9, సెప్టెంబర్ 2021, గురువారం

సంస్కృత మహాభాగవతం

 *9.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఆరవ అధ్యాయము*


*బ్రహ్మాదిదేవతలు 'పరంధామమునకు విచ్చేయుము' అని శ్రీకృష్ణుని అర్థించుట - భగవానుని ఆదేశముతో ప్రభాసతీర్థమునకు వెళ్ళుటకు సిద్ధమగుచున్న యాదవులను చూచి ఉద్ధవుడు శ్రీకృష్ణుని కడకు ఏతెంచుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*ఉద్ధవ ఉవాచ*


*6.42 (నలుబది రెండవ శ్లోకము)*


*దేవదేవేశ యోగేశ పుణ్యశ్రవణకీర్తన|*


*సంహృత్యైతత్కులం నూనం లోకం సంత్యక్ష్యతే భవాన్|*


*విప్రశాపం సమర్థోఽపి ప్రత్యహన్న యదీశ్వరః॥12417॥*


*ఉద్ధవుడు ఇట్లు నుడివెను* "దేవదేవా! యోగేశ్వరా! దివ్యములైన నీ గాథలను విన్నవారు, రూపగుణ వైభవములను కీర్తించినవారు పునీతులగుదురు. సకులలోక పూజ్యుడవైన నీవు విప్రుల శాపమును నివారింపగల సమర్థుడవయ్యును అట్లు చేయలేదు. ఈ యదువంశమును పూర్తిగా రూపుమాపి, నీవు తప్పక ఈ లోకమును త్యజింపనున్నట్లు నేను తలంతును.


*6.43 (నలుబది మూడవ శ్లోకము)*


*నాహం తవాంఘ్రికమలం క్షణార్ధమపి కేశవ|*


*త్యక్తుం సముత్సహే నాథ స్వధామ నయ మామపి॥12418॥*


*6.44 (నలుబది నాలుగవ శ్లోకము)*


*తవ విక్రీడితం కృష్ణ నృణాం పరమమంగలమ్|*


*కర్ణపీయూషమాస్వాద్య త్యజంత్యన్యస్పృహాం జనాః॥12419॥*


*6.45 (నలుబది ఐదవ శ్లోకము)*


*శయ్యాసనాటనస్థానస్నానక్రీడాశనాదిషు|*


*కథం త్వాం ప్రియమాత్మానం వయం భక్తాస్త్యజేమహి॥12420॥*


కేశవా! జగన్నాథా! నీపాదారవిందములను విడిచి, ఒక్క అరక్షణముగూడ మనజాలను. కనుక, నన్నుగూడ నీ పరంధామమునకు తీసికొనివెళ్ళుము. కృష్ణా! నీ అద్భుతలీలలు అన్నియును మానవాళికి మంగళకరములు. నీ కథాసుధలను తనివిదీర గ్రోలినవారికి ఇతర విషయములపై మనస్సు పోనేపోదు. మేము స్నానపానములయందును, ఆటపాటలలోను నీతో గూడియుంటిమి. ఆసనములపై నీతోనే కూర్చుంటిమి. నీతో భుజించితిమి, ముచ్చటించితిమి, పరుంటిమి. అట్టి నీ పరమభక్తులమైన మేము మీకు సర్వదా ప్రియతముడవైన నిన్ను వీడి ఎట్లుండగలము?


*6.46 (నలుబది ఆరవ శ్లోకము)*


*త్వయోపభుక్తస్రగ్గంధవాసోఽలంకారచర్చితాః|*


*ఉచ్ఛిష్టభోజినో దాసాస్తవ మాయాం జయేమహి॥12421॥*


దేవా! మేము నీ దాసానుదాసులము. నీ నిర్మాల్యములైన మాలలను ధరించితిమి. గంధములను అలదుకొంటిమి, వస్త్రాలంకారములను దాల్చితిమి. నీవు ఆరగించిన ప్రసాదములను స్వీకరించితిమి. కనుక నీ మాయను తప్ఫక జయింపగలము. ప్రభూ! మేము నీ మాయకు ఏమాత్రమూ భయపడము. కానీ నీ వియోగమును మాత్రము భరింపజాలము.


*6.47 (నలుబది ఏడవ శ్లోకము)*


*వాతరశనా య ఋషయః శ్రమణా ఊర్ధ్వమంథినః|*


*బ్రహ్మాఖ్యం ధామ తే యాంతి శాంతాః సన్న్యాసినోఽమలాః॥12422॥*


మహామునులు దిగంబరులై జీవితాంతము నిష్ఠతో బ్రహ్మచర్యమును పాటింతురు. అధ్యాత్మ విద్యకొరకు మిక్కిలి పరిశ్రమ చేయుదురు. ఇట్టి కఠినమైన సాధనలద్వారా వారి హృదయములు నిర్మలములగును. అంతట వారియొక్క సమస్త వృత్తులును శాంతింపగా నైష్కర్మ్యస్థితిని పొంది నీ పరమధామమునకు చేరుదురు.


*6.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*


*వయం త్విహ మహాయోగిన్ భ్రమంతః కర్మవర్త్మసు|*


*త్వద్వార్తయా తరిష్యామస్తావకైర్దుస్తరం తమః॥12423॥*


*6.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*


*స్మరంతః కీర్తయంతస్తే కృతాని గదితాని చ|*


*గత్యుత్స్మితేక్షణక్ష్వేలి యన్నృలోకవిడంబనమ్॥12424॥*


మహాయోగీశ్వరా! మేము ఈ లోకమున కర్మమార్గములయందే తిరుగుచుందుము. కానీ నీ భక్తులతోగూడి నీ రూపగుణములను ఆనందముగా చర్చించుకొనుచుందుము. నీవు లోకమర్యాదలను అనుసరించి, మానవునివలె నెరపిన లీలలను, పలికిన మధుర వచనములను పదేపదే స్మరించుచు కీర్తించుచుందుము. అట్లే నీ కదలికలను చిఱునవ్వులతో ఒప్పెడి నీ చూపులను, పరిహాసభాషణములను జ్ఞప్తికి తెచ్చుకొనుచు వాటిలో లీనమగుదుము. కేవలము ఇట్టి లీలలను స్మరించుకొనినంతమాత్రముననే దుస్తరమైన నీ మాయను తరించగలము".


*శ్రీశుక ఉవాచ*


*6.50 (ఏబదియవ శ్లోకము)*


*ఏవం విజ్ఞాపితో రాజన్ భగవాన్ దేవకీసుతః|*


*ఏకాంతినం ప్రియం భృత్యముద్ధవం సమభాషత॥12425॥*


*శ్రీశుకుడు వచించెను* పరీక్షన్మహారాజా! ఈ విధముగా ఉద్ధవుడు దేవకీసుతుడైన శ్రీకృష్ణునకు విన్నవించిన పిమ్మట ఆ పరమాత్మ తన అనన్యభక్తుడు, ప్రియభృత్యుడు అయిన ఉద్ధవునితో ఇట్లు భాషించెను.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే షష్ఠోఽధ్యాయః (6)*


ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *బ్రహ్మాదిదేవతలు 'పరంధామమునకు విచ్చేయుము' అని శ్రీకృష్ణుని అర్థించుట - భగవానుని ఆదేశముతో ప్రభాసతీర్థమునకు వెళ్ళుటకు సిద్ధమగుచున్న యాదవులను చూచి ఉద్ధవుడు శ్రీకృష్ణుని కడకు ఏతెంచుట*

అను

ఆరవ అధ్యాయము (6)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: