🔔చిత్రగుప్తుని ఆలయం🔱
🚩 పరమశివుడు ఈ భూలోకంలో దుష్టశిక్షణగావించి ధర్మ స్ధాపన చేయదలిచాడు. పాపాలు చేసినవారిని కఠినంగా శిక్షించి నీతి నియమాలను కాపాడే భాధ్యతను యమధర్మరాజుకు అప్పగించాడు. కానీ ఈ లోకంలోని పాపుల సంఖ్య పెచ్చు పెరిగి విధి నిర్వహణ అసాధ్యంకాగా యమ ధర్మరాజు తనకొక సహాయకుని ఏర్పాటు చేయమని మొరపెట్టుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు ఒక బంగారు పళ్ళెంలో ఒక రూపాన్ని చిత్రీకరించాడు. ఆవిధంగా చిత్రం నుండి ఆవిర్భవించినవాడే చిత్రగుప్తుడు. పరమశివుడు చిత్రగుప్తుని కి మానవుల పాప పుణ్యాలు లెక్క కట్టి
యమ ధర్మరాజు వద్దకి తీసుకుని వెళ్ళే బాధ్యతను అప్పజెప్పేడు.
చిత్రగుప్తుని పాప పుణ్యాల లెక్క ప్రకారం యమధర్మరాజు శిక్షలు విధించి వాటిని సక్రమంగా అమలుపర్చి ధర్మాన్ని పరిరక్షిస్తూంటాడు.
అటువంటి ఒక గొప్ప భాధ్యతాయుతమైన విధిని నిర్వహించే చిత్రగుప్తుడు హిమాలయా పర్వతాలలో సుదీర్ఘకాలం తపస్సు చేసి అనేక శక్తులు సంపాదించాడు.
అటువంటి చిత్రగుప్తునికి ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనదిగా ప్రసిధ్ధి పొందిన కాంచీపురంలో ఒక దేవాలయం (నెల్లుక్కారర్ వీధిలో) నిర్మించబడి వున్నది. 9 వ శతాబ్దానికి చెందిన చోళరాజులు ఈ అపూర్వ ఆలయాన్ని నిర్మించారు. కాంచీపురం ఒక్క చోటనే చిత్రగుప్తుని కి ప్రత్యేక ఆలయం వున్నది. మూడు అంతస్తుల రాజగోపురం గల ఈ ఆలయంలో చిత్రగుప్తుడు కుడిచేత ఘంటం,ఎడమచేత తాళపత్రాలు ధరించి ఆశీనముద్రలో దక్షిణాభిముఖంగా దర్శనమిస్తాడు.
ఇక్కడ చైత్రమాసంలో చిత్రగుప్తునికి ఉత్సవాలు చేస్తారు. చైత్ర పౌర్ణమికి ముందు రోజు చతుర్దశినాడు చిత్రగుప్తునికి
కర్ణకిదేవితో వివాహోత్సవం జరిపి పౌర్ణమినాడు బ్రహ్మాండమైన ఊరేగింపు జరుపుతారు.
ఈ ఆలయం కాంచీపురం బస్ స్టాండ్ కి సమీపమున రాజవీధిలో వున్నది.
వివాహాది శుభకార్యాల విషయంలో అడ్డంకులున్నవారు యీ ఆలయానికి వచ్చి పూజలు చేస్తే శుభ ఫలితాలు లభిస్తాయి.
అలాగే ఈ ఆలయంలోని చిత్రగుప్తుని పూజించినవారికి
మోక్షం లభిస్తుందని భక్తులు ధృఢంగా నమ్ముతారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి