*5.10.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - పదకొండవ అధ్యాయము*
*బద్ధజీవుల-ముక్తజీవుల-భక్తుల లక్షణములు*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*11.41 (నలుబది ఒకటవ శ్లోకము)*
*యద్యదిష్టతమం లోకే యచ్చాతిప్రియమాత్మనః|*
*తత్తన్నివేదయేన్మహ్యం తదానంత్యాయ కల్పతే॥12654॥*
లోకమునందలి జనులకు మిగుల ఇష్టమైనవి, తమకు ఎంతయు ప్రియమును గూర్చునవి ఐనవాటిని నాకు సమర్పింపవలెను. అట్లొనర్చినవారికి అపారఫలములు చేకూరును.
*11.42 (నలుబది రెండవ శ్లోకము)*
*సూర్యోఽగ్నిర్బ్రాహ్మణో గావో వైష్ణవః ఖం మరుజ్జలమ్|*
*భూరాత్మా సర్వభూతాని భద్రపూజాపదాని మే॥12655॥*
కళ్యాణపురుషా! ఉద్ధవా! సూర్యుడు, అగ్ని, బ్రాహ్మణుడు, గోవు, విష్ణుభక్తుడు, ఆకాశము, సకలప్రాణులు అనునవి నా పూజాస్థానములు.
*11.43 (నలుబది మూడవ శ్లోకము)*
*సూర్యే తు విద్యయా త్రయ్యా హవిషాగ్నౌ యజేత మామ్|*
*ఆతిథ్యేన తు విప్రాగ్ర్యే గోష్వంగ యవసాదినా॥12656॥*
మహాత్మా! ఉద్ధవా! నన్ను ఋగ్యజుస్సామ మంత్రములద్వారా సూర్యమండలమధ్యవర్తిగను, పవిత్రములైన దివ్యహవిస్సుల ద్వారా అగ్నిదేవునిగను (యజ్ఞస్వరూపునిగను), ఆరాధింపవలెను. భూసురోత్తముల స్వరూపములలో ఆతిథ్యములద్వారానూ, గోమాతల రూపములో కోమల తృణాహారముల ద్వారాను నన్ను సేవింపవలెను.
*11.44 (నలుబది నాలుగవ శ్లోకము)*
*వైష్ణవే బంధుసత్కృత్యా హృది ఖే ధ్యాననిష్ఠయా|*
*వాయౌ ముఖ్యధియా తోయే ద్రవ్యైస్తోయపురస్కృతైః॥12657॥*
విష్ణుభక్తుని తన ఆత్మీయునిగా తలంచి ఆదర సత్కారములను జరుపవలెను. నిరంతరము ధ్యాననిష్ఠాపరుడై హృదయాకాశములో నన్ను సేవింపవలెను. వాయువును (వాయుస్వరూపుడనైన నన్ను) ముఖ్యప్రాణస్వరూపునిగా భావించి పూజింపవలెను. జలములు, పుష్పములు, గంధాది పూజద్రవ్యములతో జలస్వరూపుడనైన నన్ను ఆరాధింపవలెను.
*11.45 (నలుబది ఐదవ శ్లోకము)*
*స్థండిలే మంత్రహృదయైర్భోగైరాత్మానమాత్మని|*
*క్షేత్రజ్ఞం సర్వభూతేషు సమత్వేన యజేత మామ్॥12658॥*
రహస్యమైన మూలమంత్రములచే, అంగన్యాస, కరన్యాసపూర్వకముగా అష్టదళపద్మశోభితమై, చక్కగా సంస్కరింపబడిన స్థండిలము (వ్రతము పూనినవాఁడు పండుకొనుటకు దర్భాదులచే సంస్కరింపఁబడిన భూమి లేదా అగ్నిహోత్రము నుంచుటకై సంస్కరించిన స్థానము) నందు నన్ను ఆరాధింపవలెను. ఆత్మస్వరూపుడనైన నన్ను శాస్త్రసమ్మతమైన భోగ(భోజన) పదార్థములతో తృప్తి పరచవలెను. రాగద్వేషరహితుడై, దేవ, మనుష్యాది సకలదేహముల యందును క్షేత్రజ్ఞునిగా నన్ను పూజింపవలెను.
*11.46 (నలుబది ఆరవ శ్లోకము)*
*ధిష్ణ్యేష్వేష్వితి మద్రూపం శంఖచక్రగదాంబుజైః|*
*యుక్తం చతుర్భుజం శాంతం ధ్యాయన్నర్చేత్సమాహితః॥12659॥*
సూర్యుడు మొదలుకొని క్షేత్రజ్ఞ (జీవుడు) పర్యంతముగల సకలస్థానములయందును చతుర్భుజములతో శంఖచక్రగదాపద్మశోభితుడనై విరాజిల్లుచు శాంతస్వరూపునిగా ఉండెడి నా మూర్తిని ధ్యానించుచు సమాహితచిత్తముతో అర్చింపవలెను.
*11.47 (నలుబది ఏడవ శ్లోకము)*
*ఇష్టాపూర్తేన మామేవం యో యజేత సమాహితః|*
*లభతే మయి సద్భక్తిం మత్స్మృతిః సాధుసేవయా॥12660॥*
ఈ విధముగా మానవుడు ఏకాగ్రచిత్తముతో వైదికములైన యజ్ఞయాగాదులను ఆచరించుట, సమాజమునకు ఉపయుక్తములగు సత్రములు, బావులు, చెఱువులు, పాఠశాలలు మొదలగువానిని నిర్మించుట మున్నగు సత్కార్యములను నా పూజగా భావించి, ఆచరించినచో అతనికి నా యందు భక్తి కుదురుకొనును. అట్లే సత్పురుషులను సేవించినవారికి నా స్వరూపజ్ఞానము ప్రాప్తమగును.
*11.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*
*ప్రాయేణ భక్తియోగేన సత్సంగేన వినోద్ధవ|*
*నోపాయో విద్యతే సధ్ర్యఙ్ ప్రాయణం హి సతామహమ్॥12661॥*
ఉద్ధవా! నేను సత్పురుషులకు ఆశ్రయుడను. కనుక సత్సంగము, భక్తియోగము అనువాటిని ఆచరించుట యనగా నన్ను పూజించుటయే యగును. కనుక సంసారసాగరమును తరించుటకు వాటిని ఆచరించుట తప్ప మఱియొక మార్గము లేదు. ఇది నా నిశ్చితాభిప్రాయము.
*11.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*
*అథైతత్పరమం గుహ్యం శృణ్వతో యదునందన|*
*సుగోప్యమపి వక్ష్యామి త్వం మే భృత్యః సుహృత్సఖా॥12662॥*
ఆత్మీయుడవైన ఉద్ధవా! నీవు నాకు భృత్యుడవు, హితైషివి, పరమమిత్రుడవు. అందువలన నీకు అతిగోప్యమైన మరియొక విషయమును తెలిపెదను. సావధానముగా వినుము.
*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే ఏకాదశోఽధ్యాయః (11)*
ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *బద్ధజీవుల-ముక్తజీవుల-భక్తుల లక్షణములు* అను పదకొండవ అధ్యాయము (11)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి