29, ఏప్రిల్ 2022, శుక్రవారం

పరమాచార్య లిలాద్భుతం

 పరమాచార్య లిలాద్భుతం


కంచి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారికి నా సోదరుడు గొప్ప భక్తుడు. అప్పుడు మహాస్వామివారు ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంలో మకాం చేస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం, వారి ఉపదేశములు వినడం కోసం వేలమంది భక్తులు వస్తున్నారు. అప్పుడు చాలా కష్టాల్లో ఉన్న నా సోదరుడు ఒక మూలాన కూర్చుని ఉన్నాడు. స్వామివారి వద్దకు వెళ్లి ఆశీస్సులు పొందాలని కోరిక ఉన్నా ఆ భక్తుల రద్దీలో వెళ్ళలేక నిస్సహాయుడై అలా ఉండిపోయాడు. హఠాత్తుగా స్వామివారు “దుర్గాప్రసాద్, ఇలా రా!” అని పిలిచారు. తన పేరేంటో తనని ఎలా పోల్చుకున్నారో ఆ దేవుడికి, పరమాచార్య స్వామివారికి మాత్రమే తెలుసు. అప్పటికి ఒక్కసారి కూడా స్వామివారిని కలవలేదు నా సోదరుడు. ఆశ్చర్యంతో భక్తులు దారి విడువగా నడుచుకుంటూ వెళ్లి, స్వామికి సాష్టాంగం చేసి కన్నీళ్ళతో స్వామివారి చరన కమలాలను అభిషేకించాడు. స్వామివారు తనని లేవదీసి, ఓదార్చి మంచి రోజులు వస్తాయని, ఒక కుమారుడు కూడా కలుగుటాడని ఆశీర్వదించారు. స్వామివారి మాటలు నిజమై తన పరిస్థితి బాగుపడి ఒక కుమారుడు కూడా కలిగాడు. పరమాచార్య స్వామికి కృతజ్ఞతగా వాడికి చంద్రశేఖరన్ అని పేరు పెట్టుకున్నాడు.


మరొక్క అనుభవం నా జీవితంలో జరిగినదే. పరమాచార్య స్వామి వంటి మహాత్ములను నేను గౌరవిన్చేవాడిని కాని, అక్కడున్న భక్తుల రద్దీకి భయపడి వారి వద్దకు వెళ్ళేవాడిని కాను. ఒకసారి స్వామివారి దర్శనానికి వెళ్లాను. నలభైల్లో నేను ఉన్నత పాఠాశాలలో చదివేవాడిని. కొత్తకొత్త ఆవిష్కరణలు చేసే శాస్త్రవేత్త అవ్వాలని నా కోరిక. అలా ఒకసారి మొటిమలతో బాధపడుతున్న నేను, దానికి మందు కనుక్కోవాలని సాలిసిలిక్ ఆసిడ్ ను కర్పూరం, నూనెలతో కలిపి నుదుటన పూసుకున్నాను. దాంతో భరించలేని మంట మొదలయ్యింది. వెంటనే మొహం కడుక్కుని అద్దంలో చూసుకుంటే, దేవుడా! నుదురు పైన చాలా భాగం చర్మం కాలిపోయి, మాంసం కనబడుతోంది. ఏవో కొన్ని లేపనాలు పూసినా చర్మం బాగా కమిలిపోయి, చూడడానికి వికారంగా తయారయ్యింది. మావాళ్ళు భయపడి ఎందఱో వైద్యులకు చూపించినా ఫలితం లేకపోయింది. అసలు ఏం జరిగిందంటే, సాలిసిలిక్ ద్రావకం(ఫీనాల్ కాంపౌండ్) కర్పూరంతో కలిసి రసాయనిక చర్య జరిగి కణజాలన్ని కాల్చే ఫీనాల్ విడుదలయ్యింది. ఇది నేను తరువాత చేసిన పరిశోధనలో కనుగొన్నాను. ఏమైతేనేమి చాలా నెలలు గడిచిపోయాయి, మచ్చ అలా మిగిలిపోయింది.


ఒకరోజు రాత్రి నాకు ఒక ఆశ్చర్యకరమైన కల వచ్చింది. మామూలుగా ఉదయం లేవగానే నాకు వచ్చిన కలలను మర్చిపోతుంటాను. కాని అది నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఒక ముసలి బ్రాహ్మణుడు, నుదుటన పెద్ద కుంకుమ తిలకంతో నాముందు నిలుచుని, “నాకు తెలుసు. ఈ మచ్చ గురించి నువ్వు బాగా ఆందోళన పడుతున్నావు. ఒక నెలరోజుల పాటు ఉదయాన్నే బావినీళ్ళతో తలస్నానం చెయ్యి. సాయింత్రం పూట నాగేశ్వర స్వామి దేవాలయానికి(మా ఇంటి వద్ద ఉంది) వెళ్ళు. మూడు ప్రదక్షిణలు చేసి, తప్పక శివలింగాన్ని దర్శించు. నెలరోజుల తరువాత నీ రూపు నీకు తిరిగొస్తుంది” అని చెప్పారు.


మొదట నేను ఆ కలకి అంత ప్రాముఖ్యతను ఇవ్వలేదు, కాని ఆయన రూపం పదే పదే కళ్ళముందు మెదలసాగేది. ఎందుకు ఆ సలహా పాటించకూడదు అనుకున్నాను. అదేమీ పెద్ద కష్టం ఏమి కాదుకదా! మరుసటిరోజు సూర్యోదయాత్పూర్వమే లేచి, బావి వద్దకు వెళ్లి గజగజలాడే చలిలో చన్నీళ్ళ స్నానం చేశాను. మంచి వేసవిలో కూడా వేడినీటి స్నానం చేసే అలవాటు నాకు. అందువల్ల ఆలస్యంగా లేచేవాడిని. అలాంటి స్థితిలో నేను తెల్లవారుఝామునే లేచి, నవంబర్ చలిలో బావి నీటితో చన్నీటి స్నానం చెయ్యడం మావాళ్ళని ఆశ్చర్యానికి గురిచేసింది. వాళ్ళ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నాను.


సాధారణంగా నేను నాస్తికుడిని, అంతగా భక్తిభావం లేనివాడిని. కనుక చాలా అరుదుగా దేవాలయాలకు వెళ్ళేవాడిని. కాని ముందుగానే నిర్ణయించుకున్నట్టుగా, సాయంత్రం నాగేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి, మూడు ప్రదక్షిణలు చేసి, శివలింగాన్ని దర్శించుకునేవాణ్ణి. ఏవైనా బలమైన కారణాల వల్ల వెళ్ళడం కుదరకపోతే, మరుసటిరోజు వెళ్ళినప్పుడు దేవునికి క్షమాపణ చెప్పి, బాకీపడ్డ ప్రదక్షిణలు కూడా చేసేవాణ్ణి. అలా కలలో బ్రాహ్మణుడు చెప్పినట్టుగా తప్పకుండా చేశాను.


అన్ని రోజులూ మంచం నుండు లేవగానే ఎంతో ఆశతో అద్దంలో చూసుకునేవాణ్ణి. కాని ఈ ముప్పై రోజులూ ఏమి జరగలేదు సరికదా మెరుగవుతున్నట్టు కూడా కనబడలేదు. కాని నన్ను నమ్మండి, ముప్పైఒకటో రోజు మామూలుగా లేచి అద్దంలో చూసుకుంటే, నన్ను ఆశ్చర్యానందాలకు గురిచేస్తూ, మొత్తం మచ్చ వెళ్లిపోయింది.


న ముఖం మునుపటిలా అయ్యింది. ఈ విషయం మావాళ్ళందరికీ తెలిపాను. ఎన్నో దశాబ్దాలు గడిచిపోవడంతో, ఈ విషయం మొత్తం మరచిపోయాను. కాని ఈరోజు (25/9/1993) జరిగిన ఒక అద్భుత విషయం వల్ల నలుగు దశాబ్దాల క్రితం జరిగిన ఏ సంఘటనని జ్ఞాపకాల పొరలలో నుండి తవ్వి తీయాల్సివచ్చింది. నిన్న నేను ఒక సెమినార్ కోసం మద్రాసుకు వచ్చాను. ‘హిందూ ధర్మ సంఘం’ కార్యదర్శి వి. మీనాక్షిసుందరంని కలవడానికి నాకు ఇది ఒక అవకాశం. వరోటి దాదాపు గంటసేపు చర్చించాను. ఆ సంభాషణలో భాగంగా కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారితో నాకు ఉన్న ఒక అనుభవాన్ని వాళ్ళు ప్రచురించబోయే సావనీర్ కోసం చెప్పమని అడిగారు. నాకు అలాంటి వ్యక్తిగత అనుభవం ఏమీ లేదని తెలిపాను. కాని మరలా వారు ఇదే విషయం అడుగగా, నేను లేదని తెలిపి, నా సోదరునికి ఒక అనుభవం ఉందని మొత్తం విషయం వారికి తెలిపాను. వెంటనే దాన్ని ఒక వ్యాసంగా వ్రాసి వారికి పంపమని అడిగారు. తరువాత వి. మీనాక్షిసుందరం గారింట్లో పరమాచార్య స్వామివారి చిత్రాలు కొన్ని చూశాను.


నా బసకు వెళ్తుండగా నా కళ్ళ ముందు స్వామివారి చిత్రం ఒకటి జ్ఞాపకం వచ్చింది. ఆ చిత్రాన్ని ఎక్కడో, ఎప్పుడో చూశాను అని అనిపిస్తోంది. కాని ఎక్కడ చూశానో గుర్తురావడం లేదు. నా ఆలోచనలన్నీ ఆ చిత్రం గురించే. గదిలోకి వచ్చి ఆలోచనల్లో పడ్డాను. హఠాత్తుగా నలభైఏళ్ళ క్రితం నా కలలో కనబడిన బ్రాహ్మణ స్వామి ముఖం కళ్ళ ముందు మెదలాడింది. అద్భుతాలకే అద్భుతం! అవును అదే చిత్రం. మీనాక్షిసుందరం ఇంటినుండి వస్తున్నప్పుడు కూడా నా కళ్ళకు కనిపించిన చిత్రం కూడా అదే. నాలుగు దశాబ్దాల తరువాతా కూడా నాకు ఆ బ్రాహ్మణ స్వామి బాగా గుర్తు. నిజానికి ఆ వయస్సులో నాకు మహాస్వామి వారి గురించి ఏమీ తెలియదు. కాని స్వామివారే నా కలలో కనబడి నా ఆర్తిని తీర్చి, బాధను పోగొట్టారు. అందుకే అంటారు దేవుని లీలలు అత్యద్భుతాలు. ఇంతటి కరుణ నేను పొందడానికి ఎవరు కారకులో మరి.


కాకతాళీయమో ఏమో, మా ఇంటిపేరు ‘కంచి’. నా పేరులోని మొదటి అక్షరం ఇదే. మా తాతముత్తాతలు కంచి నుండి వచ్చినవారే. బహుశా ఈ ‘కంచి’ సంబంధమే నన్ను పరమాచార్య స్వామివారి చరణకమలాల వద్దకు తెచ్చిందేమో. ‘నడిచే దేవుడి’ గా ప్రసిద్ధినొందిన కంచి పరమాచార్య స్వామివారి అనుగ్రహాన్ని పొందడం నా అదృష్టం. మనం భగవంతుణ్ణి చూడాలి అనుకుంటే ఆయనే మనపై దయతలచి మన పంచేద్రియాలకు అగుపడే రూపాన్ని ధరించి రావాలి. అలా భక్తుల కోసం వచ్చిన దేవుడే మన పరమాచార్య స్వామివారు.


ఓం సద్గురవే నమః


--- కె. ఆర్. కె మోహన్, “kamakoti.org” నుండి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: