట అజ్ఞానము. ఈ దేహమునకు చలనము కలిగేది ప్రాణము వలన. అదే జీవాత్మ. ఆ జీవాత్మ ఉండుటకు కారణము పరమాత్మ. పరమాత్మ, జీవాత్మతోనే ఉండి దేహములోని ఇంద్రియములు, మనసు తమ కార్యములను నెరవేరునటులు చేయుచూ జీవాత్మపరమాత్మ ఐక్యతను నిరూపించి, అద్వైతభావనను వెల్లడి చేయడం జరుగుచున్నది. దీనిని బట్టి జీవాత్మ, పరమాత్మలు ఒకటే. జీవాత్మ పరమాత్మలు ఒకటికాదు అనేది అజ్ఞానము. ఆ అజ్ఞానము చీకటివంటిది. అదే ద్వైతము. అటువంటి ఆజ్ఞానమనే చీకటిలో సంసార సాగరపయనము యొక్క మునకతప్ప పరమాత్మ అనే తీరమునకు చేరుట ఉండదు. పరమేశ్వరి అటువంటి అజ్ఞానపు చీకటులను జ్ఞానదీపికలతో తొలగించి పరమాత్మయనే తీరానికి చేరుస్తుంది గనుక ఆ తల్లి *అజ్ఞానధ్వాంతదీపికా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం అజ్ఞానాంతదీపికాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: