17, అక్టోబర్ 2021, ఆదివారం

సంస్కృత మహాభాగవతం

 *16.10.2021 సాయం కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - పదహారవ అధ్యాయము*


*పరమాత్ముని విభూతుల వర్ణనము*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*ఉద్ధవ ఉవాచ*


*16.1 (ప్రథమ శ్లోకము)*


*త్వం బ్రహ్మ పరమం సాక్షాదనాద్యంతమపావృతమ్|*


*సర్వేషామపి భావానాం త్రాణస్థిత్యప్యయోద్భవః॥12811॥*


*16.2 (రెండవ శ్లోకము)*


*ఉచ్చావచేషు భూతేషు దుర్జ్ఞేయమకృతాత్మభిః|*


*ఉపాసతే త్వాం భగవన్ యాథాతథ్యేన బ్రాహ్మణాః॥12812॥*


*16.3 (మూడవ శ్లోకము)*


*యేషు యేషు చ భావేషు భక్త్యా త్వాం పరమర్షయః|*


*ఉపాసీనాః ప్రపద్యంతే సంసిద్ధిం తద్వదస్వ మే॥12813॥*


*ఉద్ధవుడు పలికెను* సర్వేశ్వరా! నీవు స్వయముగా పరబ్రహ్మస్వరూపుడవు. ఆద్యంతములు లేనివాడవు. ఆవరణ రహితుడవు (అపరిచ్ఛిన్నుడవు). అద్వితీయుడవు. సకలప్రాణుల యొక్క, పదార్థములయొక్క ఉత్పత్తి, స్థితి, రక్షణ, లయములకు నీవే కారణుడవు. ఉత్తమ-అధమ ప్రాణులయందు అంతర్యామిగా నీవే విలసిల్లుచుందువు. కానీ, మనస్సును, ఇంద్రియములను జయింపనివారు నిన్ను తెలిసికొనజాలరు. పరమపురుషా! నీ యథార్థస్థితిని ఎరింగిన జ్ఞానులు నిన్ను ఉపాసింతురు. మహర్షులు భక్తిశ్రద్ధలతో నీయొక్క ఏ రూపములను, విభూతులను ఉపాసించి సిద్ధిని పొందెదరో, వాటిని నాకు వివరింపుము.


*16.4 (నాలుగవ శ్లోకము)*


*గూఢశ్చరసి భూతాత్మా భూతానాం భూతభావన|*


*న త్వాం పశ్యంతి భూతాని పశ్యంతం మోహితాని తే॥12814॥*


సమస్త ప్రాణులకును జీవనదాతవైన ప్రభూ! నీవు సమస్త ప్రాణులయందును అంతర్యామిగా విలసిల్లుచుందువు. కానీ, వారిలో గూఢముగా నుండి నీ లీలలను నెఱపుచుందువు. సంపూర్ణ విశ్వమును ఒక్కసారిగా సాక్షాత్కరింపజేయునట్టి నిన్ను, నీ మాయచే మోహితులై వారు తెలిసికొనజాలరు.


*16.5 (ఐదవ శ్లోకము)*


*యాః కాశ్చ భూమౌ దివి వై రసాయామ్ విభూతయో దిక్షు మహావిభూతే|*


*తా మహ్యమాఖ్యాహ్యనుభావితాస్తే నమామి తే తీర్థపదాంఘ్రిపద్మమ్॥12815॥*


అచింత్య విభూతులకు ఆశ్రయుడవైన ప్రభూ! భూమి, స్వర్గము,పాతాళముల యందును, సకల దిక్కులయందును విరాజిల్లుచుండునట్టి నీ విభూతులనన్నింటిని కృపతో నాకు వివరింప ప్రార్థన. సకల తీర్థములను పవిత్రమొనర్చునట్టి నీ పాదపద్మములకు నమస్కరించుచున్నాను.


*శ్రీభగవానువాచ*


*16.6 (ఆరవ శ్లోకము)*


*ఏవమేతదహం పృష్టః ప్రశ్నం ప్రశ్నవిదాం వర|*


*యుయుత్సునా వినశనే సపత్నైరర్జునేన వై॥12816॥*


*శ్రీభగవానుడు నుడివెను* ఉద్ధవా! ప్రశ్నించే రహస్యవేత్తలలో నీవు మేటివి. పూర్వము కురుక్షేత్రమునందు కౌరవ పాండవులమధ్య యుద్ధము ప్రారంభము కానున్న సమయమున దాయాదులతో పోరాడుటకు ఉత్సాహపడుచున్న అర్జునుడుగూడ నన్ను ఇట్లే ప్రశ్నించి యుండెను.


*16.7 (ఏడవ శ్లోకము)*


*జ్ఞాత్వా జ్ఞాతివధం గర్హ్యమధర్మం రాజ్యహేతుకమ్|*


*తతో నివృత్తో హంతాఽహం హతోఽయమితి లౌకికః॥12817॥*


"రాజ్యప్రాప్తికై దాయాదులను వధించువాడను, వీరందరును వధింపబడువారు. ఇది యంతయు విచారకరము" అని అర్జునుడు సామాన్య మానవునివలె తలపోయుచు యుద్ధము నుండి నివృత్తుడయ్యెను.


*16.8 (ఎనిమిదవ శ్లోకము)*


*స తదా పురుషవ్యాఘ్రో యుక్త్యా మే ప్రతిబోధితః|*


*అభ్యభాషత మామేవం యథా త్వం రణమూర్ధని॥12818॥*


ఉద్ధవా! అప్పుడు నేను పురుషశ్రేష్ఠుడైన అర్జునునకు యుద్ధరంగమునందు యుక్తియుక్తముగా పెక్కు విధములుగా ఉపదేశించితిని. అంతట అతడు నీవలెనే నన్ను ప్రశ్నించెను.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదహారవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: