17, అక్టోబర్ 2021, ఆదివారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*459వ నామ మంత్రము* 17.10.2021


*ఓం సుముఖ్యై నమః*


ఆత్మజ్ఞాన సంపన్నతచే మరింత ముఖకాంతితో భాసిల్లు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా నహస్ర నామావళి యందలి *సుముఖీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం సుముఖ్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను ఆరాధించు సాధకులను శుభప్రదమైన ముఖకాంతితో పలువురిలో ఆకర్షితులుగను, వారు పలికిన పలుకులు జనరంజితమైనట్లుగను, విశేషమైన కీర్తిప్రతిష్టలతోబాటు, ధనధాన్యసమృద్ధిని పొందువారిగను ఆ తల్లి అనుగ్రహించును.


అమ్మవారు ఆత్మజ్ఞానస్వరూపిణి. అందుచే ఆ తల్లి ముఖకాంతి మరింత అధికమై శోభస్కరమై యుండును. అమ్మ పరమాత్మ. అందుచే ఆ తల్లి ముఖకాంతి ఉదయించుచున్న అనంతకోటి సూర్యుల కాంతిని పోలియుండును *(ఉద్యద్భాను సహస్రాభా* - లలితా సహస్ర నామావళి యందలి ఆరవ నామ మంత్రము). ఇదే విషయం *అష్టమీచంద్ర విభ్రాజ దళికస్థల శోభితా* యని లలితా సహస్ర నామావళి యందలి పదిహేనవ నామ మంత్రంలో చెప్పబడినది. అష్టమితిథి నాటి చంద్రుని మాదిరిగా ప్రకాశించే లలాటము కలిగి యున్నది అని భావము. అంతేనా! *ముఖచంద్ర కళంకాభి మృగనాభి విశేషకా* యని పదహారవ నామ మంత్రములో వివరింపబడినది. అనగా చంద్రుని బోలిన అందమైన ముఖంలో, చంద్రుని లోని మచ్చ మాదిరిగా కస్తూరి తిలకాన్ని ధరించినదట అమ్మవారు. ఇంకను *వదనస్మర మాంగల్య గృహతోరణ చిల్లికా* అని పదిహేడవ నామ మంత్రములో ఆ తల్లి స్తుతింపబడినది. అనగా మన్మథుని మాంగల్య గృహమును బోలిన వదనానికి గృహతోరణాల మాదిరిగా కనుబొమలు ప్రకాశిస్తున్నవి. అలాగే పదునెనిమిదవ నామ మంత్రములో *వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్మీనాభలోచనా* అనగా ముఖకాంతియొక్క ప్రవాహంలో ఆ తల్లి నయనములు చలించే మీనముల జంటను బోలి యున్నవట. వెరసి ఈ నామ మంత్రములో అమ్మవారు శుభకరమైన, మంగళకరమైన, జ్ఞానముచేత అధికముగ ప్రకాశించునదిగాను, బ్రహ్మతేజస్సుతో ప్రకాశించునదిగాను, సర్వకాల సర్వావస్థలయందును భాసిల్లు ముఖపద్మము కలిగినదిగాను వేదములలో వివరింపబడినది. పరమేశ్వరి షోడశీ మంత్రాంగ దేవతయగు సుముఖీదేవి స్వరూపురాలగుటచే, ఆ తల్లి *సుముఖీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం సుముఖ్యై నమః* అని యనవలెను. 

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: