దేవుడు మెచ్చే దీక్ష••••
“నాకు ఒక రూపం లేదు. నన్ను ఎవరు ఏ రూపంలో ఆరాధిస్తే, ఆ రూపంలోనే వారిని అనుగ్రహిస్తాను’’ అని శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత నాలుగో అధ్యాయం పదకొండో శ్లోకంలో చెప్పాడు.
యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్
మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః!
‘‘పార్థా! నీకు ఒక దైవరూపం, ఒక దేవుడి పేరు అంటే ఇష్టం కాబట్టి అందరినీ అందులోకి మళ్లించే ప్రయత్నం చేయవద్దు. ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తున్నారో, పూజిస్తున్నారో వారిని అదే విధంగా నేను అనుగ్రహిస్తున్నాను. మనుషులందరూ నా మార్గాన్నే అనుసరిస్తున్నారు’’ అని శ్రీకృష్ణపరమాత్మ చెప్పాడు.
కాబట్టి దేవుణ్ణి పూజించడానికి రూపం ప్రధానం కాదు.
దానికి ఉదాహరణ ఈ కథ.
పూర్వం ఒక వర్తకుడు ఉండేవాడు. రోజూ శివుణ్ణి ఆరాధించేవాడు. నాలుగైదు తరాలుగా శివుడు వారి ఇంటి దైవం.
ఒకసారి ఆ వర్తకుడికి వ్యాపారంలో నష్టం వచ్చింది. దాంతో దిగాలుపడిపోయాడు.
‘శివుణ్ణి ఆరాధిస్తున్నా వ్యాపారంలో నష్టం వచ్చింది’ అనుకున్నాడు.
ఇంటి అరుగు మీద దిగాలుగా కూర్చున్నాడు. అతని దూరపు బంధువు ఒకరు ఆ దారివెంట వెళుతూ వర్తకుణ్ణి పలకరించాడు. ‘ఎందుకు దిగాలుగా ఉన్నావ’ని అడిగితే వ్యాపారంలో నష్టం గురించి చెప్పాడు వర్తకుడు.
అప్పుడా వ్యక్తి ‘‘అయ్యప్ప మాల ఽధరించు, నీ కష్టాలన్నీ తీరుతా‘’యన్నాడు. బలహీనమైన మనస్సుతో ఉన్న వర్తకుడు సరేనన్నాడు. వెంటనే ఇంట్లోనే తరతరాలుగా ఆరాధిస్తున్న నటరాజ విగ్రహాన్ని ఓ మూలకు నెట్టేసి, అయ్యప్ప విగ్రహాన్ని పెట్టి పూజించడం మొదలుపెట్టాడు. రోజూ ధూప, దీప, నైవేద్యాలతో పూజలు చేయసాగాడు. అనుకోకుండా వ్యాపారంలో మళ్లీ లాభం వచ్చింది. ‘అయ్యప్ప పూజ ఫలించింది’ అనుకున్నాడు.
ఒక రోజు ఇంట్లో పూజలో ఉండగా అయ్యప్ప ముందు వెలిగించిన ధూపం పొగ నటరాజ విగ్రహం దగ్గరకు వెళుతూండడం చూశాడు. గాలి మూలంగా పొగ అటువైపు వెళుతోంది. ‘అయ్యప్ప కోసం ధూపం వెలిగిస్తే, శివుడికి ఎందుకు? ఎంత ఆరాధించినా శివుడు నన్ను పట్టించుకోలేదు’ అని మనసులో అనుకుంటూ శివుడి వైపు ధూపం పొగ వెళ్ళకుండా చేయి అడ్డంపెట్టాడు.
ఆ చేతి కింది నుంచి పొగ వెళ్ళసాగింది. దాంతో తనే అడ్డంగా నిలుచున్నాడు. అతని పక్కనుంచి పొగ వెళ్ళింది. నిజానికి గాలి మూలంగా పొగ అటువైపు వెళుతోంది. ‘అడ్డంగా నిలుచున్నా శివుడి వైపు ధూపం వెళుతోంది’ అని ఒక వస్త్రం తీసుకువచ్చి, శివుడు ధూపం పొగ పీల్చుకోకుండా ఆ నటరాజ స్వామి విగ్రహం ముక్కుల్లో పెట్టాడు.
వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యాడు. వర్తకుడు ఆ అర్ధనారీశ్వరుడి కాళ్ళమీద పడి క్షమించమని వేడుకున్నాడు.
‘‘తరతరాలుగా ఆరాధిస్తున్నా ఎప్పుడూ కలగని భాగ్యం ఈ రోజు కలిగింది. నాపై ఎందుకు కరుణ చూపించావయ్యా!’’ అని శివుణ్ణి అడిగాడు.
అప్పుడు శివుడు ‘‘నువ్వు ఎప్పుడు పూజ చేసినా నన్ను రాతి విగ్రహంగానే భావించావు. ధూపం పొగ ఎటుపోయినా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు నన్ను రాతి విగ్రహం అనుకోలేదు. నేను పొగ పీలుస్తున్నానని నమ్మావు. నాపైన సంపూర్ణ విశ్వాసం చూపావు. భక్తితో ఉన్నా, వైరభావంతో ఉన్నా నాకు కావలసింది నమ్మకం’’ అన్నాడు.
ఇప్పుడు చెప్పండి... శివుడు వేరు... అయ్యప్ప వేరా? నమ్మకం ప్రధానం కాదా? అంత నమ్మకం అప్పుడే శివుడిపై ఉంటే కాపాడే వాడు కాదా? అదే శ్రీకృష్ణుడు ఇక్కడా చెప్పాడు.
కాబట్టి ఒక దీక్షలో ఉన్న వారిని మరో దీక్షలోకి మార్చకండి. కావలసింది సత్య దీక్ష! అదే భగవంతుడు మెచ్చే దీక్ష.
‘‘ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తున్నారో, పూజిస్తున్నారో వారిని అదే విధంగా నేను అనుగ్రహిస్తున్నాను. మనుషులందరూ నా మార్గాన్నే అనుసరిస్తున్నారు’’ అన్నాడు. శ్రీకృష్ణపరమాత్మ.
కాబట్టి దేవుణ్ణి పూజించడానికి రూపం ప్రధానం కాదు.
- గరికిపాటి నరసింహారావు
🌳🪴🌳🪴🌳🪴🌳🪴🌳
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి