5, అక్టోబర్ 2021, మంగళవారం

కృషి పరాశర గ్రంథ విశేషాలు -

 పరాశర మునిచే రచించబడిన కృషి పరాశర గ్రంథ విశేషాలు -


 * మాఘఫాల్గుణ మాసములలో విత్తనములు అన్ని ఒకచోట చేర్చి ఎండలో ఎండబెట్టవలెను . ఎండబెట్టుటకు భూమిపైన ఏదన్నా ఉంచవలెను .సరాసరి భూమి తగలరాదు.


 * సమాన ఆకారము లో ఉన్న విత్తనాలు మంచిఫలితాలను ఇచ్చును. అందువలన ఒకేరూపములో ఉన్న విత్తనాలను భద్రపరచవలెను.


 * బీజముల సంచులను పుట్టలపైన , చీమల బొరియల పైన , గోశాలలో , ప్రసూతి గృహములలో , వంధ్య స్త్రీ ఉన్న స్థలములలో ఉంచరాదు.


 * బీజములను ఎంగిలి చేయరాదు . రజస్వల, వంధ్యస్త్రీ, గర్భిణీస్త్రీ , బాలింత బీజములను తాకరాదు.


 * వ్యవసాయదారుడు పొరపాటున కూడా నెయ్యి, నూనె , మజ్జిగ, దీపము బీజముల పైన ఉంచరాదు. 


 * దీపము , అగ్ని, పొగతో ఎండిన , వర్షములో 

తడిచిన బీజములను పొలములో చల్లరాదు.


 * విత్తనములు వృక్షరూపములో పెద్దవైన తరువాత వాటిని తీసివేయరాదు. ఫలితాన్ని ఇవ్వవు.


 * శ్రావణములో హస్త ప్రమాణ దూరములో భాద్రపదములో హస్తానికి ప్రమాణానికి సగం దూరంలో , కన్యలో నాలుగంగుళాల దూరంలో పంటలను నాటవలెను.


 * ఆషాడ , శ్రావణ మాసములలో పంటలను కోయవలెను . ఆ సమయంలో కోయకున్న బీజాలు అలానే ఉండును.


 * శ్రావణ మాసములో పంటని కోసిన వర్షము వలన పంట నష్టం జరగదు. భాద్రపదములో పంటని కోసిన సగం పంట మాత్రమే మిగులును. ఆశ్వయుజ మాసములో పంటని కోసిన ఆ పంట పైన ఆశలు వదుకోవలసివచ్చును.


 * పొలమును రోగముల నుండి రక్షించుటకు భాద్రపద మాసములో పొలములోని జలమును బయటకి తీయవలెను. కేవలం వరిమొక్క మొదళ్ళలో మాత్రమే నీరు ఉండునట్టు చేయవలెను . భాద్రపదములో జలముతో నిండిన పంట వివిధరోగములతో నాశనం అగును.


 * రైతు మార్గశిర మాసము వచ్చినపుడు శుభదినములలో పొలం దగ్గరకి వెళ్లి రెండు ముష్టిల ధాన్యం కోయవలెను . కోసిన ధాన్యపు దుబ్బులకు గంధపుష్పములతో నైవేద్యం తగినవిధముగా చేసి పూజించి ఈశాన్య కోణము నుంచి కోయడం మొదలు పెట్టవలెను.


 * కోసిన ధాన్యపు కట్టను శిరస్సుపైన ఉంచి దారిలో ఎవరిని ముట్టుకోకుండా రైతు మౌనముగా గృహమునకు రావలెను. ఇంటిలో నున్న గదిలో ఏడడుగులు నడిచి పూర్వదిశలో ధాన్యపు కట్టని ఉంచి పూజించవలెను.


 * ధాన్యము కొలిచే ఆడకము ఆకారములో పన్నెండు అంగుళములు ఉండవలెను . ఆడకముతో ధాన్యపు రాశిని ఎడమవైపు నుండి కొలవవలెను. దక్షిణము నుండి ధాన్యమును కొలిచిన వ్యయకారకం అగును. ఎడమవైపు నుండి కొలిచిన ధాన్యము వృద్ధిని పొందును.


 * ధాన్యము కొలుచు ఆడకము మామిడి, పున్నాగము కర్రతో చేసినది ఉత్తమముగా ఉండును. వెలగచెట్టు , జువ్విచెట్టు కర్రతో చేసిన ఆడకముతో కొలిచిన పేదరికము వృద్ది అగును.


 * హస్త, శ్రవణ, ధనిష్ట, మృగశిర, శతబిషం , పుష్యమి, రేవతి , రోహిణి , భరణి, మూల, ఉత్తరాత్రయం , మఘ , పునర్వసు నక్షత్రములలో గురు, శుక్ర, సోమవారాలలో సూర్యుడు మీనలగ్నములలో ఉన్నప్పుడు ధాన్యస్థాపనం చేయవలెను . నిధన సమయములు అనగా ఆది , మంగళ , శని, బుధవారములలో ధాన్యస్థాపనం చేయకూడదు . ధాన్యస్థాపనం అనగా పండిన ధాన్యాన్ని నిలువచేయడం .


  

      

కామెంట్‌లు లేవు: