14, మార్చి 2023, మంగళవారం

నిజమైన, భక్తి

 నిజమైన, పరిపూర్ణమైన భక్తి అంటే ఇది కదా అనిపించింది. 


ఎంత ఆరాధనా భావం, ఎంత ఉన్నతమైన మనసు, అన్నిటినీ మించి సనాతన భారతీయ గురుపరంపర పట్ల వారికున్న గౌరవభావం నన్ను ముగ్ధుడిని చేసాయి.


నిన్న (12.03.2023) సాయంత్రం రాజమహేంద్రవరంలోని హోటల్ షెల్టన్ లో జరిగిన డాక్టర్ కంభంపాటి స్వయంప్రకాష్ గారి జయంతి కార్యక్రమంలో పాల్గొని, రాత్రి సుమారుగా 9.30 గంటల సమయంలో కారులో విజయవాడకు తిరుగుప్రయాణమయ్యాను. 


కొవ్వూరు వంతెన దాటి, కొంతదూరం వచ్చాక, దారి ఎడమవైపునకు తిరుగుతుంది. అది చాలా పెద్ద కూడలి. అక్కడో ఫ్లైఓవర్ కూడా ఉంది. నాకు ఆ దారిమీద పూర్తి అవగాహన లేదు. అందువల్ల కచ్చితంగా అది ఏ ప్రాంతమో చెప్పలేను.  


అలా... కారు ఎడమవైపునకు మలుపు తీసుకుంటున్న సమయంలో, పెద్ద ఫొటో కనబడింది. అది కంచి స్వామివారు... జగద్గురువులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామి వారిది. మామూలుగా అయితే, స్వామికి నమస్కారం చేసుకుని, ఆగకుండానే ప్రయాణం చేసేవాడిని. కానీ, అక్కడి సన్నివేశం నన్ను ఎంతో ఆకట్టుకోవడంతో కారు వెనక్కుతిప్పమని డ్రైవర్ కు చెప్పాను.


మీరు ఫొటోలో చూస్తున్నదే ఆ సన్నివేశం. అందులో ప్రత్యేకత ఏమిటంటే...


స్వామివారి ఫొటో కింద ఓ వ్యక్తి పూలు అమ్ముకుంటున్నాడు. అది అతడి వృత్తి. రోజూ అక్కడే పూలు అమ్ముతుంటాడు. రోజూ తాను అమ్మకానికి తెచ్చుకున్న పూలలో కొన్ని స్వామి వారి ఫొటోకి వేసి, నమస్కారం చేసుకుని, ఆ తర్వాత అమ్మకం ప్రారంభిస్తాడు. మంగళవారం, శనివారం స్వామికి ప్రత్యేకంగా అలంకారం కూడా చేస్తాడు.


నిజానికి అది అతను పెట్టుకున్న ఫొటో కాదు. స్వామివారు కొద్దికాలం క్రితం రాజమహేంద్రవరం వచ్చినప్పుడు ఓ సంస్థ ఏర్పాటుచేసిన స్వాగత ప్రకటన అది. ఆ ఫొటోకే అతడు నిత్యం పూలదండలు సమర్పిస్తాడు.


సాధారణంగా అందరూ వారి ఇష్టదైవాల ఫొటోలు పెట్టకుంటారు. కానీ, ఇతడు మాత్రం స్వామి వారి ఫొటోకే దండలు వేసి, ఆరాధిస్తున్నాడు. అతడు వ్యాపారం చేస్తున్న ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించాను. ఏ దేవుడి ఫొటో అక్కడ లేదు. కేవలం స్వామి వారి ఫొటోకే దండలు వేసి ఉన్నాయి. 


కారు దిగి, అతడిని అడిగి ఈ వివరాలు తెలుసుకున్నా. స్వామివారు చాలా గొప్పవారని, ఆయన దేవుడితో సమానమని చెప్పాడతడు అతడి యాసలో.  


నేను కొంత సొమ్ము ఇచ్చి, తీసుకోమంటే... వద్దంటే వద్దన్నాడు. నా దేవుడికి పూలు నేను వేసుకోగలను అన్నాడు. అనేకవిధాలుగా బతిమాలినా ఒప్పుకోలేదు. చివరకు ఆ సొమ్ముకు తగిన పూలు రేపటి రోజున స్వామికి సమర్పించమని చెబితే, సరేనంటూ అంగీకరించాడు. 


ఇది కదా నిజమైన, పరిపూర్ణమైన భక్తి అనిపించింది.  


ఆ పెద్ద మనసు ముందు నేనెంత చిన్నవాడినో తెలిసింది. 


ఇంతటి గొప్ప సన్నివేశాన్ని చూసిన ఆనందంలో ఆ వ్యక్తి పేరు కనుక్కోవడం మర్చిపోయాను. 


అయినా... అంతటి గొప్ప మనసుకి పేరుతో పనేముంది.


కప్ఫగంతు రామకృష్ణ గారు

కామెంట్‌లు లేవు: