5, అక్టోబర్ 2021, మంగళవారం

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*435వ నామ మంత్రము* 5.10.2021

*ఓం చాంపేయ కుసుమ ప్రియాయై నమః*

చంపకపుష్పము అనిన ప్రీతికలిగిన శ్రీమాతకు నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *చాంపేయ కుసుమ ప్రియా* యను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం చాంపేయ కుసుమ ప్రియాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధన చేయు భక్తులను ఆ తల్లి వారి జీవనమార్గమంతయును సుమసౌరభ భరితముగను, సిరిసంపదలతోను, శాంతిసౌఖ్యములతోను వర్ధిల్లునట్లుగను అనుగ్రహించును.

చాంపేయ కుసుమము అను శబ్దమునకు నాగకేసరము, సంపెంగ, దేవదారు పుష్పములని అర్థము. అమ్మవారికి సంపెంగపూలు అనిన మాత్రమే కాదు, కదంబకుసుమము, పాటలీకుసుమము మొదలైన పుష్పములనిన అత్యంత ప్రీతి. అసలు స్త్రీలకు సువాసనా భరితమును, సౌందర్యమును ఇనుమడించు పష్పములనినను మహాప్రీతి. ఆ తల్లికి కూడా పుష్పము లనిన మహాప్రీతి. పుణ్యస్త్రీలకు అంటే అయిదవ తనమున్నస్త్రీలకు పుష్పములు కూడా సౌభాగ్య చిహ్నము. అయిదో తనము అంటే ముత్తయిదువ అని అర్థం. స్త్రీలు ఎప్పుడూ అయిదు అలంకరణలతో కళ కళలాడుతుండాలి. అవే…

పసుపు, కుంకుమ, గాజులు, మెట్టెలు, మాంగళ్యం . వివాహం అయిన తర్వాత మాత్రమే మెట్టెలు, మాంగళ్యం వస్తాయి. వీటితోబాటు పువ్వులతో స్త్రీ పరిపూర్ణతను పొంది ముత్తయిదువగా పిలవబడుతుంది. అమ్మవారికి ఎన్నోరకములైన సౌరభభరితమైన పుష్పములతోబాటు చాంపేయ కుసుమములనిన ప్రీతిగలది యగుటచే, ఆ తల్లి *ఓం చాంపేయ కుసుమ ప్రియాయై నమః* అని స్తుతింపబడుచున్నది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*436వ నామ మంత్రము* 5.10.2021

*ఓం కుశలాయై నమః*

చతుష్షష్టి కళలయందును, పంచకృత్యముల (సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహముల) యందును కౌశలత్వము గలిగిన పరమేశ్వరికి నమస్కారము.

సదా (భూత భవిష్య ద్వర్తమానములయందు కుశలముగా (ఆరోగ్యముగా) ఉండు పరమేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *కుశలా* యను మూడక్షరముల (త్ర్యక్షరీ) నామ మంత్రమును *ఓం కుశలాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు భక్తులను ఆ తల్లి కరుణతో ఆయురారోగ్యభాగ్యములతోను, శాంతిసౌఖ్యములతోను విలసిల్లునటులు అనుగ్రహించును.

అమ్మవారు పంచకృత్య పరాయణమునందు మంచి నేర్పుగలిగినది. ఆ తల్లి తన సౌందర్యమును ఇనుమడింప జేయునటులు అలంకరించుకొనుటలో మంచినేర్పుగలిగినది. *సర్వారుణా* యని అనబడినటులు ఆ తల్లి తన అరుణవర్ణ దేహమునకు తగిన విధంగా ఆభరణములు, వస్త్రములు, పుష్పాలంకరణ మొదలైనవి ఏర్పరచుకొనుటలో మంచి నేర్పుగలిగి, మహిళాలోకానికి చీరకు తగిన జాకెట్టు, అందుకు తగిన బొట్టు, పుష్పాలంకరణ, వస్త్రాలంకరణ, ఆభరణములు అలంకరించుకొనుటలో ఆదర్శమూర్తి అయినది. కామేశ్వరుడు ఎంతో అందగాడు. అందుకు తగిన అందగత్తె కామేశ్వరి. అంతటి నేర్పరియైన అమ్మవారు *కుశలా* యని అనబడినది. భండాసురుడు, మహిషాసురాది రాక్షసులను సంహరించుటకు ఆ తల్లి మాత్రము సరిపోతుంది. కాని తన యుద్ధకుశలత్వమును లోకాలకు తెలియజేయుటకేమో! కోట్లాది శక్తిసేనలను, గజదళములకు అధిపతియైన సంపత్కరీదేవిని, అశ్వదళములకుఅధిపతియైన అశ్వారూఢాదేవిని, శత్రుదుర్భేద్యమైన జ్వాలాప్రాకారమును నిర్మించిన జ్వాలామాలినిని, నిత్యాదేవతలను, బాలాత్రిపురసుందరిని, మంత్రిణియైన శ్యామలాదేవిని, మహాగణేశ్వరుని, అసురుల శస్త్రాలకు ధీటైన అస్త్రములు మొదలైన యుద్ధసాధనములను ఉపయోగించుటలో తన యుద్ధకుశలత తెలియజేసినది. అంతేనా! *కరాంగుళినఖోత్పన్న నారాయణ దశాకృతిః* అన్నట్లు తన చేతి పదివ్రేళ్ళ గోళ్ళసందుల నుండి అసురులను సంహరించుటకు నారాయణుని పది అవతారములను పంపించినది.

కుశలము అనగా క్షేమము. ఆరోగ్యకరముగా నుండుట. అమ్మవారు ఏవిధమైన కోర్కెలు లేని పరబ్రహ్మస్వరూపిణియై  *నిష్కామా* యని అనబడింది. ఏ కోరికలు లేనివాడు కోటీశ్వరునితో సమానము. ఆరోగ్యవంతుడై, ఆనందస్వరూపముతో ఉంటాడు. అలాగే నిష్కామ యైన అమ్మవారు బ్రహ్మానందస్వరూపిణి యగుటచే *కుశలా* యని అనబడినది. అన్ని సంపదలకు మించినది ఆరోగ్యము. ఆరోగ్యముగా, ఎల్లప్పుడూ తృప్తిగా ఉండువారు కుశలముగా నుండువారేగదా. అందుకే అమ్మవారు ఏరకమైన కోర్కెలు లేకను మరియు తృప్తిగాను కుశలముగాను ఉండుటచే ఆ తల్లి *ఓం కుశలాయై నమః* యనుచూ నమస్కరింపబడుచున్నది.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను  అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని  జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను.  ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: