17, అక్టోబర్ 2021, ఆదివారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*460వ నామ మంత్రము* 17.10.2021


*ఓం నళిన్యై నమః* 


సుందరమైన పద్మములవలె కన్నులు, ముఖము, పాదద్వయము మొదలైన అవయవాలు కలిగి *నళినీ* యని అనబడు పరమేశ్వరికి నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *నళినీ* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం నళిన్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఆరాధించు భక్తులు శాంతిసౌఖ్యములతోను, సిరిసంపదలతోను, కీర్తిప్రతిష్టలతోను, సుందరమైన ముఖవర్చస్సుతోను అలరారుదురు.


జగన్మాత *అనవద్యాంగీ* యని ఏబదియవ నామ మంత్రములో కీర్తించబడినది. అనగా ఆ తల్లి దోషరహితమైన అంగములచే భాసిల్లుచున్నదని భావము. ఇక, ఈ నామ మంత్రములో *నళినీ* యని అనబడినది. అంటే దోషరహితమైన అంగసంపద (కాళ్ళు, చేతులు, ముఖము, కనులు మొదలైన అవయవములు) పద్మములై భాసిల్లుచున్నది. *పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా* (పద్మములను కూడా తిరస్కరించే మృదుత్వ, సౌకుమార్యాది లక్షణాలతో భాసిల్లు పాదముల జంట కలిగియున్మది అమ్మవారు) అని నలుబదియైదవ నామ మంత్రములో స్తుతింపబడినది ఆ తల్లి. గంగానదికి గల పండ్రెండు నామములలో *నళినీ* యను నామము గలదు గనుక, అమ్మవారు ఆ గంగాస్వరూపురాలై, *నళినీ* యను నామముతో ప్రసిద్ధిచెందినది. నలుడను మహారాజు శ్రీమాతను ఉపాసించి దేవీ తాదాత్మ్యమును పొందియుండుటచే, ఆ తల్లి *నళినీ* యని అనబడినది.


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం నళిన్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: