9, సెప్టెంబర్ 2021, గురువారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*994వ నామ మంత్రము* 9.9.2021


*ఓం ఆబాలగోపవిదితాయై నమః*


పసివాడి నుండి పరమాత్మ (గోపాలుని) వరకూ అందరిచేతా తెలియబడిన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *ఆబాలగోపవిదితా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం ఆబాలగోపవిదితాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిప్రపత్తులతో ఆరాధించు భక్తజనులపాలిట ఆ శ్రీమాత తానొక కృష్ణభగవానుని రూపమున సర్వకాల సర్వావస్థలయందునూ తోడై నిలచును.


ఆబాలగోపవిదితా - బాలుని నుండి గోపాలునివరకూ. పిండాండము నుండి బ్రహ్మాండము వరకూ, పిపీలకాది బ్రహ్మ పర్యంతమూ ఆ పరమేశ్వరి తెలియబడియున్నది. భగవానుడు నారాయణుడైతే, పరమేశ్వరి నారాయణి. నారాయణుని ఆకృతులను తన చేతి పదివ్రేళ్ళ గోళ్ళ సందులనుండి ఉద్భవింపజేసినది పరమేశ్వరి. నారాయణ, నారాయణిల అభేదము దీనితో స్పష్టమగుచున్నది గనుక ఆ తల్లి సాక్షాత్తు శ్రీకృష్ణపరమాత్మయే గదా! నిండుసభలో దుర్యోధనాదులు వస్త్రాపహరణము చేయునపుడు ద్రౌపదిని శ్రీకృష్ణపరమాత్మ రక్షించినవాడైతే, అజ్ఞాతవాసప్రారంభంలో ఆర్తితో "అమ్మా! పరమేశ్వరీ! మా అజ్ఞాతవాస కాలము జయప్రదముగా ముగింపజేయుమమ్మా! కాత్యాయనీ' అని వేడుకున్న ద్రౌపదికి రక్షణనిచ్చినది ఆ కాత్యాయని. భాగవతము, దేవీభాగవతము ఈ రెండిటియందు నారాయణ, నారాయణుల లీలలేగదా. ఆ నారాయణునిగురుంచి తెలియని బాలుడు, ఈ నారాయణి గురుంచి తెలియని గోపాలుడు ఉంటారా? ఉండరు. ఆ బాలునికి, ఈ గోపాలునికి కూడా తెలిసియుండునది ఆ పరమేశ్వరి గనుకనే ఆ తల్లి *ఆబాలగోపవిదితా* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం ఆబాలగోపవిదితాయై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: