5, అక్టోబర్ 2021, మంగళవారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి లీలలు..


*స్వప్న సాక్షాత్కారం..*


1998 వ సంవత్సరం..విజయవాడలో ఉంటున్న పద్మావతి గారు కనకదుర్గా దేవి కి భక్తురాలు..తనకు ఏపాటి కష్టం కలిగినా..ఇంద్రకీలాద్రి కి వెళ్లి, ఆ తల్లిని దర్శించుకొని..తన బాధలు విన్నవించుకొని వచ్చేది..ఆ కనకదుర్గమ్మ దయతో పద్మావతి గారి సంసారం చక్కగా సాగిపోతున్నది..భర్త ప్రభుత్వద్యోగి..ఇద్దరు పిల్లలూ హైస్కూలు చదువులో వున్నారు..


కానీ..కొన్నాళ్లుగా ఆవిడకు స్వప్నంలో త్రిమూర్తి స్వరూపుడు శ్రీ దత్తాత్రేయుడు కనబడి..అంతలోనే మరో యోగి రూపంలోకి మారిపోయినట్లుగా దర్శనం అవుతున్నది..నవ్వుతూ తనను ఆశీర్వదిస్తున్నట్లుగా అనిపిస్తోంది..ఇలా రెండు మూడు సార్లు స్వప్నం లో అనుభవం అయిన తరువాత..భర్త తో ఈ విషయం చెప్పింది..ఆయన పెద్దగా పట్టించుకోలేదు సరికదా.."నువ్వు ఎక్కువగా పూజలు చేస్తుంటావు కదా..ఆ భ్రమ లోంచి బైటకు రాకపోవడం చేత..ఇలాటి కలలు వస్తున్నాయేమో..సరే..నువ్వు నమ్మిన ఆ అమ్మవారి వద్దకు వెళ్లి నమస్కారం చేసుకొని వచ్చేయి..అన్నీ ఆ తల్లే చూసుకుంటుంది.." అని చెప్పారు..పద్మావతి గారికి భర్త అలా తేలిగ్గా మాట్లాడటం నచ్చలేదు కానీ..కనకదుర్గా దేవిని దర్శించమని చెప్పిన సలహా మాత్రం మనసులో నాటుకున్నది..


సాయంత్రమే దుర్గగుడికి పద్మావతి గారు వెళ్లారు..అమ్మవారిని దర్శించుకున్న తరువాత..అక్కడే కూర్చున్నారు..ఇంతలో ఆవిడకు కొద్దిదూరంలో నలుగురైదుగురు ఆడవాళ్లు కూర్చుని వున్నారు..వాళ్ళ లో ఒకావిడ లేచి వచ్చి పద్మావతి గారి ప్రక్కనే కూర్చుని..తన చేతిలోని పుస్తకాన్ని తీసుకొని చదువుకోసాగింది..పద్మావతి గారు కేవలం కుతూహలం కొద్దీ..తన ప్రక్కన కూర్చున్నావిడ చదువుతున్న పుస్తకం ఏమిటని ఆవిడను అడిగారు..


"ఇది మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్ర అనీ..తాము శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారి అనుయాయులమనీ..అమ్మవారి దర్శనానికి విజయవాడ వచ్చామని..ఈ ఆలయం లో కొద్దిసేపు పారాయణ చేసుకుందామని ఆ పుస్తకాన్ని చదువుకుంటున్నాననీ.." చెప్పింది..


("మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారితో మా అనుభవాలు" పేరుతో శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు వ్రాసిన రచన మొట్టమొదట శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టారు గారి ఆధ్వర్యంలో వెలువడుతున్న సాయిబాబా పత్రికలో ముద్రితం అయింది..తరువాత శ్రీ భరద్వాజ మాస్టారు గారి ఆధ్వర్యంలోనే పుస్తక రూపంలో ముద్రించారు..)


పద్మావతి గారు ఆ పుస్తకాన్ని చేతిలోకి తీసుకొని..చూసారు..ఆశ్చర్యం!..ఆ పుస్తకం పై తనకు స్వప్నం లో కనిపించి ఆశీర్వదించిన యోగి ఫోటో ముద్రించి ఉన్నది..పద్మావతి గారు ఒక్కక్షణం మాన్ప్రడి పోయి..తేరుకొని.."అమ్మా..ఈ క్షేత్రం ఎక్కడ ఉన్నది?..ఎలా వెళ్ళాలి?..ఈ ఫొటోలో ఉన్న మహానుభావుడి దర్శనం నాకు స్వప్నంలో జరిగింది..మీరు వివరాలు చెప్పగలరా?.." అని గబ గబా అడిగేసారు..


ఆ వచ్చినావిడ..ఓపికగా శ్రీ దత్తాత్రేయ స్వామి వారి గురించి..ఆయన చరిత్ర..కపాలమోక్షం ద్వారా సిద్ధి పొందడం..మొగలిచెర్ల వెళ్ళడానికి మార్గం..వివరంగా తెలిపారు..పద్మావతి గారు ఆవిడకూ..ఆవిడతో పాటు ఉన్న మిగిలిన ఆడవాళ్లకూ ధన్యవాదాలు తెలిపి..పరుగు పరుగున ఇంటికి వచ్చారు..ఆసరికే కార్యాలయం నుంచి వచ్చిన తన భర్త కు ఈ విషయం చెప్పి..మొగలిచెర్ల కు వెళ్లి ఆ అవధూత సమాధిని..ఆ యోగికి ఆశ్రయం కల్పించిన శ్రీధరరావు, ప్రభావతి గార్లను కూడా చూసి వద్దామని పట్టు బట్టారు..ఒక్క రెండురోజులు ఆగిన తరువాత ఆదివారం నాడు వెళదామని ఆయన చెప్పారు..


ఆదివారం నాడు కారు మాట్లాడుకుని..భర్త పిల్లలతో సహా పద్మావతి గారు మొగలిచెర్ల చేరారు..ముందుగా శ్రీధరరావు ప్రభావతి గార్లను కలిశారు..ఆ దంపతుల తో శ్రీ స్వామివారి గురించి వివరాలు తెలుసుకొని..శ్రీ స్వామివారి మందిరానికి చేరి..శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్నారు..అక్కడ ఉన్న శ్రీ స్వామివారి ఫోటో ను చూసిన పద్మావతి గారికి కళ్లలోంచి ధారగా కన్నీళ్లు కారిపోసాగాయి..తనను ఆ దత్తాత్రేయుడి రూపంలో వచ్చి ఆశీర్వదించినది ఈ మహానుభావుడే అని భర్తతో పదే పదే చెప్పుకున్నారు..శ్రీ స్వామివారి సమాధికి సాగిలబడి నమస్కారం చేసుకున్నారు..శ్రీ స్వామివారికి నైవేద్యంగా ఇతర భక్తులు సమర్పించిన పొంగలిని, పద్మావతి గారు ప్రసాదంగా స్వీకరించి, భర్తకూ పెట్టారు..ఇటువంటి దత్త క్షేత్రం లో అన్నదానం చేస్తే విశేష ఫలితముంటుందని భర్త గారికి చెప్పి, ఒప్పించి..ఆ ప్రక్క ఆదివారం అన్నదానం చేయడానికి అయ్యే మొత్తం ఖర్చును విరాళంగా ఇచ్చారు..


ఆరోజునుంచీ..పద్మావతి గారి కుటుంబం మొత్తం శ్రీ స్వామివారికి భక్తులుగా మారిపోయారు అంటే ఆశ్చర్య పోనక్ఖరలేదు కదా...


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్:523114.. సెల్..94402 66380 & 99089 73699)

కామెంట్‌లు లేవు: