29, ఏప్రిల్ 2022, శుక్రవారం

*భోజనం చేయటం ఎలా*

 మీరందరూ బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహా రావు గారి, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి మరియు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రసంగాలు వినేవుంటారు. 


ఇప్పుడు మీకందరికి ఓ చిన్ని ప్రశ్న. 


*భోజనం చేయటం ఎలా* అన్న విషయం పై ప్రసంగించటానికి పై ముగ్గురు పండితుల్ని పిలిచారనుకోండి.


వారి ప్రసంగ శైలి ఇలా కొనసాగిందనుకోండి. ఈ ప్రసంగాలను బట్టి వాళ్ళలో ఎవరెవరు ఇలా ఉపన్యసించగలరో గుర్తించండి. 


*"అన్నం పరబ్రహ్మస్వరూపం. అసలీ శరీరమే అన్నం. అందుకే దీనిని అన్నమయకోశం అన్నారు. అన్నమే అన్నాన్ని తింటున్నది. అన్నం చ బ్రహ్మ. అహం చ బ్రహ్మా. భోక్తాచ బ్రహ్మా అని చెప్పుకుంటాం. ఇలా భోజనం చేసినా, ఇతరులకి పెట్టినా బ్రహ్మభావనతో, యజ్ఞభావనతో ఉండాలి. తైత్తిరీయోపనిషత్ లో ఒక మంత్రం. అహ మన్న, మహ మన్న, మహ మన్నం..."*


*"అసలు భోజనం చేసేటప్పుడు భక్తిగా, శ్రద్ధగా నేలపై పీట వేసుకొని, దానిపై బాసింపీట వేసుకొని కూర్చోవాలండీ! టేబుల్ మీల్స్ మన సంప్రదాయం కాదు సుమండీ! మంచి నీళ్ల గ్లాసు విస్తరికి కుడివైపున ఉంచుకోవాలి. అభికరించి ఆపోశనం పట్టాలి. భోజనం ప్రారంభించామంటే యజ్ఞం ప్రారంభించినట్టే. కనుక మధ్యలో లేవ కూడదు. ఈ మధ్యన బఫేలు మొదలయ్యాయి. అన్నం తింటూ ఆ ఎంగిలి ప్లేటు పట్టుకుని కూర కోసం ఒకసారి, సాంబారు కోసం ఒకసారి పోయి లైన్లో నిలబడే దౌర్భాగ్యపు సంప్రదాయం వచ్చింది. దీన్ని మనం పరిహరించాలి."*


*"శాస్త్రాలు, సంప్రదాయాలు అనేకం ఉంటాయి. అవేవీ అసత్యాలైతే కావు. కానీ కాలానుగుణంగా కొంత సర్దుబాటు తప్పదు. నీ ఇంట్లో నీ ఇష్ట మొచ్చినట్టు భోంచేస్తావ్. కానీ నీ నెత్తి మీద ఆఫీసర్ నిన్ను ఏదో ఫంక్షన్ కి భోజనానికి పిలిచాడు. పోయి వాడి మొహాన ఒక గిఫ్ట్ గిరాటు కొట్టి వాడు ఎలా పెడితే అలా తినక తప్పదు. నువ్వేం చెప్పలేని కాలమిది. ఇహ నువ్వు బఫేలో కాదు, టేబుల్ మీల్స్ కాదు, కింద కూర్చుంటా వడ్డించండి అంటే ఎవడు వింటాడు ? ఒక్కొక్క పెళ్లి ఫంక్షన్ కి వెయ్యి మందిని కూడా పిలుస్తారు. ఈ వెయ్యి మందిలో కింద చతికిలబడి కూర్చునే ఓపిక ఎంత మంది కుంటుంది? సరే కూర్చున్నా రయ్యా! వీళ్లందరికి వంగి వడ్డన చెయ్యాలంటే ఆ వడ్డించే వాళ్లకి నడుములు విరిగిపోవూ? అక్కడికీ వాడేదో సంప్రదాయంగా, తీరుబడిగా వడ్డిద్దా మంటే సాయంత్రానికల్లా వాడు తీసుకున్న ఫంక్షన్ హాల్ ఖాళీ చెయ్యాలయ్యే. కాబట్టి చాదస్తాన్ని పక్కన పెట్టి వాడి గిఫ్ట్ వాడి మొహాన కొట్టి నాలుగు ముద్దలు తినటమే. మనకి ధర్మం ముఖ్యం కానీ ప్రతి దానికీ చాదస్తం పెట్టుకుంటే ఎట్లా?"*

కామెంట్‌లు లేవు: