17, అక్టోబర్ 2021, ఆదివారం

సంస్కృత మహాభాగవతం*

 *17.10.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదహారవ అధ్యాయము*


*పరమాత్ముని విభూతుల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*16.9 (తొమ్మిదవ శ్లోకము)*


*అహమాత్మోద్ధవామీషాం భూతానాం సుహృదీశ్వరః|*


*అహం సర్వాణి భూతాని తేషాం స్థిత్యుద్భవాప్యయః॥12819॥*


మహాత్మా! ఉద్ధవా! నేను సకలప్రాణులకు ఆత్మను. హితైషిని, సహృదయుడను. నియామకుడను. ఈ సమస్త ప్రాణులును, పదార్థములును నా రూపములే. వీటియొక్క ఉత్పత్తి, స్థితి, లయములకు కారణము నేనే.


*16.10 (పదియవ శ్లోకము)*


*అహం గతిర్గతిమతాం కాలః కలయతామహమ్|*


*గుణానాం చాప్యహం సామ్యం గుణిన్యౌత్పత్తికో గుణః॥12820॥*


చైతన్యవంతమైన పదార్థములలో నేను పరమచైతన్యమును, గణించువారిలో నేను కాలమును. త్రిగుణములయొక్క సామ్యావస్థయైన ప్రకృతిని నేనే. గుణములు గలవారియొక్క స్వాభావిక గుణమును నేనే. 


*16.11 (పదకొండవ శ్లోకము)*


*గుణినామప్యహం సూత్రం మహతాం చ మహానహమ్|*


*సూక్ష్మాణామప్యహం జీవో దుర్జయానామహం మనః॥12821॥*


గుణములయందు సంక్షోభము కలుగునప్పుడు ఉత్పన్నమగు క్రియాశక్తియైన ప్రధాన సూత్రాత్మను నేను. జ్ఞానశక్తికి ప్రధానమైన మహత్తత్త్వమును నేను. సూక్ష్మ పదార్థములలో జీవుడను నేను. వశపరచుకొనుటకు అసాధ్యమైన మనస్సును నేను.


*16.12 (పండ్రె శ్లోకము)*


*హిరణ్యగర్భో వేదానాం మంత్రాణాం ప్రణవస్త్రివృత్|*


*అక్షరాణామకారోఽస్మి పదాని ఛందసామహమ్॥12822॥*


వేదములకు అభివ్యక్తి స్థానమైన హిరణ్యగర్భుడను నేను. మంత్రములలో *అ* కార, *ఉ* కార, *మ* కారములతో గూడిన ప్రణవమును నేను. అక్షరములలో *అ* కారమును - ఛందస్సులలో త్రిపదయైన గాయత్రిని.


*16.13 (పదమూడవ శ్లోకము)*


*ఇంద్రోఽహం సర్వదేవానాం వసూనామస్మి హవ్యవాట్|*


*ఆదిత్యానామహం విష్ణూ రుద్రాణాం నీలలోహితః॥12823॥*


*16.14 (పదునాలుగవ శ్లోకము)*


*బ్రహ్మర్షీణాం భృగురహం రాజర్షీణామహం మనుః|*


*దేవర్షీణాం నారదోఽహం హవిర్ధాన్యస్మి ధేనుషు॥12824॥*


*16.15 (పదిహేనవ శ్లోకము)*


*సిద్ధేశ్వరాణాం కపిలః సుపర్ణోఽహం పతత్రిణామ్|*


*ప్రజాపతీనాం దక్షోఽహం పితౄణామహమర్యమా॥12825॥*


నేనే సకల దేవతలలో ఇంద్రుడను, అష్టవసువులలో అగ్నిని, ద్వాదశ ఆదిత్యులలో విష్ణువును, ఏకాదశరుద్రులలో శంకరుడను. బ్రహ్మర్షులలో భృగువును. రాజర్షులలో మనువును. దేవర్షులలో నారదుడను. గోవులలో కామధేనువును. సిద్ధేశ్వరులలో (సిద్ధులలో) కపిలుడను. పక్షులలో గరుత్మంతుడను. ప్రజాపతులలో దక్షప్రజాపతిని. పితృదేవతలలో అర్యముడను నేనే.


*16.16 (పదహారవ శ్లోకము)*


*మాం విద్ధ్యుద్ధవ దైత్యానాం ప్రహ్లాదమసురేశ్వరమ్|*


*సోమం నక్షత్రౌషధీనాం ధనేశం యక్షరక్షసామ్॥12826॥*


పుణ్యపురుషా! ఉద్ధవా! దైత్యులలో అసురపతియైన ప్రహ్లాదునిగా నన్నెరుంగుము. నక్షత్రములకు అధిపతియు, ఓషధులకు పుష్టిని గూర్చువాడను అగు చంద్రుడను నేను. యక్షరాక్షసులలో ధనపతియైన కుబేరుడను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదహారవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: