*4.10.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - పదకొండవ అధ్యాయము*
*బద్ధజీవుల-ముక్తజీవుల-భక్తుల లక్షణములు*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*11.33 (ముప్పది మూడవ శ్లోకము)*
*జ్ఞాత్వాజ్ఞాత్వాథ యే వై మాం యావాన్ యశ్చాస్మి యాదృశః|*
*భజంత్యనన్యభావేన తే మే భక్తతమా మతాః॥12646॥*
నా స్వరూపమును, స్వభావమును, విభూతులను ఎరిగినను, ఎరుగకున్నను, అనన్య భక్తిభావముతో నన్నే సేవించువారు నా పరమభక్తులుగా పరిగణింపబడుదురు.
*11.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*
*మల్లింగమద్భక్తజనదర్శనస్పర్శనార్చనమ్|*
*పరిచర్యా స్తుతిః ప్రహ్వగుణకర్మానుకీర్తనమ్॥12647॥*
ఉద్ధవా! నా మూర్తియొక్క, నా భక్తులయొక్క దర్శనము, స్పర్శనము, అర్చనము, పరిచర్యలు, స్తుతి, ప్రణామములు మొదలగువాటిని ఆచరింపవలెను. అట్లే నా గుణములను, కర్మలను కీర్తింపవలెను.
*11.35 (ముప్పది ఐదవ శ్లోకము)*
*మత్కథాశ్రవణే శ్రద్ధా మదనుధ్యానముద్ధవ|*
*సర్వలాభోపహరణం దాస్యేనాత్మనివేదనమ్॥12648॥*
నా కథలను వినుటయందు శ్రద్ధను కలిగియుండవలెను. నిరంతరము నన్నే ధ్యానింపవలెను. లభించిన ప్రతివస్తువును నాకు సమర్పింపవలెను. దాస్య భావముతో ఆత్మసమర్పణము గావింపవలెను.
*11.36 (ముప్పది ఆరవ శ్లోకము)*
*మజ్జన్మకర్మకథనం మమ పర్వానుమోదనమ్|*
*గీతతాండవవాదిత్రగోష్ఠీభిర్మద్గృహోత్సవః॥12649॥*
నా దివ్యావతారములను గూర్చియు, నా లీలలను గురించియు భాషించుకొనుచుండవలెను. శ్రీరామనవమి, శ్రీకృష్ణాష్టమి మొదలగు పర్వదినములను సంతోషముగా చేసికొనుచుండవలెను. గీతాలాపములు, నృత్యములు, వివిధములగు వాద్యగోష్ఠులు మొదలగువానితో నా మందిరము నందు ఉత్సవములను జరుపవలెను.
*11.37 (ముప్పది ఏడవ శ్లోకము)*
*యాత్రా బలివిధానం చ సర్వవార్షికపర్వసు|*
*వైదికీ తాంత్రికీ దీక్షా మదీయవ్రతధారణమ్॥12650॥*
రథయాత్ర, బ్రహ్మోత్సవములవంటి విశేష వార్షిక పర్వదినములలో (చాతుర్మాస్యముల యందును, ఏకాదశీ తిథులయందును) దివ్యక్షేత్రములను సేవించుచుండవలెను. వైదికములైన, తాంత్రికములైన దీక్షలను పాటింపవలెను. నాకు సంబంధించిన వ్రతములను ఆచరించుచుండవలెను.
*11.38 (ముప్పది ఎనిమిదవ శ్లోకము)*
*మమార్చాస్థాపనే శ్రద్ధా స్వతః సంహత్య చోద్యమః|*
*ఉద్యానోపవనాక్రీడపురమందిరకర్మణి॥12651॥*
దేవమందిరముల యందు నా అర్చామూర్తులను వ్యక్తిగతముగానైనను, సామూహికముగానైనను స్థాపింపవలెను. నా కొరకై ఉద్యాన వనములను, ఉపవనములను, క్రీడాస్థానములను, నగరములను, మందిరములను నిర్మింపవలెను.
*11.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*
*సమ్మార్జనోపలేపాభ్యాం సేకమండలవర్తనైః|*
*గృహశుశ్రూషణం మహ్యం దాసవద్యదమాయయా॥12652॥*
సేవకునివలె భక్తిశ్రద్ధాపూర్వకముగా, నిష్కపట భావముతో నా మందిరములయందు ఊడ్చుట, గోమయముతో గూడిన జలములను చల్లుట, స్వస్తికాది చిహ్నమలతో చిత్రవిచిత్రములుగా మ్రుగ్గులు పెట్టుట చేయవలెను.
*11.40 (నలుబదియవ శ్లోకము)*
*అమానిత్వమదంభిత్వం కృతస్యాపరికీర్తనమ్|*
*అపి దీపావలోకం మే నోపయుంజ్యాన్నివేదితమ్॥12653॥*
దంభాహంకారములను విడనాడవలెను. తానొనర్చిన కార్యములను గూర్చి గొప్పలు చెప్పికొనరాదు. ఇతరదేవతల ఆరాధనలలో ఉపయోగించిన దీపములను నా పూజలకై వినియోగింపరాదు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని పదకొండవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి