17, అక్టోబర్ 2021, ఆదివారం

మృత్యుదారుకుఠారికా

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

 శ్రీమతి శశికళ ఓలేటి గారి కథ* 

              🌷🌷🌷

*మృత్యుదారుకుఠారికా- శ్రీమాత*

              🌷🌷🌷

ఆశ్వయిజ మాసమంటేనే… శాక్తేయంగా ఉంటుంది జనజీవితం! బతుకమ్మ సంబరాలు, సద్దులు, దసరా నవరాత్రుల సంరంభాలు, అమ్మవారికి కుంకుమార్చనలు, సహస్రనామార్చనలు, నవావరణార్చనలు, శ్రీవిద్యోపాసన, సంగీతకచేరీలు, నాట్యప్రదర్శనలు… ఏంటో గాలిలో ఒకలాంటి ఉత్సాహపు, ఉత్సవపు ఎనర్జీ అణువణువునా ప్రసరిస్తూ…. బద్దకంగా పక్కమీద దొర్లుతున్న పిల్లవాడి… దుప్పటిలాగి, నిద్రలేపే తల్లిలా… ఆ అమ్మవారు కూడా.. మన సుషుప్తినుండి జాగృతం చేస్తున్నట్టే ఉంటుంది! అలాంటి ఆశ్వయుజ శుద్ధ అష్టమినాడు…బ్రాహ్మీ ముహూర్తానే పరిమళ ఇంటి తలుపులు … దబదబా బాదింది అమ్మవారు… వాళ్ళ పక్కింటి బాలా త్రిపుర సుందరి రూపంలో! 


తాలారా స్నానం చేసిన కురులు …జారుముడి వేసి, ఎర్రని మడిపట్టుచీర, పచ్చని మోము ఛాయను మరింత ఇనుమడింప చేస్తూ… పసుపు పూసిన మోముమీద.. మెరిసే అరుణోదయపు బొట్టు… మిగిలిన మంగళ చిహ్నాలతో…. కళ్ళెదురుగా… పరదేవతలా నిలబడ్డ ఆ పిల్లను చూసి.. పరిమళకు ఒక్క క్షణం..అయోమయం, మైకం కమ్ముకున్నట్టు అయిపోయింది! 


“ పరిమళ పిన్నీ! మీతో పెద్ద పని పడింది ! అందరూ దగా చేసేసారు. వంటావిడ రాత్రి వాట్సప్ మెసేజ్ పెట్టిందిట! నేను చూడలేదు! ఏదో సూతకం వచ్చి.. రాలేదట! మా అమ్మ, చెల్లి రావడం లేదు. మా ఆడపడుచులు పదకొండింటికి కానీ రాలేరట. ఈరోజు ఇంత పూజ పెట్టుకున్నా! చంటిపిల్ల చంక దిగడం లేదు. డెభ్భై మందికి పైగా వస్తారు. భోజనాలని చెప్పేసా! ఇక బ్రహ్మగారు, శిష్యులు వచ్చి… శ్రీచక్ర రచన మొదలుపెడతారు. వాళ్ళకు అన్నీ అందించాలి. అమ్మవారికి అలంకరణ చెయ్యాలి. ఆ పారాయణ భక్తబృందం వారే ఏభైమంది వస్తున్నారు. మీరు మడి కట్టుకోక తప్పదు పిన్నీ! ఏదో ఒకటి మీకు తోచింది… ఓ రెండు, మూడు ప్రసాదాలు చేసి, పుణ్యం కట్టుకోండి. బయట కేటరింగ్ తిండి ఎవరూ తినరట. ప్లీజ్ పిన్నీ ప్లీజ్! “…మడిలో ఉండడంతో… చేతులు పట్టుకోలేదు … కానీ… కళ్ళు నిండుకుండ లయిపోయాయి సుందరికి! 


      “ సరే!”…. అందో , లేదో కూడా తెలియదు… ఈ లోపునే … పెద్ద పెద్ద పేకేజ్ పెట్లతో… సామానూ, కూరలూ… తోసుకుంటూ గుమ్మంలో పెట్టేసాడు , సుందరీ వాళ్ళాయన విజయకుమార్! వెళ్ళిపోతూ… సుందరి..” పిన్నీ! మడిగా చెయ్యాలి, మర్చిపోకండే!”… అని చెప్పి… పరిగెట్టుకు పోయింది. ఆ సంభారాలు చూసేసరికి.. ఏభైఐదేళ్ళ పరిమళకు ఏమీ పాలుపోలేదు. అసలు గత పదిరోజులుగా ఆమెకు ఆరోగ్యం బాలేదు. కుడిచెయ్యి… మొదళ్ళ నుండి పీకేస్తోంది! పిల్లలు ఇద్దరూ…అమెరికాలో స్థిరపడిపోవడంతో… ఇంట్లో ఆయనకు, తనకు గుజ్జనగూళ్ళ వంటలే! ఏదో నెలకో రెండుసార్లు… కాస్త భారీగా ఒకటి, రెండు ఐటెమ్స్ చేసుకుని… వృద్ధాశ్రమానికో, పిల్లల హోమ్ కో వెళ్ళడం తప్పా… ఇంత బృహద్ పాకశాస్త్ర ప్రావీణ్యం … తనకు ఇసుమింత కూడా లేదు! దిగులుగా… ఆ వంటపాత్రల కేసి చూస్తూ… చేష్టలుడిగి కూర్చుంది పరిమళ! 


     సుందరీ వాళ్ళు, పరిమళ వాళ్ళ పక్క ఫ్లాటు కొనుక్కుని, దిగినప్పటి నుండి ఎప్పుడూ ఏదో ఒక హడావిడే! విపరీతమైన దైవభక్తో, లేక నిష్టాగరిష్ట సాంప్రదాయ కుటుంబ నేపధ్యమో లేక… జీవితపు తొలిదశల్లోనే అందలాలు అందిపుచ్చుకున్న దర్పమో…కారణం తెలీదు కానీ…ఆ ఇంట ఎప్పుడూ ఉత్సవ వాతావరణం ఉండవలసిందే! ఏడాదిలో పన్నెండు నెలలూ…శుభతిధులే ఆ భార్యాభర్తలకు…హోమాలు, యజ్ఞాలూ, పూజలూ, వ్రతాలూ, పారాయణలు, అభిషేకాలంటూ….ఏదో ఒక కార్యక్రమం తలపెట్టి, బంధుమిత్రులను అందరినీ.. వాటిల్లో భాగస్థులను చెయ్యడం భలే వేడుక! ఇంతా చేసి…సుందరికి ముప్ఫైయేళ్ళు, విజయకుమార్ కు ముప్ఫై ఐదు! వాళ్ళకు రెండేళ్ళ పిల్ల ఆద్య! 


             ఒక దశాబ్దకాలం అమెరికాలో ఉండి, రెండేళ్ళ క్రితమే వచ్చేసారు ఇండియా. అతను పెట్టిన సాఫ్ట్ వేర్ కంపెనీ… అనతికాలంలోనే…అఖండ విజయం సాధించడం…అంతా దైవకృపే అని నమ్మే…భక్తిపరులు! ఏ గడ్డ మీదున్నా సనాతనధర్మమే…మూలమంత్రం వాళ్ళకు! బాల్యం నుండీ మహానగరాల్లోనే ఉన్న పరిమళకు వయసుంది కానీ, పెద్దగా… పద్ధతులు, పూజాపునస్కారాలు తక్కువే అని చెప్పాలి. ఆవిడకు ఇల్లంతా కళాత్మకంగా పెట్టుకోవడం, బాల్కనీల్లో హరితవనాలూ, బోన్సాయి మొక్కలూ, స్నేహితులతో కిట్టీపార్టీలు, కళాఖండాల సేకరణ…హిందూస్థానీ సంగీతం… ఇవే రుచులూ-అభిరుచులూ! 


         అలాంటి ఆవిడ సీదాసాదా జీవితంలోకి ఝుంఝూమారుతంలా “ పిన్నీ”…అంటూ.. చొచ్చుకొచ్చింది ఈ సుందరి. పరిమళ చేత శ్రావణశుక్రవారాలు… వరలక్ష్మిని నిలబెట్టించింది! పాలవెల్లిలు కట్టించింది, కార్తీకమాసం శివాలయాలు తిప్పించింది, క్షీరాబ్ది ద్వాదశిని ఉసిరి, తులసికి …దీపాలు పెట్టించింది… ఆఖరికి తిరుపతి యాత్ర కూడా చేయించింది. మొదట్లో…సుందరి సాగదీసుకునే మాటలు, చాదస్తపు ఆచారాలూ… పరిమళకు కాస్త చిరాగ్గా అనిపించేవి. అయితే సుందరిలోని నిష్కల్మషమైన ప్రేమ, ఆత్మీయత… ఆమెను కట్టి పడేసాయి. సుందరి.. పరిమళకు , ఆమె ఆచార లేమిని ప్రశ్నించదు. జడ్జ్ చెయ్యదు. “సరదాగా చెయ్యి పిన్నీ!”…. అంటూ మెల్లగా ఆధ్యాత్మిక బాట పట్టిస్తుంది. అంతే! . దానికి పరిమళకు ఏ ఆక్షేపణలూ లేవు. ఆమె నాస్తికురాలయితే కాదు కదా! తన శక్తికి, ఆసక్తికి మించి.. ఆమె ఎలాగూ చెయ్యదు! 


              ఇంతలో…ఈ హడావిడికి లేచిన పరిమళ భర్త…చుట్టూ కూరగాయల బుట్టలు పెట్టుకుని శాకాంబరీదేవిలా కూర్చున్న భార్య నుండి , పరిస్థితి గ్రహించి…” చూడు పరిమీ! బెంగపడిపోకు! నేనూ ఓ చెయ్యి వేస్తా! చేసేద్దాం. ఆ పిల్ల పెద్ద కార్యక్రమం పెట్టుకుంది. మన గౌతమికే ఆ అవసరం వస్తే… మనం సాయం చెయ్యమా? లే! నాకు తెలుసులే! మడిగా ఎలా చెయ్యాలో! “.।.. అంటూ భార్యకు ధైర్యం చెప్పీ, లేవదీసారు! వాచ్ మేన్ భార్యకు …కాల్ చేసి.. వంటిళ్ళు , స్టవ్ లూ కడగడానికి పిలిచారు! భర్త కళ్ళలో కొత్త ఉత్సాహం, హుషారూ..ఆమెకు కొత్తకాదు. పెద్ద ఉమ్మడికుటుంబంలో… సాంప్రదాయాలూ, కుటుంబ అనుబంధాల మధ్య పెరిగాడాయన! గోదావరి రుచులూ, మర్యాదలూ అంటూ పాకులాడే కుటుంబం ఆయనది. పరిమళ కుటుంబ నేపధ్యం పూర్తిగా విభిన్నం! చదువులు, కొలువుల మధ్య..ఢిల్లీలో డిఫెన్స్ వాతావరణంలో పెరిగిన నేపధ్యం పరిమళది! అయినా భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు ఏ లోటూ లేదు. ఇద్దరి కుటుంబాలనూ.. కలుపుకున్న కొత్త సంస్కారం ఇద్దరిలో! 


        తలారా స్నానం చేసి, తడీపొడిగా ఉన్న పట్టుచీర కట్టుకుని…వంటింటి బాల్కనీ తలుపు తెరవగానే…చల్లనిగాలి, కొత్తగా పూసిన పూల పరిమళాలను మోసుకొచ్చి…ఒంటికి తాకింది. చిన్నగా వణికింది పరిమళ. అంతలోనే సాంత్వనగా, ఆలంబనగా అనిపించింది. 


కేశవరావు గారు ఫోన్లో… అక్కగారిని లేపి..వంటలకు కొలతలు, పద్ధతులూ అడుగుతున్నారు! చకచకా మినప్పప్పు నానబెట్టేసింది! పులిహారకు బియ్యం ఎసర్లు పెట్టేసారు! అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకులతో… ఘనంగా జీడిపప్పు, పల్లీలు, పోపు దినుసులతో పులిహార పోవు చేసి, చింతపండు మగ్గులో ఉప్పు, పసుపు, బెల్లంతో మగ్గబెట్టి… ఆరబెట్టిన పులిహారలో కలిపేసారు! పైన దట్టంగా నూపొడి, మెంతిపొడి… వేసి… పైన ఓ నాలుగు నిమ్మ కాయలు పిండి…ఘాటుగా ఘుమఘుమల పులిహార కలిపేసారు! ఊరుతూ ఉండమ్మా… అరి అరిటాకు కప్పేసారు! పులుసులకు, కూరలకు, పచ్చళ్ళకూ పోపులు వేయించి పక్కన పెట్టారు , కొన్ని పొళ్ళు కొట్టారు! పెద్ద గుమ్మిడికాయ, ఆనపకాయలు, ములక్కాడలు, బెండ, తెల్లొంకాయ, చిలగడ దుంపలు , బచ్చలి కాడలు..పచ్చిమిరప వైనంగా ముక్కలు కోసి…. పెద్ద డెగిసాలో…చింతపండురసం, ముప్పావు కేజీ బెల్లం, ఉప్పు, పసుపు , ఇంగువలతో … పదునుగా ఉడికించి, బియ్యంపిండి, మెంతులు, ఆవాలు, ధనియాలు, ఎండుమిరపతో కొట్టిన పిండినీటితో చిక్కబరచి…పోపులు వేసి…పొర్లించారు! నాలుగు పక్షాలుగా కోసిన పదిహేను కేజీల లేతొంకాయల్లో మెంతికారం కూరి… ఓ కేజీ నూనెలో ఆ పళంగా వేసేసి…. మగ్గమని చెప్పి… మూత పడేసారు! ఇరవై లీటర్ల చిక్కటి పాలతో…దోరగా నేతిలో వేపిన పెసరపప్పు, ఎండుకొబ్బరి, విరివిగా వాడిన డ్రైఫ్రూట్స్ తో… ఏలకులు, పచ్చకర్పూరపు ఘుమఘుమలతో…పాతబియ్యంతో….కొత్తబెల్లంతో..చక్కెరపొంగలి ఘమఘమలాడి పోయింది! 


           కట్టర్ తో ఒకేలాగ ముక్కలు కొట్టేసి… దోసావకాయ ఆవఘాటుతో… ఎర్రగా నూనె, ఊటతో…ఊరిస్తూ… గిన్నెకెక్కింది. ఇరవై కొబ్బరి చిప్పలకు, ఆరు పుల్లమామిడి చేర్చి… మంచి ఇంగువ, మినప్పుప్పు పోపుతో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి… పచ్చబంగారంలా మెరిసిపోతోంది. ఎలాగూ గారెలు చేస్తున్నాం కనుకా… ఎర్రగా అల్లప్పచ్చడి కనిపించకపోతే… అమ్మవారు చిన్నబుచ్చుకుంటారని… కేశవరావు గారు…. ఓ కేజీ అల్లం బాగుచేసి… ధారాళంగా పులుపు బెల్లం పోపులతో అల్లప్చచ్చడి గ్రైండర్ లో బరబరలాడించి… కొబ్బరి పచ్చడి పక్కన కూర్చోపెడితే… పసుపుకుంకాల్లా… కలకలలాడిపోయాయి! తలో మూడేసి కేజీల బియ్యం కుక్కర్లు ఎక్కించి… పులగం, దధ్యోజనాలు కలిపారు. పక్కవీధిలోంచి పెరుగు బకెట్లు తెప్పించి…బరకపిండి, కాటుకలా రుబ్బిన పిండిలు కలిపి… మినపగారెలు వేసి… ఆవపెట్టి, పోపేసిన పెరుగులో… పీల్చుకుని పొంగిపోండి… అంటూ… ఇంత సన్నటి కొత్తిమీర, అల్లం, మిర్చి చల్లి….కుదురుగా… ఆకులు మూసారు. 


        ఆ వంటలు చెయ్యడం… ఏదో ఒక క్రతువులా ఉంది ఆ నడివయసు జంటకు. అలసట, ఆయాసం, ఒంట్లో కూర్చున్న రోగాలను ఎప్పుడో మర్చిపోయారు. ఏదో యజ్ఞం చేస్తున్నట్టు శ్రద్ధగా, భక్తితో… ఒకరితో ఒకరు పోటీలు పడుతూ చేస్తున్నారు ఇద్దరూ! చిన్నసైజు బంతులంత బూరెలు వేసారు. కందాబచ్చలి కూర చేసారు. పిల్లల కోసం చప్పగారెలు, బజ్జీలూ వేసారు! కమ్మని పెరుగు సిద్ధం చేసారు! అమ్మవారు తాంబూల పూరిత ముఖి…కనుక తాంబూలాలు లేకపోతే ఎలాగా… అంటూ… వెండిపళ్ళెంలో… ఆకులూ, వక్కలూ, సున్నంతో పాటూ… భాషా కొట్లోంచి వంద మిఠాయి కిళ్ళీలు పురమాయించారు. పదకొండున్నరకల్లా….. వంటలన్నీ… తమ విశాలమయిన భోజనాల బల్ల ఎక్కించేసారు పరిమళా, కేశవరావుగారూ! 


        సుందరి పరిస్థితి ఎంత వ్యస్థత లేకుండా ఉందంటే…. పాపం వచ్చి పడుతున్న గుంపుల గుంపుల ఆహ్వానితులు, అనాహ్వానితులు, శ్రీవిద్యా భక్తబృందం వారూ.. ఓ పక్క… మరోపక్క… అమ్మా మీరు ఇరువురూ…పీటల మీద కూర్చోవాలి… అంటూ తొందర పెడుతున్న పురోహితులూ, వారి శిష్యులూ, మధ్యలో అవీ ఇవీ అందించడం…అష్టభుజాంకితలా… పనిచేస్తూ… ఆపసోపాలు పడుతోంది. ప్రసాదాలు… పరిమళకు అప్పగించి… అటుపక్కకు కూడా చూడలేనంత హడావిడి! ఇక్కడ పరిమళ ఎంత అలిసిపోయిందంటే… కనీసం చీర కూడా మార్చుకోలేనంత! అలాగే వెళ్ళి… అమ్మవారి దర్శనం, ఆ నవావరణ అలంకరణలు, దీపాలూ చూద్దామని బయలుదేరబోయింది. ఇంతలో విజయకుమార్ ఫోను! “ అత్తయ్యగారూ! ఇక్కడ పిల్లలు తెగ ఏడుపులూ, అల్లరులూ! మీ ఇంట్లో ఆడుకుంటారు. కాస్త కనిపెట్టి ఉంటారు కదా!”…. అంటూ పెట్టేసాడు. ఉస్సురనిపించింది పరిమళకు! 


         తీసి ఉన్న తలుపుల్లోంచి… ఒక్కరు కాదు, ఇద్దరు కాదు పన్నెండు మంది పిల్లలు….ఒకరొకరుగా అడుగుపెట్టారు…నవ్వుకుంటూ, సిగ్గుపడుతూ, బెరుగ్గా, గెంతుకుంటూ, ఆడుకుంటూ… అనేక చేష్టలతో! చక్కని జరీల పట్టులంగాలు, కాళ్ళకు గజ్జెలు, నడుములకు వడ్డాణాలు, జడలకు కుచ్చెలు, సూర్యచెంద్రులు, పాపిటబొట్లు…మెడలో హారాలు, నుదుటన దోసగింజ మెరుపుబొట్లు…..అలా ఘల్లుఘల్లున కాళ్ళ అందియలు మోగిస్తూ… కలహంస నడకలతో… ఇల్లంతా సంచరిస్తున్న ఆ బాలాంబల్ని చూసేసరికి…. ఆ దంపతులిద్దరికీ వెర్రి పరవశం వచ్చేసింది. వాళ్ళతో పాటూ వచ్చిన ముగ్గురు పని అమ్మాయిలూ… అందంగా ముస్తాబయ్యి… కళ్ళకు చలవగా ఉన్నారు. ఎన్ని అమ్మవారి పేర్లో మారుమోగుతున్నాయి ఆ గుంపులో! ఆద్య, ఆర్ణ, అపర్ణ, సహస్ర, పద్మిని, పార్వతి, హౌరి, మృదుల, యోగిని, యోగిత, భారతి…. పరిమళకు అవే తనకు సంప్రాప్తించిన మంత్రబీజాక్షరాలా అనిపించింది. 


       ఇల్లంతా వారి ఇష్టారాజ్యమయింది. దేవుడి గదిలో పసుపు కుంకుమలు చల్లేసారు. అందరి నెత్తినా అక్షతలు పోసారు. మొక్కల కున్న పూలన్నీ కోసి తలల్లో దోపుకున్నారు! అద్దాల ముందు ముస్తాబులయ్యారు! గంధాలు పూసారు. ఓ ఇద్దరు వీరభద్రుడూ, పోతరాజూ కూడా ఉండి… అక్కలకు పాలకొలను ఆడడంలో సాయం చేస్తున్నారు. కేశవరావు గారికి… తమింట పెళ్ళిళ్ళలో చేసే కామేశ్వరీ వ్రతం గుర్తుకొచ్చింది…ఏడేడు అక్కల్లూ… ఏమి చేసారు… అంటూ పాడుతూ..! గబగబా లేచి…. మూడు పెట్లలో దాచిన బొమ్మలన్నీ తెచ్చి… అక్కడ పెట్టారు. పరిమళ ఆశ్చర్యపోయింది ఆయన చేష్టకు. అవన్నీ తమ దేశవిదేశ పర్యటనల్లో కొనుక్కున్న అపురూపమైన బొమ్మలు! కూతురు గౌతమి చేత బొమ్మలకొలువు పెట్టించాలనే కోరిక తీరకుండానే… ఆ అమ్మాయి అండర్ గ్రాడ్ కే అమెరికా వెళ్ళిపోవడం, చివరకు ఒక అమెరికన్ ను పెళ్ళి చేసుకుని అక్కడే స్థిరపడిపోవడంతో… ఆ కోరిక అసంపూర్ణంగా ఉండిపోయింది. 


       సాఫ్ట్ టాయిస్ చంటిపిల్లల కిచ్చి… పెద్దపిల్లలంతా…. మహదానందంగా… ఒక బొమ్మల కొలువు పెట్టారు. వాళ్ళలో ఉన్న క్రియేటివిటీకి ఆశ్చర్యపోయింది పరిమళ! అందమైన పూలకుండీలు, ఫ్లవర్ పాట్స్ ను అటూఇటూ పెట్టి… ఇంట్లో ఉన్న టీపాయిలన్నీ లాగి… మెట్లగా బొమ్మలమర్చారు. దీపాలు వెలిగించారు! రకరకాల పాటలు పాడారు. సారంగధరియా పాటకు నాట్యం చేసారు. వీళ్ళ హడావిడిలో… సుందరి ఇంట్లో పూజా, సామూహిక పారాయణం సంగతే మర్చిపోయారు వీళ్ళు! 


        ఇంతలో …. ఎవరో … కేటరర్ ఫోన్ చేసారు. ఎక్కడో అమ్మవారి గుడిలో సంతర్పణ కోసం వంటలున్నాయని, పంపించగలనని! పరిమళకు చివుక్కుమనిపించింది. అక్కడ వారికి పూర్తిగా సరిపడకుండా… ఇలా పక్కదారిన పంపిస్తాననడం! వంటలు సిద్ధం అయిపోయాయని… అవసరం అయితే చేస్తామని , చెప్పి పెట్టేసింది. వేడిగా అన్నం కుక్కర్లు ఎక్కించేసారు ఈ లోపల! 


      ఇంతలో ఎవరో పారాయణ బృందంలో ఒకామెకు… అమ్మవారు ఒంటిమీదకు వచ్చారట! కొబ్బరినీళ్ళు కావాలని…. పరిమళ ఫ్లాటు తలుపు కొట్టారు కొందరు ఆడవాళ్ళు! ఫ్రిజ్ లోంచి… కొబ్బరినీళ్ళ పాక్ లు తీసి ఇచ్చింది. సుందరి ఇంట్లోంచి… పెద్దపెద్ద గొంతుకులతో… “ అమ్మా! తల్లీ! శాంతించు!” అంటూ… అయిగిరి నందిని నందిత మేధిని”…. అంటూ చదువుతున్నారు అంతా! అది విని చిన్నగా నిట్టూర్చింది పరిమళ. తను పెరుగు తీసుకోడానికి తమ తలుపు తెరిచినపుడు… బృందంలో నాయకురాలు ఒక పెద్దామె… మిగిలిన వారితో… “ ఈరోజు రుక్మిణి వంతు!”…. అనడం గుర్తొచ్చింది. బుర్రలో ఎక్కువ సందేహాలకు తావులేకుండా…. పిల్లలు ఆకళ్ళని మొదలు పెట్టారు. పనిపిల్లలు చిన్నపిల్లలకు వెంట తెచ్చిన డబ్బాల్లోంచి తినిపిస్తున్నారు! పిల్లలు డైనింగ్ పూమ్ లోకి వెళ్ళ కుండా తలుపుల వేయాల్సి వచ్చినందుకు బాధగా ఉంది ఆ దంపతులకు! సుందరి ఇంట్లో… పూజ ఆలస్యం అయిపోతోంది. ఒంటి గంటయింది. ఇంకా మహానైవేధ్యానికి పిలుపు రాలేదు. కేశవరావుగారు… ఇంక లాభం లేదని సుందరీ వాళ్ళింటికి వెళ్ళారు. మూడువేల చదరపు అడుగుల ఇళ్ళు అవన్నీ! ఎక్కడా సూదిమొన ఆన్చడానికి లేనట్టు… అన్ని గదులు క్రిక్కిరిసిపోయాయి! గొప్ప లయబద్ధంగా అమ్మవారి స్థోత్రాలు, వేదమంత్రాలూ ధ్వనిస్తున్నాయి! చాలా తర్జనభర్జనల తరువాత… పూజ మధ్యలో మహానైవేధ్యం పెట్టేట్టు నిర్ణయం జరిగింది! 


            పిల్లలంతా … వరసగా కూర్చుని… అరిటాకుల్లో వడ్డన చేస్తుంటే… ఆవురావురమని… అధరువులన్నీ మెచ్చుకుంటూ… భోంచేసారు. కిళ్ళీలు వేసుకున్నారు. అందర్నీ కుర్చీల్లో కూర్చోపెట్టి.. చక్కగా కాళ్ళకు పసుపులు రాసి, బొట్టు పెట్టి…మంచి గిఫ్ట్ బేగ్ లో… అప్పటికప్పుడు మనిషిని పంపి తెప్పించిన పట్టులంగాలు, అద్దాలగాజులూ, పెయింటింగ్ కిట్లు, బొట్లు, కాటుకా… పెట్టి.. చేతికిచ్చింది. అవి చూసి.. పిల్లల మొహాలూ, వాళ్ళ కోసం వచ్చున్న వాళ్ళ అమ్మల మొహాలూ వెలిగిపోయాయి! 


       ఇంతలో… సుందరి ఆడపడుచులు పరిగెట్టుకొచ్చారు. “ అత్తయ్యగారూ! వడ్డనలిక్కడే నండి. పంక్తి భోజనాలకు టైం చాలదు. బఫే పెట్టేద్దాం అంటూ…హడావిడి చేసారు. మరో పదినిమిషాల్లో… అతిధులంతా బిలబిలమంటూ… లోపలికి వచ్చేసి… పదార్ధాలన్నీ …. వడ్డింపించుకుని… ఇల్లంతా వ్యాపించి… భోజనాలు పూర్తి చేస్తున్నారు. పరిమళకు , కేశవరావుగారికీ ఎంతో తృప్తిగా ఉంది. కూతురు పెళ్ళి… అయినవాళ్ళ మధ్య, స్వదేశంలో ఎంతో ఘనంగా చెయ్యాలనుకుని ఏర్పాట్లు చేసుకున్నారు. సంబంధం కుదుర్చుకున్నారు. ఆఖరి నిమిషంలో… ఆ పెళ్ళి చేసుకోనని… అమెరికన్ డాక్టర్ కొలీగ్ ను పెళ్ళిచేసేసుకుని… తల్లితండ్రుల ఆశలన్నీ వమ్ము చేసింది గౌతమి! 


పరిమళ ఓ నిమిషం ఆలోచించింది. కూతురు పెళ్ళికోసం… పెట్టుబడుల కోసం తెప్పించిన ఉప్పాడచీరల కట్టలు .. బీరువాలోంచి తీసి బయట పెట్టింది. వచ్చిన వారందరికీ…ముత్తయుదువా, కాదా… అనే భేదం లేకుండా, బొట్టుపెట్టి… చీరలు చేతిలో పెట్టింది. అందరూ అమృతతుల్యమైన భోజనం, అతిథిమర్యాదతో సత్కరించారని పరమానంద భరితులై… తాంబూలం వేసుకుని, ఆశీర్వదించి సెలవు తీసుకున్నారు. పిల్లలంతా ముద్దులు పెట్టి, కౌగిలించుకుని, తమ బొమ్మల కొలువును మరోసారి వీక్షించుకుని ఇళ్ళ దారి పట్టారు! 


        సుందరి దంపతుల పూజలూ, హోమం, పూర్ణాహుతి అయ్యేటప్పటికి సాయంత్రం ఐదున్నర! అంత మందికి వండి, కడుపారా వడ్డించేసరికి పరిమళకు కడుపు నిండిపోయింది. కొబ్బరి నీరు తప్ప మారు ఆహారం లేదు. అప్పుడు పిలుపొచ్చింది ఆమెకు… అమ్మవారిని చూడడానికి!


సుందరి ఇంటి గుమ్మం దగ్గర నిలబడింది పరిమళ… భర్తతో పాటూ! చంపకాశోకపున్నాగ సౌగంధిక లసత్కచ… మందారకుసుమ ప్రియ… పద్మప్రియ, పద్మహస్త…పద్మిని… సరసిజనయని… అమ్మవారు… ఆ దీపకాంతిలో… హోమగుండపు ….అగ్నికీలలలో…ధగధ్ధగాయమానంగా … ప్రకాశిస్తోంది. కర్పూరచందనాగరుల సువాసనతో… ఆ దివ్యవరణంతా… నిండిపోయింది. పండితుల దీవెనలు తప్పా… వాతావరణమంతా… నిర్జనంగా, నిశ్చలంగా, నిరామయంగా తోచింది ఆమెకు. అంత దూరం నుండి… ఆ దయామృతసాగరి , మందస్మిత వదని…కరుణా కటాక్షాలు … తనపై అపారంగా కురుస్తున్నటు ఉన్నాయి. పరిమళ పరిసరాలను మర్చిపోయింది. ఆమె శరీరం జ్వాలాముఖిలా… ఉష్ణాన్ని చిమ్ముతోంది. మైకం ఆవహించి కళ్ళు మూతలు పడుతున్నాయి. అతికష్టం మీద ఆ జగన్మాత దివ్యసుందర విగ్రహానికి చేతులు జోడించి… ఆ గుమ్మంలో… రొమ్ముపట్టుకుని… భర్తచేతిలో కూలబడిపోయింది పరిమళ! 


            అక్కడ పూజకు భంగం కలగకుండా… భార్యను రెండు చేతులతో పొదువుకుని… ఇంట్లోకి తెచ్చి… గదిలో పడుకోపెట్టారు కేశవరావుగారు! పరిమళ పిన్నికి… బొట్టుపెట్టి, అమ్మవారి తాంబూలం ఇవ్వాలన్న ఆశపడ్డ సుందరి… పరిమళ కనిపించక, తన పెద్దాడపడుచుకు ఇచ్చేసింది! 


       పరిమళ జ్వరంతో పడిపోవడం ఎవరూ గమనించలేదు! డాక్టర్ వచ్చి, పరీక్షించి, అలసట వలన జ్వరం వచ్చిందని, ఆమె ఎర్రగా వాచిపోయిన కుడిచేతికి బహుశా సెల్యుటైటిస్ వచ్చి ఉండచ్చని…మర్నాడు పరీక్షలతో నిర్ధారించచ్చని ధైర్యం చెప్పి, రెండు ఇంజక్షన్లు చేసి వెళ్ళిపోయారు! 

పరిమళ మాత్రం ఇంకా స్పృహలోకి రావడం లేదు. ఆమె స్థితి డెలీరియస్ గా ఉంది! ఏవో కలలు, దృశ్యాలు, శబ్దాలు… హోరుగా కలిసిపోతూ! ఎక్కడో దట్టమైన కీకారణ్యమో, ఎత్తయిన శిఖరాగ్రాలు, పోటెత్తే జలనిధులు తనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టు…తను సహాయం కోసం అరుస్తున్నట్టు… ! ఆమె ఒళ్ళు కుంపటిలా ఉంది. మెదడు బరువుగా వ్యాకోచిస్తున్న భావన. రొమ్ములోంచి…నిప్పుకణికె తో కాలుస్తున్న మంట! గట్టిగా అరుస్తోంది… ఒక తెల్లని గోడల గదిలో! తన కొంగంతా రక్తసిక్తమై! 


        ఏ గంట సేపో ఆ స్థితి! మెల్లగా ఒళ్ళు నీరికారిపోతున్నట్టు… వంటింటి నుంచి చల్లని గాలి సేదతీరుస్తున్నట్టు, తను ఒక దీపకాంతులతో వెలుగుతున్న … పూజాగృహంలో కూర్చున్నట్టు! పిల్లలంతా … “ యా దేవీ సర్వ భూతేషు శక్తిరూపేణ సంస్థితా… నమస్తస్తై నమస్తస్తై నమస్తస్తై నమో నమః!”…. అంటూ అపరాజితా స్థోత్రం చదువుతున్నారు. వేల మంది స్త్రీలు…” ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః”…. అంటూ అమ్మవారిని సహస్రనామాలతో స్థుతిస్థున్నారు. వారి మధ్యలో తను పరవశత్వంతో… “అమ్మా”… అంటూ అరుస్తూ పడిపోయింది. ఒక చల్లని తల్లి తనను ఒడిలోకి తీసుకుంది. ఆమె మోము క్రోధంతో సింధూరారుణ విగ్రహ లా ఉంది. తను గజగజా వణుకుతోంది. ఆమె నఖదిధీతి సంపన్న.. … వాడిగా ఉన్న గోళ్ళతో…తన రొమ్ము చీల్చింది. ఎర్రటి మందారపూలను బయటకు తీసింది. 


“ అయి శతఖండ-విఖండిత-రుండ-వితుండిత-శుండ-గజాధిపతే; రిపు-గజ-గండ-విదారణ-చండపరాక్రమ-శౌండ-మృగాధిపతే |�నిజ-భుజదండ-నిపాటిత-చండ-నిపాటిత-ముండ-భటాధిపతే; జయ జయ హే మహిషాసుర-మర్దిని రమ్యకపర్దిని శైలసుతే “…. 


మిన్నులంటేట్టు ఎలుగెత్తి భజిస్తున్నారు! జనాలు! 

చల్లబడింది ఆ పరదేవత. రొప్పతోంది ఇంకా ఆవేశంతో! 


“దుర్లభా! దుర్గమా! దుర్గా!దుఃఖహంత్రీ! శుభప్రదా! భవరోగ చక్ర ప్రవర్తినీ! సర్వవ్యాధి ప్రశమనీ! సర్వమృత్యునివారిణీ! భాగ్యాబ్ది చంద్రికా భక్తచిత్త కేకి ఘనాఘనా… రోగపర్వతదంభోళిర్మృత్యుదారు కుఠారికా!”…. అంటూ తన భర్త ఆ పరదేవతను వేడుకుంటున్నాడు! 


యుద్ధం ముగిసినట్టుంది. అంతా శాంతి. ధవళకాంతిలో… ధవళ పద్మంలో…రజితకాంతులు వెలువరిస్తూ… శాంతికవచంలో రాజరాజేశ్వరీ దేవి… బాల రూపంలో… అభయముద్రనిస్తున్న అవ్యాజ కరుణామూర్తి… అజ్ఞానాన్ని అంతం చేసిన కాంతి దీపికలా!


        ఎంత సేపు తన్మయురాలై చూసిందో ఆ తల్లిని పరిమళ. దగ్గరకు వెళ్ళింది ఆర్తితో! ఎర్రని కుంకం అద్దింది. చల్లని గంధాన్ని చెంపలకు పూసింది. “ ఇంక వెళ్ళు”…. అంది ఆ బాలా త్రిపుర సుందరి. ఒక్కసారిగా … జాగృతిలోకి వచ్చింది పరిమళ. 


ఇల్లంతా అలుముకున్న మొగలిరేకుల, సన్నజాజుల సువాసన! ఒళ్ళంతా పాకిన ఉత్తేజం! నూతనోత్సాహం. లేచి హాల్లోకి వెళ్తూ… అద్దంలో చూసుకుంది. ఉదయమంతా పిల్లలంతా కలిపి అలదిన కుంకుమ, చందనాల కలగాపులగంలో… స్పష్టంగా గోచరిస్తున్న కుంకుమబొట్టు, చందనపు చారికలు! ఒళ్ళు పులకించి పోయింది పరిమళకు. ఎవరితో పంచుకోవాలని కూడా అనిపించలేదు…ఆ అనుభూతిని. ఆ తాదాత్మ్యతలో ఎంత సేపుందో తెలీదు… ! 


ఫోను రింగవుతుంటే లేచి వచ్చిన కేశవరావుగారు…హాల్లో కూర్చున్న భార్యను విచిత్రంగా చూస్తూ… ఫోన్ తెరిచారు! 


 “ కూతురు గౌతమి, అల్లుడు రాన్… భారతీయ సాంప్రదాయ దుస్తుల్లో… చక్కగా హిందూ దేవాలయంలో… జరుగుతున్న దసరా ఉత్సవాల్లో పాల్గొంటున్న దృశ్యాల వీడియోలు పంపింది కూతురు. మరొక దృశ్యంలో… చక్కగా బృందగానంలో… మహిషాసుర మర్ధిని స్థోత్రం పాడుతూ!చాలా సంతృప్తిగా అనిపించింది..ఆ తండ్రిమనసు…..మన మతాన్ని, మన సాంప్రదాయాన్ని కూతురు వదలనందుకు! అయితే ఇవేవీ పరిమళ మనసులో నమోదు కావడం లేదు! ఆమె ట్రాన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది! 


      మరో రెండురోజుల్లో ఆమె మామూలు మనిషయింది. భర్తతో తనను చూస్తున్న ఆంకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళింది. 


నెల్లాళ్ళ క్రితం శెనగబద్ద ప్రమాణంలో… రొమ్ములో వచ్చిన కేన్సర్ కణితి… మేలిగ్నంట్ గా మారి, రెండవదశ దాటి మూడవ దశ చివరకు మారడం,లివర్ కూ, ఓవరీస్ లో కూడా ఛాయామాత్రంగా కేన్సర్ కణాలు చేరడం…ఆమెకు ఎమర్జన్సీ ఆపరేషన్ కు డాక్టర్ ఇచ్చిన వ్యవధి దాటి అప్పుడే వారం రోజులవ్వడం… ఇవేవీ కేశవరావుకు తెలియదు. ఆమెతో పాటూ వెళ్ళిన సుందరికి మాత్రం తెలుసు! 


“ ఎందుకు చెప్పలేదు మా ఎవ్వరికీ”…. అని గద్దించిన భర్తతో… తాపీగా..” దసరాలయ్యాకా చేయించుకుందామని!”… అంది పరిమళ. “ ఎవరా నూరిపోసింది. ఆ సుందరే కదా!”… అంటూ రెట్టిస్తున్న భర్తతో…” తననేమీ అనద్దు. తను నా కోసమే ఆ హోమాలన్నీ చేసింది. జీవితంలో ఒక్కసారి ఆధ్యాత్మిక జీవనాన్ని చవి చూడాలని అనిపించింది. వలంటరీ రిటైర్మెంట్ తరువాత నాలో ఎన్నో శారీరిక మార్పులు, రుగ్మతలూ! ఆ ఆందోళనలో… కన్నబిడ్డలా నా చెయ్యి పట్టుకుని నడిపించింది సుందరి. తను నిజానికి నన్ను ఆపరేషన్ కు తొందరచేసింది. నాకన్నా ఎక్కువ ఆందోళన పడింది. ఎందుకో నాకే… జీవితంలో చివరిక్షణాలు దగ్గర పడ్డాయి అనిపించింది! నేను భగవంతుని నుండి తీసుకోవడమే కానీ ఎప్పుడూ…ఎలాంటి సేవా, అర్చనా చెయ్యలేదు. అందుకే దసరా పూజలు అయ్యాకా…విజయదశమి తర్వాతే మీకు చెప్పాలని నిర్ణయించుకున్నా! “…. అంటూ తల వంచుకున్న ఆమె తలను …ఆర్తిగా గుండెకు పొదువుకుని కన్నీరు కార్చేడాయన! 


            **********************


ఆయన కన్నీరు వృధాపోలేదు! సుందరి పూజలు వ్యర్ధమవలేదు! పరిమళ విశ్వాసం వమ్ము అవలేదు. ఆమె రొమ్ముల్లో కానీ, శరీరంలో మరెక్కడా కానీ…ఎక్కడా కాన్సర్ ఛాయలు అత్యంత ఆధునిక పరీక్షా విధానాల్లో కూడా దొరకలేదు! అది ఒక బ్రహ్మరహస్యమని.. ఒక్క పరిమళకే తెలుసు. తనకే ఆ అద్భుతం ఎందుకు జరిగిందో మాత్రం తెలీదు! మెడికల్ హిస్టరీలో ఇదో మిరకిల్ అని డాక్టర్ అంటుంటే…ఈ చేతనాచేతన ప్రకృతిలో అద్భుతం కానిదేది? ఆ మిరకిల్స్ వెనకాల నున్న చిన్మయ చేతనామూర్తి అన్నిటికన్నా పెద్ద అద్భుతం కదా అనుకుంటుంది పరిమళ! 


తన అలౌకిక అనుభవాన్ని అభూతకల్పనగా…విమర్శించే అవకాశాన్ని ఆమె ఇతరులకు ఇవ్వదలుచుకోలేదు! 


కాలం ముందుకు నడుస్తోంది. సుందరి శ్రీమాతతో తన్మయ భక్తిలో… పరిమళ శ్రీమాతతో స్నేహభక్రితో… సాగిపోతూనే ఉన్నారు! ఎన్నో నవరాత్రులు కాలగమనంలో వస్తూ పోతూ ఉంటాయి. ఆ భక్తప్రియా, భక్తివశ్యా, భావనాగమ్య… మాత్రం కాలాతీతంగా… తనను నమ్మిన వారిని అనుగ్రహిస్తూనే ఉంటుంది! 


   శుభం భూయాత్


శ్రీ మాత్రే నమః! 


ధన్యవాదాలతో, దసరా శుభాకాంక్షలతో…..🙏

*ఓలేటి శశికళ.*

కామెంట్‌లు లేవు: